Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ప‌ర్యావ‌ర‌ణం

వ్యర్థాలతో దారీతెన్నూ

* ప్లాస్టిక్‌ రహదారుల నిర్మాణం

రహదారులు ఆర్థిక వ్యవస్థకు జీవనాడులు. దేశంలో 90 శాతం ప్రజలు ఉపరితల మార్గంపై ఆధారపడే ప్రయాణాలు సాగిస్తున్నారు. 65 శాతం సరకుల రవాణా రహదారుల ద్వారానే సాగుతోంది. పల్లెసీమలకు విద్య, వైద్యం, బ్యాంకింగ్‌ వంటి వసతులు అందుబాటులోకి రావాలంటే వాటికి చక్కటి రహదారులు అవసరం. గ్రామీణ రహదారుల విషయంలో సర్కారు నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. దేశంలో 2011 గణాంకాల ప్రకారం సుమారు 6,38,588 గ్రామాలుండగా, దాదాపు 40శాతం గ్రామాలకు మామూలు మట్టిబాటలు మాత్రమే ఉన్నాయి. ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన పథకం కింద రహదారులు నిర్మాణమవుతున్నా, ఇంకా దాదాపు 35శాతం గ్రామాలకు పూర్తిస్థాయి రహదారులు లేవు. ప్రపంచ బ్యాంకు నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం.. దేశంలో రహదారుల కోసం ఖర్చు పెట్టే ప్రతి పది లక్షల రూపాయలతో సగటున 163 మంది పేదరికం నుంచి బయటపడే అవకాశం ఉంది.

అన్నదాతకు ప్రయోజనం
నాణ్యమైన రహదారుల వల్ల దళారుల ప్రమేయం లేకుండా రైతులు తమ పంటలను తామే విపణిలో అమ్ముకోవడానికి, కాయగూరలు, ఆకు కూరలు వంటి వాటిని సకాలంలో మార్కెట్‌కు తరలించేందుకు వెసులుబాటు కలుగుతుంది. రహదారుల అభివృద్ధితో నగరాలు, పల్లెల మధ్య రాకపోకలు పెరుగుతాయి. సాంకేతికత అందుబాటుతో ఆధునిక పద్ధతులతో సాగు చేయడం వల్ల పంట దిగుబడి గణనీయంగా పెరిగే అవకాశాలు మెరుగుపడతాయి. ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన పథకం కింద సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల వ్యయంతో దాదాపు అయిదు లక్షల కిలోమీటర్ల రహదారులు నిర్మాణమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే సుమారు 83.3 కోట్ల ప్రజలు ప్రయోజనం పొందారు. ముఖ్యంగా గ్రామాల్లోని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 22శాతం గ్రామీణులకు కొంతమేరకైనా జీవనోపాధి పొందే అవకాశం కలిగింది. నాణ్యమైన రహదారుల నిర్మాణం వల్ల తరచూ మరమ్మతులు చేయాల్సిన అవసరాన్ని నివారించవచ్చు. దేశంలో రహదారుల నిర్మాణ వ్యయంకన్నా తదనంతర మరమ్మతుల ఖర్చు అధికంగా ఉంటోందని పలు అధ్యయనాల ద్వారా తేలింది.

ప్లాస్టిక్‌ వ్యర్థాలను రహదారుల నిర్మాణంలో ఉపయోగించుకోవడం వల్ల బహుళ ప్రయోజనం సిద్ధిస్తుంది. అధిక ఉష్ణోగ్రత కారణంగా దేశంలో రహదారులు బీటలువారే సమస్య ఉంది. ఈ సమస్య పరిష్కారానికి ప్లాస్టిక్‌ రహదారులు ఎంతో అనువైనవని నిపుణులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి ప్లాస్టిక్‌ రహదారుల నిర్మాణాన్ని చేపట్టడం ప్రయోజనకరం. వ్యర్థ ప్లాస్టిక్‌ను శుద్ధి పరచి దానిని ద్రవరూపంలోకి మార్చి, ఆ ద్రవ పదార్థాన్ని తారుతో కలిపి నిర్మించే ప్లాస్టిక్‌ రహదారుల ప్రక్రియ ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. ఈ పద్ధతిని ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో అనుసరిస్తున్నారు. ప్లాస్టిక్‌ రహదారుల ఉపరితలం నునుపుగా ఉండటం వల్ల వాహనాల ప్రయాణం వేగవంతంగా, సాఫీగా సాగి, ప్రయాణ సమయం తగ్గుతుంది. ఇంధనం సైతం ఆదా అవుతుంది. ప్లాస్టిక్‌ వ్యర్థాల్ని శుద్ధి ప్రక్రియలో పునర్‌ వినియోగించడం వల్ల పర్యావరణానికి ఎనలేని మేలు కలుగుతుంది. మరోవైపు దేశంలో ఎడాపెడా పేరుకుపోతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాల మహమ్మారి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. దేశంలో ఏడాదికి 56 లక్షల టన్నుల వ్యర్థ ప్లాస్టిక్‌ పోగవుతుంది. ప్లాస్టిక్‌ వ్యర్థాల్ని కాల్చడం వల్ల విష వాయువులు ఉత్పన్నమై పర్యావరణ కాలుష్యంతోపాటు సామాజిక, ఆర్థికపరమైన సమస్యలు ఏర్పడుతున్నాయి. అన్ని గ్రామాల్లో ప్లాస్టిక్‌ రహదారుల నిర్మాణం చేపడితే- దేశంలో ఉన్న వ్యర్థ ప్లాస్టిక్‌ మొత్తం సరిపోదని అంచనా.

తమిళనాడు ముందంజ
తమిళనాడు, హిమాచల్‌ ప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు ప్లాస్టిక్‌ రహదారుల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఈ విషయంలో తమిళనాడు మిగతా రాష్ట్రాలకన్నా ముందంజలో ఉంది. తమిళనాడులోని మదురై నగరంలో త్యాగరాజ ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన డాక్టర్‌ వాసుదేవన్‌ నేతృత్వంలో ప్లాస్టిక్‌ రహదారులపై పరిశోధనలు జరిగాయి. ఈ పరిశోధన ఫలితాలపై 2006లో పేటెంట్‌ హక్కులు సైతం పొందారు. ప్లాస్టిక్‌ రహదారులను తమిళనాడు, హిమాచల్‌ ప్రదేశ్‌, జంషెడ్‌పూర్‌లలో ప్రయోగాత్మకంగా నిర్మించి సత్ఫలితాలు సాధించారు. ప్లాస్టిక్‌ రహదారుల నిర్మాణ విధానానికి 2013లో ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ సంస్థ జాతీయ స్థాయి గుర్తింపును కల్పించింది. అప్పటి తమిళనాడు ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ నిధి నుంచి ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రహదారుల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించింది. స్వయం సహాయక బృందాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పదహారు జిల్లాల్లోని 26 పట్టణాల్లో వ్యర్థ ప్లాస్టిక్‌ నుంచి తారులో మిశ్రమంగా కలిపే ద్రవాన్ని తయారు చేసే చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించింది. 2017 నాటి అంచనాల ప్రకారం దేశంలో సుమారు 34,000 కి.మీ. మేర రహదారులు వ్యర్థ ప్లాస్టిక్‌ ఆధారంగా నిర్మాణమయ్యాయి. కేంద్ర కాలుష్య నివారణ సంస్థ ప్లాస్టిక్‌ రహదారుల నిర్మాణానికి అనుమతులు జారీ చేసింది.

ఒక కిలోమీటర్‌ మేర రహదారి నిర్మాణానికి 10 టన్నుల తారు అవసరం అవుతుంది. ప్లాస్టిక్‌ రహదారుల నిర్మాణంలో 9 టన్నుల తారు, టన్ను ప్లాస్టిక్‌ వ్యర్థాల్ని ఉపయోగిస్తారు. టన్ను ప్లాస్టిక్‌ వ్యర్థాలు సుమారు పది లక్షల ప్లాస్టిక్‌ సంచులతో సమానం. ప్లాస్టిక్‌ రహదారుల నిర్మాణం వేగం పుంజుకుంటే ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఎందుకూ పనికిరాని, భూమికి భారంగా మారే చెత్తలా కాకుండా, ఆధునిక సమాజానికి ఉపయోగపడే విలువైన పదార్థంలా మారుతుందనటంలో ఎంత మాత్రం సందేహం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం స్ఫూర్తితో వాడిపారేసే ప్లాస్టిక్‌కు అంతం పలకాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తాజాగా పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్లాస్టిక్‌ వ్యర్థాల్ని ప్రయోజనకరరీతిలో ఉపయోగించుకునే దిశగా నడుంకట్టాలి. ఇందుకోసం రహదారుల నిర్మాణంలో ప్లాస్టిక్‌ వ్యర్థాల వాడకాన్ని పెంచాలి. దేశవ్యాప్తంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ రహదారుల నిర్మాణ ప్రక్రియను ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు తీసుకుంటే భవిష్యత్‌ భారతాన్ని ప్లాస్టిక్‌ భూతం నుంచి కాపాడటమే కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రాణప్రతిష్ఠ చేసినట్లవుతుంది!

- బి.ఎన్‌.వి. పార్థసారథి
Posted on 29-09-2019