Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ప‌ర్యావ‌ర‌ణం

చేటుసంచులపై జనచేతన

సత్యాగ్రహం, అహింసలే ఆయుధాలుగా అసమాన పోరాటానికి మారుపేరై జాతికి నిత్యస్ఫూర్తిగా నిలిచిన బాపూజీ నూట యాభయ్యో జయంతి వేడుకల్ని యావద్దేశం ఘనంగా నిర్వహించుకుంటున్న తరుణమిది. ఆ సందర్భంగా నిన్న దిల్లీలో ‘జాతీయ సంకల్ప్‌ యాత్ర’ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా దేశవాసులకిచ్చిన పిలుపు, ఆలోచనాత్మకమైనది. పరాయి పాలనను తరిమికొట్టిన గాంధీజీ పట్టుదల, అచంచల దీక్షాసంకల్పాలు- ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ ఉత్పత్తులపై ప్రజోద్యమంలోనూ ఉట్టిపడాలన్నది అమాత్యుల ఉపన్యాస సారాంశం. ‘ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది’ అన్న ప్రధాని మోదీ మనోగతానికి అనుగుణంగా అక్టోబర్‌ రెండో తేదీనుంచి యాభై మైక్రాన్లలోపు ప్లాస్టిక్‌ వస్తూత్పాదనల వినియోగంపై దక్షిణమధ్య రైల్వే ఆంక్షలు ప్రకటించింది. లోక్‌సభ సచివాలయం, ఎయిరిండియాలతోపాటు ఒడిశా వంటి రాష్ట్రాలూ ఆ మేరకు కట్టుబాటు చాటాయి. వాస్తవానికి సిక్కిం, నాగాలాండ్‌, దిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రభృత రాష్ట్రాలు ఇలా వాడి అలా పారేసే ప్లాస్టిక్‌ ఉత్పత్తుల విక్రయాలు, నిల్వ, వినియోగాలను శిక్షార్హాలుగా లోగడే ప్రకటించాయి. ప్రాంతాలవారీగా, సంస్థలవారీగా, ప్రభుత్వపరంగా నిషేధాంక్షలు చాలాచోట్ల ప్రభావశూన్యమైన అనుభవాల నేపథ్యంలో- జరిమానాలు కాదు, జనచేతనే సమస్యకు సరైన విరుగుడు అనడం పట్ల భిన్నాభిప్రాయానికి తావే లేదు. రెండు దశాబ్దాలకు పైగా సిక్కిమ్‌లో పల్చని ప్లాస్టిక్‌ సంచులు, టన్నులకొద్దీ ప్లాస్టిక్‌ వ్యర్థాలు కానరాకుండాపోవడానికి ప్రధాన కారణం- అక్కడి ప్రజానీకం అడుగడుగునా క్రియాశీల భాగస్వామ్య పాత్ర పోషించడమే. అక్కడే కాదు, జాతీయ స్థాయిలోనూ ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ రూపేణా పెనుముప్పును నివారించగలిగేది జనమహోద్యమమే!

దాదాపు ఏడు దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా 830 కోట్ల టన్నులకు పైగా ప్లాస్టిక్‌ ఉత్పత్తులు తయారయ్యాయి. అందులో అరవై శాతం దాకా ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఇప్పటికీ రకరకాల రూపాల్లో భూమిపైన, లోపల, జలాల్లో పోగుపడి ఉన్నాయి. ఒక్క భారత్‌లోనే ఏటా సుమారు 95 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు పేరుకుపోతున్నాయని, అందులో 40 శాతం దాకా సేకరణకే నోచుకోవడం లేదని, ప్యాకేజింగుకు వాడే ఉత్పత్తుల్లో 43 శాతం మేర ఒకసారి వాడి పారేసేవేనని గణాంకాలు చాటుతున్నాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాలు సూక్ష్మకణాలుగా చీలిపోయి గాలిలో ఉన్నా, భూగర్భ జలాల్లోకి చేరినా మానవ శరీర కణాల్ని, డీఎన్‌ఏను సైతం దెబ్బతీయగలవని వివిధ అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. దేశంలో పలుచోట్ల వరదలు పోటెత్తడానికి, పారిశుద్ధ్య వ్యవస్థలు మొరాయించడానికి, పక్షులు చేపలు సముద్ర తాబేళ్ల సంతతి తరిగిపోవడానికి ప్లాస్టిక్‌ వ్యర్థాలే ముఖ్యకారణం. ఈ సమస్య విస్తృతి పట్ల సంపూర్ణ అవగాహనతో సుప్రీంకోర్టు- ప్లాస్టిక్‌ సంచులు లేకుండా చూడటమో, ఉత్పత్తిదారులే తిరిగి సేకరించే పద్ధతిని పాటించడమో జరగకపోతే రేపటి తరానికి అణ్వస్త్రాలను మించిన భీకరముప్పు తప్పదని అయిదేళ్ల క్రితమే హెచ్చరించింది. దీటుగా స్పందించాల్సిన ప్రభుత్వాలేమో అసమగ్ర ప్రణాళికలు, చర్యలతో పొద్దుపుచ్చుతున్నాయి. ఉత్పత్తి వినియోగాలపై ఆంక్షల్ని జర్మనీ, ఇంగ్లాండ్‌ వంటి దేశాలు కట్టుదిట్టంగా అమలుపరుస్తున్నాయి. వెయ్యేళ్ల ఆయువు కలిగిన పాలిథీన్‌ ఉత్పత్తులు ఛిద్రమై నశించిపోయేలోగా మానవాళికి, పర్యావరణానికి వాటిల్లజేయగల తీవ్ర అనర్థాలపై విస్తృత జనచేతన- అరకొర నిషేధాలు, ఆంక్షలకన్నా విశేష ప్రభావాన్వితమవుతుంది. ప్రజలే స్వచ్ఛందంగా ప్లాస్టిక్‌ వస్తూత్పాదనల్ని దూరంపెట్టే వాతావరణ పరికల్పన, ప్రత్యామ్నాయాల అందుబాటుపై ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించడం అన్నిందాలా మంచిది.

ఎక్కడికక్కడ టన్నుల కొద్దీ పోగుపడుతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలను ప్రణాళికాబద్ధంగా కట్టడి చేయడంలో, తెలివిగా పునర్వినియోగించుకోవడంలో ప్రభుత్వాల వైఫల్యం ఎన్నో సమస్యలకు అంటుకడుతోంది. వ్యర్థాల నిర్వహణలో థాయ్‌లాండ్‌, ఆస్ట్రేలియా; ప్లాస్టిక్‌ వినియోగ నియంత్రణలో ఐర్లాండ్‌, ఫ్రాన్స్‌ల అనుభవాలు భారత్‌ వంటి దేశాలకు అమూల్య గుణపాఠాలు. ప్లాస్టిక్‌ వ్యర్థాల పునర్వినియోగంలో సృజనాత్మక విధానాలతో జపాన్‌ ధీమాగా పురోగమిస్తోంది. ప్రపంచంలోనే అత్యుత్తమ పునర్వినియోగ వ్యవస్థ నెలకొన్న దేశంగా స్వీడన్‌ ప్రత్యేక గుర్తింపు సాధించింది. ముందుగానే మేలుకున్న దేశాల ప్రయోగశీలత ఇక్కడి వ్యూహాలకు పదునుపెట్టాలి. ప్లాస్టిక్‌ సంక్షోభం ముమ్మరించిన దేశాల్లో వ్యర్థాల రీసైక్లింగ్‌ను ప్రోత్సహించేలా పన్ను రాయితీలు కల్పించడం శ్రేష్ఠమన్న ప్రతిపాదనల మంచిచెడ్డల్ని ప్రభుత్వాలు లోతుగా తర్కించాలి. రోడ్ల నిర్మాణంలో, విద్యుత్‌ జనరేటర్లలో ప్లాస్టిక్‌ వ్యర్థాల్ని ఇంధనంగా ఉపయోగిస్తున్న ఉదంతాలు- గుర్తించి ప్రోత్సహిస్తే సత్ఫలితాలు తథ్యమనడానికి దృష్టాంతాలు. వియత్నాం వంటి దేశాలు గాలిలో తేమసోకినా, సూర్యరశ్మి నేరుగా ప్రసరించినా వందరోజుల్లో విచ్ఛిన్నమయ్యే పదార్థంతో చేతిసంచులు రూపొందిస్తున్నాయి. ఇక్కడా ఆ తరహా ప్రయోగాలు, రీసైక్లింగ్‌పై పరిశోధనలకు ప్రభుత్వం అండగా నిలవాలి. ఉత్సాహం తొణికిసలాడుతున్న అంకుర పరిశ్రమల్ని అటువైపు మళ్ళించగలిగితే- సమీప భవిష్యత్తులో ప్లాస్టిక్‌ వినియోగ క్రమబద్ధీకరణ, వ్యర్థాల పునర్వినియోగం సాధ్యపడే మంచిరోజులు రావచ్చు. ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించడానికి సుస్థిర ప్రజాభాగస్వామ్యాన్ని నిర్మించడంతోపాటు, రేపటి పౌరుల్లో పర్యావరణ స్పృహ పెంపొందించేలా పాఠ్యాంశాల సమగ్ర సంస్కరణా తక్షణావసరం!


Posted on 03-10-2019