Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ప‌ర్యావ‌ర‌ణం

వాతావరణ మార్పులపై ఉపేక్ష

* ఉద్గారాల నియంత్రణపై నిర్లిప్తత

గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలను అరికట్టే విషయంలో దేశాధినేతల ప్రసంగాలు ప్రకటనలకే పరిమితమవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయమై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుల్లో చిత్తశుద్ధి లోపించింది. మార్పులనేవి రాత్రికి రాత్రే రావాలని కాదు. లక్ష్యాల్ని సాధించేందుకు నిర్మాణాత్మక, ప్రభావశీల చర్యలు తీసుకున్నారా అన్నదే ఇక్కడ ప్రశ్న. ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యూహాల అమలులో దేశాధినేతలు నిర్లక్ష్యపూరిత, నిరాసక్త ధోరణితో సాగుతున్నారని చెప్పకతప్పదు. వాతావరణ మార్పుల్ని ప్రాధాన్యాంశంగా, నిర్దిష్టంగా దృష్టి సారించాల్సిన విషయంగా ప్రభుత్వాలు పరిగణించడం లేదని స్పష్టమవుతోంది. ప్రస్తుత ఆర్థిక, విద్యుత్తు ధోరణుల్ని పరిశీలిస్తే ఈ ఏడాది సైతం ఉద్గారాలు 2018 మాదిరిగా అత్యధిక స్థాయిలోనే ఉండనున్నాయి. 2019లో ప్రపంచ జీడీపీ 3.2 శాతం పెరుగుతుందని అంచనా. ఈ క్రమంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కర్బనీకరణ క్షీణత గత పదేళ్ల కాలంలో మాదిరిగానే ఉంటే పరిస్థితి ఉద్గారాల పెరుగుదలకే దారితీస్తుంది.

వాతావరణ శాస్త్ర సంస్థల సమాఖ్య వెలువరించిన నివేదిక ప్రకారం భూతాపాన్ని ఎదుర్కొనే విషయంలో లక్ష్యాలకు, వాస్తవితకు మధ్య అంతరం ఉంది. ఈ నివేదికను ఐరాస వాతావరణ చర్యల సదస్సు కోసం రూపొందించారు. భూ వినియోగం, విద్యుత్తు వంటి సామాజిక, ఆర్థిక రంగాల్లో ప్రాథమిక మార్పును అత్యవసరంగా చేపట్టాల్సి ఉందని ఆ నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల చోటు చేసుకునే ప్రభావాలను పరిహరించేందుకు ఇలాంటి మార్పు అవసరమని తేల్చిచెప్పింది. మానవ కారక వాతావరణ మార్పుల ప్రభావం పెరుగుతున్న క్రమంలో భూమి వ్యవస్థ పరిస్థితిపై నిర్దిష్ట అంచనాను ఈ నివేదిక తెలియజేసింది. నివేదికలో పేర్కొన్న గణాంకాలు, అంశాలు సరికొత్తవే కాకుండా, అధీకృత సమాచారమని ఐరాస ప్రధాన కార్యదర్శి వాతావరణ చర్యల సదస్సుకు సంబంధించిన శాస్త్ర సలహా బృందం పేర్కొంది. ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) ప్రకారం 2015-19 మధ్య కాలంలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు అత్యంత వేడిగా ఉంటాయని, పారిశ్రామికీకరణ కాలానికి ముందు (1850-1900)తో పోలిస్తే 1.1 డిగ్రీల సెల్సియస్‌కన్నా అధికమని అంచనా.

సుదీర్ఘకాలం ఉండే వేడి గాలులు, తుపాన్లు, వరదలు, కరవులు సామాజిక ఆర్థిక అభివృద్ధి, పర్యావరణంపై ప్రభావం చూపుతాయి. 1979-2018 మధ్య ఆర్కిటిక్‌ సముద్ర మంచు విస్తృతిలో దశాబ్దానికి సుమారు 12 శాతం చొప్పున క్షీణత నమోదైంది. అదే శీతకాలంలో నాలుగు అత్యల్ప విలువలు 2015-2019 మధ్య నమోదయ్యాయి. మొత్తంగా అంటార్కిటికా మంచు ఫలకం నుంచి ఏటా నష్టపోతున్న మంచు పరిమాణం 1979-2017 మధ్య కనీసం ఆరు రెట్లు పెరిగింది. హిమనీనదాల నష్టం 2015-2019 మధ్య రికార్డు స్థాయిలో ఉన్నట్లు నమోదైంది. సముద్రజలాల ఉష్ణాల రేటు పెరగడం, గ్రీన్‌లాండ్‌ కరగడం, పశ్చిమ అంటార్కిటికా మంచు ఫలకాలు కరగడం ఫలితంగా సముద్ర మట్టాల పెరుగుదల వేగం 1997-2006 మధ్య ఏడాదికి 3.04 మిల్లీమీటర్లుగా ఉన్నట్లు డబ్ల్యూఎంవో పేర్కొంది. ఇది 2007-2016 మధ్య సుమారు ఏడాదికి నాలుగు మిల్లీమీటర్లుగా ఉంది. పారిశ్రామిక యుగం ప్రారంభం నుంచి సముద్ర క్షారతలో 26 శాతం పెరుగుదల నమోదైంది. కార్బన్‌ డైఆక్సైడ్‌ (సీవో2), మీథేన్‌ (సీహెచ్‌4), నైట్రస్‌ ఆక్సైడ్‌ (ఎన్‌2వో) వంటి గ్రీన్‌హౌస్‌ వాయువుల స్థాయులు కొత్త ఉత్థానాలకు చేరినట్లు నివేదిక పేర్కొంది. మూడు నుంచి అయిదు మిలియన్‌ సంవత్సరాల క్రితం భూమి వాతావరణంలో 400 పార్ట్స్‌ పెర్‌ మిలియన్‌ సీవో2 ఉండగా, ప్రపంచ సగటు ఉపరితల ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్‌తో ప్రస్తుతంకన్నా వేడిగా ఉన్నట్లు తేలింది. దీంతో గ్రీన్‌లాండ్‌, పశ్చిమ అంటార్కిటికాలోని మంచు ఫలకాలు కరిగి, తూర్పు అంటార్కిటికాలో ప్రాంతాల్లో మంచు తగ్గడం వంటివి చోటుచేసుకున్నాయి. వీటి ఫలితంగా ప్రపంచ సముద్ర మట్టాల పెరుగుదల 10-30 మీటర్లుగా ఉన్నట్లు గుర్తించారు.

వాతావరణ మార్పుల లక్ష్యాన్ని సాధించడంలో ప్రధాన సమస్య- గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాల్ని నివారించే యంత్రాంగాల్ని ఏర్పాటు చేయడం లేదా పరిశ్రమలు యంత్రాల్ని బిగించడం వంటివి తప్పనిసరి చేసేలా కఠినమైన చట్టాలు లేకపోవడమే. అరాబెస్క్యూ ఎస్‌-రే అనే పెట్టుబడి గణాంక సంస్థ ఇటీవల ఓ అధ్యయనం నిర్వహించింది. దీని ప్రకారం ఈ శతాబ్దం మధ్యనాటికి పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతల్ని పారిశ్రామికీకరణ ముందస్తు దశ స్థాయి తరహాలో 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలన్నది లక్ష్యం. ఈ లక్ష్యసాధన కోసం తాము అమలు చేసే ప్రణాళికల్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని స్టాక్‌మార్కెట్లలో నమోదైన మూడు వేల కంపెనీల్లో 18 శాతం మాత్రమే వెల్లడించాయి. ప్రపంచంలోని అగ్రశ్రేణి 200 కంపెనీల్లో మూడోవంతుకన్నాపైగా ఇప్పటికీ తమ గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలను వెల్లడించలేదు. ప్రమాదకర స్థాయిలో ఉన్న భూతాపాన్ని పరిహరించేందుకు ఆందోళనలు పెరుగుతున్నా ఈ కంపెనీలు స్పందించలేదని తేలింది. పెట్టుబడుల పోకుండా జాగ్రత్తపడేందుకు చాలా కంపెనీలు తమ పూర్తిస్థాయి ఉద్గారాల వివరాల్ని దాచిపెట్టినట్లు వెల్లడైంది.

2014లో భారత్‌లో మొత్తం గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలు 3,202 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల కార్బన్‌ డైఆక్సైడ్‌కు సమానం (ఎంటీసీవో2ఈ)గా ఉన్నాయి. ఇది ప్రపంచ గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాల్లో 6.55 శాతం. భారత్‌ 2018లో 2,299 మిలియన్‌ టన్నుల కార్బన్‌డై ఆక్సైడ్‌ను విడుదల చేసింది. గత ఏడాదితో పోలిస్తే, 4.8 శాతం పెరిగింది. ఈ లెక్కన భారతీయులు గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలతో నిండిన కాలుష్యం మధ్యే నివసించాల్సిందే. మరోవైపు ప్రభుత్వపరంగా బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తికి ప్రత్యామ్నాయంగా పూర్తిస్థాయి ప్రయత్నాలు లోపిస్తున్నాయి!


- సత్యపాల్‌ మేనన్‌
Posted on 04-10-2019