Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ప‌ర్యావ‌ర‌ణం

ప్రకృతి ప్రసాదిత ఉద్యోగ పర్వం

* ప్రత్యామ్నాయ ఇంధనరంగంలో అపార అవకాశాలు

భూతాపాన్ని అరికట్టాలంటే బొగ్గు, చమురు లాంటి శిలాజ ఇంధనాలను వదలి పునరుత్పాదక ఇంధన వనరులకు మళ్ళక తప్పదు. ఉన్నపళాన ఆ పని చేస్తే ఇప్పుడు ఇంధన రంగంలో పనిచేస్తున్న లక్షలాదిమంది రోడ్డున పడతారని, అనుబంధ వ్యాపారాలూ మూతబడతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వాల ఇంధన విధానాలను ఈ కలవరపాటు ప్రభావితం చేయకమానదు. ఇక్కడ గమనించాల్సిన వాస్తవమేమంటే సూర్యుడు, వాయువు, వరుణుడు ఇళ్లలో దీపాలు వెలిగించడమే కాదు- కోట్లాదిమందికి ఉపాధి కల్పించగలరు కూడా. ముఖ్యంగా పవన, సౌర విద్యుదుత్పాదన వల్ల పల్లెసీమల్లో పెద్దయెత్తున కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. కర్బన ఉద్గారాలను పరిహరించి పునరుత్పాదక విద్యుదుత్పాదనకు మళ్లితే 2050కల్లా 2.8 కోట్ల కొత్త ఉద్యోగాలు ఉత్పన్నమవుతాయని అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ (ఐరెనా) డైరెక్టర్‌ జనరల్‌ అద్నాన్‌ అమీన్‌ వివరించారు. 2018నాటికే ప్రపంచంలో పునరుత్పాదక ఇంధన రంగంలో పనిచేస్తున్నవారి సంఖ్య కోటీ పది లక్షలకు చేరిందని ఐరెనా ప్రకటించింది. 2011 నుంచి అమెరికాలో బొగ్గు ఇంధనంగా నడిచే థర్మల్‌ విద్యుత్కేంద్రాల్లో సగానికిపైగా మూతపడ్డాయి. నేడక్కడ బొగ్గు గనుల్లో పనిచేస్తున్నవారు కేవలం లక్షకు దిగివచ్చింది. పునరుత్పాదక ఇంధన రంగంలో ఏకంగా 33 లక్షలమంది పనిచేస్తున్నారు. 2050కల్లా కర్బన ఉద్గారాలను పూర్తిగా నిర్మూలించాలని అమెరికన్‌ నగరాలు, రాష్ట్రాలు కృతనిశ్చయంతో ఉన్నందువల్ల, హరిత ఇంధనాలు మరెందరికో ఉపాధి చూపనున్నాయి. చైనాలో ఇవి ఇప్పటికే 42 లక్షలమందికి ఉద్యోగాలు కల్పించాయి. భారతదేశంలో 2014లో సౌర, పవన విద్యుత్‌ రంగాల్లో 19,800 మంది పనిచేస్తుండగా, 2019లో వారి సంఖ్య లక్షకు పెరిగింది. 2015 పారిస్‌ వాతావరణ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాగ్దానం మేరకు 2022కల్లా 175 గిగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పాదనను సాధించే క్రమంలో అదనంగా 2.30 లక్షలమందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా.

కలిసికట్టుగా కృషి
ప్రపంచ దేశాల నాయకులు ఇటీవల న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో సమావేశమై వాతావరణ మార్పుల నిరోధానికి జరుపుతున్న కృషిని సమీక్షించారు. మనమింకా రెండో గేరులోనే నడుస్తున్నామని తేల్చారు. కర్బన ఉద్గారాలు తగ్గించడానికి కొత్త లక్ష్యాలను ప్రతిపాదించి, వాటిని వేగంగా అందుకోవడానికి ప్రజలు, ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు కలిసికట్టుగా చిత్తశుద్ధిగా కృషిచేయాలన్నారు. పునరుత్పాదక ఇంధనాలతో విద్యుత్‌ ప్లాంట్ల స్థాపన, విద్యుదుత్పాదన, విద్యుత్‌ వ్యాపారం- ఈ మూడు విభాగాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఉపాధి వల్ల వ్యక్తుల ఆదాయాలు పెరిగి, సామాజిక సుస్థిరతకు, పర్యావరణ రక్షణకు సానుకూల వాతావరణం ఏర్పడుతుందని ఐరెనా ప్రధాన కార్యదర్శి ఫ్రాంచెస్కో లా కామెరా వివరించారు. పునరుత్పాదక ఇంధన రంగంలో మూడోవంతు ఉద్యోగాలు సౌర ఫలకాల ఉత్పత్తిలో లభిస్తున్నాయి. ఆ తరవాత ఎక్కువ ఉద్యోగాలు ద్రవరూప జీవ ఇంధనాలు, జల, పవన విద్యుత్‌ రంగాల్లో దక్కుతున్నాయి. గ్రిడ్‌తో అనుసంధానించకపోయినా మారుమూల ప్రాంతాల్లో సౌర, పవన విద్యుదుత్పాదన చేయవచ్చు. ఆసియా, ఆఫ్రికాల్లో ఎడారులు, పర్వతాలు, అడవుల వంటి దుర్గమ ప్రాంతాల్లో ఈ విధంగా పలువురు ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం చైనా, జర్మనీ, అమెరికాలు భూమి మీద భారీగా పవన విద్యుదుత్పాదన సాగిస్తున్నాయి. రేపు సముద్రతలం మీదా గాలిమరలు ఏర్పాటు చేసి సాగర పవనాలతో కరెంటు ఉత్పత్తి చేయవచ్చు. భారతదేశంలో ప్రప్రథమంగా ఇలాంటి సాగర-పవన విద్యుదుత్పాదన కేంద్రం గుజరాత్‌ తీరంలో ఏర్పడనుంది. 2017నాటికి భారత్‌లో సౌర విద్యుత్‌ కర్మాగారాల స్థాపన, విద్యుదుత్పాదనలో 1.64 లక్షల మంది పనిచేస్తున్నారని ఐరెనా తెలిపింది.

ప్రపంచంలో పునరుత్పాదక విద్యుదుత్పాదనలో చైనా జగజ్జేత అయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. ప్రపంచమంతటా ఈ రంగంలో పనిచేస్తున్నవారిలో 40 శాతం చైనాలోనే ఉన్నారు. ఐరోపా సమాఖ్య దేశాలు, అమెరికాల్లోనూ పునరుత్పాదక ఉద్యోగాలను దండిగా సృష్టిస్తున్నా, ఈమధ్య సౌర విద్యుత్‌ రంగంలో ఉపాధి అవకాశాలు తగ్గాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనా నుంచి దిగుమతి అయ్యే సౌర విద్యుత్‌ ఫలకాల మీద సుంకాలను పెంచేసినందువల్ల, ఖర్చులు పెరిగి పెట్టుబడులు తగ్గి కొత్త సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటు కుంటువడి ఉద్యోగాలు మరింత తగ్గిపోనున్నాయి.

భారత్‌లో బ్రేకులు
భారతదేశంలో పీపీఏల సవరణ రగడకు తోడు డిస్కమ్‌లు సకాలంలో చెల్లింపులు జరపకపోవడం, ముందనుకున్న ప్రకారం సౌర, పవన విద్యుత్తును కొనకపోవడం వల్ల కొత్త పెట్టుబడులు మందగించే ప్రమాదం ఉంది. ఈ దుష్ప్రభావ ఛాయలు ఇప్పటికే ఉద్యోగాల మీద ప్రసరిస్తున్నాయి. 2018లో దేశవ్యాప్తంగా సౌర విద్యుత్‌ ప్లాంట్లు, ఇళ్లపైకప్పుల మీద సౌర విద్యుదుత్పాదన, పవన విద్యుత్‌ ప్రాజెక్టుల్లో 30 వేలమందికి ఉపాధి లభిస్తే, 2019 మార్చికల్లా వారి సంఖ్య 12,400కు తగ్గిపోయింది. దిల్లీకి చెందిన ఇంధన, పర్యావరణ, జల వనరుల మండలి (సీఈఈడబ్ల్యూ), జాతీయ వనరుల రక్షణ మండలి (ఎన్‌ఆర్‌డీసీ) సంయుక్త నివేదిక ఈ వివరాలను తెలిపింది. ప్రభుత్వ విధానాలు మారడం వల్ల కొత్తగా భారీ ప్రాజెక్టులు చేపట్టడానికి పారిశ్రామికవేత్తలు ఉత్సాహం కనబరచడం లేదు. కానీ, ఇళ్లకప్పుల మీద సౌర విద్యుదుత్పాదన మందగించడం చాలా ఆందోళన కలిగిస్తోంది. భారీ సౌర ప్రాజెక్టుల్లోకన్నా ఇళ్ల కప్పుల మీద సౌర ఫలకాలు అమర్చి విద్యుదుత్పాదన చేయడం ద్వారానే అత్యధిక ఉద్యోగావకాశాలు లభిస్తాయి. థర్మల్‌, సౌర, పవన విద్యుత్కేంద్రాలు ఎక్కడో దూరాన కొండల్లో గుట్టల్లో ఏర్పాటవుతాయి. ఉద్యోగాల కోసం అక్కడికే వెళ్లకతప్పదు. దీనికి భిన్నంగా ఇళ్ల పైకప్పు సౌర ప్రాజెక్టులు నగరాలు, పట్టణాల్లో ఉండి అక్కడే ఉద్యోగాలు కల్పిస్తాయి. సిబ్బంది గృహవసతి, కుటుంబం, వాతావరణ పరిస్థితుల గురించి ఆందోళన చెందాల్సిన పని ఉండదు. దీర్ఘకాలంలో గ్రిడ్‌కు అనుసంధానమైన భారీ సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్టుల నుంచి విద్యుత్‌ కొనుగోలు చేయడంకన్నా, సొంత ఇళ్ల మీదనే ఉత్పత్తిచేసుకుని వాడుకోవడానికి వినియోగదారులు ఇష్టపడటం ఖాయం. ఇది వారికి ఎంతో సులువుగా చౌకగా ఉంటుంది. సౌర ఫలకాల ధరలు పెరగడం వల్ల భారతీయ కుటుంబాలు ఇళ్ల కప్పు సౌర ప్లాంట్లను చేపట్టలేకున్నారు. 2022కల్లా పునరుత్పాదన ఇంధన వనరుల నుంచి విద్యుదుత్పాదన సామర్థ్యాన్ని 175 గిగావాట్లకు పెంచాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2015లో తీర్మానించింది. అది నెరవేరాలంటే ఇళ్ల కప్పుల మీద దృష్టిపెట్టాలి. పునరుత్పాదక ఇంధన ప్లాంట్లకు స్వల్ప వడ్డీ రేట్లకు రుణాలివ్వడం, కుదురైన ధరల నిర్ణయం, స్థిరమైన నియంత్రణలతో లక్ష్యాన్ని సాధించాలి!


- వరప్రసాద్‌
Posted on 05-10-2019