Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ప‌ర్యావ‌ర‌ణం

అంతటా అవినీతి కాలుష్యమే!

కోట్లాది భారతీయుల జీవన ప్రమాణాలకు తూట్లు పొడుస్తూ జల, వాయు కాలుష్యాలు పెచ్చరిల్లుతున్న దేశం మనది. కాలుష్య నియంత్రణలో భాగంగా- పాతబడిన థర్మల్‌ కేంద్రాల్ని మూసేయాలని; వాహన, పారిశ్రామిక కాలుష్య కట్టడికి నూతన ప్రమాణాలు రూపొందించాలని ఆమధ్య ‘నీతి ఆయోగ్‌’ పలు సూచనలు చేసింది. నేటికీ ఎక్కడి గొంగడి అక్కడే! దేశవ్యాప్తంగా వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెద్దయెత్తున పేరుకుపోవడానికి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు, రసాయన పరిశ్రమలు, గనుల తవ్వకాలు, వాహనాలు ప్రధానంగా పుణ్యం కట్టుకుంటున్నాయి. వాటిని అదుపు చేసేందుకంటూ ఎప్పటికప్పుడు మేలిమి సూచనలెన్ని వెలుగుచూస్తున్నా అమలుకు నోచక దస్త్రాలకు పరిమితమవుతున్న నేపథ్యంలో- జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) తాజాగా కొరడా ఝళిపించింది. కాలుష్య స్థాయి అత్యంత విషమంగా ఉన్నచోట్ల, తీవ్రంగా నమోదైన ప్రాంతాల్లో కశ్మల కారక పరిశ్రమల్ని మూడునెలల్లోగా మూసేయించాలని అది కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ)కి గిరిగీసింది. పారిశ్రామిక ప్రాంతాల్లో జల, వాయు కాలుష్య నిబంధనల ప్రాతిపదికన వాస్తవ సమాచారాన్ని సీపీసీబీ మూడు నెలల్లోగా క్రోడీకరించి పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖలతో సంయుక్త కార్యాచరణను పట్టాలకు ఎక్కించాలనీ ఎన్‌జీటీ నిర్దేశించింది. ఇదే హరిత ట్రైబ్యునల్‌ శిశువులు, వృద్ధుల సంక్షేమం దృష్ట్యా దేశం నలుమూలలా శబ్దకాలుష్య తీవ్రతను అరికట్టే విస్తృత ప్రణాళికను మూడునెలల వ్యవధిలో సిద్ధపరచాలని గత మార్చిలో సీపీసీబీని ఆదేశించింది. గడువు ముగిసినా దానిపై ఎక్కడా చడీచప్పుడు లేదు! మరి, తాజా ఉత్తర్వులకు ఏ గతి పడుతుందో ఏమో. యథార్థానికి కలుషిత ప్రాంతాల్లో వాతావరణ శుద్ధి, కశ్మల క్లేశాలపై జనసామాన్యంలో చైతన్యం పెంపొందించడమన్నది- సీపీసీబీ బాధ్యతల్లో కీలకాంశం. ఆ సంగతిని ఏనాడో విస్మరించిన కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి రాష్ట్ర విభాగాల్ని కూడగట్టుకుని, అడ్డగోలుగా నిబంధనల ఉల్లంఘనకు తెగబడిన పరిశ్రమలకు తాళాలు వేయించే చొరవ కనబరుస్తుందా?

వాహన పారిశ్రామిక కాలుష్యం నిర్నిరోధంగా ఇలాగే కొనసాగినట్లయితే భారత్‌, పాక్‌, బంగ్లాదేశ్‌లలో కోట్లమందిని ఆహార సంక్షోభం అతలాకుతలం చేసే దురవస్థ ఎంతో దూరాన లేదని ఇటీవలే మసాచుసెట్స్‌ సాంకేతిక విద్యాసంస్థ పరిశోధన ప్రమాద ఘంటికలు మోగించింది. ఎవరెంతగా హెచ్చరిస్తున్నా దేశంలో కాలుష్య నియంత్రణ వ్యవస్థ ఏళ్ల తరబడి అలసత్వానికి మారుపేరుగా భ్రష్టుపడుతూనే ఉంది. దేశంలో నదుల దుస్థితిని పరికిస్తే చాలు- పీసీబీల దారుణ నిర్వాకాలు ఇట్టే బోధపడతాయి. సగానికి పైగా నదుల్లో నీరు తాగడానికి పనికిరాదు. నాలుగోవంతు నదీజలాలు స్నానానికి ఉపయోగించే వీల్లేదని గతంలో సర్కారీ అధ్యయనమే నిగ్గుతేల్చింది. భారత్‌లో నదులు, జలవనరులు కలుషితం కాకుండా దశాబ్దాలుగా చేపట్టామన్న కసరత్తు వట్టి కంటితుడుపేనని సాక్షాత్తు ‘కాగ్‌’ నివేదికే స్పష్టీకరించింది. సహజ సిద్ధమైన రంగు, రుచి, వాసనల్ని కొల్లబోయేలా చేసి జలాల్ని గరళంగా మార్చేస్తున్న పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధీకరించే కేంద్రాల ఏర్పాటును సర్వోన్నత న్యాయస్థానం 2017 ఫిబ్రవరిలో ప్రస్తావించింది. అందుకుతగ్గ చర్యలు చేపట్టాల్సిందిగా పరిశ్రమలన్నింటికీ ఉమ్మడిగా నోటీసులిచ్చి, మూడు నెలల్లో దిద్దుబాట పట్టనివాటికి విద్యుత్‌ సరఫరా నిలిపివేయాలని సుప్రీంకోర్టు అప్పట్లో లక్ష్మణరేఖ గీసినా- ఏం ఒరిగింది? ఉమ్మడి వ్యర్థ శుద్ధి వ్యవస్థలకు సంబంధించి రుసుముల నిర్ధారణ బాధ్యతను స్థానిక సంస్థలకు దఖలుపరచాలన్నా- ముందడుగు పడలేదు. అవినీతి మడుగులో పీసీబీల ఈదులాట అంతులేని కథగా కొనసాగినన్నాళ్లు ఏ ఆదేశాలదైనా తాటాకుల చప్పుడే కాకతప్పదు!

పారిశ్రామికంగా ముందంజ వేస్తున్న ఆసియా పసిఫిక్‌ ప్రాంతం జలవాయు కాలుష్యాల్ని అరికట్టలేకపోతే కడగండ్ల పాలుకావడం తథ్యమని రెండు పుష్కరాల క్రితమే ఆసియా అభివృద్ధి బ్యాంకు సూటిగా హెచ్చరించింది. ఇంచుమించు అదే సమయంలో పర్యావరణానికి, ప్రజారోగ్యానికి తూట్లుపడకుండా అవసరమైన జాగ్రత్తలన్నీ తీసుకున్న రసాయనిక పరిశ్రమలనే అనుమతించాలని తనవంతుగా సుప్రీంకోర్టు ఉద్బోధించింది. అందుకు మన్నన దక్కినట్లయితే- నేడిలా కాలుష్యకారక పరిశ్రమలకు మూడు నెలల్లో మంగళం పలకాలని ఎన్‌జీటీ ఆదేశించాల్సి వచ్చేదే కాదు. 180 దేశాల పర్యావరణ పనితీరు సూచీలో ఇండియా చివరి వరసన తల వేలాడేయడంలో కాలుష్య నియంత్రణ మండళ్ల ‘కృషి’ ఎంతో ఉంది! గంగానదితోపాటు అమృతజల రాశులెన్నో అనేక పరిశ్రమల విషవ్యర్థాల కాటుకు ఉక్కిరిబిక్కిరి కావడంలో పీసీబీల తిలాపాపం తలా పిడికెడు. గాలిని నీటిని నేలను పరిరక్షించుకోవడంలో, పరిశుభ్రతను సంస్కృతిగా అలవరచడంలో ఆస్ట్రేలియా, బార్బడోస్‌, జోర్డాన్‌, కెనడా ప్రభృత దేశాల అనుభవాలు ఏ పౌరసమాజానికైనా గొప్ప గుణపాఠాలు. ఫలానా పరిశ్రమ కాలుష్యం వెదజల్లుతోందని జనం ఉప్పందిస్తే చాలు తక్షణ చర్యలకు సిద్ధపడటమే చైనాలో జల, వాయు నాణ్యతా ప్రమాణాల్ని తిరగరాసింది. ఐస్‌లాండ్‌, ఫిన్లాండ్‌, ఎస్తోనియా వంటిచోట్ల సామాజికోద్యమంగా పర్యావరణ పరిరక్షణ అద్భుతాల్ని సాకారం చేస్తోంది. ఆ తరహా క్రియాశీలక పౌర భాగస్వామ్యమే ఇక్కడా క్షేత్రస్థాయి మార్పులకు అంటుకట్టగలిగేది. నిబంధనల్ని అతిక్రమించి తప్పించుకోవడమెలాగో పరిశ్రమలకు తామే తెలియజెప్పి అవినీతి రాబడుల్లో మునిగితేలుతున్న విధిద్రోహులతో కాలుష్య నియంత్రణ మండళ్లు లుకలుకలాడుతున్నాయి. వాటి సమూల క్షాళనకు పటిష్ఠ చర్యలు చేపడితేనే దేశంలో జడలు విరబోసుకుంటున్న కాలుష్య భూతాన్ని కట్టడి చేయగలిగేది!


Posted on 18-07-2019