Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ప‌ర్యావ‌ర‌ణం

రుతుపవనాలకు ఏమైంది?

* కదలికల్లో అనిశ్చితి - కుండపోతగా వానలు

రుతుపవనాలు గతి తప్పి ఆకస్మిక కుండపోత వర్షాలు కురిపిస్తున్నాయి. వరదలు, విపత్తులకు కారణమవుతున్నాయి. బిహార్‌, అసోం రాష్ట్రాల్లో; ముంబయి, హైదరాబాద్‌ నగరాల్లో కురుస్తున్న అతి భారీవర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సాధారణంగా జూన్‌ మొదటి వారం నుంచి సెప్టెంబరు 30 వరకు దేశంలో నైరుతి రుతుపవనాల కాలం. అక్టోబరు ఆరంభం నుంచి అవి తిరుగుముఖం పట్టి, హిమాలయాల నుంచి ఈశాన్య భారతం మీదుగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని కొంత భాగం, కేరళ, తూర్పు కర్ణాటక మీదుగా పయనించాలి. నైరుతి రుతుపవనాలు పశ్చిమ, మధ్య భారతం నుంచి ఉత్తరాదికి పయనించి, విస్తరిస్తున్నాయి. ఈ రుతుపవనాల గడువు ముగిసినా దక్షిణాదిన తెలంగాణలో గడచిన మూడు వారాలుగా కుండపోత వర్షాలు పడుతున్నాయి. వాతావరణ పరిస్థితుల్లో మార్పులూ ఇందుకు కారణమే. సీజన్‌ మొత్తంలో కురవాల్సిన వర్షపాతం మూడు, నాలుగు రోజుల్లోనే నమోదైంది. చుక్కనీరులేని కృష్ణానది పైనున్న జలాశయాలన్నీ వారం రోజుల్లోనే నిండుకుండల్లా పరవళ్లు తొక్కాయి.

పశ్చిమ, మధ్య, ఉత్తర భారతంలోనూ ఇవే పరిస్థితులున్నాయి. 2013 తరవాత ఉత్తరాఖండ్‌లో మళ్ళీ భీకర వరదలు పోటెత్తాయి. నగరాల్లోని జనావాస ప్రాంతాలు, రహదారులు జలాశయాలను తలపింపజేస్తున్నాయి. హైదరాబాద్‌లో సెప్టెంబరు చివరి వారంలో ఒకేరోజు కొన్ని గంటల్లోనే కుండపోతగా 14 సెం.మీ. వాన కురిసింది. దేశమంతటా ఆకస్మికంగా అతితక్కువ వ్యవధిలో అధిక వర్షపాతం నమోదు కావడం సర్వ సాధారణంగా మారుతోంది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సమయంలో సగటున 968.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కొంకణ్‌, గోవా, పశ్చిమ మధ్యప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాల వల్లే గడిచిన 119 ఏళ్ల చరిత్రలో రికార్డు స్థాయిలో వానలు కురిశాయి. 2019లో కేరళ, బిహార్‌లతో పాటు పది రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిసి వరదలు ముంచెత్తాయి. వరదలను సమర్థంగా ఎదుర్కోవాల్సిన ఆవశ్యకతను ప్రస్తుత పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి.

నిర్లిప్తతే శాపం
ప్రకృతి విపత్తులను ముందే అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేయడంలో, నష్ట నివారణ చర్యలు చేపట్టడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం, నిర్లిప్తత ప్రదర్శిస్తూ ఉండటంవల్లే పరిస్థితులు చేయి దాటిపోతున్నాయన్నది చేదు నిజం. భారీ స్థాయిలో వర్షాలు కురిసినప్పుడు, నీటిపారుదల వ్యవస్థ పటిష్ఠంగా ఉండాలి. కాలువలు, నాలాల ఏర్పాటు, నిరంతరం వాటి పర్యవేక్షణ, నిర్వహణ అత్యంతావశ్యకం. వర్షపునీటి ప్రవాహం సాఫీగా సాగిపోయే పరిస్థితులు నేడు దేశంలో ఏ నగరంలోనూ లేవన్నది వాస్తవం. చెరువులు, కుంటల్లో ఏళ్ల తరబడి పూడికతీయకపోవడం, నాలాల విస్తరణ చేపట్టకపోవడం, అతిక్రమణలు, అక్రమ నిర్మాణాల కోసం చెరువులు, కుంటలు, నాలాలను మూసేస్తుండటం ఇందుకు కారణాలు. కురిసిన వర్షపు నీటిని నిల్వ చేసే చిన్న నీటి వనరులు అంతర్థానం అవుతున్నాయి. మురుగునీటి పారుదల వ్యవస్థల్లో వాడిపారేసే ప్లాస్టిక్‌ సంచులు, సీసాలు, ఇతర వస్తువులు విచక్షణారహితంగా గుప్పిస్తున్నారు. అవి వాననీటి ప్రవాహానికి ఆటంకంగా మారి నగరాల్లో వరదలు పోటెత్తడానికి కారణమవుతున్నాయి. అభివృద్ధి, సుందరీకరణ పేరిట సహజసిద్ధమైన నదుల స్వరూపాన్ని మార్చేస్తుండటం కూడా పలు అనర్థాలకు దారితీస్తోంది. హైదరాబాద్‌లోని మూసీ నదే ఇందుకు ప్రబల నిదర్శనం. మెట్రోరైల్‌ డిపోలు, బస్సు ప్రయాణ ప్రాంగణాలు, శిల్పారామం వంటి ప్రజోపయోగ నిర్మాణాలతో పాటు ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చి పెట్టే భూముల లేఅవుట్ల ఏర్పాటుకు మూసీనది పరీవాహక ప్రాంతమే వేదిక కావడం... వంటి చర్యలు ఎప్పటికైనా మూసీకి వరద ముప్పును తెచ్చిపెట్టే విపత్తు కారకాలేనని పర్యావరణ, ఇంజినీరింగ్‌ నిపుణులు చేస్తున్న హెచ్చరికలు ముందస్తు ప్రమాదఘంటికలు!

బ్రహ్మపుత్ర నదినే తీసుకుంటే దానిలో పూడిక పేరుకుపోవడం వల్ల రెండు కిలోమీటర్ల నది వెడల్పు ప్రస్తుతం చాలాచోట్ల 14 కి.మీ. మేర విస్తరించింది. లోతు తగ్గిపోవడం వల్ల విస్తీర్ణం పెరిగి, ఈశాన్య భారతంలో వరదలకు కారణమవుతోంది. 2015లో చెన్నై నగరాన్ని ముంచెత్తిన వరదలకు ప్రధాన కారణం మురుగునీటి పారుదల వ్యవస్థలోని లోపాలే. ప్రత్యేకించి ఉత్తర, ఈశాన్య భారతంలో వరదలకు పర్వత కొండ ప్రాంతాల్లో తరచూ కొండచరియలు విరిగి పడుతుండటమే ప్రధాన కారణం. 2013లో ఉత్తరాఖండ్‌ను భీకర వరదలు ముంచెత్తాయి. కొండచరియలు విరిగి నదులు, కాలువల సహజ ప్రవాహానికి అడ్డుపడటమే నాటి పెను ఉత్పాతానికి కారణం. దేశంలో తరచూ సంభవిస్తున్న వరదలకు వ్యవసాయరంగం తీవ్రంగా ప్రభావితమవుతోంది. పంటపొలాలు, వ్యవసాయ క్షేత్రాలు నీట మునిగి రైతన్నలను నష్టాలకు గురిచేస్తున్నాయి. ఈ నష్టాలు అంతిమంగా ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమై మధ్యతరగతి ప్రజలకు పెనుభారంగా పరిణమిస్తున్నాయి. పాడి పరిశ్రమ సైతం విపరీతంగా నష్టపోతోంది. నేలలు కోతకు గురై నిస్సారమైపోతున్నాయి. భారీ వర్షాలు, వరదల వల్ల మౌలిక సదుపాయాలకు వాటిల్లుతున్న నష్టం అంతాయింతా కాదు. రవాణా, కమ్యూనికేషన్‌, విద్యుత్‌ పంపిణీ వ్యవస్థలు దెబ్బతిని ప్రజాజీవనాన్ని స్తంభింపచేస్తున్నాయి. నీటి కాలుష్యాల వల్ల అంటురోగాలు, వ్యాధులు ప్రబలి ప్రజారోగ్యానికి సవాలు విసరుతున్నాయి. అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. తరచూ సంభవిస్తున్న విపత్తుల వల్ల పాలనా యంత్రాంగంపై ఆర్థికంగా, మానవ వనరులపరంగా ఒత్తిడి తీవ్రతరమవుతోంది. ప్రభావిత ప్రాంతాల ప్రజలకు సహాయ పునరావాస కల్పన ప్రభుత్వాలకు సవాలుగా మారుతోంది.

ప్రాంతీయ ప్రణాళికలే పరిష్కారం
ఆకస్మిక వరదలను సమర్థంగా ఎదుర్కొని, నష్టతీవ్రతను తగ్గించడానికి సుస్థిరమైన వరద నివారణ ప్రణాళికలను రూపొందించి, ఆచరణలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రాథమికంగా వరద ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల సమగ్ర సమాచారంతో కూడిన మ్యాపింగ్‌ చేపట్టి, ప్రాంతాలవారీగా నిర్వహణ ప్రణాళికలు రూపొందించి, క్షేత్రస్థాయిలో అమలుచేయాలి. ఆయా ప్రాంతాల్లో భూవినియోగాన్ని నియంత్రించడం ద్వారా ఆస్తి, ప్రాణనష్టాల తీవ్రతను తగ్గించవచ్చు. వరద ప్రభావ నష్టాలను తగ్గించడానికి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి శాశ్వత పునరావాసం కల్పించాలి. వరద ముంపునకు అవకాశమున్న ప్రాంతాల్లో భారీస్థాయి అభివృద్ధి కార్యకలాపాలను చేపట్టరాదు. పట్టణ, నగర పాంతాల్లో ముంపు బారినపడే ప్రాంతాలను నీటికుంటలు, సరస్సులుగా తీర్చిదిద్దడం శ్రేయస్కరం. వరదనీటి ప్రవాహాన్ని మళ్లించడానికి కాలువలు, కరకట్టలు నిర్మిస్తే ప్రమాద తీవ్రత తగ్గుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 146 నదీ పరీవాహక ప్రాంతాల్లో కురిసే వర్షపాత వివరాలను భారత వాతావరణ శాఖ నిత్యం పర్యవేక్షిస్తోంది. నదుల్లోకి వచ్చిచేరే వరదనీటి ప్రవాహం పరిమాణం, అది ఎంత సమయంలో జలాశయాలకు చేరే అవకాశం ఉంది, తదితర విషయాలను వాతావరణ శాఖ, కేంద్ర జలసంఘం కలిసి అంచనా వేసి, ఆ వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిస్తుంటాయి. ఈ గణాంకాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు జలాశయాల్లోని నీటినిల్వ, వాటి సామర్థ్యాన్ని బట్టి నీటిమట్టాల నిర్వహణను చేపట్టాలి. ప్రస్తుతం దేశంలోని అనేక ప్రాంతాల్లో జలాశయాల్లోని నీటి నిల్వలను సమర్థవంతంగా క్రియాశీలకంగా నిర్వహించే వ్యవస్థ లేదు. కేంద్ర జలసంఘానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య చక్కని సమన్వయం, క్షేత్రస్థాయిలో ఔత్సాహికులు, నిబద్ధత కలిగిన సిబ్బంది ఉంటే భారీ వర్షాలతో సంభవిస్తున్న వరద ముంపును గణనీయంగా తగ్గించవచ్చు. ప్రస్తుతం అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వాతావరణశాఖ మరింత కచ్చితత్వంతో అంచనాలు, సమాచారాన్ని వెల్లడిస్తోంది. వాతావరణశాఖ, కేంద్రజల సంఘం, రాష్ట్ర ప్రభుత్వాలు క్రియాశీలకంగా వ్యవహరించి, కార్యాచరణకు ఉపక్రమించినప్పుడే వరదలు, విపత్తుల బారి నుంచి ప్రాణాలను, ఆస్తులను కాపాడుకోగలుగుతాం.- మనస్వి
Posted on 13-10-2019