Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ప‌ర్యావ‌ర‌ణం

మూగజీవుల అరణ్యరోదన

* రైలుపట్టాలపై జంతుబలి

భారతీయ రైల్వే వ్యవస్థ ఆధునిక సాంకేతికతను అంది పుచ్చుకొంటూ నానాటికీ విస్తరిస్తోంది. ప్రయాణికులకు సౌకర్యాలతోపాటు, ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించడానికి అనేక చర్యలు చేపడుతోంది. పట్టణాలు, నగరాల్లో వంతెనలు నిర్మిస్తోంది. రైలు గేట్ల వద్ద ప్రమాదాలు సంభవించకుండా రక్షణ చర్యలు మెరుగుపరుస్తోంది. ప్రజల విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న రైల్వేశాఖ అడవి జంతువుల రక్షణ విషయంలో ఉదాసీనంగా ఉండటమే బాధాకరం. ఆధునిక రైళ్ళ వేగం మూగ జంతువుల పాలిట పెనుశాపమవుతోంది. అటవీ క్షేత్రంలో ఆహారాన్వేషణలో స్వేచ్ఛగా సంచరించే ఎన్నో జంతు జాతులు వేగంగా దూసుకొస్తున్న రైళ్ళకింద పడి పట్టాలమీదే విలవిల్లాడుతూ ప్రాణాలు విడుస్తున్నాయి. భారతదేశ అడవుల్లో రైళ్ళ కింద పడి రోజుకు 31 వన్యమృగాలు మృతి చెందుతున్నాయని రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఇటీవల పార్లమెంటులో ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వన్యప్రాణుల రక్షణకు పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలతో కలిసి రైల్వేశాఖ శాశ్వత చర్యలు చేపడుతుందని 2013లో నాటి రైల్వేమంత్రి పవన్‌కుమార్‌ బన్సాల్‌ సైతం పార్లమెంటుకు తెలిపారు. ముఖ్యంగా ఏనుగుల సంరక్షణపై దృష్టి సారిస్తున్నామన్న మంత్రి ప్రకటన ఆ తరవాత కార్యాచరణకు నోచుకోకపోవడమే అసలైన విషాదం!

నిత్య మృత్యుఘోష
గత మూడున్నరేళ్లలో రైళ్ళు ఢీకొని ఏనుగులు, పులులు, సింహాలు సహా చనిపోయిన మొత్తం జంతువుల సంఖ్య 35,732 అని రైల్వే శాఖ గణాంకాలే చాటుతున్నాయి. అందులో ఏనుగులు 65 ఉన్నాయి. 2016లో 7,945, 2017లో 11,683, 2018లో 12,625, 2019లో (జూన్‌ 20 వరకు) 3,479 చొప్పున అడవి జంతువులు ప్రాణాలు కోల్పోయాయి. పశ్చిమ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో అటవీ ప్రాంతం అధికంగా ఉన్న మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో జంతు మరణాలు అధికంగా నమోదయ్యాయి. ఈ జోన్‌ పరిధిలో 2016 నుంచి 2018 జూన్‌ వరకూ 12,748 వన్యప్రాణులను రైళ్లు బలి తీసుకున్నాయి. ఉత్తరాఖండ్‌లోని రాజాజీ జాతీయ అభయారణ్యం మీదుగా వెళ్తున్న రైల్వే ట్రాక్‌ ఏనుగుల పాలిట మృత్యుమార్గం (కిల్లర్‌ ట్రాక్‌)గా మారింది. దీంతో పలువురు పర్యావరణవేత్తలు స్పందించి, ఫిబ్రవరి నెలలో రైల్వేమంత్రికి విజ్ఞాపన పత్రం సమర్పించారు. వన్యమృగాలను బలిగొనడంలో ఉత్తర మధ్య రైల్వేజోన్‌ రెండోస్థానంలో నిలిచింది. గత మూడున్నరేళ్లలో ఈ జోన్‌ పరిధిలో 11,829 వన్యజీవులు హతమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అడవుల్లో మూడున్నరేళ్ల వ్యవధిలో రైళ్ళు ఢీకొని 110 వన్య మృగాలు చనిపోయాయి. అభివృద్ధి కోసం అడవుల ద్వారా రైలు మార్గాలు వేయడం అనివార్యం. అదే సమయంలో రైళ్ళ రాకపోకలు జంతువుల ప్రాణాలు హరించకుండా శాఖాపరంగా దీటైన చర్యలు తీసుకొనకపోవడమే తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఏనుగులు గుంపులుగా వలస వెళ్తుంటాయి. వేసవిలో ఝార్ఖండ్‌లోని దాల్మా కొండల్లో ఉండి, ఆ తరవాత పశ్చిమ్‌ బంగ మీదుగా ఒడిశాలోకి ప్రవేశిస్తాయి. ఏ కాలంలో ఎక్కడ ఆహారం, నీరు దొరుకుతుందో అక్కడికి ఏనుగులు తరలిపోతుంటాయి. సరిగ్గా ఇదే సమయంలో రైలు మార్గాలను దాటుతూ ప్రమాదాల బారినపడుతున్నాయి. పశ్చిమ్‌ బంగలోని జల్పాయ్‌గురి జిల్లాలోని అటవీ క్షేత్రంలో ఏనుగుల సంచారం అధికంగా ఉంటుంది. 2010లో సంభవించిన ఓ ఘోర ప్రమాదం పలువురు జంతుప్రేమికులను కలచివేసింది. రైలు పట్టాలపై ఏనుగులు గుంపుగా ఉండగా శరవేగంగా వచ్చిన గూడ్సు రైలు ఆ సమూహాన్ని ఢీకొంది. ఆ దుర్ఘటనలో ఏడు ఏనుగులు మృతి చెందాయి. ఒక ఏనుగును రైలు సుమారు 400 మీటర్లు ఈడ్చుకువెళ్ళింది. గున్న ఏనుగులు పట్టాలు దాటేందుకు కష్టపడుతుంటాయి. ఆ సమయంలో మిగతా ఏనుగులు వాటికి రక్షణవలయంగా నిలబడతాయి. సరిగ్గా అదే సమయంలో ఏనుగుల గుంపును రైలు ఢీకొంది. ఇదే తరహా దుర్ఘటన 2012లో ఒడిశాలోనూ చోటుచేసుకోగా ఆరు ఏనుగులు మరణించాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన సుప్రీంకోర్టు ఆయా ప్రాంతాల్లో రైళ్ల వేగ నియంత్రణకు చర్యలు చేపట్టాలని 2014లో ఆదేశించింది. దాంతో ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో గంటకు 30 కి.మీ. వేగం మించకుండా రైళ్ళు నడపాలని సిబ్బందికి రైల్వేశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ ఆదేశాలు పూర్తిస్థాయిలో అమలు కావడంలేదనడానికి కొనసాగుతున్న ఏనుగుల మరణాలే రుజువు!

భారత్‌లో ఏనుగులు సంచరించే క్షేత్రాలు (ఎలిఫెంట్‌ కారిడార్స్‌) 88 ఉన్నాయి. వాటిలో ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్న ప్రాంతాలు 37. అక్కడ రైల్వేట్రాక్‌ కింది నుంచి దారులు (అండర్‌పాస్‌), వంతెనలు (ర్యాంప్‌లు) నిర్మించడం కష్టమైన పనే అయినా, అసాధ్యం కాదు. రైల్వే సిబ్బందికి మార్గదర్శకాలు జారీ చేసి చేతులు దులిపేసుకోకుండా వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ముందస్తుగా జంతువుల ఉనికి పసిగట్టేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. జంతువుల కదలికలకు రైలుపట్టాల కిందుగా మార్గాలు వదిలి, రైల్వేట్రాక్‌కు అటుఇటు కందకాలు తవ్వడం ద్వారా వాటి సంచారాన్ని నియంత్రించవచ్చు. ఈ విషయంలో ఖర్చుకు వెనకాడకుండా అవసరమైన చోట ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టాలి. న్యాయస్థానాలు సైతం ఇలాంటి సూచనలే చేశాయి. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా, వాటి అమలు జాడ పెద్దగా లేదు. దీనిపై రైల్వే, అటవీ, పర్యావరణశాఖలు సమగ్ర అధ్యయనం నిర్వహించి, ఆచరణాత్మక పరిష్కార చర్యలకు సత్వరం పూనుకోవాలి.

‘తేనెటీగల రొద’ వ్యూహం
భారీ కాయంతో అన్ని జంతువులను హడలెత్తించే గజరాజులు తేనెటీగలంటే మాత్రం బెంబేలెత్తిపోతాయి. వాటి రొద వినిపించే వైపు వెళ్ళడానికి అవి సాహసించవు. తేనెటీగ కాటుకు అవి అంతగా భయపడతాయి కాబట్టే రైల్వేశాఖ ఏనుగుల రక్షణకు ఓ వ్యూహాన్ని రూపొందించింది. దీన్ని ‘ప్లాన్‌ బీ’గా వ్యవహరిస్తున్నారు. తేనెటీగల రొద శబ్దాన్ని ఉత్పత్తి చేసే పరికరాల(బజింగ్‌ యాంప్లిఫైయర్స్‌)ను రైల్వేశాఖ తయారు చేయించింది. తొలివిడతగా ఈ పరికరాలను అసోం అడవుల్లో ఏనుగులు సంచరించే 12 క్షేత్రాల్లో రైలు పట్టాల వెంట అమర్చింది. ఈ రొద 600 మీటర్ల వరకూ వినిపిస్తుంది. దాంతో ఏనుగులు రైలు వచ్చే దిశగా వెళ్లవు. ఈ పరికరాలను దేశమంతటా విస్తరించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ తరహా పరిష్కార మార్గాలను ఎంత త్వరగా ఆచరణలోకి తెస్తే వన్యప్రాణులకు అంత మేలు ఒనగూరుతుందని ప్రభుత్వం గ్రహించాలి.


- నీలి వేణుగోపాల్‌రావు
Posted on 14-10-2019