Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ప‌ర్యావ‌ర‌ణం

హరితం... ఆహ్లాదభరితం

* శబ్ద వాయు కాలుష్యాల నియంత్రణ

ఏటా పంట వ్యర్థాలు, దీపావళి టపాసులను కాల్చడం వల్ల ఏర్పడే కాలుష్యాన్ని అరికట్టడానికి చైతన్యం గల పౌరులు చేస్తున్న కృషి ఫలిస్తోంది. వారికి అండగా సుప్రీంకోర్టు నిలవడంతో పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. పంజాబ్‌, హరియాణ, ఉత్తర్‌ ప్రదేశ్‌ గోధుమ పొలాల్లో ఏటా అక్టోబరు నుంచి నవంబరు వరకు 2.3 కోట్ల టన్నుల వ్యర్థాలను దగ్ధం చేస్తున్నారు. దీనివల్ల వచ్చే పొగ మేఘాలకు దీపావళి టపాసుల ధూమం తోడై ఉత్తరాదిన జనానికి, ముఖ్యంగా రాజధాని దిల్లీ ప్రజలకు ఊపిరి సలపకుండా చేస్తోంది. పంట చెత్తను తగులబెడితే వచ్చే పొగ వల్ల ప్రతి ఘనపు మీటరు గాలిలో ధూళి కణాల సంఖ్య 1000 మైక్రోగ్రాములకు చేరుతోంది. భద్రమైన స్థాయి 50 మైక్రోగ్రాములకు ఇది 20 రెట్లు ఎక్కువ. మరోవైపు మన పట్టణాలు, నగరాల్లో దీపావళి పండుగ దినాల్లో పిల్లలు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలతో ఆస్పత్రులను ఆశ్రయించాల్సి రావడం బాధాకరం. ఇది చాలదన్నట్లు ఎన్నికల ప్రచారంలో, పెళ్ళిళ్లు, క్రీడోత్సవాల్లోనూ టపాకాయలు పేల్చడం ఆనవాయితీ అయిపోయింది. పండుగ, పంట కాలుష్యాలపై పౌరులు వేసిన పిటిషన్లను పురస్కరించుకుని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. పంట మొదళ్లను తగులబెట్టకుండా పొలంలోనే కలిపి దున్నే సంవిధానాలను భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌) రైతులకు అందించింది. రాష్ట్ర ప్రభుత్వాలను, వివిధ ప్రభుత్వ సంస్థలను ఈ కృషిలో భాగస్వాములను చేసింది. ఫలితంగా ఈ ఏడాది హరియాణలో వాయుకాలుష్యం పూర్తిగా, పంజాబ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌లలో గణనీయంగా తగ్గనుంది. రైతులు ఐసీఏఆర్‌ సాంకేతికతను వినియోగించడానికి, హ్యాపీ సీడర్‌, పంట గడ్డి ఛాపర్‌ వంటి ఆధునిక యంత్ర పరికరాలు కొనుగోలు చేయడానికి వీలుగా కేంద్రం 2018 నుంచి నిధులు అందిస్తోంది.

నిషేధ పూర్వాపరాలు
దీపావళినాడు కాలుష్యకారక టపాసులను పేల్చడం నిషేధించాలని 2015లో పిల్లల తండ్రులు కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఇద్దరు ఆరు నెలల శిశువులు, ఓ 14 నెలల పసిబిడ్డ తరఫున వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను మన్నించి 2018లో సుప్రీంకోర్టు సంప్రదాయ టపాసులను నిషేధించింది. వాటి బదులు పెద్దగా కాలుష్యం వెదజల్లని హరిత టపాసులను వినియోగించాలన్నది. పలు రాష్ట్ర ప్రభుత్వాలూ టపాసులను నిషేధించాయి. ఆటంబాంబులు, లక్ష్మీ బాంబుల్లో, థౌజండ్‌వాలా, 5 థౌజండ్‌వాలా వంటి గొలుసు టపాకాయల్లో, ఇతర సంప్రదాయ టపాసుల్లో గంధకం, బేరియం, పొటాషియం, అల్యూమినియం వంటి హానికర రసాయనాలను పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థ (పెసో) గుర్తించింది. బేరియం నైట్రేట్‌తో రంగులు విరజిమ్మే టపాసులను తయారు చేస్తారు. టపాసులు పెద్దశబ్దంతో పేలేట్లు చేసేది- పొటాసియం నైట్రేట్‌. ఈ రెండు రసాయనాలు గాలిలో చాలాసేపు ఉండి ప్రజల ఆరోగ్యాలపై దుష్ప్రభావం చూపుతాయి. ఇలాంటి ప్రమాదకర ఉద్గారాలను దాదాపు 30 శాతం వరకు తగ్గించి హరిత టపాసులను రూపొందించడంలో భారత శాస్త్ర, పారిశ్రామిక మండలి (సీఎస్‌ఐఆర్‌), జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్‌ పరిశోధన సంస్థ (నీరి)లు విజయం సాధించాయి. టపాసుల తయారీలో ఈ సంస్థలు వాడిన ఓ కొత్త ‘ఆక్సిడెంట్‌’ రసాయనం పటాసు పేలగానే ధూళి కణాలు విరజిమ్మకుండా అణచిపెడుతుంది. ధ్వనిని, ఉద్గారాలను తగ్గించడానికి ‘సార్బెంట్స్‌’ను ఉపయోగించారు. మొత్తంమీద ఎనిమిది ప్రభుత్వ పరిశోధనాలయాలు కలిసి ఎనిమిది రకాల హరిత టపాసులను తయారుచేశాయి. మామూలు టపాకాయలు 160 డెసిబుల్‌ శబ్దాలను వెలువరిస్తే, హరిత టపాసులు చేసే శబ్దం 125 డెసిబుల్స్‌ మాత్రమే ఉంటుంది. 2.5 మైక్రానుల మందం కలిగిన ధూళి కణాలు (పీఎం) 30 శాతం తగ్గుతాయి.

సమయానికి అందని ఆనందం ఇదంతా సంతోషకరమే కాని, హరిత టపాసులు ఈ ఏడాది దీపావళికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాబోవడం లేదు. దిల్లీ విపణిలో అందుబాటులో ఉన్న హరిత టపాసులు కేవలం కాకరపువ్వొత్తులు, చిచ్చుబుడ్లు మాత్రమే. ఆటంబాంబులు, లక్ష్మీ బాంబులు, రాకెట్ల సంగతి దేవుడెరుగు- కనీసం విష్ణుచక్రాలు, భూచక్రాలూ లభ్యం కావడం లేదు. పిల్లలు గత్యంతరం లేక ఒకటీ అరా కాకర పువ్వొత్తులు, చిచ్చుబుడ్ల ప్యాకెట్లు కొనుక్కొని ఇంటికి తిరిగి వెళ్తున్నారు. అదీకాకుండా టపాకాయలతో కాలుష్యం పెరుగుతుందని పాఠశాలల్లో బోధిస్తున్నందున మార్కెట్‌కు వచ్చే బాలబాలికల సంఖ్య బాగా పడిపోయింది. అందుకే పట్టణాల్లో ఈ ఏడు టపాసుల దుకాణాల సంఖ్య బాగా తగ్గిపోయింది. దేశ రాజధాని దిల్లీలో ఒకప్పుడు 200 రకాల టపాకాయలు అమ్మిన దుకాణాలు నేడు రెండు రకాల హరిత టపాసులతో సరిపెట్టుకోవలసి వస్తోంది. మరి విక్రయాలు 20 శాతానికి పడిపోయాయంటే ఆశ్చర్యమేముంది? హరిత టపాసుల వల్ల కాలుష్యం 30 శాతం తగ్గే మాట నిజమే కాని, మామూలు టపాసులకన్నా వాటి ధర 30 నుంచి 50 శాతం ఎక్కువ కావడంతో విక్రయాలు తగ్గుతున్నాయి.

బాలారిష్టాలు
దేశంలో 95 శాతం టపాసులను తయారుచేసే శివకాశిలో ఈ ఏడాది ఉత్పత్తి చాలా ఆలస్యంగా మొదలైంది. ఇక్కడి కర్మాగారాలు దాదాపు ఎనిమిది లక్షలమంది కార్మికులను నియోగించి ఏడాదికి రూ.8,000 కోట్ల విలువైన టపాకాయలను తయారుచేస్తున్నాయి. సంప్రదాయ టపాసులపై గతేడాది దీపావళికి ముందు సుప్రీంకోర్టు విధించిన నిషేధాన్ని నిరసిస్తూ శివకాశి ఉత్పత్తిదారులు ఆరు నెలలపాటు సమ్మె చేశారు. అసలు హరిత పటాసు అంటే ఏమిటో ప్రభుత్వం నుంచి వారికి స్పష్టత లభించలేదు. చివరకు ఎలాగోలా స్పష్టత వచ్చి పెసో సంస్థ హరిత టపాసుల తయారీకి లైసెన్సులు ఇవ్వసాగింది. చిత్రమేమంటే శివకాశిలో మొత్తం 1,070 టపాసుల కర్మాగారాలు ఉంటే, వాటిలో ఆరింటికి మాత్రమే లైసెన్సులు ఇచ్చిన పెసో, ఉత్తర భారతంలో ఏకంగా 24 ప్లాంట్లకు వాటిని మంజూరు చేసింది. సీఎస్‌ఐఆర్‌, నీరీలు శివకాశిలో హరిత టపాసుల తయారీలో శిక్షణకు ఏర్పాట్లు చేశాయి. ఈ కార్యక్రమం పూర్తయ్యాక ఉత్పత్తిదారులు ఈ ఏడాది మార్చిలో కర్మాగారాలు తెరచినా, మార్కెట్‌కు కావలసిన పరిమాణంలో టపాసులను పంపడానికి వ్యవధి సరిపోలేదు. అదీకాకుండా సమ్మెకాలంలో చాలామంది కార్మికులు శివకాశిని వదలి పనులు వెతుక్కుంటూ వేరే ఊళ్లకు వలసవెళ్లడంతో పటాసు కర్మాగారాలకు కార్మికుల కొరత ఏర్పడింది. ఏతావతా హరిత పటాసుల్లో వైవిధ్యం లేక, సరైన పరిమాణంలో విపణికి రాక వ్యాపారం 30 శాతానికి పడిపోయింది. ఈ లోటును తీర్చడానికి అక్రమ టపాసులు మార్కెట్‌కు వస్తున్నాయి. నిరుడు మిగిలిపోయిన సంప్రదాయ టపాసులను విపణిలోకి వదులుతున్నారు. వెరసి... ఈ ఏడాది దీపావళి పండుగనాడు కాలుష్యం ఆశించిన స్థాయిలో తగ్గబోవడం లేదు. అనుమతి పొందిన కర్మాగారాలు తయారుచేసిన టపాసులపై బార్‌ (క్యూఆర్‌) కోడ్‌లు ముద్రించాలని సీఎస్‌ఐఆర్‌, నీరిలు సిఫార్సు చేయగా, ప్రభుత్వం దాన్ని చాలా ఆలస్యంగా ఆమోదించింది. అప్పటికే టపాసుల రవాణా జరిగిపోవడంతో ఈ ఏడాది ముద్రలను వేయలేకపోయారు. హరిత టపాసులపై క్యూఆర్‌ కోడ్‌ల ముద్రణ ఉత్తర్వును 2020 దీపావళి నుంచి అమలుచేసేలా చూడాలని సుప్రీంకోర్టుకు తమిళనాడు పటాసు తయారీదారుల సంఘం విన్నవించింది. కనీసం వచ్చే ఏడాది దీపావళికైనా సాధికార ముద్రలతో రకరకాల హరిత టపాసులు అందుబాటులోకి వచ్చి పిల్లలకు ఆనందం, కార్మికులకు జీవనోపాధి, కర్మాగారాలకు దండిగా విక్రయాలు లభిస్తాయని ఆశిద్దాం!

జీవావరణానికి మేలు
పసిపిల్లలు, పెంపుడు జంతువులు, భయవిహ్వలత వల్ల తీవ్ర ఒత్తిడికి లోనయ్యే వ్యక్తుల మానసిక, శారీరక స్థితిని దృష్టిలో ఉంచుకుని ఐరోపా, అమెరికా నగరాలు పెద్దగా చప్పుడు చేయని టపాసుల వైపు మళ్లుతున్నాయి. నిరుడు ఈ ప్రయోగానికి నాంది పలికిన నగరం ఇటలీలోని కోలెక్కియో. టపాకాయల పేలుడు శబ్దాలను తగ్గించాలని ఆ నగర పాలిక ఓ చట్టం చేయగా, సెట్టి ఫైర్‌ వర్క్స్‌ అనే కంపెనీ ఆ చట్టానికి అనుగుణమైన టపాసులను తయారుచేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. పండుగలు, జాతీయ దినోత్సవాలు, క్రీడోత్సవాలు, ఎన్నికల ప్రచారాల సందర్భంగా ఫెళఫెళార్భటులతో టపాకాయలను పేల్చడం ప్రపంచమంతటా ఉన్నదే. ఈ భీకర శబ్దాలకు వన్య ప్రాణులు సైతం హడలెత్తి మృత్యువాత పడిన సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికాలో బీబె నగరంలో 2010 నూతన సంవత్సరాది నాడు పెద్దయెత్తున టపాకాయలు పేల్చగా ఆ శబ్దాలకు గుండె ఆగి 5,000 ఎర్ర రెక్కల నల్లటి పక్షులు (రెడ్‌ వింగ్డ్‌ బ్లాక్‌ బర్డ్స్‌) నింగి నుంచి నేలకూలాయి. ఆ భయంకర శబ్దాల నుంచి తప్పించుకోవడానికి అనేక పక్షులు ఇళ్ల పొగ గొట్టాల్లోకి, చెట్లలోకి దుమికి చనిపోయాయి. టపాకాయల చప్పుళ్లకు అడవుల నుంచి జింకలు గాబరాగా రోడ్ల మీదకు పరుగెత్తుకుంటూ వచ్చి వాహనాలను ఢీకొని మరణించిన సందర్భాలూ అనేకం. ఇక పెంపుడు కుక్కలైతే టపాసుల పేలుళ్లకు జడిసి ఇళ్లలో దాక్కోవడమో లేదా ఇల్లు వదలి పారిపోవడమో చేస్తుంటాయి. 120 డెసిబుల్స్‌ను మించిన శబ్దం ప్రాణులకు బాధ కలిగిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కానీ, టపాకాయలు 150 నుంచి 170 డెసిబుల్స్‌ వరకు శబ్దం చేస్తాయి.

పర్యావరణ, జీవావరణాలపై టపాసులు చూపే దుష్ప్రభావంపై ప్రజల్లో అవగాహన పెరగడంతో నిశ్శబ్ద టపాసుల ఉత్పత్తికి పాశ్చాత్య ప్రభుత్వాలు, పరిశ్రమలు క్రమంగా ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ టపాసులు అసలు శబ్దమే చేయవని కాదు- మామూలు టపాకాయలంత భారీగా చప్పుడు చేయవంతే. అవి శబ్దంకన్నా రంగురంగుల కాంతులు వెదజల్లడానికే ప్రాధాన్యమిస్తూ వినియోగదారులను ఆకట్టుకొంటున్నాయి. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవమైన జులై నాలుగున ఇలాంటి టపాసులు వాడాలని చాలామంది కోరుతున్నారు. బ్రిటన్‌లో ఇప్పటికే జనావాసాలకు దగ్గర్లో నిశ్శబ్ద టపాసులను మాత్రమే పేల్చడానికి అనుమతిస్తున్నారు.


- ప్రసాద్‌
Posted on 26-10-2019