Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ప‌ర్యావ‌ర‌ణం

ఆయువు తోడేస్తున్న వాయువు

దేశ రాజధాని దిల్లీ మహానగరమిప్పుడు అక్షరాలా ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతోంది. చలికాలంలో, ముఖ్యంగా దీపావళి తరవాత దిల్లీ ఇలా తీవ్ర వాయుకాలుష్య కోరల్లో చిక్కి విలవిల్లాడటం ఏటా చూస్తూనే ఉన్నా- ఈసారి పరిస్థితి మరింత దిగజారింది. రుతుపవనాలు, వాయుదిశ అనుకూలించిన కారణంగా ఆగస్ట్‌, సెప్టెంబర్‌ నెలల్లో దిల్లీ వాయునాణ్యత కొంత మెరుగుపడినట్లనిపించింది. దీపావళి బాణసంచా కాలుష్యం యావత్‌ ఉత్తర భారతావనినీ కమ్మేయగా, దిల్లీకి ఎప్పటిలాగే ‘పొరుగు సమస్య’ తలెత్తింది. వాయుకాలుష్యం పెచ్చుమీరిన దిల్లీలో ఇప్పటికే ‘ఆరోగ్య అత్యవసర పరిస్థితి’ ప్రకటించిన కేజ్రీవాల్‌ ప్రభుత్వం నవంబరు అయిదో తేదీ దాకా పాఠశాలలకు సెలవులిచ్చేసింది. అక్కడి నిర్మాణ కార్యకలాపాలపైనా నిషేధం విధించారు. సరి, బేసి నంబర్‌ ప్లేట్ల ప్రాతిపదికన వాహనాల రాకపోకలపై ఆంక్షల అస్త్రాన్ని సర్కారు మళ్ళీ వెలికితీయడం- పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. వర్షాలు కురిసి చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంటవ్యర్థాల దహనం తగ్గి కాలుష్యం అదుపులోకి వస్తుందని అధికారులు చెబుతున్నా- ఆ అంచనాలతో వాయునాణ్యత సూచీ విభేదిస్తోంది. సాధారణంగా ఆ సూచీ 400-500 పాయింట్ల మధ్య ఉంటే ప్రమాదకరంగా, అంతకుమించితే అత్యంత హానికరంగా పరిగణిస్తారు. దిల్లీలోని పలుప్రాంతాల్లో వాయునాణ్యత సూచీ అయిదు వందల పాయింట్లకు పైబడిన దరిమిలా గత్యంతరం లేక అనేక విమాన సర్వీసుల్నీ రద్దు చేయాల్సివచ్చింది. ముఖానికి మాస్కులు కట్టుకోనిదే బయటకు అడుగు కదపలేని దుస్థితి దిల్లీతోపాటు గురుగ్రామ్‌, ఘజియాబాద్‌, ఫరీదాబాద్‌, నొయిడా పరిసర ప్రాంతాలకూ దాపురించింది. ఆ విషవాయు ప్రభావానికి లోనయ్యే రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, ఒడిశాలూ చేరడం వాయుగండ ఉత్పాత విస్తృతిని కళ్లకు కడుతోంది!

పశుగ్రాసంగా గోధుమగడ్డిని వినియోగించడం పరిపాటి అయిన ఉత్తర భారతదేశంలో టన్నులకొద్దీ వరిదుబ్బుల్ని పొలాల్లోనే వదిలేసి అక్కడే తగలబెడుతుంటారు. విపరీత కాలుష్య కారకమవుతున్న పంట వ్యర్థాల దహనాన్ని నిషేధించాల్సిందిగా జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) నాలుగేళ్ల క్రితమే నిర్దేశించింది. ఆ మేరకు ఆంక్షలు అమలులోకి వచ్చాయని పంజాబ్‌, హరియాణా ప్రభుత్వాలు చెబుతున్నా, తనవంతుగా కేంద్రం సుమారు రూ.11 వందల కోట్ల ప్రత్యేక పథకం ప్రకటించినా- క్షేత్రస్థాయిలో పరిస్థితి మారడం లేదు. ఎవరేం అంటున్నా తమకు ఆర్థిక ప్రోత్సాహకాలు లభించడం లేదన్న రైతుల ఆక్రోశం, పొలాల్లో వ్యర్థాల దహనకాండ చల్లారడంలేదు. ఒక్క టన్ను పంట వ్యర్థాలకు నిప్పుపెడితే 60 కిలోల కార్బన్‌ మోనాక్సైడ్‌, రమారమి 14 వందల కిలోల బొగ్గుపులుసు వాయువు, మూడు కిలోల సూక్ష్మధూళి కణాలతోపాటు బూడిద, సల్ఫర్‌ డయాక్సైడ్‌ వెలువడతాయి. దేశంలో ఏటా తగలబెడుతున్న పది కోట్ల టన్నుల దాకా పంట వ్యర్థాల్లో సగానికిపైగా వాటా పంజాబ్‌, హరియాణా, యూపీలదే. ఇలా దహనం చేస్తుండటంవల్ల గాలి విషకలుషితం కావడమొక్కటే కాదు- భూమిపొరల్లో పైరుకు ఉపయోగపడే వేల రకాల సూక్ష్మజీవులు హతమారిపోతున్నాయి. నేలలో తేమ శాతం సైతం క్షీణిస్తోంది. వాయు కాలుష్య నివారణ నిమిత్తం ఆవశ్యక చర్యలు చేపట్టాలని కోరుతూ యూపీ, హరియాణా, దిల్లీ ముఖ్య కార్యదర్శులకు తాజాగా లేఖలు రాసినట్లు ఈపీసీఏ (వాతావరణ కాలుష్య నియంత్రణ మండలి) ఛైర్మన్‌ భూరేలాల్‌ చెబుతున్నారు. పంట వ్యర్థాలతో వంటచెరకు, ఇతర ఉత్పత్తుల తయారీ విభాగాల అవతరణ, సమస్యాత్మక ప్రాంతాల్లో వరి బదులు తృణధాన్యాల సాగుకు ప్రోత్సాహం- సరైన దిద్దుబాటగా నిపుణులు సూచిస్తున్నారు. వాటిని సాకారం చేసేందుకు దిల్లీ, పంజాబ్‌, హరియాణా, యూపీల ఉమ్మడి చొరవే ఉత్తర భారతావనికి కొత్త ఊపిరులూదగలిగేది!

వాయునాణ్యతకు తూట్లు పడటమన్నది దిల్లీ పరిసర ప్రాంతాలకో, ఏ వంద నగరాలకో పరిమితమైన సమస్య కాదు. దేశంలోని మూడొంతులకు పైగా నగరాలు, పట్టణాలు గ్యాస్‌ ఛాంబర్లుగా భ్రష్టుపట్టడం కాలుష్య నియంత్రణ మండళ్ల అసమర్థ నిర్వాకాలకు రుజువు. గాలి నాణ్యత పరంగా 180 దేశాల జాబితాలో భారత్‌ అట్టడుగు వరసన ఈసురోమంటోంది. దేశీయంగా ప్రతి ఎనిమిది మరణాల్లో ఒకటి వాయుకాలుష్యం కారణంగానే చోటుచేసుకుంటున్నట్లు భారత్‌ వైద్య పరిశోధన మండలి సహా వివిధ సంస్థల నివేదికలు ధ్రువీకరిస్తున్నాయి. కశ్మల కారక పరిశ్రమలు, సంస్థల పట్ల దృఢవైఖరి అవలంబిస్తున్న చైనాలో పదేళ్లుగా వాయుకాలుష్య మరణాలు తగ్గుముఖం పట్టాయి. అదే ఇక్కడ, 23 శాతం మేర పెరుగుదల నమోదైంది! దిల్లీలో కశ్మల తీవ్రత వల్ల గుండె, ఊపిరితిత్తుల సమస్యలు పెచ్చరిల్లుతాయని ‘ఎయిమ్స్‌’ (అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ) ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. వాయుకాలుష్యం ఉత్తర, తూర్పు భారతవాసుల ఆయుర్దాయాన్ని ఏడేళ్ల వరకు హరింపజేసే ముప్పున్నట్లు షికాగో విశ్వవిద్యాలయ సరికొత్త అధ్యయనం హెచ్చరిస్తోంది. వరంగల్‌, కర్నూలు లాంటిచోట్లా గాలిలో నికెల్‌, సీసం, ఆర్సెనిక్‌ శాతాలు ఇంతలంతలు కావడం; 66 కోట్లమంది భారతీయుల జీవన ప్రమాణాల్ని కుంగదీస్తున్న వాయుకాలుష్యం అసంఖ్యాకంగా పసి శ్వాసకోశాలపై కర్కశ దాడి చేస్తుండటం- భీతావహ పరిణామాలు. పరిశుభ్రతను సంస్కృతిగా అలవరచి పౌరసమాజంలో పర్యావరణ స్పృహ ఇనుమడింపజేసిన ఆస్ట్రేలియా, బార్బడోస్‌, కెనడా తదితర దేశాలు వాయునాణ్యతలో మిన్నగా రాణిస్తున్నాయి. ఎన్నదగ్గ పురోగతి సాధించిన దేశాల అనుభవాల నుంచి విలువైన గుణపాఠాలు నేర్చి పర్యావరణానికి మేలుచేసే విధానాల అమలుకు ప్రభుత్వాలు నిబద్ధమైతే ఇక్కడా పరివర్తన సాధ్యపడుతుంది. దిల్లీ తరహా సంక్షోభాలు దేశంలో పునరావృతం కాని రోజులు వస్తాయి!


Posted on 04-11-2019