Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ప‌ర్యావ‌ర‌ణం

మానవ తప్పిదాలతోనే ముప్పు

* భవనాల్లో అగ్నిప్రమాదాలు

మానవ తప్పిదాల కారణంగా సంభవించే విపత్తుల్లో విధ్వంసకరమైనవి అగ్ని ప్రమాదాలే. ఇవి ప్రాణాలనైనా, ఆస్తులనైనా బుగ్గి చేసేస్తాయి. ప్రస్తుత కాలంలో సంభవిస్తున్న అత్యధిక శాతం అగ్ని ప్రమాదాలకు ప్రధాన కారణం- నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యమే. నిబంధనల మేరకు భద్రతా ప్రమాణాలను పాటించకపోవడంతో విపత్తులు నివురుగప్పిన నిప్పులా పొంచి ఉంటున్నాయి. జన సంచారం అధికంగా ఉండే సినిమా థియేటర్లు, బహుళ అంతస్తుల దుకాణ సముదాయాలు, భవనాలు, కార్పొరేట్‌ విద్యాసంస్థలు, కార్యాలయాల్లో అగ్ని ప్రమాదాల ముప్పు అధికంగా ఉంటోంది. ఆఖరికి అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చేరితే, అక్కడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితులు- కొరవడుతున్న భద్రతా ప్రమాణాల లోపానికి అద్దం పడుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ పిల్లల ఆస్పత్రిలో జరిగిన ప్రమాదంలో పసికందు ప్రాణాలు కోల్పోవడం- యాజమాన్యం, సిబ్బంది బాధ్యతా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనం. గత ఏడాది లక్షల మంది సందర్శించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో అగ్నిప్రమాదం సంభవించి కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించడం వెనక నిర్వాహకుల నిర్లక్ష్య వైఖరి స్పష్టమవుతోంది. దేశంలో మలేరియా, క్షయ వ్యాధులకంటే అగ్ని ప్రమాదాల్లో కాలిన గాయాలతో మృతి చెందుతున్నవారి సంఖ్యే అధికంగా ఉంటోందని తాజాగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అంచనాలో తేలింది. దేశంలో ఏటా 70 లక్షల మంది కాలినగాయాల బారిన పడుతుండగా, అందులో ఏడు లక్షల మంది ఆస్పత్రుల్లో చేరుతున్నారు. 2.4 లక్షల మంది అంగవైకల్యానికి గురవుతున్నారు. కాలిన గాయాల వల్ల ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు మృత్యువాత పడుతున్నట్లు అధికారిక అంచనా. ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే దాదాపు 21 ఆస్పత్రులపై అగ్నిమాపక సేవల విభాగం ప్రాసిక్యూషన్‌కు ఆదేశాలు జారీ చేసిందంటే భద్రతా ప్రమాణాలు ఎంత పేలవంగా ఉన్నాయో అర్థమవుతోంది.

జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న ఆస్పత్రుల్లో భద్రతా ప్రమాణాలను మెరుగుపరచి ప్రాణాలకు, మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లకుండా అనుసరించాల్సిన నిర్మాణాత్మక, ఆచరణాత్మక మార్గదర్శకాలను 2016 జనవరిలోనే విడుదల చేసింది. వాటి అమలులో చిత్తశుద్ధి కొరవడటం, నిరంతర పర్యవేక్షణ యంత్రాంగం క్షేత్రస్థాయిలో లేకపోవడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. జాతీయ భవన నిర్మాణ కోడ్‌ మార్గదర్శకాలను అనుసరించకుండా ఆస్పత్రుల భవనాలను నిర్మించడం, ఇతర భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం, గాలీ వెలుతురు ప్రసరించకుండా, ఆపద సమయంలో భవనాల నుంచి నిష్క్రమించడానికి వీలులేకుండా నిర్మాణాలు చేపట్టడం విపత్తులకు కారణమవుతోంది. జాతీయ భవన నిర్మాణ కోడ్‌(2005) ప్రకారం ఎత్తయిన భవనాల నిర్మాణాలన్నీ సంబంధిత జోనల్‌ మార్గదర్శకాల ప్రకారం నిరభ్యంతర పత్రాన్ని పొందాలి. అగ్నిమాపక సేవలందించే వాహనాలు ప్రత్యేకించి యంత్ర సామగ్రి అమర్చిన వాహనాల రాకపోకలకు వీలుగా 12 మీటర్లకు పైగా ఖాళీ ఉండేలా మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. భవనాల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు వరసగా అయిదారు మీటర్లకు తగ్గకుండా ఉండాలి. నిర్దేశిత ఖాళీ ప్రదేశాలు ఉండేలా చూసుకోవాలి. భవనానికి వెలుపల నుంచి కనీసం రెండుచోట్ల మెట్ల నిర్మాణాలు ఉండాలి. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు మంటలను ఆర్పే, నియంత్రించే కనీస సామగ్రిని అందుబాటులో ఉంచాలి. ఆచరణలో ఇవేవీ పాటించకపోవడం వల్లే పరిస్థితులు విషమిస్తున్నాయి. ప్రధానంగా ఆస్పత్రుల్లో వినియోగించే యంత్రసామగ్రి, ఉపకరణాలు ఎక్కువగా విద్యుత్తుపై ఆధారపడేవే. విద్యుత్‌ తీగల స్థితిగతులు, నిర్వహణను నిర్ణీత కాలవ్యవధితో క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి. ఇందులో లోపాల కారణంగానే అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. బహుళ అంతస్తుల భవనాల్లోని సెల్లార్లను ఖాళీగా వదలకుండా జనరేటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లను అమర్చడం యజమానులు, నిర్వాహకులు చేస్తున్న పెద్ద తప్పు. దీనివల్ల విద్యుదాఘాతం, అగ్నిప్రమాదాలను కొనితెచ్చుకున్నట్లవుతోంది. ఇరుకైన స్థలాల్లో బహుళ అంతస్తుల నిర్మాణం, రాకపోకలకు సరైన సదుపాయాలు కల్పించకపోవడం, లిఫ్టులు, ఇరుకుమెట్ల ద్వారానే రాకపోకలు సాగిస్తుండటం, గాలీ వెలుతురు, ఖాళీ ప్రదేశాలకు ఆస్కారం లేకుండా రోగులను కుక్కేస్తుండటం వంటి చర్యల వల్ల ఆస్పత్రుల్లో భద్రతా ప్రమాణాలను తుంగలో తొక్కేస్తున్నారు. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

ప్రాణాల్ని నిలబెట్టే ఆస్పత్రులైనా, వినోదాన్ని పంచే సినిమా థిÅయేటర్లయినా, విజ్ఞాన సముపార్జనకు ఉద్దేశించిన విద్యాసంస్థల భవనాలైనా- అగ్నిప్రమాద విపత్తులు సంభవించకుండా ఉండాలంటే నిర్దిష్ట జాగ్రత్తలు పాటించాలి. కనీసం సగం మంది సిబ్బందికి అగ్నిప్రమాద నివారణ చర్యలపై కనీస అవగాహన కల్పించి శిక్షణలో తర్ఫీదునివ్వాలి. మంటల్ని ఆర్పడంలో మెళకువలపై తరచుగా ‘మాక్‌ డ్రిల్‌’ వంటి కార్యక్రమాలు నిర్వహించాలి. తద్వారా విపత్తుల్ని సమర్థంగా ఎదుర్కోవడంలో సిబ్బందిని సంసిద్ధుల్ని చేసేందుకు అవకాశం ఉంటుంది. రాకపోకలు సులభంగా సాగేలా మార్గాలు, ఆపద వేళ నిష్క్రమణకు వీలైన బాహ్యమార్గపు మెట్ల దారి, ఖాళీ ప్రాంతాలు, అగ్నిమాపక సామగ్రి అందుబాటులో ఉండటం వంటి ముందుజాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. ఆస్పత్రుల్లో ఆహార శాలలు, బయటి రోగుల సేవా కేంద్రాలు, రోగ పరీక్షల నిర్వహణను సెల్లార్లలో చేపట్టకూడదు. విద్యుదాఘాతానికి తావు లేకుండా సురక్షితమైన విద్యుత్‌ సరఫరా, నియంత్రణ, పర్యవేక్షణ ద్వారా పలు అగ్ని ప్రమాదాలను నివారించవచ్చు. ఆస్పత్రుల్లో వినియోగించే విద్యుత్తు ఉపకరణాలు, వ్యాధుల చికిత్స సామగ్రిని నిరంతరం పర్యవేక్షించాలి. పూర్తిస్థాయిలో అగ్నిమాపక సౌకర్యాలు అందుబాటు ఉండని గ్రామీణ ప్రాంతాల్లో సదరు సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.

డాక్టర్‌ జీవీఎల్‌ విజయ్‌కుమార్‌
(రచయిత- భూ విజ్ఞానశాస్త్ర నిపుణులు)
Posted on 06-11-2019