Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ప‌ర్యావ‌ర‌ణం

విపత్తులపై యుద్ధ భేరి

* కష్టనష్టాల నియంత్రణకు వ్యూహ రచన
* సత్వరమే యథా పూర్వస్థితి కల్పన
* నష్ట నివారణకు పెట్టుబడులు
* విధానపరమైన మార్పులు
* దేశార్థికానికీ మేలుమలుపు

వరదలు, ఉప్పెనలు, కరవు కాటకాలు, భూకంపాల వంటి విపత్తులు పొంచివున్న కాలమిది. నేడు వర్ధమాన దేశాల ఆర్థిక ప్రగతికి విపత్తులు ప్రధాన అవరోధంగా మారుతున్నాయి. వీటి నుంచి సత్వరమే కోలుకునేందుకు సమర్థ విపత్తుల నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు నేటి అవసరం. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఈ అంశంపై దృష్టి సారిస్తున్నాయి. ఇటీవల జపాన్‌లోని ఒకాసాలో జరిగిన జి-20 దేశాల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ- విపత్తులకు ఎదురొడ్డి, వెనుదిరిగి సత్వరమే పూర్వస్థితికి చేరుకునేందుకు (డిజాస్టర్‌ రీసైలెన్స్‌) ప్రపంచ దేశాలన్నీ ఉమ్మడి కార్యాచరణకై ముందుకు రావాలని పిలుపిచ్చారు. విపత్తుల నుంచి సత్వరమే కోలుకుని పూర్వస్థితికి చేరుకోవడం కోసం సమగ్ర కార్యాచరణతో కూడిన వ్యూహాన్ని అనుసరించాలి. తద్వారా ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలికంగా చూపే ప్రతికూల ప్రభావం నుంచి బయటపడవచ్చు. ప్రకృతి విపత్తుల బారినపడేవారిలో ఎక్కువ శాతం పేదలే ఉంటారు.

ఆసియాలోనే అధిక నష్టాలు
విపత్తుల నుంచి కోలుకుని సత్వరం యథాతథస్థితి సాధించడానికి ఉద్దేశించిన ‘రీసైలెన్స్‌’ వ్యూహం నేడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఏప్రిల్‌లో ఆసియా అభివృద్ధి బ్యాంకు నివేదిక వెల్లడించిన సమాచారం ప్రకారం ఆసియా ప్రాంతంలో ప్రతి అయిదుగురిలో నలుగురు ప్రకృతి విపత్తుల ప్రభావానికి గురవుతున్నారు. దీనివల్ల ఆసియా ప్రాంత అభివృద్ధికి ఇవి శాపంగా పరిణమిస్తున్నాయని తేలింది. 2000-18 మధ్యకాలం గణాంకాల ప్రకారం ఏటా సగటున 38 వేలమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా 66 వేల విపత్తులు సంభవిస్తే, వీటిలో 55 శాతం ఆసియాలోనే సంభవించాయని ఆ నివేదిక తెలిపింది. వీటివల్ల 12,800 కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం సంభవిస్తే ఇందులో 26 శాతం ఆసియాకే వాటిల్లింది. ఆసియాలో సంభవిస్తున్న విపత్తుల్లో 82 శాతం వరదలు, తుపానులు, కరవులు ఉన్నాయి. అనూహ్య వాతావరణ మార్పులు ఇందుకు దోహదపడుతున్నాయి. అందువల్ల ఆసియాలోని అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ విధిగా విపత్తులు పెద్దపెట్టున విరుచుకుపడకముందే ‘పూర్వస్థితి వ్యూహ సాధన’ దిశగా పటిష్ఠ కార్యాచరణ రూపకల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఉత్పాతాల కష్టనష్టాల నుంచి తేరుకుని పూర్వస్థితికి రావడానికి పట్టణ ప్రాంతాల ప్రజలకు పట్టే సమయంకన్నా పల్లెకారులకు మూడురెట్లు అదనపు సమయం పడుతుంది. దీన్నిబట్టి ఆసియాలోని గ్రామీణ జీవన ఆర్థిక వ్యవస్థపై విపత్తుల ప్రభావ తీవ్రతను అంచనా వేయొచ్చు. భారత్‌లోని ముంబయి, చెన్నై, పూరీ వంటి నగరాల్లోని పరిస్థితులనే తీసుకుంటే మురికివాడలు, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల భద్రతకు భరోసా కరవవుతోంది. ఏదైనా విపత్తు బారినపడితే ఆ కుటుంబం పొదుపు, మదుపు చేసుకున్న కొద్దిపాటి సొమ్ములనూ కోల్పోతున్నారు. అనధికారికంగా వడ్డీకి తెచ్చుకున్న రుణాలు తడసిమోపెడై వారిని మరింత పేదరికంలోకి నెట్టేస్తున్నాయని ఏడీబీ అధ్యయనం కుండ బద్దలుకొట్టింది.

ఆసియావ్యాప్తంగా విపత్తులను ఎదుర్కోవడం కోసం అనుసరించాల్సిన వ్యూహానికి పదును పెట్టాలంటే భారీగా నిధులు అవసరమవుతాయి. ఆసియా అభివృద్ధి బ్యాంకు అంచనాల మేరకు 2016-2030 మధ్యకాలంలో 26 లక్షల కోట్ల డాలర్ల మేర వ్యయమయ్యే మౌలిక సదుపాయాల కల్పన చేపట్టాలి. ఈ లెక్కన ఏటా సగటున లక్షా 70 వేలకోట్ల డాలర్లు అవసరమవుతాయని అంచనా. భవిష్యత్తులో సంభవించనున్న పెను విపత్తులనుంచి తట్టుకోవడానికి వాతావరణానుకూల పరిస్థితుల కల్పనకు పెట్టుబడులు పెట్టడం అనివార్యం. ఇందుకోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో కలిసి ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే అంతర్జాతీయ సంస్థలు విపత్తులు తలెత్తినప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఏడు రెట్లు అదనంగా ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నాయి. విపత్తులు సంభవించాక అందించే నిధులకన్నా విపత్తులకు ఎదురొడ్డి నిలవడానికి చేస్తున్న కృషిలో భాగంగా నిధుల సమీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆసియాలోని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థిక సహాయం అవసరం మరింత ఉందన్నది గ్రహించాలి. ఆసియాలోని అత్యధిక దేశాలు 2015-2030 సంవత్సరాల మధ్య వరకు విపత్తుల నష్టతీవ్రతను నివారించేందుకు ‘షెండాయ్‌ కార్యాచరణ’ను అనుసరిస్తున్నాయి. విపత్తులు సృష్టిస్తున్న నష్ట తీవ్రత క్రమంగా పెరుగుతున్న తరుణంలో మరింత ప్రభావితమైన కార్యాచరణకు నడుం బిగించాలి. అంతర్జాతీయ సంస్థలు అందించే ఆపన్నహస్తం కోసం వేచిచూడకుండా, ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు విపత్తులపై ఎదురీతకు వాస్తవస్ఫూర్తితో ప్రణాళికలు రూపొందించాలి. అందుకు అవసరమైన బడ్జెట్‌ కేటాయింపులు చేయాలి. ఆసియాలోని భారత్‌ వంటి దేశాలన్నీ విపత్తుల నష్ట తీవ్రత తగ్గించే చర్యలు, జాతీయాభివృద్ధికి దోహదపడేలా ప్రణాళికలు రూపొందించాలి. మరిన్ని నిధులు వినియోగించి నాణ్యమైన రీతిలో పనులు చేపట్టి విపత్తుల నష్ట తీవ్రతను తగ్గించాలి. వాతావరణంలో కలుగుతున్న అనూహ్య మార్పులు- విపత్తులు విజృంభించడానికి కారణమవుతున్నాయి. విశృంఖల పట్టణ, నగరీకరణ ప్రజలను అంతకంతకు విపత్తుల ముంగిట నిలబెడుతున్నాయన్నది చేదు వాస్తవం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బీమా సౌకర్యం లేకపోవడం ఆర్థికంగా దెబ్బతీస్తున్న మరో అంశం. 1980వ దశకం నుంచి ఆసియావ్యాప్తంగా సంభవించిన నష్టాల్లో కేవలం ఎనిమిది శాతమే బీమా పరిధిలో ఉండటం గమనార్హం. బీమా సదుపాయాలు బాగా విస్తరించాల్సిన అవసరాన్ని ఈ పరిశీలన గుర్తుచేస్తోంది. ఆసియాలోని వర్ధమాన దేశాల్లో బహుళ సంఖ్యలో విపత్తు బీమా పథకాలు ఉన్నప్పటికీ ప్రజలకు అవగాహన, ప్రాచుర్యం కల్పించడంలో వైఫల్యాలు ఉన్నాయి. భారత్‌లో దాదాపు 15 వరకు విపత్తు నష్ట బీమా పరిహార పథకాలు ఉన్నప్పటికీ అవి ప్రభావమంతంగా పనిచేయడం లేదు.

నాలుగు దశలుగా సన్నద్ధత
మనదేశంలో విపత్తులను సమర్థంగా ఎదుర్కొనే కార్యాచరణ వ్యూహం విషయంలో ఇప్పుడిప్పుడే పురోగతి కనబడుతోంది. ఈ పరిజ్ఞానంలో ప్రత్యేక సాంకేతికత, నగరాల్లో విపత్తులకు పూర్వస్థితి కల్పన, ప్రణాళికల కార్యాచరణ, విషయ విశ్లేషణ, అమలు తీరు ఇమిడిఉన్నాయి.
సందర్భం: విపత్తులు సంభవించినప్పుడు ఏ సమూహంలో పునఃస్థితి వ్యూహాన్ని కల్పించాలో ఎంచుకోవాలి. ప్రత్యేకించి ఒక సామాజిక వర్గమా, రాజకీయ వ్యవస్థా, పర్యావరణ పరిస్థితా లేక సంస్థ అనేది నిర్ధారించుకోవాలి.
ప్రభావిత కారకాలు: ఎలాంటి ఆకస్మిక ఘటనలు, ఘర్షణలు, విపత్తులు ప్రజలకు ఇబ్బందులు సృష్టిస్తున్నాయో తెలుసుకోవాలి. దీర్ఘకాలంలో ప్రభావం చూపే వనరుల సంక్షోభం, పట్టణీకరణ, వాతావరణ మార్పులు వంటివీ వీటిలో ఉండాలి.
విశ్లేషణ: వ్యవస్థీకృత లోపాలు, అనుసరిస్తున్న విధానాలనుబట్టి విపత్తులు ఉత్పన్నమైన తీరు, తీవ్రత ఉంటాయి. వాటిని సరిదిద్ది ఆయా ఘటనల ద్వారా ఉత్పన్నమయ్యే నష్టతీవ్రత తగ్గించాలి. పర్యవసానాలనూ అంచనా వేయాలి.
ప్రతి చర్య: అన్ని అధ్యయనాలు, విశ్లేషణలను, విపత్తులను తిప్పికొట్టడానికి వినియోగించుకోవాలి. పూర్వ పరిస్థితులను పునరుద్ధరించాలి. వీలైతే మెరుగ్గా తీర్చిదిద్దాలి.
ఈ నాలుగు అంశాల ద్వారా విపత్తులకు ముందున్న పరిస్థితులను సత్వరమే పునరుద్ధరించగలమని యూకేకు చెందిన డీఎఫ్‌ఐడీ కార్యాచరణ ప్రణాళిక చెబుతోంది.

పర్యావరణంతో ఆటలొద్దు
2019-20 వార్షిక బడ్జెట్‌లో భారత ప్రభుత్వం విపత్తుల నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఇందుకోసం రూ.577.93 కోట్లు కేటాయించింది. నిరుటికంటే ఇది రూ.289.13 కోట్లు అదనం. గతేడాది రూ.284.82 కోట్లు మాత్రమే ఇచ్చారు. దీనిలో జాతీయ తుపాను నష్టపరిహారం వాటా రూ.3.03 కోట్ల నుంచి రూ.296.19 కోట్లకు పెంచారు. భారత్‌లో ప్రధానంగా పర్వతప్రాంతాల్లో అభివృద్ధి-పర్యావరణ వ్యవస్థల మధ్య పాటించాల్సిన సమతుల్యత డోలాయమానంలో పడింది. పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాలు కావడం వల్ల ఇక్కడ అభివృద్ధి విషయంలో ఆచితూచి అడుగేయాలి. పర్యాటక ప్రాంతంగా పేరురావడంతో జనసమ్మర్దం పెరిగి అనేక పర్వత సానువుల్లోని సహజసిద్ధమైన వ్యవస్థల ఉనికి ప్రమాదంలో పడుతోంది. ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల విస్తరణ, భౌగోళిక పరిస్థితులకు భంగం వాటిల్లేలా చేస్తుండటంతో ఆకస్మిక వరదలు, కొండ చరియలు విరిగిపడటం లాంటి విపత్తులు సంభవిస్తున్నాయి. పర్యావరణపంగా సున్నిత ప్రాంతాలన్నీ అటు వ్యాపారపరంగా, ఆవాసాల పరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతూ ప్రకృతి సహజత్వంపై ఒత్తిళ్లకు కారణమవుతున్నాయి. దేశంలో పర్యావరణ సున్నిత ప్రాంతాల పరిరక్షణకు సంబంధించిన మార్గదర్శకాలు, నియమ నిబంధనలు ఉన్నప్పటికీ కొండప్రాంతాల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణలో ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించడంలో ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదనేది వాస్తవం. ఈ నేపథ్యంలో విపత్తులను నియంత్రించగలిగే పట్టణాలు, నగరాలు ప్రణాళికల రూపకల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రజల్లో, వ్యవస్థల్లో అవగాహన కల్పించాలి. ప్రతిస్పందక, ప్రతిచర్యలకై అనుసరించాల్సిన వివిధ స్థాయుల్లోని మెళకువలను, మెరుగైన పట్టణ ప్రణాళికలను రూపొందించాలి. విపత్తు నష్టతీవ్రత కనిష్ఠ స్థాయికి తగ్గించేలా పర్యావరణ హిత అభివృద్ధి కార్యక్రమాలతోనూ పట్టణీకరణకు ప్రాధాన్యం కల్పించాలి. ఆ మేరకు ప్రజల్లో చైతన్యాన్ని రగిలించాలి. విపత్తు తీవ్రతకు ప్రభావితం కాని మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలి. వాతావరణ మార్పుల్లోని వైరుద్ధ్యానికి, భూతాపానికి ముకుతాడు వేయాలి. పర్యావరణం-అభివృద్ధిల మధ్య సమతుల్యతకు భంగం వాటిల్లకుండా మసలుకున్ననాడే ప్రకృతి విపత్తుల నుంచి మానవాళిని కాపాడుకోగలం!

- డాక్ట‌ర్ జీవీఎల్ విజ‌య్‌కుమార్‌, భూవిజ్ఞాన‌శాస్త్ర నిపుణులు
Posted on 20-07-2019