Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ప‌ర్యావ‌ర‌ణం

కలుషిత తీరం - ‘వేట’కు దూరం!

* నేడు ప్రపంచ మత్స్య దినోత్సవం

దేశ తీర ప్రాంతం ఏడున్నరవేల పైచిలుకు కిలోమీటర్లతో అనేక జలాశయాలు, నదులు, కాలువలతో కోటి నలభై లక్షల మంది మత్స్యకారులకు జీవనోపాధి కల్పిస్తోంది. మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా విదేశీ మారకద్రవ్యం రూపంలో దేశానికి కిందటి ఆర్థిక సంవత్సరం రూ.49 వేల కోట్ల మొత్తం సమకూరింది. సముద్ర చేపల వేట ద్వారా వచ్చే ఉత్పత్తిలో భారత్‌ ప్రపంచంలో మూడో స్థానంలో, మంచినీటి చేపల ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉంది. ‘యూనిఫాం వేసుకోని సైనికులు’గా మత్స్యకారులను భారత నావికా దళాధిపతి అభివర్ణించారు. తీరప్రాంతంలో చేపల వేటతోపాట రక్షణ కోణంలో సైతం అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు నావికాదళానికి సమాచారం చేరవేస్తున్న నిత్యశ్రామికులు మత్స్యకారులు అనడంలో సందేహం లేదు. దేశానికి ఆహార, ఆర్థిక భద్రతతోపాటు రక్షణపరంగానూ అండగా నిలుస్తూ బహుముఖ పాత్ర పోషిస్తున్న మత్స్యకారులు వలస బాటపట్టడానికి, సరిహద్దులు దాటి పక్క దేశాల జైళ్లలో మగ్గడానికి, గిరిజనం తరహాలో రిజర్వేషన్లకోసం ఉద్యమ బాట పట్టడానికిగల కారణాలేమిటి అని తర్కిస్తే బాధాకర వాస్తవాలు వెల్లడవుతాయి.

తాతల నాటి సాధనసంపత్తితో తిప్పలు
తీరప్రాంతాలు కాలుష్యభరితంగా మారి- ప్రతికూల వాతావరణ మార్పుల కారణంగా సముద్రంలో చాలా దూరం వెళ్ళి లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే చేపలను వేటాడాల్సిన పరిస్థితుల్లో సంప్రదాయ వేట గిట్టుబాటుకాని వ్యవహారంగా మారింది. ఇంత లోతు ప్రాంతాల్లో వేటకు అనువైన సాధన సంపత్తి కొందరి వద్దనే ఉండటమూ మరో ప్రతిబంధకం. మలేసియా, ఇండొనేసియా, సింగపూర్‌ వంటి దేశాలు అత్యాధునిక సాధన సంపత్తి ఉపయోగిస్తూ; మత్స్యకారులకు మెరుగైన నైపుణ్యాలను అలవర్చి బ్రహ్మాండమైన ఉత్పత్తి సాధిస్తున్నాయి. భారతీయ మత్స్యకారులనూ మారుతున్న అవసరాల మేరకు సమాయత్తం చేస్తే ఇప్పుడు సాధిస్తున్న దిగుబడికన్నా కనీసం అయిదు రెట్లు అధిక ఉత్పత్తికి అవకాశం ఉంటుంది. చైనా మత్స్యకారులకు ఒక్కొక్కరికి ఏటా సగటున ఆరు టన్నుల మత్స్యసంపద లభిస్తే, భారత్‌లో ఆ పరిమాణం రెండు టన్నులు మాత్రమే. ఇది ఏ మాత్రం గిట్టుబాటు కాని వ్యవహారం. అందువల్లే ముఖ్యంగా బంగాళాఖాతంపై ఆధారపడ్డ మత్స్యకారులు వలస బాట పడుతున్నారు. ఇక కొన్ని రాష్ట్రాల మత్స్యకారులు మెరుగైన వేట కోసం ప్రాణాలకు తెగించి మన ప్రాదేశిక జలాలను సైతం దాటి ఇతర దేశాలకు వెళ్ళి వారి సైన్యానికి పట్టుబడి జైళ్లలో సంవత్సరాల తరబడి మగ్గిపోతున్నారు.

తీరప్రాంతాల్లో పట్టణీకరణ, పారిశ్రామికీకరణ అధికంగా జరగడం వల్ల కాలుష్య కారకాలు నేరుగా సముద్రంలో కలుస్తున్నాయి. వాణిజ్య నౌకాశ్రయాలకు దగ్గరలో చమురు చేరవేసే నౌకల వల్ల సముద్ర జీవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. మరోవంక విచ్చలవిడి వేటవల్ల తల్లి చేపల, రొయ్యల మనుగడ ప్రమాదంలో పడుతోంది. ఇష్టారీతిన సముద్రగర్భ తవ్వకాలు, ఇసుక ఎత్తిపోయడం; నత్రజని, ఫాస్పరస్‌ మూలకాలు అధికంగా ఉన్న కాలుష్యం నీటిలో కలవడంవల్ల అధిక ప్లవకాలు ఉత్పత్తి జరిగి సముద్ర ఉపరితలం నుంచి అడుగుభాగానికి సూర్యకాంతి చొచ్చుకువెళ్ళడం లేదు. దానివల్ల ప్రకృతి సిద్ధంగా ఉండవలసిన సముద్ర నాచు, సముద్ర గడ్డి మాయమైపోతున్నాయి. అనేక రకాల వాణిజ్య విలువ కలిగిన సముద్ర జీవులకు ఇవి ఆవాసాలు, ప్రత్యుత్పత్తి స్థావరాలు. ఒకప్పుడు టైగర్‌ రొయ్యల పెంపకం చెరువుల్లో ఎంత పరిమాణంలో జరిగేదో- అంతే ఉత్పత్తి లేక అంతకుమించి సముద్రంలో వేట ద్వారా లభించేది. ఇప్పుడు టైగర్‌ రొయ్యలు సముద్ర తీర ప్రాంతాల్లో బాగా తగ్గిపోయాయి. దానితోపాటు దేశవాళి తెల్లరొయ్య (ఇండికస్‌ రకం) సైతం ఎంతో అరుదుగా లభిస్తోంది. గతంలో తీర ప్రాంత పరిధిలోని రొయ్య ఉత్పత్తి కేంద్రాలు- టైగర్‌ రొయ్య పిల్లల కోసం సముద్రం నుంచి తల్లి రొయ్యలను సేకరించేవి. కాబట్టి, సామాజిక బాధ్యతగా ఉత్పత్తిలో పదిశాతం పిల్లల్ని తిరిగి సముద్రంలో విడిచిపెట్టేవారు. అలాగే మడ అడవుల సాంద్రత అధికంగా ఉండటంతో దేశీ తెల్ల రొయ్య కూడా విరివిగా లభించేది. కానీ, ఎప్పుడైతే రైతులు వనామి సాగు విరివిగా చేపట్టారో దానివల్ల సమస్యలు మొదలయ్యాయి. అది విదేశీ రకం కావడంవల్ల జీవవైవిధ్య రక్షణ కారణాల పేరిట సముద్రంలో వాటిని విడుదలను నిషేధించారు. అలా ఒకదానికొకటి మిళితమై సముద్రంలో రొయ్యల వేట అన్నది ఇప్పుడు అత్యంత అరుదైన వ్యవహారంగా మారిపోయింది. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపెడా) సముద్ర ఉత్పత్తులు; ఉప్పునీటి చెరువుల సాగు, మంచినీటి సాగు ఉత్పత్తుల ఎగుమతికి ఉద్దేశించింది. దీని ద్వారా ఒకప్పుడు 70 శాతం సముద్ర ఉత్పత్తులు ఎగుమతి అయితే- సాగు రూపంలో జరిగిన ఉత్పత్తి 30శాతం విదేశాలకు తరలేది. అలాంటిది ఈ రోజు పరిస్థితి తిరగబడింది. మొత్తంగా ఎగుమతుల్లో 20 శాతం సముద్ర ఉత్పత్తులు, 80 శాతం సాగు ద్వారా వచ్చినవి ఉంటున్నాయి. ఆ రకంగా ‘ఎంపెడా’లో సముద్ర ఉత్పత్తులు అన్న పదానికి క్రమంగా అర్థమే లేకుండా పోతోంది. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరచేందుకు గడచిన రెండు దశాబ్దాలుగా ఇస్తున్న ప్రోత్సాహకాల్లో కాలానుగుణ మార్పులు లేకపోవడమే ఇందుకు కారణం. కానీ, మత్స్యకారుల కోసం విలక్షణ విధానాలు అమలు చేస్తూ కేరళ అద్భుతి ప్రగతి సాధిస్తుండటం గమనార్హం.

మత్స్యకారులకు చేయూత
సముద్ర తీర ప్రాంతాల్లో జీవ వైవిధ్యం మెరుగుదలకు గట్టి చర్యలతోపాటు- పర్యావరణ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించాలి. కేంద్ర పరిశోధన సంస్థలు, మత్స్యకార సంఘాల భాగస్వామ్యంతో ఆ నిధులను సక్రమంగా వినియోగించేందుకు కృషి చేయాలి. సముద్ర తీర ప్రాంతాల్లో మత్స్య ఉత్పత్తి పెంపు, మత్స్యకారుల భద్రతపై చైనా అధిక శ్రద్ధ పెడుతోంది. తద్వారా పెట్టుబడికి మూడింతల విలువైన ఉత్పత్తిని సాధిస్తోంది. భారత్‌ సైతం చైనా విజయాలనుంచి పాఠాలు నేర్వాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా 500 బిలియన్‌ డాలర్ల వ్యాపార సామర్థ్యం ఉన్న అలంకరణ చేపల మార్కెట్లో 51 శాతం వాటాతో సింగపూర్‌ సింహభాగం ఆక్రమించింది. చైనా, మలేసియా, థాయిలాండ్‌, ఇండోనేసియా, శ్రీలంక వంటి దేశాలు తరవాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచ అలంకరణ చేపల విపణిలో భారత్‌ వాటా కేవలం 0.7 శాతం. కానీ, అటు ఉప్పునీటి లేక మంచినీటి అలంకరణ చేపల సాగుకు అత్యంత అనుకూలమైన పరామితులు భారత్‌లో ఉన్నాయి. ఈ విపణిని సింగపూర్‌ శాసిస్తుండటం గమనార్హం. తీరప్రాంతంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న రిలయన్స్‌ వంటి సంస్థలు కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా కాకినాడ తీరప్రాంతంలో ఐటీ, జీపియస్‌ ఆధారిత ఉపగ్రహ సేవలు మత్స్యకారులకు అందుబాటులో ఉంచి, వారికి మెరుగైన వేటకు తోడ్పాటు అందిస్తున్నాయి. దళారుల బెడద లేకుండా మార్కెట్‌తో వారికి అనుసంధానం ఏర్పాటుచేసి స్థానిక మత్స్యకారుల ఆదరణ పొందుతోంది. టాటా ట్రస్ట్‌ వంటివి సైతం మత్స్యకార గ్రామాలను దత్తత తీసుకొని వారికి ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు కృషి చేస్తున్నాయి. ఇదే స్ఫూర్తితో తీర ప్రాంతంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇతర సంస్థలూ సామాజిక బాధ్యతగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుంది. తీరప్రాంతంలో జీవ వైవిధ్యానికి తోడ్పాటుగా నిలవడంతోపాటు మత్స్యకారుల జీవనోపాధి స్థిరీకరణకు ప్రభుత్వాలు నిర్మాణాత్మక విధానాలతో ముందుకు రావాలి. తద్వారా మత్స్య ఉత్పత్తి సుస్థిర వృద్ధికి బాటలు పరవాలి.

- కరణం గంగాధర్‌
(రచయిత- ఆక్వా రంగ నిపుణులు)
Posted on 21-11-2019