Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ప‌ర్యావ‌ర‌ణం

తాగునీరే కాలనాగు!

ఏటికేడు పెరుగుతున్న నీటి కటకట ఎంతటి భయవిహ్వల దృశ్యాల్ని ఆవిష్కరించనుందో నిరుడు నీతి ఆయోగ్‌ నివేదిక గణాంక సహితంగా వెల్లడించింది. ఇప్పటికే 60 కోట్లమంది తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న ఇండియాలో 2030 నాటికి అందుబాటులోని నీటికంటే అవసరాలు రెండింతలు అధికం కానున్నాయని, కోట్లాది జనాల్ని ఒడ్డునపడ్డ చేపల్లా మార్చేసే ఆ ఉత్పాతం స్థూల దేశీయోత్పత్తిలో ఎకాయెకి ఆరుశాతం ఆర్థిక నష్టాలకు కారణభూతమవుతుందనీ హెచ్చరించింది. స్వాతంత్య్రానంతర కాలంలో నాలుగు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి విస్తృతంగా ఆనకట్టలు నిర్మించినా అధిక శాతం పంట చేలు తడవడానికి, గ్రామాల్లో 85శాతం జన సమూహాలు గుక్క తడుపుకోవడానికీ భూగర్భ జలాలే దిక్కు. పునఃపూరక (రీఛార్జింగ్‌) ఏర్పాట్లు కొరవడి భూగర్భ జలమట్టాలు ఆందోళనకర స్థాయిలో కోసుకుపోవడం, దాని వెన్నంటి జీవ జలాలు పలు రసాయన వ్యర్థాల పాలబడి విష కలుషితం కావడం- జమిలిగా జాతి జవజీవాల్ని చెండాడుతున్నాయి. 16 రాష్ట్రాల్లోని 79 జిల్లాల్లో భూగర్భ జలాలపై సాగించిన అధ్యయనం మరింతగా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. లీటరు నీటిలో యురేనియం పరిమాణం ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన సురక్షిత ప్రమాణాల కంటే ఎన్నో రెట్లు అధికంగా ఉండటం- తాగునీరే కాలనాగు అవుతోందని నిర్ధారిస్తోంది. దేశీయంగా భూగర్భ జలాల్లో అత్యధికంగా యురేనియం అవశేషాలు ఏపీలోని గుంటూరు జిల్లాలో కనిపిస్తుంటే, తెలంగాణలోని నల్గొండ ఆరోస్థానంలో నిలిచింది. లీటరు నీటిలో 30 మిల్లీగ్రాముల కంటే తక్కువ పరిమాణంలో యురేనియం కనిపించినా ప్రమాదం లేదు. అది గుంటూరునుంచి సేకరించిన నమూనాల్లో 2074 ఎంజీలు, నల్గొండలో 521 ఎంజీలుగా నిగ్గుదేలడం- జన జీవన సౌభాగ్యాన్ని కబళించే ‘ఉరేనియం’ ఉత్పాతాన్ని కళ్లకు కడుతోంది. ఇప్పటిదాకా తాగునీటి దురవస్థల్ని ఎదుర్కొంటున్న ప్రజానీకం కొత్తగా ఈ ముప్పుతిప్పలకూ సిద్ధపడాల్సి వస్తోంది!

‘సుజలాం... సుఫలాం మాతరం’ అంటూ దేశ మాతను కీర్తించే భరత జాతి ప్రాణప్రదంగా పదిలపరచుకోవాల్సిన నీటి వనరుల పట్ల ఏడు దశాబ్దాలుగా ప్రదర్శించిన నిర్లక్ష్య ధోరణి పర్యవసానాలు అభాగ్య జనం ఉసురు పోసుకొంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని 84శాతం ప్రజలు కుళాయి నీటి సరఫరాలకు నోచుకోవడం లేదని, 70శాతం నీటి వనరులు కలుషితమైన ఫలితంగా ఏటా రెండు లక్షలమంది ప్రాణాలు కోల్పోతున్నారని నీతి ఆయోగ్‌ వెల్లడించింది. 2024నాటికి మూడున్నర లక్షల కోట్ల రూపాయల భూరి వ్యయంతో ‘హర్‌ ఘర్‌ జల్‌’ పేరిట సురక్షిత నీటి సరఫరా ప్రణాళికను కేంద్రం సిద్ధం చేస్తున్న తరుణమిది. దేశంలోని 21 పెద్ద నగరాల్లో భారతీయ ప్రమాణాల సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వే- దేశ రాజధాని దిల్లీతోపాటు చండీగఢ్‌, గాంధీనగర్‌, పట్నా, బెంగళూరు, జమ్మూ, లఖ్‌నవూ, చెన్నై, డెహ్రాడూన్‌లలో నల్లా నీళ్లు దిగనాసిగా ఉన్నాయని నిర్ధారించింది. 28 ప్రాతిపదికల ఆధారంగా చేసిన పరీక్షల ఫలితాలు- నగరాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా ఎంచబోతే మంచినీరు ఎక్కడా దొరకట్లేదని కుండ బద్దలుకొడుతున్నాయి. కాబట్టే తాగునీటి నాణ్యతపరంగా మొత్తం 122 దేశాల జాబితాలో 120వ స్థానంలో ఇండియా ఈసురోమంటోంది. ఈసరికే దేశంలోని 160 జిల్లాల్లో భూగర్భ జలాలు ఉప్పునీటిమయమై, 230 జిల్లాల్లో ఫ్లోరైడ్‌ భూతం కోరసాచిన నేపథ్యంలో- సీసం, ఆర్సెనిక్‌, నైట్రేట్లవంటి జనారోగ్య క్షయకారకాలకు యురేనియం సైతం తీవ్రస్థాయిలో జతకలుస్తోందన్న సమాచారం భీతిల్లచేసేదే. ప్రభుత్వాలు విధిగా, పౌరులు స్వీయ బాధ్యతగా జలసంరక్షణ సామాజికోద్యమ రూపు సంతరించుకోకుంటే- భవిష్యత్తు అంతా గడ్డుకాలమే!

సుప్రీంకోర్టే స్పష్టీకరించినట్లు- మంచినీటిని పొందడం పౌరుల ప్రాథమిక జీవన హక్కు. ఉపరితల జలవనరుల్ని జాగ్రత్తగా కాపాడుకొంటూ, వాన నీటిని సంరక్షించుకొంటూ, ఎలాంటి కాలుష్య వ్యర్థాలూ నీటి వనరుల్లో కలవకుండా కాచుకొంటూ, వినియోగించిన నీటి పునశ్శుద్ధి ద్వారా జల యాజమాన్య నిర్వహణను మెరుగుపరచుకొంటూ వస్తున్న దేశాలే ధీమాగా పురోగమిస్తున్నాయిప్పుడు! కేంద్ర జల సంఘం, కేంద్ర భూగర్భ జల సంస్థలను నేటి అవసరాలకు దీటుగా పునర్‌ వ్యవస్థీకరించాలని విస్పష్టంగా సూచిస్తూ 2016 జులైలో మిహిర్‌ షా నేతృత్వంలోని నిపుణుల కమిటీ విపుల నివేదిక సమర్పించింది. దేశవ్యాప్తంగా మూడు కోట్లకుపైగా బోరు బావుల ద్వారా విచ్చలవిడిగా నీటిని తోడేయడం ఎంతగా అనర్థదాయకమో ఎలుగెత్తిన కమిటీ- తక్షణ దిద్దుబాటు చర్యల్నీ ప్రస్తావించింది. సమగ్ర జాతీయ జల విధానం రూపకల్పన దిశగా ప్రయత్నాలు ఇంకా కొలిక్కిరాకముందే, భూగర్భ జలాల్లో యురేనియం అవశేషాల ముప్పు భీతిల్ల చేస్తోంది. కడపజిల్లా ఎం.తుమ్మలపల్లి యురేనియం శుద్ధి కర్మాగారం కాలుష్య కారకమై అనేక దుష్పరిణామాలకు అంటుకడుతోందన్న స్థానికుల ఆవేదన అర్థవంతమైనదే. గుంటూరు, కడప, నల్గొండ జిల్లాల్లోని భూగర్భ జలాల్లో యురేనియం అవశేషాల తీవ్రత ఏ స్థాయిలో ఉందో, ఆ నీళ్లు తాగితే జనారోగ్యం ఏమవుతుందో తెలిసికూడా, అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు ఉరకలెత్తడం- జనహితం పట్టని తెంపరితనమే! నాలుగంచెల జలశుద్ధి, పటిష్ఠ సరఫరా వ్యవస్థలతో పరిపుష్టమైన సింగపూర్‌ ఆదర్శంనుంచి గుణపాఠాలు నేర్చి- నీటి యాజమాన్యంలో మేలిమి ప్రమాణాలు నెలకొల్పడం ద్వారా పౌరుల జీవన హక్కుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరోసా కల్పించాలి!

Posted on 25-11-2019