Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ప‌ర్యావ‌ర‌ణం

నాణ్యమైన నీరేదీ?

* కలుషిత జలాలతో కష్టాలు

మనిషి జీవించడానికి నీరు ఎంత అవసరమో, దాని నాణ్యత అంతకన్నా ముఖ్యం. మానవ శరీరంలో 50 నుంచి 75 శాతం వరకు నీరు ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతలను నియంత్రించడంలో, జీవక్రియ విధులను నిర్వహించడంలో నీరు అత్యంత కీలకపాత్ర పోషిస్తుంది. తాగునీటి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్పుడు చాలావరకు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కావు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (2019) నివేదిక ప్రకారం జనాభాలో 146 కోట్ల మంది (19 శాతం) ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందుబాటులో లేదు. చాలామంది ప్రజలు నీటిని శుద్ధి చేయకుండానే తాగుతున్నారని తాజా జాతీయ నమూనా సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌) వెల్లడించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొంది. నీటిని కాచి తాగేవారి సంఖ్య తక్కువగా ఉంది. ప్రపంచంలో 80 శాతం వ్యాధులు కలుషితమైన నీటిని తాగడం వల్లే వస్తున్నాయని వివిధ నివేదికలు పేర్కొంటున్నాయి. ఇలా వచ్చే వ్యాధుల్లో అతిసారం, కలరా, టైఫాయిడ్‌, విరేచనాలు, పోలియో ముఖ్యమైనవి. అతిసారంతో ప్రపంచంలో ఏటా సుమారు అయిదు లక్షల మందికి పైగా చిన్నారులు మృత్యువాత పడుతున్నారని అంచనా.

ప్రజలు కలుషిత నీటిని తాగుతున్నందున హెపటైటిస్‌, ఉదర వ్యాధుల బారిన పడుతున్నారు. ఉదర వ్యాధులవల్ల సుమారు 68.5 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. హెపటైటిస్‌వల్ల ఇంచుమించు 32.5 కోట్ల మంది ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. పలు దేశాల్లో ఆరోగ్య సంరక్షణ జాగ్రత్తలు, పారిశుద్ధ్య సేవలు, వ్యర్థ పదార్థాల నిర్వహణ చర్యలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. ప్రజల్లో వ్యక్తిగత శుభ్రత లోపిస్తోంది. ఇందుకు భారత్‌ మినహాయింపు కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా గణాంకాల ప్రకారం ప్రపంచంలో 78.5 కోట్ల మంది ప్రజలకు సరైన రీతిలో తాగునీటి సేవలు అందడం లేదు. వీరిలో 14.4 కోట్ల మంది కేవలం భూ ఉపరితల జలాల మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ నీరు వేగంగా కలుషితమవుతోంది. ఐక్యరాజ్య సమితి లక్ష్యం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ సురక్షిత తాగునీరు అందుబాటులో ఉండటమనేది వారి ప్రాథమిక హక్కు. కానీ, ఈ విషయాన్ని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి.

నీటి వనరులతోపాటు సామాజిక, ఆర్థిక, అభివృద్ధి స్థితిగతులను పరిగణనలోకి తీసుకొని ఐక్యరాజ్య సమితి 2010 నుంచి ‘మానవ అభివృద్ధి సూచిక’ పేరుతో ప్రజల ఆయుర్దాయానికి సంబంధించిన గణాంకాలను విడుదల చేస్తోంది. మొత్తం 189 దేశాలు దీని పరిధిలో ఉన్నాయి. ఈ సూచికలో చిన్న దేశమైన నార్వే మొదటి స్థానంలో ఉంది. నైజీరియా అత్యంత దిగువన 189వ స్థానంలో ఉంది. భారత్‌ 128వ స్థానంలో నిలిచింది. పొరుగున ఉన్న శ్రీలంక మనకన్నా మెరుగైన స్థానంలో ఉంది. ఈ ద్వీపదేశం 75వ స్థానంలో ఉంది. వివిధ దేశాల్లోని సామాజిక, ఆర్థిక, అభివృద్ధి స్థితిగతులతోపాటు తాగునీటి వనరుల పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈ సూచికలు తెలియజేస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వ తాజా సర్వే (2019) ప్రకారం దేశవ్యాప్తంగా కేవలం 18.33 శాతం గ్రామీణ గృహాలకు మాత్రమే కుళాయిల ద్వారా తాగునీరు సరఫరా అవుతోంది. పట్టణ ప్రాంత గృహాలకు 90 శాతం వరకు సరఫరా చేస్తున్నారు. దేశ రాజధాని నగరం దిల్లీలో పరిస్థితి అధ్వానంగా ఉంది. అక్కడ కుళాయిల ద్వారా సరఫరా అవుతున్న నీరు తాగడానికి పనికి రాదని అధ్యయనంలో వెల్లడైంది. ఈ నీటిలో అనేక వ్యర్థాలు ఉంటున్నాయి. నీటి నాణ్యతను పరీక్షించేందుకు మొత్తం 28 అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. కోల్‌కతా చెన్నై, జయపుర, దెహ్రాదూన్‌, రాంచి, రాయపూర్‌ నగరాల్లో సరఫరా అవుతున్న కుళాయి నీటిలోనూ నాణ్యత కొరవడుతోంది. ఈ నగరాల్లో నీటి నాణ్యతను నిర్ధారించేందుకు వివిధ అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. హైదరాబాద్‌, భువనేశ్వర్‌, తిరువనంతపురం, పట్నా, భోపాల్‌, అమరావతి, సిమ్లా, బెంగళూరు, చండీగఢ్‌, లక్నో, జమ్ము తదితర నగరాల్లోనూ పరిస్థితి సంతృప్తికరంగా లేదు. ఈ నగరాల్లో ప్రజలకు సరఫరా చేసే నీటిలో నాణ్యతా లోపం స్పష్టంగా కనపడుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో పరిస్థితి మెరుగ్గా ఉంది. అక్కడ ప్రజలకు అందిస్తున్న నీరు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగానే ఉందని పరీక్షల్లో తేలింది. 20 రాష్ట్రాల్లోని నగరాల్లో కుళాయిల ద్వారా అందించే నీరు తాగడానికి సురక్షితం కాదని వెల్లడైంది. భారతీయ నీటి పోర్టల్‌ (2019) నివేదిక ప్రకారం ఏటా దేశంలో 37.3 కోట్ల మంది ప్రజలు నీటిద్వారా వచ్చే వ్యాధులతో బాధపడుతున్నారు. అందులో 10.5 లక్షల మంది పిల్లలు డయేరియా వ్యాధితో కన్నుమూస్తున్నారు. దేశవ్యాప్తంగా కలుషిత నీరు తాగి అనారోగ్యం పాలవుతున్న ప్రజలు పని దినాలను కోల్పోయి ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రభుత్వం కొన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ అవి సంతృప్తికరంగా లేవు. 2020 నాటికి ఈశాన్య రాష్ట్రాల నగరాలతోపాటు వంద ఆకర్షణీయ నగరాలు, జిల్లా ప్రధాన కేంద్రాల్లోని నీటిని పరీక్షించాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2024 నాటికి దేశంలోని అన్ని గృహాలకు సురక్షితమైన కుళాయి నీరు అందించడానికి రూ.3.5 లక్షల కోట్లు వ్యయం చేసేదిశగా అడుగులు వేస్తోంది. నాణ్యమైన పంపుల ద్వారా నీటిని సరఫరా చేయడం వల్ల కొంతవరకైనా వ్యాధులను అరికట్టవచ్చు. నీటిని సరఫరా చేస్తున్న ప్రాంతంలోనే నాణ్యత పరీక్షలు నిర్వహించాలి. ప్రజల్లో అవగాహన పెంపొందించడమూ అవసరం!

Posted on 29-11-2019