Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ప‌ర్యావ‌ర‌ణం

భూతాపం... బాల్యానికి శాపం

* వాతావరణ మార్పులతో ఉపద్రవం

పెరుగుతున్న భూతాపం వాతావరణంలో గణనీయ మార్పులకు కారణమవుతోంది. ప్రధానంగా కాలుష్యం పెచ్చరిల్లుతూ- భావి భారత పౌరుల పాలిట పెనుముప్పుగా పరిణమించనుంది. భూతాపాన్ని నియంత్రించడంలో విఫలమైతే భవిష్యత్తు తరాల మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. వాతావరణ మార్పులు ఆరోగ్యంపై చూపుతున్న ప్రభావాల గురించి సమగ్రమైన అధ్యయనం, విశ్లేషణల తర్వాత ‘ది లాన్సెట్‌’ సంస్థ విడుదల చేసిన నివేదికలో ఆందోళనకరమైన విషయలు వెల్లడయ్యాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నకొద్దీ చిన్నారుల్లో పౌష్టికాహార సమస్యలు తలెత్తుతున్నాయి. ఆహార ధాన్యాల ఉత్పత్తి, దిగుబడులు క్రమేపీ తగ్గుతూ... ధరలు పెరగడమే దీనికి కారణం. భారత్‌లో 1960వ దశకం నుంచే వరి, మొక్కజొన్న ధాన్యాల సగటు దిగుబడిలో దాదాపు 2 శాతం తరుగుదల కనిపిస్తోంది. ఫలితంగా పేదవర్గాల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయి, దేశవ్యాప్తంగా అయిదేళ్లలోపు చిన్నారుల్లో మూడింట రెండోవంతు మృత్యువాత పడుతుండటం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. వాతావరణంలో కలుగుతున్న అనూహ్యమైన మార్పులు కలరా వ్యాధి కారకమైన ‘విబ్రియో బ్యాక్టీరియా’కు అనుకూలిస్తుండటం వల్ల- అది విజృంభిస్తూ ఏటా ఇన్‌ఫెక్షన్లు మూడు శాతం పెరిగేందుకు కారణమవుతోందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది.

అసంఖ్యాకమైన జనాభా, వైద్య-ఆరోగ్య సదుపాయాల్లో తీవ్ర అసమానతలు, పేదరికం, పోషకాహార లోపం వంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలున్న భారత్‌ వంటి దేశాల్లో వాతావరణ మార్పుల ప్రభావం భారీ స్థాయిలో ఉంటుందంటూ నివేదిక పేర్కొంది. అధిక శాతం చిన్నారుల మరణాలకు అతిసారం సంబంధిత రుగ్మతలే ప్రధాన కారణమని తెలిపింది. రెండు దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నా, గత 50 ఏళ్లుగా పర్యావరణపరంగా నెలకొంటున్న వాతావరణ మార్పులు పరిస్థితుల్ని తారుమారు చేశాయని భావించవచ్చు. పగటి, రాత్రి ఉష్ణోగ్రతల్లో తీవ్ర వ్యత్యాసం; మారుతున్న వర్షపాతం తీరుతెన్నులు- డెంగీ, మలేరియా, అతిసారం వంటి వ్యాధులు విజృంభించడానికి కారణమవుతున్నాయి. ప్రపంచ జనాభాలో ఇప్పుడు సగానికి పైగా ఈ వ్యాధుల ప్రభావానికి గురవుతున్నారని పలు అధ్యయనాల్లో వెల్లడవుతోంది. ఈ ప్రభావానికి ఎక్కువగా బలవుతోంది చిన్నారులే అనేది బాధాకరమైన వాస్తవం. పొగమంచు, వాయుకాలుష్యం మూలంగా సంభవిస్తున్న శ్వాసకోశ వ్యాధులు, ఉబ్బసం వంటివి సైతం చిన్నారులను ప్రభావితం చేస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న న్యుమోనియా, అతిసారం సంబంధిత మరణాల్లో 75 శాతం అయిదేళ్లలోపు చిన్నారులవే కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా విడుదలైన ‘న్యుమోనియా, డయేరియా 10వ ప్రగతి నివేదిక’లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతమున్న ఆరోగ్య సదుపాయాలు- రేపటితరాల పౌరులకు అందుబాటులో లేవని, 23 దేశాల్లో అత్యధిక శాతం ప్రభావితమౌతున్న చిన్నారులకు అవసరమైన వైద్య సదుపాయాలు అందడంలేదని ఈ నివేదిక పేర్కొంటోంది. ప్రధానంగా అయిదేళ్లలోపు వయసున్న చిన్నారుల జనాభా భారత్‌లోనే ఎక్కువ ఉండటంవల్ల న్యుమోనియా, అతిసారం మరణాలు ఇక్కడ ఎక్కువ శాతం సంభవిస్తున్నాయి. వాస్తవానికి 2016 ప్రారంభంలో ‘రోటావైరస్‌’ వ్యాక్సీన్‌కు స్వస్తి పలికి... 2017లో ‘న్యూమోకోక్కల్‌’ మిశ్రమ వ్యాక్సీన్‌ను ప్రవేశపెట్టడటంతో భారత్‌ పరిస్థితి మెరుగైనప్పటికీ- వాతావరణంలో సంభవిస్తున్న అనూహ్యమైన మార్పులు, వాయుకాలుష్యం పెచ్చరిల్లడంవల్ల వ్యాధులు విజృంభిస్తూ ఆందోళనకరంగా మారాయి. న్యుమోనియా, డయేరియాల నుంచి రక్షించుకోవాలన్నా, కోలుకోవాలన్నా ఓఆర్‌ఎస్‌, జింక్‌ పోషక మూలకాలు తీసుకోవడం అత్యంతావశ్యకం. భారత్‌లో డయేరియా సంబంధ వ్యాధిగ్రస్థులైన చిన్నారుల్లో 50 శాతం మందికి మాత్రమే ఓఆర్‌ఎస్‌ ద్రావణం... 20 శాతం మందికి మాత్రమే జింక్‌ అనుబంధ పోషకాలు అందుబాటులో ఉంటున్నాయని నివేదిక పేర్కొనడం గమనార్హం. ‘సేవ్‌ ది చిల్డ్రన్‌, యూనిసెఫ్‌’ సంస్థలు 2017లోనే తేల్చిన నివేదిక ప్రకారం- భారత్‌లోని చిన్నారుల్లో న్యుమోనియా వ్యాధికి పోషకాహార లోపమూ కారణమే. దీనివల్ల 53 శాతం మందిలో ఎదుగుదల లోపం ఉంటుందని నివేదిక పేర్కొంది.

ఇండియాలో న్యుమోనియా వ్యాధితో ప్రతి గంటకు 14 మంది అయిదేళ్లలోపు చిన్నారులు మృత్యువాత పడుతూ ఉండటం పోషకాహారలోపం, కాలుష్య తీవ్రతలను తెలియజేస్తోంది. 2018లో దేశవ్యాప్తంగా న్యుమోనియాతో 1,27,000 మంది శిశువులు మృతి చెందినట్లు తాజా నివేదిక పేర్కొంది. 2017లో సంభవించిన చిన్నారుల మరణాల్లో 14 శాతం న్యుమోనియావల్లే కావడం విషాదకరం. న్యుమోనియా సంబంధ శిశుమరణాలు అత్యధికంగా సంభవించే తొలి నాలుగు అగ్రదేశాల జాబితాలో భారత్‌ ఉండటం గమనార్హం. కర్బన ఉద్గారాలకు సంబంధించి పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇప్పటి చిన్నారుల తరం ముగిసే నాటికి భూగోళం సరాసరి ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల సెల్సియస్‌కు మించి పెరుగుతాయనేది అంచనా. ఇదే జరిగితే భావి తరాలకు జీవితంలో అడుగడుగునా వాతావరణ మార్పుల దుష్పరిణామాలు, ప్రభావాలు ఎదురుకాక తప్పవనేది వైద్య ఆరోగ్య, పోషకాహార నిపుణుల హెచ్చరికల సారాంశం.

ఈ పరిస్థితుల నేపథ్యంలో- ప్యారిస్‌ వాతావరణ ఒప్పందంలోని లక్ష్యాలకు అనుగుణంగా భూతాపం పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్‌కు మించి పెరగకుండా చూడటమే ప్రపంచ దేశాల ముందున్న తక్షణ కర్తవ్యం. ప్రపంచ పౌరసమాజాలు తీవ్ర వాయు కాలుష్యానికి కారణమవుతున్న ఇంధన వినియోగ తీరుతెన్నులను మార్చుకోవడంపై దృష్టి సారించాలి. సాంప్రదాయక ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా సౌరశక్తి, పవనశక్తి, జీవ ఇంధనాల వినియోగంవైపు మళ్ళాలి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో అసమానతలకు కారణమవుతున్న అంశాలపై దృష్టి సారించాలి. వాతావరణ మార్పుల ప్రభావం వల్ల సంభవిస్తున్న వ్యాధులపై పూర్తి అవగాహన కల్పించాలి. వ్యాధులను నివారించడం, నియంత్రణ చర్యలను పాదుకొల్పడం ద్వారానే భావిభారత పౌరులను కాపాడుకోవడానికి వీలవుతుంది. రేపటి తరానికి స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించి, సంపూర్ణ ఆయురారోగ్యవంతులుగా తీర్చిదిద్దడం సాధ్యమవుతుంది.

- డాక్టర్‌ జి.వి.ఎల్‌.విజయ్‌కుమార్‌
Posted on 02-12-2019