Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ప‌ర్యావ‌ర‌ణం

పచ్చదనంతో పరుగులు

* జీవ ఇంధనోత్పత్తిలో కొత్త అధ్యాయం

జట్రోఫా మొక్క నుంచి విజయవంతంగా జీవ ఇంధనాన్ని వెలికితీసిన భారత పెట్రోలియం పరిశోధన సంస్థ (ఐఐపీ) వంటనూనెలను డీజిల్‌గా మార్చే పనిలో ఉంది. గత నెలలో కోల్‌కతాలో జరిగిన అంతర్జాతీయ సైన్స్‌ ఉత్సవాల్లో ఐఐపీ శాస్త్రజ్ఞులు ఈ అంశంపై ప్రదర్శన ఇచ్చారు. తాజా వంటనూనెలకు మెథనాల్‌, మరికొన్ని రసాయనాలను కలిపి డీజిల్‌గా మార్చవచ్ఛు అది చాలా తక్కువ ఖర్చుతో తయారవుతుంది. ఐఐపీ చాలా ఏళ్ల నుంచి జట్రోఫా మొక్కల నుంచి జీవ డీజిల్‌ ఉత్పత్తి చేపట్టింది. పలు రాష్ట్రాల్లో రైతులు వాణిజ్య ప్రాతిపదికపై జట్రోఫా సాగు చేయనారంభించారు. జట్రోఫా మొక్కలు వేగంగా పెరగడానికి ఇజ్రాయెల్‌ అభివృద్ధి చేసిన సాంకేతికతను భారతీయ రైతులు అవలంబిస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో దేశమంతటా ఇథనాల్‌ను ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. ఇకపై వంటనూనెల నుంచీ జీవ ఇంధనం తయారు చేయడానికి కృషి మొదలైంది. జట్రోఫా నుంచి ఐఐపీ ఉత్పత్తి చేసిన జీవ ఇంధనాన్ని కొన్నేళ్ల క్రితం ‘టూ స్ట్రోక్‌’ ఇంజిన్లలో విజయవంతంగా వాడారు. కొన్ని మహారాష్ట్ర రవాణా సంస్థ వాహనాలూ ఈ ఇంధనంతో నడిచాయి. ఈ ప్రయోగాలు సఫలమైనప్పటికీ వాణిజ్య ప్రాతిపదికపై జీవఇంధన ఉత్పత్తి ఇంకా మొదలుకాలేదు. తాజాగా వంటనూనెల నుంచి జీవ ఇంధన తయారీ యత్నాలు ఊపందుకొంటున్నాయి.

జట్రోఫా నుంచి తయారైన 330 కిలోల జీవ డీజిల్‌తో ఒక విమానాన్ని నడిపారు. స్పైస్‌ జెట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఆ విమానం 2018లో దెెహ్రాదూన్‌ నుంచి 45 నిమిషాలు పయనించి దిల్లీ చేరుకుంది. 2019 రిపబ్లిక్‌ దినోత్సవ కవాతులో వైమానిక దళానికి చెందిన ఏఎస్‌-32 రవాణా విమానాన్ని జీవ డీజిల్‌తోనే నడిపారు. జట్రోఫా మొక్కలో 40 శాతం నూనె ఉంటుంది. దీన్ని ఏవియేషన్‌ టర్బైన్‌ ఇంధనం (ఏటీఏఫ్‌)తో కలిపి విమానం నడిపారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 500 మంది రైతులు జట్రోఫా సాగు చేస్తున్నారు. ప్రకృతిలో 400 రకాల గింజలు జీవఇంధన తయారీకి పనికొస్తాయి. కిరోసిన్‌ ఆధారిత ఏటీఎఫ్‌తో విమానాలు నడుపుతున్నందువల్ల వాతావరణంపై ప్రతికూల ప్రభావం ప్రసరిస్తోంది. వాతావరణ మార్పుల్లో 4.9 శాతం విమాన ప్రయాణాల వల్లనే సంభవిస్తోంది. జీవ ఇంధనాల వల్ల కర్బన ఉద్గారాలు బాగా తగ్గిపోతాయని ఐఐపీ సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ రంజన్‌ రే వివరించారు. భారతదేశంలో జెట్‌ విమానాలకు ఏడాదికి 60-70 లక్షల టన్నుల ఏటీఎఫ్‌ అవసరపడుతోంది. ఆ గిరాకీలో సగ భాగాన్ని జీవ డీజిల్‌తో తీర్చవచ్ఛు ఈ సగంలో మూడోవంతును వాడిన వంటనూనెతో తీర్చవచ్ఛు జీవ డీజిల్‌ వాడితే ఖరీదైన ఏటీఎఫ్‌ అవసరం తగ్గడమే కాకుండా కర్బన ఉద్గారాలూ దిగివస్తాయి.

భారతదేశంలో ఏటా 2.3 కోట్ల టన్నుల వంటనూనె వినియోగిస్తున్నారు. ఒక లీటరు వంటనూనె నుంచి 850-950 మిల్లీలీటర్ల జీవ డీజిల్‌ను తయారుచేయవచ్ఛు వాడేసిన వంటనూనె కూడా డీజిల్‌ తయారీకి ఉపకరిస్తుంది. హోటళ్లు, ఇతర వాణిజ్యపరమైన ఆహారశాలల్లో ఒకసారి వాడిన వంటనూనెను మళ్ళీ వాడకూడదని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) కొత్త నియంత్రణలు విధించింది.

రేపు వంటనూనెల నుంచి తీసే బయోడీజిల్‌తోనూ జెట్‌ విమానాలు, మోటారు వాహనాలను నడపవచ్ఛు అందుకే రకరకాల మార్గాల్లో జీవ డీజిల్‌ తయారీకి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే తొమ్మిది రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లో చెరకు నుంచి ఇథనాల్‌ తీసి ఇంజిన్లలో ఇంధనంగా వాడుతున్నారు. భారతదేశం 2005లో 160 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను తయారుచేసి, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఇథనాల్‌ ఉత్పత్తిదారుగా నిలిచింది. జీవ డీజిల్‌ను సంప్రదాయ ఇంధనంలో కలిపి వాడటం ద్వారా డీజిల్‌ వినియోగాన్ని 20 శాతం తగ్గించాలని భారత్‌ యోచిస్తోంది. జీవ ఇంధనాల పరిశోధన-అభివృద్ధికి భారతదేశం 2007లో పది దేశాలతో కలిసి తూర్పు ఆసియా ఇంధన భద్రత ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పది దేశాల్లో చైనా, జపాన్‌, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, న్యూజిలాండ్‌లూ ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం పెరగడం, చమురు నిల్వలు తరగడం వల్ల పై దేశాలు ఇప్పటికే జీవఇంధన ఉత్పత్తిలో ముందుకెళ్తున్నాయి. అమెరికా, బ్రెజిల్‌, కెనడా, కొలంబియా, వెనిజువెలా దేశాలు ఇప్పటికే జీవఇంధన తయారీలో ముఖ్యమైన మైలురాయిని దాటాయి. ప్రపంచంలో తయారవుతున్న జీవ ఇంధనంలో 40 శాతం ఒక్క అమెరికాలోనే ఉత్పత్తవుతోంది. ఏడాదికి మూడు నుంచి నాలుగు కోట్ల టన్నుల జీవ ఇంధనాన్ని తయారు చేస్తున్న అమెరికా ఈ రంగంలో అగ్రగామిగా నిలుస్తోంది. 2.5 కోట్ల టన్నులతో బ్రెజిల్‌ రెండో అతిపెద్ద ఉత్పత్తిదారు. ఒక టన్ను చమురును మండిస్తే 3.15 టన్నుల బొగ్గుపులుసు వాయువు ఉత్పన్నమవుతోంది. కాలుష్య కారకమైన చమురు బదులు భద్రమైన జీవ ఇంధనాల తయారీకి పలు దేశాలు వినూత్న కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాయి. తాజా, వాడేసిన వంటనూనెలు, జంతుకొవ్వులతో తయారయ్యే జీవ ఇంధనాన్ని అమెరికా విరివిగా వినియోగిస్తోంది. ఈ తరహా జీవఇంధనం 20 పాళ్లు, మిగతా 80 పాళ్లు మామూలు డీజిల్‌ను కలిపి పౌర, సైనిక మోటారు వాహనాల్లో ఉపయోగిస్తోంది. 2018లో అమెరికా జీవ ఇంధనంతో పెద్దయెత్తున విమాన ప్రయాణాలు నిర్వహించింది.

మొక్కజొన్న, కలప రద్దుతో గడ్డి, ఆల్జీ, జంతువ్యర్థాలు, మురుగు నుంచి కూడా జీవ మీథేన్‌, జీవ డీజిల్‌ తయారీకి ప్రపంచమంతటా ప్రయోగాలు జరుగుతున్నాయి. సుస్థిరాభివృద్ధికి అంతర్జాతీయ ఇంధన సంస్థ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రపంచ జీవఇంధన ఉత్పత్తి 2030కల్లా మూడురెట్లు పెరగాలి. కానీ, పంట పొలాలను జీవ ఇంధన ఉత్పత్తి వేదికలుగా మారిస్తే, ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుందన్న ఆందోళనా లేకపోలేదు.

- ఆర్‌పీ నైల్వాల్‌
Posted on 11-12-2019