Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ప‌ర్యావ‌ర‌ణం

ఆత్మహత్యా సదృశం!

‘ఈ పుడమి గాలి నేల నీరు మన పిల్లల నుంచి రుణంగా తీసుకొన్నవేగాని, మనకవి తాత ముత్తాతల వారసత్వం కాదు. కనుక మనకెలా అవి దక్కాయో కనీసం వాటిని అలాగే రేపటి తరానికి అప్పగించాలి’- మహాత్మాగాంధీ మహితోక్తి అది. ఆ బాధ్యతను విస్మరించి ఆర్థిక ప్రగతి పేరిట మితిమీరిన కర్బన ఉద్గారాలతో పర్యావరణ విధ్వంసానికి తెగబడి, పెను వాతావరణ మార్పులకు అంటుకట్టి, భూమండలాన్నే నిత్యాగ్నిగుండంగా మార్చేసిన నేరగాళ్లను భావితరం నేడు సూటిగా నిలదీస్తోంది. ‘సమస్త పర్యావరణ వ్యవస్థలూ కుప్పకూలి సర్వనాశనానికి ఆరంభ దశలో ఉన్నా’యంటూ ‘ఇంకా కట్టుకథలతో పొద్దుపుచ్చడానికి మీకు ఎంత ధైర్యం?’ అన్న పర్యావరణవేత్త గ్రెటా థున్‌బర్గ్‌తో భావితరం బలంగా గళం కలుపుతున్న వేళ స్వీడన్‌లోని మాడ్రిడ్‌లో ‘కాప్‌ 25’ విశ్వసదస్సు జరిగింది. 2015 నాటి ప్యారిస్‌ ఒప్పందాన్ని పూర్తిగా అమలులోకి తెచ్చే విధివిధానాల నిర్ధారణ, కర్బన ఉద్గారాల స్వయంనియంత్రణ లక్ష్యాల్ని అన్ని దేశాలూ మరింత పెంచేలా చూడాలన్న ధ్యేయంతో పద్నాలుగు రోజులపాటు జరిగిన సదస్సు ఎలాంటి ఫలితం సాధించకుండానే చాప చుట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి కర్బన ఉద్గారాల తలసరి సగటు 1.3 టన్నులు. అదే అమెరికా తలసరి సగటు నాలుగున్నర టన్నులు. చైనా 1.9, ఐరోపా సంఘం 1.8. అయితే ఇండియా వాటా కేవలం అర టన్ను! నిరుడు విశ్వవ్యాప్తంగా కర్బన ఉద్గారాల్లో చైనా 28 శాతం, అమెరికా 15, ఈయూ తొమ్మిది, ఇండియా ఏడు శాతం వాటా కలిగిఉన్నాయని, మొత్తం 59 శాతానికి అవే పుణ్యం కట్టుకొన్నాయని సమితి గణాంకాలు ఎలుగెత్తుతున్నాయి. నెల రోజుల క్రితం ప్యారిస్‌ ఒప్పందం నుంచి అమెరికా అధికారికంగా వైదొలగినందున స్వీయ నియంత్రణ లక్ష్యాల పెంపుదలపై చైనా, ఇండియాల మీద సహజంగానే ఒత్తిడి పెరిగింది. ప్యారిస్‌ ఒప్పంద పరిధిలో అందరికన్నా మిన్నగా ఫలితాలు చూపిస్తున్న ఇండియా- అదనపు మోతలకు తలొగ్గకపోవడం, పేద దేశాల వాణిని పెద్ద దేశాలు పెడచెవిన పెట్టడంతో ఉత్తుత్తి ఆశాభావ ప్రకటనలకే సదస్సు పరిమితమైంది!

మనిషి సహా సమస్త జీవావరణాన్ని పొత్తిళ్లలో పాపలా సాకిన పర్యావరణం, వాతావరణ మార్పుల దరిమిలా మానవాళితో చేస్తున్నది అక్షరాలా ప్రత్యక్ష రణం. ప్రగతి పేరిట ప్రకృతి సమతూకాన్ని దెబ్బతీసి, బొగ్గుపులుసు వాయు ఉద్గారాల అగ్గితో భూతాపం రాజేసి పారిశ్రామిక దేశాలు చేసిన పాపం మానవాళికే పెనుశాపంగా మారడమే విషాదం. సమితి ప్రధాన కార్యదర్శి కోరుతున్నట్లు కర్బన ఉద్గార తటస్థత (నెట్‌ జీరో) సాధించేందుకు 28 దేశాల ఈయూ సన్నద్ధత చాటింది. ఆ విధంగా ఇండియా, చైనాలపై ఒత్తిడి పెంచే యత్నం సాగినా- 2005నాటి క్యోటో ప్రొటోకాల్‌కు అభివృద్ధి చెందిన దేశాల కట్టుబాటే ప్యారిస్‌ ఒడంబడిక సాఫల్యానికి సరైన ప్రాతిపదిక అవుతుందంటూ బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా, ఇండియా, చైనా సంయుక్తంగా ప్రకటించాయి. ప్యారిస్‌ ఒడంబడిక సాఫల్య వైఫల్యాల సమీక్ష 2023లో జరగనున్నందున అప్పటిదాకా స్వీయ ఉద్గారాల నియంత్రణ లక్ష్యాల్ని పెంచదలచుకోలేదని ఇండియా స్పష్టీకరించింది. ప్యారిస్‌ ఒప్పందంలోని ఆరో అధికరణ ‘కర్బన విపణి’ ఏర్పాటును ప్రస్తావిస్తోంది. లక్షిత స్థాయికన్నా అధికంగా ఉద్గారాల్ని తగ్గించే దేశాలు ఆ మేరకు తమ వాటాను విక్రయించే వెసులుబాటుతో కర్బన విపణి ఏర్పాటైతే దానివల్ల బహుముఖ ప్రయోజనాలుంటాయంటున్నా, ఆ కీలకాంశమూ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. పర్యావరణ విపత్తులతో తల్లడిల్లే పేద దేశాలకు ధనిక దేశాల ఆర్థికసాయం అందించే ప్రతిపాదనకూ అదే గతి పట్టింది. ప్రపంచవ్యాప్త ఉద్గారాల్లో కేవలం 13 శాతానికి కారణమవుతున్న 77 దేశాలు కర్బన ఉద్గార తటస్థతకు సంసిద్ధత తెలిపినా- దానివల్ల ఒనగూడే మేలెంత? వరస ఉత్పాతాలతో పర్యావరణం భీతిల్లజేస్తున్న వేళ కంటితుడుపు చర్యలతో మానవాళి తెరిపిన పడుతుందా?

పారిశ్రామిక విప్లవానికంటే ముందున్న స్థాయికన్నా వాతావరణ ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల సెంటీగ్రేడుకు మించకుండా నియంత్రించాలని ప్యారిస్‌ ఒప్పందం నిర్దేశించింది. ప్యారిస్‌ ఒప్పందం మేరకు ప్రపంచ దేశాలన్నీ కాలుష్య ఉద్గారాల్ని సమర్థంగా కట్టడి చేసినా ఉష్ణోగ్రతల్లో పెరుగుదల మూడు డిగ్రీల సెంటీగ్రేడుకు చేరుతుందని పలు శాస్త్రీయ అధ్యయనాలు చాటుతున్నాయి. సముద్ర మట్టాల పెరుగుదల, భీకర తుపానులు, వరదలు, కరవులు, కార్చిచ్చులు- ప్రపంచార్థికాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ విపత్తులన్నింటిలో వాతావరణ మార్పుల దుష్ప్రభావాన్ని ఏ మాత్రం తోసిపుచ్చే వీల్లేదు. ప్యారిస్‌ ఒడంబడిక తరవాత ప్రమాదకర వాయు ఉద్గారాలు నాలుగు శాతం పెరిగాయని, పర్యావరణం భూతల హితకరం కావాలంటే- వాటిని ఏటా ఏడు శాతానికి పైగా వచ్చే దశాబ్ద కాలంపాటు కట్టడి చేయాలనీ శాస్త్రవేత్తలు మొత్తుకొంటున్నారు. క్యోటో ప్రొటోకాల్‌ను నిష్కర్షగా కాలదన్నిన అమెరికా, అధ్యక్షుడిగా ఒబామా ప్రాప్తకాలజ్ఞత కనబరచడంతో ప్యారిస్‌ ఒప్పందాన్ని ఔదలదాల్చింది. ‘అమెరికాకే ప్రాధాన్యం’ అంటూ ఎన్నికల్లో నెగ్గిన ట్రంప్‌ ప్యారిస్‌ ఒప్పందాన్ని తోసిపుచ్చడం- యావత్‌ ప్రపంచాన్నీ పెను సంక్షోభ గుండంగా మార్చేస్తోంది. జర్మన్‌ వాచ్‌ అనే స్వచ్ఛంద సంస్థ వెలువరించిన వాతావరణ ముప్పు సూచీలో ఇండియా 2017లో ఉన్న 14వ స్థానం నుంచి నిరుడు అయిదో స్థానానికి చేరింది. అంతర్జాతీయ ఒడంబడికలకు ఎంతగా నిబద్ధత చాటినా, అమెరికా మాదిరిగా ఏ దేశం భూతాపం పెరుగుదలకు కారణమైనా, ప్రపంచ దేశాలన్నీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ‘మనకున్నదొక్కటే భూమి’ అన్న స్పృహతో అన్ని దేశాలూ ఉమ్మడి కార్యాచరణకు సిద్ధం కాకపోతే- మానవాళికి అది ఆత్మ వినాశనమే!

Posted on 17-12-2019