Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ప‌ర్యావ‌ర‌ణం

పర్యావరణానికి ప్రజల అండ

* బ్రిటన్‌ తొలి అడుగు

ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో బ్రిటన్‌ ఒకటి. మానవాభివృద్ధి సూచీలో ఎంతో ముందున్న దేశమది. నిరుడు డిసెంబరులో ఒక్కసారిగా అక్కడ నిరసన జ్వాలలు రేగాయి. అందుకు కారణం మారుతున్న వాతావరణ స్థితిగతుల పట్ల ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తంకావడమే. దేశంలో పర్యావరణ ఆత్యయిక స్థితి (క్లైమేట్‌ ఎమర్జెన్సీ) ప్రకటించాలంటూ సామాన్య ప్రజలు, విద్యార్థులు, ఉద్యమకారులు వేల సంఖ్యలో రోడ్లమీదకు వచ్చారు. బ్రిటన్‌ పార్లమెంట్‌లో సుదీర్ఘ చర్చ సైతం జరిగింది. తప్పని పరిస్థితిలో ప్రభుత్వం దిగివచ్చి పర్యావరణ ఆత్యయిక స్థితిని ప్రకటించింది. ఆపై ఐర్లాండ్‌, కెనడా, ఫ్రాన్స్‌ దేశాలూ ఇదే నిర్ణయం తీసుకున్నాయి. న్యూయార్క్‌ నగరం సైతం ఇదే స్ఫూర్తిని అందిపుచ్చుకొంది.

ప్రపంచంలో పర్యావరణ ఆత్యయిక స్థితిని ప్రకటించిన మొదటి దేశంగా బ్రిటన్‌ నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా మారుతున్న వాతావరణ పరిస్థితులను గమనించిన ఐరోపా దేశాలు, ముందుజాగ్రత్త చర్యలు తీసుకోకుంటే భూమిపై భవిష్యత్‌ తరాల మనుగడ కష్టమని భావించి- ‘పర్యావరణ ఆత్యయిక స్థితి’ని ప్రకటిస్తున్నాయి. ప్రపంచంలో సంభవించే విపత్తులకు వాతావరణ మార్పులే కారణమని పలు నివేదికలు స్పష్టం చేస్తున్న తరుణంలో పరిష్కార దిశగా ఒకవైపు ఈ దేశాలు పయనిస్తుంటే, కాలుష్య కారకాలను అత్యధిక స్థాయిలో విడుదల చేస్తున్న చైనా, అమెరికా, భారత్‌ వంటి దేశాలు మాత్రం మొద్దు నిద్ర పోతున్నాయి. కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్న దేశాల్లో చైనా మొదటి స్థానంలో, అమెరికా, ఐరోపా దేశాలు, భారత్‌ తరవాతి స్థానాల్లో ఉన్నాయి.

భూ వాతావరణంలో కర్బన ఉద్గారాలను సాధ్యమైనంత మేరకు తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 2015లో ‘పారిస్‌ ఒప్పందం’ కుదిరింది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలను ఈ శతాబ్దంలో రెండు డిగ్రీల సెల్సియస్‌కు మించి పెరగకుండా చూడాలని, వీలైనంత వరకు 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలని నిర్ణయించి, 195 దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ప్రస్తుతం విడుదలవుతున్న కర్బన ఉద్గారాలను 2030లోగా సగానికి, 2050నాటికి పూర్తిగా తగ్గించాలని సంకల్పించాయి. ప్రతి దేశం వాతావరణ పరిస్థితులపై అవగాహన కలిగించడంతోపాటు, పౌరుల్లో చైతన్యం తేవాలని నిర్ణయించాయి. భూతాపానికి కారణమయ్యే కర్బన కారకాల వాడకాన్ని పూర్తిగా తగ్గించి, వాటి స్థానంలో ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని నిర్దేశించుకున్నాయి. దశాబ్దాలుగా వాతావరణంలో ‘కార్బన్‌ డయాక్సైడ్‌’ పేరుకుపోతోంది. దీంతో భూతాపం క్రమంగా పెరుగుతూ ప్రపంచవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తద్వారా వాతావరణ సమతుల్యత దెబ్బతిని, వర్ష నమూనాలు తారుమారవుతూ, వానలు పడే రోజులు తగ్గుతున్నాయి. అమెరికా ‘ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (ఈపీఏ)’ ప్రకారం పారిశ్రామిక విప్లవాని(1750)కి ముందు 280 ‘పార్ట్స్‌ పర్‌ మిలియన్‌ (పీపీఎం)’గా ఉన్న కార్బన్‌ డయాక్సైడ్‌ ప్రస్తుతం 411 పీపీఎమ్‌కు చేరింది. ఏటా దాదాపు మూడు వేలకోట్ల మెట్రిక్‌ టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ వాతావరణంలోకి విడుదలవుతోందని అంచనా. కొన్ని దశాబ్దాల క్రితం వాతావరణంలో 0.03 శాతంగా ఉన్న కార్బన్‌ డయాక్సైడ్‌ ప్రస్తుతం 0.04 శాతానికి చేరిందని ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమేట్‌ చేంజ్‌(ఐపీసీసీ) నివేదిక తెలిపింది. ప్రతి కార్బన్‌ డయాక్సైడ్‌ అణువు కొన్ని దశాబ్దాలపాటు వాతావరణంలోనే ఉంటుంది. ఉష్ణాన్ని బంధించుకునే స్వభావం ఉన్న కార్బన్‌ డయాక్సైడ్‌తో పాటు, ‘గ్రీన్‌ హౌస్‌’ వాయువుల ప్రభావంతో భూ ఉపరితలం, సముద్రాలు కూడా వేడెక్కుతున్నాయి.

ప్రకృతి వైపరీత్యాల్లో 91 శాతం వాతావరణ మార్పుల కారణంగానే సంభవిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి నివేదిక స్పష్టం చేస్తోంది. 2006-15 మధ్యకాలంలో వచ్చిన తుపాన్ల కారణంగా దాదాపు 16 వేల మంది చనిపోయినట్లు తెలిపింది. అంతకుముందు దశాబ్దంలో ఈ మరణాల సంఖ్య 13,600. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2100 నాటికి ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతలకు అదనంగా మూడు నుంచి అయిదు డిగ్రీల సెల్సియస్‌ వరకు పెరుగుతాయని ప్రపంచ వాతావరణ సంస్థ అంచనా వేసింది. దీనివల్ల మంచు పర్వతాలు కరిగిపోవడంతో పాటు, భీకర తుపాన్లు విరుచుకుపడతాయి. ఈ మార్పులు ప్రజారోగ్యం, జీవనోపాధి, ఆహార భద్రత, నీటి సరఫరాతో పాటు ఆర్థిక ప్రగతిపై తీవ్ర ప్రభావం చూపనున్నట్లు ఐపీసీసీ స్పష్టీకరిస్తోంది.

మన దేశంలో వాతావరణ మార్పులకోసం తీసుకుంటున్న చర్యలు శూన్యమే అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈశాన్య, ఉత్తర భారతంలో భారీ వర్షాలతో జనం అతలాకుతలం అవుతుంటే, దక్షిణ భారతంలో కరవు ఛాయలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు దేశంలో దాదాపు 44 శాతం ప్రాంతాలు కరవును ఎదుర్కొంటున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా చెన్నై నగరం తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దిల్లీ నగరం ఏడాది క్రితం ‘మెడికల్‌ ఎమర్జెన్సీ’ ప్రకటించింది. వీటన్నింటికీ వాతావరణంలో వస్తున్న మార్పులే ప్రధాన కారణం. పెట్రోలు, డీజిల్‌ వాహనాలకు ప్రత్యామ్నాయాలైన విద్యుత్‌ వాహనాల వాడకంలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ మూడేళ్లు వెనకబడినట్లు నిపుణులు చెబుతున్నారు. వాతావరణంలో అసమానతలు ఇలాగే కొనసాగితే ప్రపంచంలో సారవంతమైన భూములు సత్తువ కోల్పోయి ఎడారులుగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 23న అమెరికాలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరగనున్న ‘క్లైమేట్‌ యాక్షన్‌ సమ్మిట్‌-2019’లో తీసుకోబోయే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సదస్సు తీర్మానాలను భారత్‌లో ఎలా అమలు చేస్తారనేది పరిశీలనాంశం. 1960వ దశకంలో తీసుకొచ్చిన హరిత విప్లవం మాదిరిగానే ఇప్పుడూ హరిత, పారిశ్రామిక విప్లవం తీసుకురావాలని, వెంటనే దేశంలో పర్యావరణ ఆత్యయిక స్థితి ప్రకటించి, భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పచ్చదనాన్ని పెంచడం, పవన సౌర ఇంధనాలను ప్రోత్సహించడం తక్షణ కర్తవ్యాలు కావాలి.- అనిల్‌ కుమార్‌ లోడి
Posted on 22-07-2019