Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ప‌ర్యావ‌ర‌ణం

తీర నగరాలకు జలగండం!

* పెరుగుతున్న సముద్ర మట్టాలు

సముద్ర మట్టాలు గతంలో అంచనా వేసిన దానికన్నా వేగంగా పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముప్ఫై. కోట్లకు పైగా ప్రపంచ జనాభా, మూడున్నర కోట్ల మంది భారతీయుల గృహాలు వచ్చే ముప్ఫై. ఏళ్లలో నీటిపాలు కావచ్చనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. గతంలో చేపట్టిన అధ్యయనాలతో పోలిస్తే ప్రమాద తీవ్రత పెరిగినట్లు ఇటీవలి నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లోతట్టు తీరప్రాంతాల్లో నివసించే వారికి ముప్పు మూడురెట్లు అధికంగా ఉందని, భారతీయులకు ఏడురెట్లు ఎక్కువగా ఉందని అవి పేర్కొంటున్నాయి. హిమానీ నదాలు కరుగుతూ, సముద్ర మట్టాలు పెరుగుతుండటంతో మూడున్నర కోట్లమంది భారతీయులు ప్రమాదం అంచున ఉన్నట్లేననేది నిపుణుల హెచ్చరిక. వాతావరణ వ్యవస్థలోని అదనపు ఉష్ణాన్ని సముద్రాలు 90 శాతందాకా గ్రహించి, భూమిని నివాసయోగ్యంగా చేస్తున్నా... ఉష్ణం కారణంగా హిమానీ నదాలు, ముఖ్యంగా గ్రీన్‌లాండ్‌, అంటార్కిటికాల్లో ఉండే మంచు ఫలకాలు కరిగి సముద్ర మట్టాలు పెరగడానికి కారణమవుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 శాతం జనాభా అత్యంత జనసాంద్రతతో కూడిన తీరప్రాంతాల్లోనే నివసిస్తోంది. పది అతిపెద్ద విశ్వనగరాల్లో ఎనిమిది- ఏదో ఒక తీరానికి సమీపంలోనే ఉన్నాయి. అన్ని దేశాలనూ పరిగణనలోకి తీసుకుంటే, ప్రమాదం బారిన పడే అవకాశాలున్న 45 తీరప్రాంత రేవు నగరాల్లో నాలుగు భారత్‌వే. ముంబయి నుంచి కోల్‌కతా వరకు, చెన్నై నుంచి మధ్య కేరళ వరకు, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలు ముప్పు అంచున ఉన్నాయి. గత యాభై ఏళ్లకాలంలో భారత తీర ప్రాంతంలో సముద్రమట్టాలు సగటున ఏటా 1.7 మిల్లీమీటర్లతో- 8.5 సెంటీమీటర్ల మేర పెరిగాయని ఇటీవల రాజ్యసభలో కేంద్ర పర్యావరణశాఖ సహాయమంత్రి బాబుల్‌ సుప్రియో పేర్కొనడం ఆందోళన చెందాల్సిన విషయమే. 10 భారతీయ ఓడరేవుల్లో సేకరించిన సమాచారం ప్రకారం... పశ్చిమ్‌ బంగలోని డైమండ్‌ హార్బర్‌ వద్ద సముద్ర మట్టాలు అత్యధికంగా ఏటా 5.16 మి.మీ. పెరగగా, ఆ తరవాతి స్థానంలో గుజరాత్‌లోని కాండ్లా వద్ద 3.18 మి.మీ., పశ్చిమ్‌ బంగలోని హల్దియా వద్ద 2.89 మి.మీ., అండమాన్‌ నికోబార్‌లోని పోర్ట్‌బ్లెయిర్‌ వద్ద 2.2 మి.మీ., గుజరాత్‌లోని ఓఖా వద్ద 1.5 మి.మీ., కేరళలోని కోచ్చి వద్ద 1.3 మి.మీ., ఏపీలోని విశాఖపట్నం వద్ద 0.9 మి.మీ. మేర పెరుగుదల ఉన్నట్లు వెల్లడైంది. సముద్ర మట్టాల పెరుగుదలవల్ల, 2050 నాటికి వార్షిక వరద ముప్పు బంగ్లాదేశ్‌కు ఎనిమిది రెట్లు, భారత్‌కు ఏడు రెట్లు, థాయిలాండ్‌కు పన్నెండురెట్లు, చైనాకు మూడు రెట్లు అధికమవుతోంది. ఇదే కాలానికి ముంబయి, కోల్‌కతా, చెన్నై, మధ్య కేరళ, సూరత్‌తోపాటు గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఏడాదికోసారి వరద ముప్పు ఎదుర్కొనే ప్రమాదముంది. ముంబయిలో దాదర్‌ నుంచి కాండివలి, జవహర్‌లాల్‌ నెహ్రూ ఓడరేవు నుంచి ఖర్గర్‌ వరకు తుడిచిపెట్టుకుపోయే ముప్పుంది. కోల్‌కతాలో ముప్ఫైశాతం లోతట్టు ఇళ్లు ముంపునకు గురయ్యే ప్రమాదముంది. చెన్నైలో పెరంబూరు నుంచి పురసైవక్కం వరకు, ప్రధాన నగరంలోకీ వరద ప్రవేశించే అవకాశం ఉంది. మంచు కరగడం వల్ల ఒక మీటర్‌ దాకా

సముద్ర మట్టాలు పెరిగితే, 2100 నాటికి ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మందిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ మార్పులపై అంతర ప్రభుత్వ కమిటీ(ఐపీసీసీ) తన నివేదికలో పేర్కొంది. 2100 నాటికి కర్బన ఉద్గారాల్ని బాగా తగ్గించి, భూతాపాన్ని రెండు డిగ్రీల సెల్సియస్‌కన్నా తక్కువకు పరిమితం చేసినా 30 సెం.మీ. నుంచి 60 సెం.మీ.మేర సముద్రమట్టాల్లో పెరుగుదల ఉంటుందనేది నిపుణుల మాట. మరోవైపు కర్బన ఉద్గారాల పెరుగుదల ప్రస్తుత స్థాయిలోనే కొనసాగితే సముద్ర మట్టాలు 60 నుంచి 110 సెం.మీ.దాకా హెచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల తీర నగరాలకు ముప్పు పొంచి ఉండగా, మరోవైపు హిమాలయాల్లోని హిమనీనదాలు కరుగుతుండటం కారణంగా ఉత్తర భారత్‌లోని పలు నగరాలు తీవ్ర జలసంక్షోభం బారిన పడే ప్రమాదం ఉందని ఐరాసకు చెందిన వాతావరణ విభాగం పేర్కొంది.

సముద్ర మట్టాలకు సంబంధించిన ఆందోళనకరమైన హెచ్చరికలపై భిన్న వాదాలూ లేకపోలేదు. ఇవి ఎక్కువగా అమెరికా, ఆస్ట్రేలియాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన పరిశీలనలని, భారత్‌కు సంబంధించి క్షేత్ర గణాంకాల్ని పరిగణనలోకి తీసుకోలేదని కొంతమంది నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సముద్ర మట్టాల పెరుగుదల స్థానిక అంశాలపైనా ఆధారపడి ఉంటుందని, ప్రపంచస్థాయి నమూనాల్లో వాటిని పరిగణనలోకి తీసుకొని ఉండకపోవచ్చని అభిప్రాయ పడుతున్నారు. హిందూ మహా సముద్ర మట్టం పెరుగుదలకు ప్రధానంగా వేడి కారణమని, ఈ సమస్యను నిర్దిష్టంగా గుర్తించేందుకు మరింత మెరుగైన పర్యవేక్షక సాంకేతిక పరిజ్ఞానం అవసరమనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. భారత్‌కు సంబంధించి మరికొన్ని పరిశీలనలు అవసరమని, పరిస్థితి అంత ఆందోళనకరంగా లేదని మరికొంతమంది నిపుణులు స్పష్టం చేస్తుండటం గమనార్హం.

ఎవరి వాదనలు ఎలా ఉన్నా... ఏదో ఒక స్థాయిలో ముప్పు పొంచి ఉందనేది అంగీకరించాల్సిన సత్యం. సముద్ర మట్టాల పెరుగుదల వల్ల- తీరప్రాంతం కోతకు గురవడంతోపాటు, తుపాన్ల తాకిడి పెరిగి, తరచూ వరదలూ సంభవిస్తాయన్న సంగతి తెలిసిందే. సముద్ర జలాల్లో ఆమ్ల గుణం పెరిగి సముద్ర ఆహారం తగ్గే ప్రమాదం ఉంది. ఉష్ణ తరంగాలూ పెరుగుతాయి. హిమానీ నదాలు, మంచు కరిగి నీటి లభ్యత తగ్గిపోతుంది. ఈ క్రమంలో వచ్చే ముప్ఫై ఏళ్లలో కర్బన ఉద్గారాల్ని తగ్గించకపోతే, అలలు ముంచెత్తే ప్రాంతాలు మరింతగా పెరుగుతాయి. ఈ స్థాయిలో ముప్పు ఉందని స్పష్టంగా తెలుస్తున్నప్పుడు ముందే మేల్కొని, తెలివిడిని ప్రదర్శించాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. సమస్య తీవ్రతను తగ్గించేందుకు ‘గ్రీన్‌హౌస్‌’ వాయు ఉద్గారాలను తగ్గించే దిశగా ప్రపంచవ్యాప్తంగా విస్తృత స్థాయిలో కృషి జరగాల్సి ఉంది.

- శ్రీనివాస్‌ దరెగోని
Posted on 27-12-2019