Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ప‌ర్యావ‌ర‌ణం

నేలతల్లి కడుపు చల్లగా...

ప్రపంచంలోనే అత్యల్పంగా కేవలం ఎనిమిది శాతం వాననీటినే సంరక్షిస్తూ- మరోవైపు, విచ్చలవిడిగా నిల్వల్ని తోడేస్తున్న భారత్‌లో సహజంగానే భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఆరు వారాలక్రితం దేశంలోని 256 జిల్లాలు, 1592 బ్లాకుల్లో భూగర్భ జలాల పరిరక్షణకు ‘జల్‌శక్తి అభియాన్‌’ను ఆవిష్కరించిన కేంద్రం- రాష్ట్రాలతో జట్టు కట్టి జనావాసాల దాహార్తి తీరుస్తామనీ అప్పట్లోనే ప్రకటించింది. ‘జల్‌శక్తి అభియాన్‌’ కింద స్థానిక సంస్థలకు మార్గదర్శకాలను క్రోడీకరించిన మోదీ ప్రభుత్వం మాజీ ప్రధాని వాజ్‌పేయీ జయంతిని పురస్కరించుకొని ఏడు రాష్ట్రాల్లో తాజాగా ‘అటల్‌ భూజల్‌ యోజన’కు శ్రీకారం చుట్టింది. మహారాష్ట్ర, హరియాణా, రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, యూపీ, కర్ణాటకల్లో 78 జిల్లాల పరిధిలోని సుమారు 8,300 గ్రామాల్లో భూగర్భ జలాల మెరుగుదలకు ఉద్దేశించిన పథకం నిమిత్తం అయిదేళ్లలో వెచ్చిస్తామంటున్న మొత్తం అక్షరాలా ఆరువేల కోట్లరూపాయలు! అందులో సగం ప్రపంచ బ్యాంకు రుణం పోను మిగతాది కేంద్ర సాయం- రాష్ట్రాలకు గ్రాంట్లుగా జమపడనున్నాయి. రాష్ట్రాల ఆసక్తి, సన్నద్ధతల ప్రాతిపదికన జాబితా ఎంపికైనట్లు కేంద్రం చెబుతున్నా- పంజాబ్‌ స్పందన, సమాచార సేకరణ పూర్తిగా జరగలేదన్న భావన కలిగిస్తోంది. పఠాన్‌కోట్‌, ముక్త్‌సర్‌ మినహా తక్కిన ఇరవై జిల్లాల్లో భూగర్భ జలాలు తరిగిపోయిన పంజాబును ‘అటల్‌ భూజల్‌ యోజన’లో చేర్చకపోవడమేమిటని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. పథకంలో మరిన్ని ప్రాంతాలను జోడించాల్సి వస్తే ఆ మేరకు వ్యయీకరణా పెంపొందితేనే తప్ప యోజన గాడినపడే అవకాశం లేదు. వాస్తవానికి, భూగర్భ జలాల అంశం ఒక్కటే కాదు- ప్రతి గ్రామం జలనిధి ఏర్పరచుకోవాలని, తక్కువ నీరు అవసరమయ్యే పంటలు సాగు చేయాలంటూ ప్రధాని మోదీ చేసిన ఉద్బోధ సైతం దేశమంతటికీ వర్తించేదే.

నేలలోపలి పొరల్లో తడారిపోతున్న దుస్థితి ఏ కొన్ని ప్రాంతాలకో పరిమితమైన సమస్య కాదని, దేశవ్యాప్తంగా 72శాతం మేర భూగర్భ జలాలు అడుగంటిపోయాయన్నది ‘వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా వినుతికెక్కిన రాజేంద్ర సింగ్‌ అంచనా. అమెరికాలోని అతిపెద్ద రిజర్వాయర్‌ మీడ్‌ లేక్‌ సామర్థ్యానికి రెండింతల దాకా భూగర్భ జలరాశిని భారత్‌ కోల్పోయినట్లు నాలుగేళ్ల క్రితం ‘నాసా’ మదింపు వేసిన తరవాత అయినా- ఎడాపెడా తోడివేత ఎక్కడైనా తగ్గిందా? దేశానికి స్వాతంత్య్రం వచ్చేటప్పటికి తలసరి నీటి లభ్యత 6,042 ఘనపు మీటర్లు; నేడది నాలుగోవంతుకన్నా తక్కువకు కుంగి, అంతకంతకు తెగ్గోసుకుపోతోంది. సమస్య మూలాలు, సంక్షోభ విస్తృతి బహిరంగ రహస్యాలు. దేశంలో దశాబ్దాల క్రితమే కాలుష్య నియంత్రణ వ్యవస్థను కొలువు తీర్చినా ఏం ఒరిగింది? నష్ట నివారణ, జలాల పునశ్శుద్ధి తగినంతగా విస్తరించలేదని కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ నివేదిక అధిక్షేపించినా- అది దున్నపోతుపై వాన చందమే అయింది. పర్యవసానంగా భూగర్భ జలాలమీద ఒత్తిడి తీవ్రతరమై 160 జిల్లాల్లో నిల్వలు ఉప్పునీటిమయమయ్యాయని, 230 జిల్లాల్లో ఫ్లోరైడ్‌ భూతం కోరసాచిందన్న గణాంకాలు- కమ్ముకుంటున్న దురవస్థను కళ్లకు కడుతున్నాయి. మిషన్‌ కాకతీయ (తెలంగాణ), నీరు-చెట్టు (ఏపీ), ముఖ్యమంత్రి జల్‌ స్వాభిమాన్‌ అభియాన్‌ (రాజస్థాన్‌), సుజలాం సుఫలాం యోజన (గుజరాత్‌) తదితరాల పేరిట వివిధ రాష్ట్రాల్లో జల చేతన వ్యక్తమవుతున్నా- జాతీయ స్థాయిలో ఏకోన్ముఖ కృషి కొరవడటం ప్రధాన లోపమనే చెప్పాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యతాయుత భాగస్వామ్యం జలసంరక్షణలో జాతికి కొత్త ఒరవడి దిద్దాలి!

సక్రమంగా నాణ్యమైన నీటిసరఫరా ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. పోనుపోను నీటి అవసరాలు, అందుబాటు మధ్య అంతరం ఎకాయెకి 43 శాతానికి పెరగనుందన్న కేంద్రం విశ్లేషణ, ‘జల్‌ జీవన్‌ మిషన్‌’ ద్వారా 14 కోట్ల గ్రామీణ గృహాలకు నల్లా నీరు అందించడానికయ్యే వ్యయభారం అయిదేళ్లలో మూడు లక్షల 60 వేలకోట్ల రూపాయలన్న అంచనాలే అందుకు రుజువు. అంత మొత్తాన్ని కేంద్రం, రాష్ట్రాలు చెరి సగం నెత్తికెత్తుకోవాలంటే- ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పటికది సాకారమవుతుందో ఏమో! కేంద్ర జలసంఘాన్ని, కేంద్ర భూగర్భ జలసంస్థను సమకాలీన అవసరాలకు దీటుగా పునర్‌వ్యవస్థీకరించాలని మిహిర్‌ షా కమిటీ మూడున్నరేళ్ల క్రితమే సూచించింది. భూగర్భ జలమట్టాలు హరాయించుకుపోతున్న ప్రాంతాల్లో రైతులు పరస్పర సహకారంతో నీటి బడ్జెట్లు రూపొందించుకుని పంటల సాగు చేపట్టాలంటున్న ప్రధానమంత్రి- అందుకు పైయెత్తున మార్గదర్శకత్వం, సాంకేతిక సహకారం అందించే పకడ్బందీ యంత్రాంగాన్నీ తీర్చిదిద్దాలి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, యూకే వంటివి భూగర్భ జలమట్టాలు తరిగిపోకుండా జాగ్రత్తపడటంతోపాటు శాయశక్తులా పొదుపు చర్యలు పాటిస్తున్నాయి. ఏ నీటివనరూ కాలుష్యం బారిన పడకుండా కంటికి రెప్పలా కాచుకునే బాధ్యతను సుమారు 12 లక్షలమంది సంరక్షకులకు చైనా కట్టబెట్టింది. వర్షజలాల్ని సాధ్యమైనంతగా ఒడిసిపట్టేందుకు అనువుగా కొన్ని దేశాలు రహదారుల నిర్మాణంలోనూ మెలకువలు పాటిస్తున్నాయి. బొట్టుబొట్టునూ ఒడిసిపట్టి, ప్రతి నీటి బిందువు నుంచీ గరిష్ఠ ప్రయోజనం పొందడం ఇక్కడ జాతీయ సంస్కృతిగా స్థిరపడితే- పంట దిగుబడులూ పెరుగుతాయి. వార్షిక కడగండ్లూ దూరమవుతాయి. భూగర్భ జలాల వెలికితీత, పునఃపూరక (రీఛార్జి) తీరును పురపాలక విభాగాలు పర్యవేక్షించాలని అయిదు నెలల క్రితం వెలువడ్డ కేంద్రప్రభుత్వ మార్గదర్శకాలు తు.చ. తప్పకుండా అమలైతే- ‘అటల్‌ భూజల్‌ యోజన’ స్ఫూర్తి దేశమంతటా పరిమళిస్తుంది!

Posted on 28-12-2019