Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ప‌ర్యావ‌ర‌ణం

కలవరపెడుతున్న భూక్షీణత

* నిర్మాణాత్మక చర్యలతోనే పరిష్కారం

పెరుగుతున్న జనాభాకు ఆహారాన్ని అందించడంలో ఇప్పటికే తంటాలు పడుతున్న భారత్‌ను భూక్షీణత సమస్య వేధిస్తోంది. ఫలితంగా ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం అధికమవుతోంది. అటవీ నిర్మూలన, అతిగా సాగు చేయడం, మృత్తికా క్షయం, చిత్తడి నేలల తగ్గుదల వంటి పలు కారణాలతో భారతదేశంలో 30 శాతానికిపైగా భూమి (9.6 కోట్ల హెక్టార్లు) క్షీణతకు గురైంది. దీనివల్ల పంట దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడటంతోపాటు, వాతావరణ మార్పులకూ ఇది కారణమవుతోంది. ఈ పరిస్థితులన్నీ తిరిగి మరింత భూక్షీణతకు దారితీస్తున్నాయి.

వాతావరణ మార్పులను నిలువరించడంలో అడవులే అత్యంత కీలకం. భారత్‌లో 2018 నాటికి 16 లక్షల హెక్టార్ల మేర అడవులకు ముప్పు వాటిల్లింది. 2015 నాటికి అయిదేళ్ల కాలవ్యవధిలో కోటికిపైగా వృక్షాలను పడగొట్టేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దేశంలో 500పైగా ప్రాజెక్టులు రక్షిత ప్రదేశాలు, పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతాల్లో ఉన్నాయి. వీటికి మోదీ ప్రభుత్వ హయాములో 2014 జూన్‌ నుంచి 2018 మే వరకు తొలి నాలుగేళ్లలో జాతీయ వన్యమృగ బోర్డు ఆమోదం తెలిపింది. అంతకుముందు యూపీఏ ప్రభుత్వం 2009 నుంచి 2013 వరకు 260 ప్రాజెక్టుల్ని ఆమోదించింది.

ఐరాస గణాంకాల ప్రకారం- భారత్‌ పాలు, పప్పు ధాన్యాలు, జౌళి రంగాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుగా పేరొందింది. వరి, గోధుమ, చెరకు, వేరుసెనగ, కూరగాయలు, పండ్లు, పత్తి సాగులో రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా పేరు గడించింది. అయితే, పర్యావరణానికి హాని కలిగే పరిస్థితులు ఇదే తరహాలో కొనసాగితే, దేశంలో 80 శాతం చిన్న-సన్నకారు రైతులు సమీప భవిష్యత్తులో తీవ్రస్థాయిలో ప్రభావితమయ్యే ప్రమాదముంది. వ్యవసాయ ప్రధానమైనదిగా పేరొందిన భారత ఆర్థిక వ్యవస్థ సైతం ఆహార భద్రత ముప్పు బారిన పడే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వినపడుతున్నాయి. పశువుల వృద్ధి, ఉత్పాదకతపైనా భూక్షీణత ప్రభావం పడి, వాతావరణ మార్పులకు దారితీసే అవకాశం ఉందని ఐరాసకు చెందిన వాతావరణ మార్పులపై అంతర ప్రభుత్వ కమిటీ(ఐపీసీసీ) వెల్లడించింది.

పర్యావరణ వ్యతిరేక చర్యల్ని అడ్డుకునే విషయంలో 2006లో ఆమోదం పొందిన అటవీ హక్కుల చట్టం (ఎఫ్‌ఆర్‌ఏ) ఉపయుక్త ఉపకరణం. ఎన్నో తరాలుగా అడవుల్లో జీవిస్తున్న వారికి రక్షణ కల్పిస్తూ అటవీ భూమిపై, సహజ వనరులపై వారి హక్కుల్ని ఈ చట్టం గుర్తిస్తుంది. ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతోంది. దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల హెక్టార్ల అటవీ భూమి ఉండగా, 2019 ఏప్రిల్‌ 30 నాటికి సుమారు 1.3 కోట్ల హెక్టార్ల భూములకు సంబంధించిన ఎఫ్‌ఆర్‌ఏ వివాదాలనే ప్రభుత్వం పరిష్కరించగలిగింది. దీనికితోడు, 20 లక్షల మంది అటవీ నివాసుల కుటుంబాలకు సంబంధించిన ఎఫ్‌ఆర్‌ఏ హక్కులపై వాదనలు తిరస్కరణకు గురైన నేపథ్యంలో- సుప్రీంకోర్టులో ప్రస్తుతమున్న కేసు వారి నెత్తిన కత్తిలా మారి భయపెడుతోంది. ప్రస్తుతం 21 రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా తిరస్కరణకు గురైన అంశాల్ని సమీక్షించే పనిలో ఉన్నాయి.

తీవ్రస్థాయి వాతావరణ పరిస్థితులు, ఇతరత్రా మానవ కార్యకలాపాల వల్ల నీరు, గాలి కారణంగా సంభవించే లవణీయత, క్షీణత మృత్తికా క్షయంతో రూ.72 వేల కోట్లకుపైగా నష్టాలు సంభవించినట్లు ఇంధన వనరుల సంస్థ(టీఈఆర్‌ఐ) అధ్యయనం స్పష్టం చేస్తోంది. భారత్‌లో 2018-19లో వ్యవసాయానికి కేటాయించిన బడ్జెట్‌ రూ.58 వేల కోట్ల కన్నా ఇది ఎక్కువ.

భారత్‌లో చిత్తడి నేలలు 1,52,600 చ.కి.మీ.మేర ఉన్నాయి. ఇది దేశ భౌగోళిక ప్రాంతంలో అయిదు శాతం. అటవీ నిర్మూలన, వాతావరణ మార్పులు, నీటి పారుదల, భూకబ్జాలు, పట్టణాభివృద్ధి వంటి సమస్యలు చిత్తడి నేలల్ని అంతకంతకూ తగ్గించేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ తరహా భూమిలో ఏటా రెండు నుంచి మూడు శాతం తగ్గుతున్నట్లు తేలింది. గత మూడు దశాబ్దాల కాలంలో దేశంలోని పశ్చిమ కోస్తాలోని మడ అడవుల్లో సుమారు 40 శాతం వ్యవసాయ భూములుగా, ఇళ్ల కాలనీలుగా మారిపోయాయి. అధిక మొత్తంలో కర్బనాన్ని వేగంగా గ్రహించే చిత్తడి నేలలు, భూతాపంపై పోరాటంలో కీలకంగా వ్యవహరిస్తాయి. చిత్తడి నేలల పునరుద్ధరణకు, మృత్తికా పరిరక్షణ విషయంలో మనదేశం నిర్మాణాత్మకంగా అడుగులు వేయలేదు. ఆవరణ వ్యవస్థను కాపాడగలిగే ‘కోస్తా నియంత్రణ జోన్‌ నోటిఫికేషన్‌-2018’ని బలహీనపరచడం వల్ల స్థిరాస్తి వ్యాపారులు భారీ స్థాయిలో అభివృద్ధి ప్రాజెక్టుల్ని చేపట్టేందుకు వీలు కల్పించినట్లయింది. ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలను పకడ్బందీగా అమలు చేసినట్లయితే, తీర ప్రాంతాలు- బలహీన ఆవరణ వ్యవస్థల్ని పరిరక్షించే అవకాశం ఉంది. భారత్‌ను ఎక్కువగా భయపెడుతున్న మరో అంశం భూతాపం. దేశంలో భౌగోళికంగా 69 శాతం మెట్టభూములే కావడంతో ఈ ఆందోళన మరింత ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా 60 కోట్ల మంది ప్రజలు నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా- మెట్టప్రాంత జనాభా మరింత తీవ్రంగా నీటి కొరత, కరవు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇటీవల దిల్లీలో ఎడారీకరణపై పోరాటానికి ఐరాస నిర్వహించిన సదస్సు(సీఓపీ-14)లో 2030 నాటికి భూక్షీణతకు అడ్డుకట్ట వేయాలనే సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనకు సభ్య దేశాలు అంగీకారం తెలిపాయి. భూక్షీణతను తగ్గించే లక్ష్య సాధన కోసం ప్రపంచస్థాయిలో సభ్య దేశాలకు సాంకేతికపరమైన సహకారం అందించే దిశగా ఓ సంస్థను ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్రమోదీ ఈ సదస్సులో ప్రతిపాదించారు. 2030 నాటికి భూక్షీణతను నిలువరిస్తామని- క్షీణతకు గురైన అటవీ, వ్యవసాయ భూముల్లో కనీసం మూడు కోట్ల హెక్టార్ల భూమికి పునరుజ్జీవం కల్పిస్తామని భారత్‌ హామీ ఇచ్చింది. ఆ మేరకు కార్యాచరణ దిశగా సుస్థిరంగా అడుగులు పడాల్సిన అవసరం ఉంది.

- నీరజ్‌ కుమార్‌
Posted on 03-01-2020