Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ప‌ర్యావ‌ర‌ణం

భవితకు భరోసా పచ్చదనమే!

* అడవుల పెరుగుదల తీరుతెన్నులు

కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల మంత్రి ప్రకాష్‌ జావడేకర్‌ ఇటీవల విడుదల చేసిన తాజా జాతీయ అటవీ సర్వే నివేదిక (2017-19) దేశంలో అడవుల పరిరక్షణ, విస్తీర్ణం పెరుగుదలకు సంబంధించిన అనేక ప్రశ్నలను, సవాళ్లను తెరమీదకు తీసుకువచ్చింది. పారిస్‌ ఒప్పందం ప్రకారం 2030నాటికి 250 కోట్ల నుంచి 300 కోట్ల టన్నుల కార్బన్‌ డై ఆక్సైడ్‌కు సమానమైన ఉద్గారాలను తగ్గించేందుకు వీలుగా- దేశంలో అడవుల విస్తీర్ణాన్ని పెంచుతామని భారత్‌ 2015లో ఒప్పుకొంది. తాజా సర్వే నివేదిక ప్రకారం గత రెండేళ్లలో దేశవ్యాప్తంగా అటవీ విస్తీర్ణం 0.56 శాతమే పెరిగింది. ఈ పరిణామం పారిస్‌ ఒప్పంద లక్ష్యాన్ని చేరుకునేందుకు గట్టి నమ్మకాన్నిస్తుందని మంత్రి జావడేకర్‌ చెబుతున్నారు. అనేక రాష్ట్రాల్లో అడవులు హరించుకుపోతున్న పరిస్థితిని ఇదే నివేదిక మరోవైపు కళ్లకు కడుతోంది. దేశ భూభాగంలో 33 శాతం మేర అటవీ విస్తీర్ణాన్ని నిర్దేశిత లక్ష్యంగా పెట్టుకుని దశాబ్దాలు దాటుతున్నా- దాన్ని చేరుకోవడం సాధ్యం కాలేదు. అడవుల పరిరక్షణ, పెంపకం కోసం జాతీయ స్థాయిలో సమగ్ర అటవీ విధానం రూపకల్పన ఏళ్ల తరబడి సాగుతూనే ఉంది. నిర్దేశించుకున్న లక్ష్యాలు, అడవుల లెక్కింపు ధోరణులు, కర్బన ఉద్గారాల నియంత్రణలో ఇప్పుడున్న అటవీనాణ్యత ఎంతవరకూ దోహదం చేస్తుందనే విషయాలూ చర్చనీయాంశంగా మారాయి.

లక్ష్యసాధనలో నిరాశ
మానవాళికి స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం అందించడంతో పాటు భూగర్భ జలాల సంరక్షణ, కర్బన ఉద్గారాల తగ్గింపు, వాతావరణ మార్పుల నియంత్రణలో అడవులు విశేషమైన పాత్ర పోషిస్తాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా కోట్లాది మందికి ఉపాధి అందిస్తాయి. 1952లో అమలులోకి వచ్చిన మొదటి జాతీయ అటవీ విధానం ప్రకారం దేశ భూభాగంలో 33 శాతం విస్తీర్ణంలో అడవులు ఉండాలి. 67 ఏళ్లు గడిచినా లక్ష్యాన్ని చేరుకోలేదు. జాతీయ అటవీ సర్వే సంస్థ (ఎఫ్‌ఎస్‌ఐ) రెండేళ్లకోసారి ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా దేశంలో అటవీ విస్తీర్ణం పెరుగుదల క్షీణత తీరుతెన్నులను అంచనా వేస్తుంది. ఎఫ్‌ఎస్‌ఐ అటవీ నివేదిక ప్రకారం ప్రస్తుతం దేశ భూభాగంలో 7,12,249 చ.కి.మీ. మేర (21.67 శాతం) అడవులు విస్తరించి ఉన్నాయి. 2017లో అది 21.54 శాతం. అంటే రెండేళ్లలో పెరిగిన అటవీ విస్తీర్ణం 0.56 శాతమే. 2011లో అటవీ విస్తీర్ణం 6,92,027 చ.కి.మీ.గా నమోదైంది. గడచిన దశాబ్దంలో 20,222 చ.కి.మీ. (మూడు శాతం) మేర పెరిగింది. సంఖ్యాపరంగా ఇది భారీగానే కనిపిస్తున్నా అడవుల రకాలను బట్టి విస్తీర్ణం పెరుగుదల విధానంపై అనేక సందేహాలు నెలకొని ఉన్నాయి. మధ్యస్థాయి దట్టమైన అడవులు 3,08,472 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉన్నాయి. కాఫీ, వెదురు, తేయాకు వంటి వాణిజ్య తోటలతో కూడిన బహిరంగ అడవులు 3,04,499 చ.కి.మీ.(9.26 శాతం)లో విస్తరించి ఉన్నాయి. దశాబ్ద కాల విశ్లేషణ ప్రకారం వాణిజ్య తోటలతో కూడిన బహిరంగ అడవుల విస్తీర్ణం 5.7 శాతం పెరిగింది. మధ్యస్థాయి దట్టమైన అడవుల విస్తీర్ణం 3.8 శాతం తగ్గింది. ఈ వర్గం అడవులు 2011లో 3,20,736 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉండగా- తాజా నివేదిక ప్రకారం విస్తీర్ణం 3,08,472 చ.కి.మీ.కు కోసుకుపోవడం గమనార్హం. ఒక హెక్టారులో 70 శాతంపైగా చెట్లు ఉంటే వాటిని దట్టమైన అడవులుగా వర్గీకరిస్తారు. కర్బన ఉద్గారాలను నియంత్రించడంలో వీటి పాత్ర అధికం. భారత్‌లో ఇవి 99,278 చ.కి.మీ. (మూడు శాతం) మాత్రమే ఉన్నాయి. ఈ తరహా అడవుల పెరుగుదల 1.14 శాతమే నమోదైంది. గత నివేదికలో ఈ తరహా అడవులు (2015-17) 14 శాతం పెరిగినట్లు నమోదైంది. కర్ణాటకలో 1,025, ఆంధ్రప్రదేశ్‌లో 990, కేరళలో 823, జమ్మూకశ్మీర్‌లో 371, హిమాచల్‌ప్రదేశ్‌లో 344 చ.కి.మీ. చొప్పున అటవీ విస్తీర్ణం పెంపుదల సాధించి జాతీయంగా తొలి అయిదుస్థానాల్లో నిలిచాయి. దేశంలో అటవీ విస్తీర్ణం పెరుగుదల, క్షీణతకు సంబంధించిన గణాంకాల నమోదు విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అడవుల పచ్చదనాన్ని అంచనా వేసేటప్పుడు అటవీ భూముల యాజమాన్య హక్కులు, చెట్ల జాతులు, నిర్వహణ వంటివాటిని పరిగణనలోకి తీసుకోవడంలేదు. ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో చెట్లపై భాగంలోని పచ్చదనం (పందిరి) ఒక హెక్టారులో పదిశాతం మేర ఆవరించి ఉంటే ఆ ప్రాంతాన్ని అడవిగా గుర్తించడంపై కొన్నేళ్లుగా చర్చ నడుస్తుంది. కాఫీ, యూకలిప్టస్‌, కొబ్బరి, మామిడితోపాటు అనేక రకాల వాణిజ్య తోటల ఉపరితల భాగం సహజంగా పచ్చదనంపరచుకుని ఉంటుంది. వీటినీ పరిగణనలోకి తీసుకోవడంవల్ల అడవుల విస్తీర్ణం లెక్కింపు నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

‘కంపా’ నిధులపై ఆశలు
పర్యావరణ పరిరక్షణ చట్టం (1980) ప్రకారం అభివృద్ధికి అవసరమయ్యే అటవీయేతర ప్రాజెక్టులకు అడవులను బదలాయించేందుకు, ప్రత్యామ్నాయ వనీకరణను చేపట్టేందుకు ఒక నిర్దిష్ట ప్రక్రియ దేశవ్యాప్తంగా అమలవుతోంది. ఆ మేరకు లక్షలాది ఎకరాల భూములను ఈ ప్రాజెక్టులకు కేటాయించారు. ప్రపంచబ్యాంకు నివేదికల ప్రకారం 1980-2016 మధ్యకాలంలో దేశంలో 22 లక్షల 23 వేల ఎకరాల అడవులను అటవీయేతర ప్రాజెక్టుల కోసం బదలాయించారు. ఇది దేశంలోని 1.2 శాతం మేర అటవీ విస్తీర్ణానికి సమానం. అటవీ చట్టం ప్రకారం ఇంతే విస్తీర్ణంలో ప్రత్యామ్నాయ అడవులను ఈపాటికే పెంచి ఉండాలి. ఎఫ్‌ఎస్‌ఐ సైతం ఈ ప్రత్యామ్నాయ అడవుల పెంపకం తీరుతెన్నులను అధ్యయనం చేసిన దాఖలాల్లేవు. నష్టపరిహారం కింద జమపడిన నిధులను అడవుల పెంపకానికి పారదర్శకంగా ఖర్చు పెట్టేందుకు కేంద్ర స్థాయిలో 2009లో ప్రత్యామ్నాయ వనీకరణ నిధి నిర్వహణ, ప్రణాళిక సంఘం(కంపా)ను ఏర్పాటు చేశారు. అటవీ పరిరక్షణ కోసం కాకుండా వేరే కార్యక్రమాలకు ఈ నిధులను వినియోగించారు. కాగ్‌ వంటి సంస్థలు మండిపడటంతో ఏళ్ల తరబడి చర్చల అనంతరం కంపాకు చట్టబద్ధత కల్పించారు. గతేడాది సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని ఏళ్ల తరబడి రాష్ట్రాలకు కేటాయించకుండా కంపా వద్ద పోగుపడి ఉన్న 54 వేల కోట్ల రూపాయల నిధులను కేంద్రానికి, రాష్ట్రాలకు జమచేయాలని ఆదేశించడంతో కదలిక వచ్చింది. నిరుడు ఆగస్టులో కేంద్రమంత్రి జావడేకర్‌ 27 రాష్ట్రాలకు రూ.47 వేలకోట్ల నిధులను విడుదల చేశారు.

పచ్చదనం పెంపు కోసం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యాచరణను ప్రారంభించడం ఆశావహ పరిణామం. హరితహారం పేరిట తెలంగాణ వచ్చే అయిదేళ్లలో అటవీ వనాలు, సామాజిక అడవుల కింద 230 కోట్ల మొక్కలు నాటి, సంరక్షించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి రెండు గ్రామాలకు ఒక నర్సరీ చొప్పున ఏర్పాటు చేసి, వివిధ రకాల నీడనిచ్చే మొక్కలతోపాటు, పండ్లు, పూలు, ఔషధ మొక్కలను నాటుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వనం-మనం కార్యక్రమం ద్వారా మొక్కల పెంపకం, వనాల సంరక్షణ కార్యక్రమాలను అమలు చేస్తోంది. 2029 నాటికి భూభాగంలో 50 శాతం అడవుల పెంపకం అనే పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అటవీ శాఖలో ఖాళీ అయిన ఉద్యోగాలను ఏళ్ల తరబడి భర్తీ చేయడంలేదు. తరచూ ఏర్పడే కార్చిచ్చులను అరికట్టలేకపోతుండటం వల్ల భూమిపై ఒండ్రు తగ్గిపోతోంది. వీటి నివారణకు అడవుల్లో కందకాల ఏర్పాటు అవసరం ఉంది. అటవీ భూముల దురాక్రమణ, వృక్షాల నరికివేతలను అడ్డుకోవాలి. మొక్కలు నాటి, సంరక్షించే పాఠశాల, కళాశాల విద్యార్థులకు మార్కులిచ్చే పద్ధతి ప్రవేశపెట్టాలి. నాటిన మొక్కను జియో ట్యాగింగ్‌ చేసి సంరక్షించడం అవసరం. భారీస్థాయిలో ఖాళీగా ఉండిపోతున్న ప్రైవేటు భూముల్లో ఆదాయం సమకూరే వృక్షజాతులతో అడవులను పెంచేవిధంగా సదరు భూమి యాజమానులకు ప్రోత్సాహక నిధులు అందించాల్సిన అవసరం ఉంది.

గుణపాఠం నేర్పుతున్న కార్చిచ్చు
అడవుల విస్తీర్ణం పెంచడం ద్వారా ఉష్ణోగ్రతలను నియంత్రించకపోతే పర్యవసానాలు ఎంత భయంకరంగా ఉంటాయో చెప్పడానికి కొన్ని నెలలుగా ఆస్ట్రేలియాలో బీభత్సం సృష్టిస్తున్న కార్చిచ్చులే నిదర్శనం. కార్చిచ్చుల విజృంభణ ప్రజాజీవితాన్నే కాకుండా, వన్యప్రాణులనూ అతలాకుతలం చేస్తోంది. అక్కడ గడచిన పదేళ్ల వ్యవధిలో సగటు ఉష్ణోగ్రత ఒక డిగ్రీ సెల్సియస్‌ మేర పెరిగింది. గరిష్ఠస్థాయి ఉష్ణోగ్రతలవల్ల ఏళ్ల తరబడి కరవు కాటకాలు సాగుతున్నాయి. నిరుడు సెప్టెంబరులో మొదలైన కార్చిచ్చుల వల్ల ఈ ‘కంగారూల’ దేశం కోలుకోలేని విధంగా దెబ్బతింది. క్వీన్స్‌ల్యాండ్‌, న్యూ సౌత్‌వేల్స్‌ రాష్ట్రాల్లో విధ్వంస తీవ్రత అధికంగా ఉంది. 80 కి.మీ. వేగంతో వీస్తున్న వేడిగాలులు మెల్‌బోర్న్‌, సిడ్నీ సహా ఇతర నగరాలనూ ప్రభావితం చేస్తున్నాయి. ఇప్పటివరకూ కోటీ ఇరవై లక్షల ఎకరాల విస్తీర్ణంలోని అడవులు కాలిపోయినట్లు అంచనా. కనీసం 24 మంది పౌరులు మృత్యువాత పడ్డారు. న్యూ సౌత్‌వేల్స్‌ రాష్ట్రంలోనే 1,300 ఇళ్ళు అగ్నికి ఆహుతయ్యాయి. పరిస్థితిని అదుపు చేయడానికి నౌకా వైమానిక దళాలతో పాటు మూడువేల మంది సైనికులు నిరంతరం శ్రమిస్తున్నారు. 48 కోట్లకు పైగా జంతువులు, పక్షులు మంటల తాకిడికి గురై ఉంటాయని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ‘టెడ్డీ బేర్‌’ను తలపించే ‘కొవాలా’ అనే జంతువులు 30 శాతం వరకు అంతరించి ఉంటాయని సిడ్నీ విశ్వవిద్యాలయ పర్యావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇవి చూడటానికి పాండాల్లా కనిపిస్తాయి. నెమ్మదిగా కదులుతాయి. దీంతో అవి కార్చిచ్చుల బారినుంచి తప్పించుకోలేకపోతున్నాయి. కంగారూలు, వాలబీస్‌, ఒంబట్స్‌ వంటి జంతువులు, పలు రకాల పక్షులు సైతం మంటలకు నేలకొరిగాయి. గాయాలతో బయటపడిన జంతువులు సైతం ఆవాసం, ఆహారం కొరవడి మృత్యువాత పడుతున్నాయి. వందలాది జంతువులు అడవుల సమీపంలోని ఇళ్ళలోకి ప్రవేశిస్తున్నాయి. పర్యావరణంలో చోటుచేసుకున్న విపరీత మార్పులే ఇన్ని అనర్థాలకూ కారణమనేది విస్మరించరాని చేదునిజం. ఈ తరహా వైపరీత్యాల నుంచి అన్ని దేశాలూ గుణపాఠాలు నేర్చుకోవలసి ఉంది.Posted on 06-01-2020