Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ప‌ర్యావ‌ర‌ణం

పర్యావరణంతో ఆటలిక చాలు!

* పచ్చదనంపై ‘సుప్రీం’ ఆదేశాలు

గనుల తవ్వకాలకు చేసుకునే లీజు ఒప్పందాల్లో హరిత నిబంధనల్ని చేర్చాలన్న సుప్రీంకోర్టు ఇటీవలి ఆదేశాలు హర్షణీయం. ఒక సంస్థ గనుల తవ్వకాలు పూర్తయ్యాక, గుంతల్ని పూడ్చి గడ్డి, మొక్కల్ని పెంచడం ద్వారా పచ్చదనాన్ని పునరుద్ధరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో జీవవైవిధ్య పరమైన సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడాల్సి ఉంటుంది.

ఖనిజాల కోసం గనుల తవ్వకం అనాదిగా వస్తున్నదే. ఆఫ్రికాలో 43 వేల సంవత్సరాల క్రితమే తవ్వకాలు సాగినట్లు తెలుస్తోంది. చేతులు, రాతి ఉపకరణాలతో గనుల తవ్వకాల్ని సాగించిన ఆ రోజుల్లో నేలతల్లిని ధ్వంసం చేయలేదు. భారీస్థాయి యంత్రాలు అందుబాటులోకి రావడంతో కొండలు, పర్వతాల లోపలి భాగాలను సైతం రోజుల వ్యవధిలో తవ్వేస్తున్న రోజులివి. సాంకేతికతపరంగా ఎంతో ముందడుగు వేసినా, పర్యావరణం, ఆధ్యాత్మికతల పరంగా ఉదాసీనత ప్రబలుతోంది. అందువల్లే సుప్రీంకోర్టు తాజా ఆదేశం, నేలతల్లికి గాయాల నుంచి సాంత్వన చేకూర్చేలా ఉందన్న అభిప్రాయాన్ని పర్యావరణవేత్తలు వ్యక్తీకరిస్తున్నారు.

బాక్సైట్‌ నుంచి బొగ్గు వరకు, భూగర్భ గనుల నుంచి ఉపరితల గనుల వరకు దేశంలో అనేక రకాల తవ్వకాలు సాగుతున్నాయి. అందువల్ల ప్రతి విభాగానికి ఓ మార్గదర్శక పుస్తకాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది. తవ్వకాల వల్ల విష వ్యర్థాలు భూగర్భంలోకి ప్రవేశించి, జల వనరులను నాశనం చేస్తున్నాయి. మొక్కల మనుగడకు అవసరమయ్యే ఉపరితలం మట్టిపొరలు తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఈ మట్టిని ముందుగా తొలగించి, నిల్వ చేసి, ఖనిజాల తవ్వకం అనంతరం అక్కడకు తెచ్చి పూడ్చాలన్న నిబంధనలు కొన్ని దేశాల్లో విధిగా అమలవుతున్నాయి. సాధారణంగా, పచ్చదనం పునరుద్ధరణకు ఎంతో శ్రమించాలి. గనుల తవ్వకం పూర్తయ్యాక భూమి ఎగుడుదిగుడుగా మారిపోవడమే దానికి కారణం. ఆ భూమిలో జీవ పదార్థమూ నాశనమవుతుంది. మొక్కల ఎదుగుదలకు తోడ్పడే పోషకాలను అక్కడి మట్టి కోల్పోయి, నిస్సారంగా మారుతుంది. నీటి నుంచి పోషకాల్ని గ్రహించే సామర్థ్యాన్ని కోల్పోతుంది. మృత్తికలు భారీ లోహపదార్థాలతో నిండి విషతుల్యమవుతాయి. వీటిలో అత్యధిక స్థాయిలో పీహెచ్‌ నిల్వలు చేరతాయి. దీనివల్ల సూక్ష్మజీవులు నాశనమవుతాయి.

బొగ్గు గనుల విషయంలో లవణీయత, అధికపాళ్లలో సోడియం గాఢత పెచ్చరిల్లడం మరో సమస్య. పచ్చదనాన్ని పెంచే విషయంలో ఇవి అడ్డంకిగా పరిణమిస్తాయి. పచ్చదనం ప్రక్రియ స్థానిక వృక్ష, జంతుజాలాల పునరుద్ధరణకు దోహదపడుతుంది. లేదంటే కలుపు మొక్కలు, వృక్షాలు పెరగవచ్చు. ఎందుకూ పనికిరాని బంజరు భూములుగా మారవచ్చు. ఇలాంటి సమస్యలను పరిహరించడానికి జీవవైవిధ్య నమూనా ఆధారిత పెంపక విధానాలను ప్రోత్సహించేందుకు సుప్రీంకోర్టు సాంకేతిక నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలి. పరిశ్రమ నిపుణులు, శాస్త్రవేత్తలు అందులో ఉండాలి. అన్ని రాష్ట్రాల వృక్షజాలం, జీవవైవిధ్యం, స్థానిక సంప్రదాయాలు, అక్కడి గనుల వివరాలను కమిటీ సేకరించాలి. ఆయా ప్రాంతాల్లోని స్థానిక గిరిజనులకూ కమిటీలో భాగస్వామ్యం కల్పించాలి. గనుల తవ్వకం అనంతరం ఖనిజాలను సేకరించి, ఆపై భూమిని పునరుద్ధరించే విషయంలో వారి అనుభవం ఎంతగానో ఉపకరిస్తుంది. ఆయా ప్రాంతాలతో సంబంధంలేని స్థానికేతర వృక్షజాతులను, ఇతర రకాలను పచ్చదనంలో ఉపయోగించకుండా కమిటీ సాయంతో సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తుంది. పునరుద్ధరణ ప్రక్రియలో పర్యావరణ, జీవవైవిధ్య పరంగా స్పష్టమైన లక్ష్యాలను గనుల కంపెనీలకు నిర్దేశించాల్సి ఉంటుంది. అవి యాభై శాతానికిపైగా సహజసిద్ధమైన జీవవైవిధ్యాన్ని అటవీకరణ, మొక్కల పెంపకం ద్వారా పునరుద్ధరించాల్సి ఉంటుంది. ప్రతిపాదిత నమూనా ప్రకారం అదనంగా పదిశాతం భూమిని స్థానికంగా కనుమరుగయ్యే ప్రమాదం ఎదుర్కొంటున్న వృక్షాల కోసం కేటాయించాలి. పునరుద్ధరణ ప్రక్రియ ప్రాథమిక దశలో స్థానిక గడ్డిజాతి మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయి. గనుల్ని తవ్వే కంపెనీలు స్థానిక ప్రజలకు అడవికి బదులుగా అడవిని పునరుద్ధరించి ఇచ్చినప్పుడే న్యాయం జరుగుతుంది.

నిపుణుల సలహాలతో మొక్కలు నాటితే భూమిలోకి విష పదార్థాలు చేరవు. జంతువులు, పక్షులను దృష్టిలో ఉంచుకొని మొక్కలు నాటాలి. ఆహార, ఔషధ వృక్షాల పెంపుదల వల్ల స్థానిక ప్రజలకూ జీవనోపాధి లభిస్తుంది. తొలిదశలో గడ్డి, చిక్కుళ్ల రకాల్ని పెంచడం వల్ల అడవుల పెంపకానికి బలమైన పునాది పడుతుంది. కుష్‌ తదితర స్థానిక గడ్డి రకాల పెంపకం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కంపెనీలు జీవవైవిధ్య మేనేజర్‌ లేదా సంరక్షణాధికారిని ప్రాజెక్టుకు అనుసంధానంగా నియమించుకోవాల్సి ఉంటుంది. పచ్చదనం పునరుద్ధరణ ప్రక్రియను తృతీయపక్షం ధ్రువీకరించాలి. లక్ష్యాల్ని సాధించని పక్షంలో విధించే జరిమానాలు కఠినంగా ఉండాలి. కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా చేపట్టే కార్యకలాపాల్లో పచ్చదనం పునరుద్ధరణకు నిధులు ఉపయోగించేందుకు అనుమతించాలి.

భూక్షీణత వంటి కీలక సమస్య భారత్‌నే కాకుండా, చాలా దేశాల్లోని ప్రజల్ని వేధిస్తోంది. అనేకమంది జీవనోపాధిని కోల్పోతున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాలను పర్యావరణ పునర్నిర్మాణ విషయంలో తొలి అడుగుగా భావించాలి. సదరు ప్రాంతాలన్నీ పునరుద్ధరణకు నోచుకుంటే, తిరిగి అడవులపై ఆధారపడే అవకాశం వస్తుంది. అందువల్ల జంతువులు, వృక్షాలు, నేలతల్లి విషయంలో బాధ్యతగా మెలగాలి. వనరుల దోపిడి ధోరణిని వీడి, పుడమితల్లికి అవుతున్న గాయాలను మాన్పడానికి సంస్థలు బాధ్యతగా ముందుకు రావాలి. నేలతల్లి సహనాన్ని పరీక్షిస్తే సంభవించే ఉపద్రవానికి ఆస్ట్రేలియాను వణికిస్తున్న తాజా కార్చిచ్చే ఉదాహరణ!

- ఇంద్రశేఖర్‌ సింగ్‌
Posted on 20-01-2020