Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ప‌ర్యావ‌ర‌ణం

కబళిస్తున్న కాలుష్యం

* అటవీ విస్తీర్ణం పెంపే శరణ్యం

‘వారసత్వ వృక్షాల ప్రాముఖ్యం అమూల్యమైనది. జీవితకాలంలో ఓ చెట్టు ఇచ్చే ఆక్సిజన్‌ విలువెంత? అందరూ విస్మరించిన ఆ విలువను లెక్కకట్టాల్సిన సమయం ఆసన్నమైంది’- తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డేతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కోల్‌కతా నగరాభివృద్ధి పనుల్లో భాగంగా చెట్ల తొలగింపు నేపథ్యంలో దాఖలైన వ్యాజ్య విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలివి. ఏవైనా ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాలే తప్ప, ప్రాణవాయువునిచ్చే చెట్లను నరకకూడదని ధర్మాసనం అభిప్రాయం. కానీ, ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ, వ్యవసాయం, అభివృద్ధి పేరుతో చెట్ల నరికివేత, కార్చిచ్చు తదితర కారణాలవల్ల అటవీ సంపద క్షీణిస్తోంది. ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఓ) ప్రతి అయిదేళ్లకు ఒకసారి నిర్వహించే ప్రపంచ అటవీ వనరుల అంచనా(జీఎఫ్‌ఆర్‌ఏ)-2015 ప్రకారం, 1990లో 31.6 శాతంగా ఉన్న ప్రపంచ అడవుల విస్తీర్ణం 2015 నాటికి 30.6 శాతానికి తగ్గడం ఆందోళన కలిగించే విషయం. ఇక గడచిన అయిదేళ్లు చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరాలుగా రికార్డు నెలకొల్పినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) పేర్కొన్న సంగతి తెలిసిందే. అంతేకాదు, మంచు పర్వతాలు కరుగుతూ, సముద్రమట్టాలు పెరుగుతూ, వాటికి ఆనుకుని ఉన్న మహానగరాలు ప్రమాదంలో పడే అవకాశాలున్నాయన్న నివేదికల సారాంశం కలవరపెడుతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఊహించని విధంగా వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయన్న ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ వ్యాఖ్యలు ఆలోచింపజేస్తున్నాయి. ఇలా వివిధ కారణాలతో ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో పేరుకుపోతున్న బొగ్గుపులుసు వాయువును తగ్గించడానికి కర్బన (కార్బన్‌) నిల్వలు పెంచుకోవడం వంటి ప్రత్యామ్నాయాలవల్ల వాతావరణ ప్రభావాల్ని తగ్గించవచ్చనేది నిపుణుల అభిప్రాయం.

లక్ష్యం సుదూరం
ప్రస్తుతం దాదాపు 770 కోట్లున్న ప్రపంచ జనాభా 2050 నాటికి వెయ్యికోట్లకు చేరుకుంటుందని అంచనా. భారత్‌లోని మొత్తం ఆరున్నర లక్షల గ్రామాల్లో- దాదాపు లక్షన్నర పల్లెటూళ్ల ప్రజలు రోజూవారీ అవసరాలకోసం అడవులపైనే ఆధారపడుతున్నారు. జనాభా పెరుగుతూ ఉంటే అందుకు తగ్గట్లు వారి పోషణ, తదితర అవసరాలకోసం అడవులపైనే ఆధారపడతారు. అడవులను నరకకుండా వ్యవసాయాన్ని ఎలా పెంచాలన్నదే మరో ప్రధాన సవాలు. మనదేశంలో కూడా అటవీ సంపద ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. భారతీయ అటవీ సర్వే తాజా నివేదిక ప్రకారం రెండేళ్లలో కేవలం 0.65 శాతం (5,188 చ.కి.మీ) అడవుల విస్తీర్ణం మాత్రమే పెరిగింది. గడచిన దశాబ్ద కాలంలో కేవలం మూడు శాతం అడవులను మాత్రమే అదనంగా పెంచారు. ఇది ఇలాగే కొనసాగితే భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో అటవీ సంపద నిర్దేశిత 33 శాతానికి చేరడానికి మరికొన్ని దశాబ్దాలు పట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరంలేదు.

జీవావరణ వ్యవస్థలో నేలపైన, నేలకింద జీవపదార్థాలు(ఏజీబీ, బీజీబీ), మృత కలప, లిట్టర్‌(చెత్త), నేల సేంద్రియ పదార్థాల్లో కర్బనం నిక్షిప్తమై ఉంటుంది. ఇలా పర్యావరణ వ్యవస్థలో వివిధ స్వరూపాల్లో నిక్షిప్తమై ఉండే కార్బన్‌ మొత్తాన్నే కర్బన నిల్వ(కార్బన్‌ స్టాక్‌)గా వ్యవహరిస్తాము. వాతావరణంలో ఉండే కార్బన్‌లో దాదాపు సగం ఈ అడవులు, వృక్షాలే శోషించుకుంటున్నాయి. దేశంలో కర్బన శోషణ స్వల్పంగా పెరిగిందని తాజాగా విడుదలైన అటవీ నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను విడుదల చేస్తూ 2030నాటికి పారిస్‌ ఒప్పంద లక్ష్యాలను మనదేశం చేరుకోగలదని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ, ప్రస్తుతం భారత్‌లో ఇప్పటివరకూ కర్బన శోషణ పరిమాణం 7,124 మిలియన్‌ టన్నులు. కిందటి అధ్యయనంతో పోలిస్తే (2017లో 7,082 మిలియన్‌ టన్నులు) తాజాగా శోషణ పరిమాణం 42.6 మిలియన్‌ టన్నులకు పెరిగింది. ఈ పరిమాణం దాదాపు 21.3 మిలియన్‌ టన్నుల చొప్పున పెరుగుతోంది. ఈ మాత్రం వేగంతో 2030 నాటికి 250-300 కోట్ల టన్నులకు చేరే బొగ్గు పులుసు వాయువుకు సమానమైన ఉద్గారాలను తగ్గించేందుకు అవసరమైన కర్బన శోషణ వ్యవస్థలను ఏర్పరచుకోవడం మాత్రం కష్టమే. రాష్ట్రాల విషయానికొస్తే అరుణాచల్‌ ప్రదేశ్‌ అత్యధికంగా 1,051.32 మిలియన్‌ టన్నులతో కర్బన శోషణలో అగ్రస్థానంలో ఉండగా, మధ్యప్రదేశ్‌ 588.73 మిలియన్‌ టన్నులు, ఛత్తీస్‌ఘడ్‌ 480.25, మహారాష్ట్ర 440.51, ఒడిశా 432.28 మిలియన్‌ టన్నులతో తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 219 మిలియన్‌ టన్నులు, తెలంగాణలో 151 మిలియన్‌ టన్నులు మాత్రమే ఉన్నాయి.

కర్బన శోషణ పెంచుకోవాల్సిందే...
దట్టమైన అడవులు, అడవుల బయట ఉండే భారీ వృక్షాలు సైతం కర్బనాన్ని ఎక్కువ మొత్తంలో స్వీకరిస్తాయి. జీఎఫ్‌ఆర్‌ఏ ప్రకారం అడవులు సగటున హెక్టారుకు 74 టన్నుల కార్బన్‌ను నిల్వ చేసుకుంటాయని అంచనా. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 200 కోట్ల టన్నులకు సమానమైన బొగ్గు పులుసు వాయువును అడవులు గ్రహిస్తున్నాయి. ఇలా అడవులతో కర్బన శోషణ పరిమాణాన్ని పెంచడంవల్ల హరిత గృహ వాయువుల ప్రభావాన్ని, తద్వారా వాతావరణ మార్పుల ప్రభావాల్ని తగ్గించవచ్చనేది నిపుణుల అభిప్రాయం. ప్రపంచంలో అత్యధిక కర్బన శోషణ కలిగిన దేశాల్లో భారత్‌ ఎనిమిదో స్థానంలో ఉన్నప్పటికీ ఇది మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉంది. రష్యా, బ్రెజిల్‌, అమెరికా, కాంగో, ఇండోనేసియా, కొలంబియా, చైనా మనకన్నా ఎక్కువ స్థాయిలో కర్బన శోషణ కలిగి ఉన్నాయి. కానీ మనదేశంలో అటవీ సంపద ద్వారా కర్బన శోషణను ఆశించిన స్థాయిలో పెంచుకోలేకపోతున్నాం. మొక్కలను నాటడంతో పాటు ప్రజల్లో అవగాహన కలిగించేందుకు చైనా ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ‘జాతీయ వృక్ష దినోత్సవం’ (ఆర్బర్‌ డే) నిర్వహిస్తోంది. ఆస్ట్రేలియా, బెల్జియం, బ్రెజిల్‌, కాంబోడియా, కెనడాల్లో ఏటా ‘వృక్ష దినోత్సవం’ నిర్వహిస్తూ మొక్కల పెంపకం, పర్యావరణంపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాయి. మనదేశంలో సైతం ఇలాంటి కార్యక్రమాలు చేబడుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో భారీయెత్తున మొక్కలు నాటే ప్రయత్నం కొనసాగుతోంది. ఇలా ప్రతి రాష్ట్రం లక్ష్యాలను నిర్దేశించుకొని ప్రజలు, విద్యార్థులు, స్వచ్ఛందసంస్థల భాగస్వామ్యంతో భారీస్థాయిలో చెట్లను పెంచే కార్యక్రమాలు రూపొందించుకోవాలి. నిరుపయోగ భూములు, సాగుచేయని స్థలాలు, జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట భారీస్థాయిలో చెట్లను పెంచుతూ అవి పెరిగేవరకూ పరిరక్షించుకోవాలి. సాగుభూమి పెంచడం ద్వారా సైతం కర్బన శోషణను గణనీయంగా పెంచుకోవచ్చునన్నది నిపుణుల సూచన. భారత అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడినట్టుగా.. ప్రతిచెట్టు విడుదల చేసే ఆక్సిజన్‌ విలువను కొలమానంలోకి తీసుకొని వాటి నరికివేతను నియంత్రించడంపై శ్రద్ధ పెట్టాలి. ఈ రకంగా సృజనాత్మక పద్ధతుల్లో వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గిస్తూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతపై పౌరసమాజంపై ఉంది.

- అనిల్‌కుమార్‌ లోడి
Posted on 21-01-2020