Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ప‌ర్యావ‌ర‌ణం

భూమాతకు జ్వరం!

భూతాపం పెచ్చరిల్లి, వాతావరణంలో పెనుమార్పులు దాపురించి, దేశదేశాల్లో ప్రాణాంతక ఉత్పాతాలు సంభవిస్తున్నాయి. మానవాళి నెత్తిన కత్తిలా వేలాడుతున్న భీకర ముప్పు తీవ్రతను, సంక్షోభ మూలాలను ఇప్పటికీ గుర్తించ నిరాకరిస్తున్న అమెరికా అధ్యక్షులు ప్రపంచ ఆర్థిక వేదిక (దావోస్‌) సదస్సులోనూ కనబరచిన పెడధోరణి, డొనాల్డ్‌ ట్రంప్‌ విడ్డూర వ్యవహారశైలికి అద్దంపడుతోంది. పర్యావరణ అనర్థాలపై భయాందోళనల్ని ఏమాత్రం పసలేనివిగా కొట్టిపారేసిన ట్రంప్‌, ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఈఎఫ్‌) ప్రతిపాదించిన లక్షకోట్ల మొక్కల యోజనకు బాసటగా నిలుస్తామంటున్నారు. యువ పర్యావరణవేత్త గ్రెటా థున్‌బర్గ్‌ సూటిగా స్పందించినట్లు- వాతావరణ మార్పులకు సంబంధించి అమెరికా సహా ప్రపంచ దేశాలు చేయాల్సింది మరెంతో ఉంది! ‘మా తరాన్ని మీరు ఏం చేయబోతున్నా’రంటూ నేతాగణం నిష్పూచీతనాన్ని నిగ్గదీసే చొరవ పాఠశాల స్థాయి పిల్లల్లోనే వ్యక్తమవుతున్నా- సంపన్న దేశాలు పోచికోలు కబుర్లతో పొద్దుపుచ్చుతుండటం దురదృష్టకరం. పుడమిని పరిరక్షించుకునే సమష్టి బాధ్యతను సక్రమంగా పట్టాలకు ఎక్కించడంలో తమవంతుగా చేయాల్సిందేమీ లేదన్న అలసత్వానికి మారుపేరుగా అమెరికా పరువుమాస్తోంది. లోగడ క్యోటో ప్రొటోకాల్‌ను అగ్రరాజ్యం నిష్కర్షగా కాలదన్నింది. ఒబామా అధ్యక్షుడిగా ప్యారిస్‌ ఒడంబడికపై వాషింగ్టన్‌ సంతకం చేసినా, శ్వేతసౌధాధిపత్యం దఖలుపడ్డాక ఆ ఒప్పందం అమలు బాధ్యతను ట్రంప్‌ గాలికొదిలేశారు. యావత్‌ ప్రపంచాన్నీ సంక్షోభ సుడిగుండంలోకి నెట్టేసే ఆ విపరీత నిర్ణయం పట్ల దేశ విదేశాల్లో ఘాటునిరసనలు వ్యక్తమైన తరవాతా ట్రంప్‌ తీరు మారలేదు. తలసరి చెట్ల నిష్పత్తిలో కెనడా, రష్యా, బ్రెజిల్‌ కన్నా ఎంతో వెనకబడి ఉన్న అమెరికా, డబ్ల్యూఈఎఫ్‌ సరికొత్త ప్రతిపాదనను నెగ్గించడానికి తమవంతుగా సహకరిస్తామని ప్రకటించడం- వట్టి కంటితుడుపు.

స్వతహాగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పోనుపోను మృత్యుపాశావరణంగా మార్చేస్తున్న అవాంఛనీయ చర్యలేమిటి? ప్రగతి ప్రణాళికలు, పారిశ్రామికీకరణల పేరిట దేశదేశాలు యథేచ్ఛగా బొగ్గు, పెట్రోలియం, సహజవాయువుల్ని మండిస్తున్న కారణంగా- వాతావరణంలో కర్బన ఉద్గారాల పరిమాణం ఇంతలంతలవుతోంది. తద్వారా ఉష్ణోగ్రతలు పెరిగి జల కాలుష్యం, అంటురోగాలు, ఆహార సంక్షోభంతోపాటు అనూహ్య విపత్తులూ వాటిల్లుతున్నాయి. కర్బన ఉద్గారాల్లో తొలి రెండు స్థానాల్లో ఉన్న చైనా, అమెరికాల వాటా దాదాపు 40శాతం. వాటితో పోలిస్తే భారత్‌ విడుదల చేస్తున్న రాశి (4.5శాతం) స్వల్పమే అయినా స్వీయ బాధ్యతల నిర్వహణకు మన దేశం ఎన్నడూ వెనకడుగు వేసింది లేదు. గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదలలో ముందున్న దేశాలు భూతాప కట్టడి ప్రణాళిక అమలుకు చురుగ్గా కూడి రాకపోవడం ధరణీతలాన్ని అక్షరాలా భగ్గుమనిపిస్తోంది! నిన్నకాక మొన్న వెలుగు చూసిన అధ్యయన నివేదిక, ప్రపంచ దేశాలు ఏటా 10వేల కోట్ల టన్నులకు పైబడి ప్రకృతి వనరుల్ని కరిగించేస్తున్నాయని మదింపు వేసింది. ఇంకో మూడు దశాబ్దాల్లో ఆ సంఖ్య 17000-18400 కోట్ల టన్నులకు విస్తరించనుందంటున్న అధ్యయనం, వర్ధమాన దేశాల్లో కన్నా సంపన్న రాజ్యాల్లో పదింతలకుపైగా తలసరి వినియోగం నమోదవుతున్నట్లు నిగ్గుతేల్చింది. ఒకసారి విడుదలైన బొగ్గుపులుసు వాయువు, నైట్రస్‌ ఆక్సైడ్‌ వంటివి సుమారు వందేళ్లపాటు వాతావరణ విధ్వంసం కొనసాగిస్తూనే ఉంటాయి. వాటిని విచ్చలవిడిగా ఉత్పత్తి చేయడంలో ముందున్న చైనా, అమెరికా, ఈయూ దేశాలు స్వీయ నియంత్రణ లక్ష్యాల అమలులోనూ బాధ్యతాయుతంగా వ్యవహరించడం పర్యావరణహితకరమవుతుంది. జరుగుతున్నది వేరు. రెండు నెలలక్రితం ప్యారిస్‌ ఒప్పందంనుంచి అధికారికంగా నిష్క్రమించిన అమెరికా- వాతావరణంలో అనర్థక మార్పుల్ని అభూతకల్పనగా కొట్టిపారేయడం పర్యావరణహితైషుల్ని కుపితుల్ని చేస్తోంది!

ఎవరు అవునన్నా కాదన్నా, యథార్థాలకు ఎంతగా మసిపూసి మారేడు చేసినా- భూతాపంలో పెరుగుదల తాలూకు విధ్వంసక సామర్థ్య తీవ్రతను ఉపేక్షించలేరు. సహారా ఎడారిపై మంచు దుప్పటి, అమెరికాలో మైనస్‌ నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు, ప్రపంచం నలుమూలలా దుస్సహ స్థాయిలో వరదలు, తుపానులు, కరవు కాటకాలు, గతి తప్పుతున్న రుతువులు... భూతాపంలో వృద్ధివల్ల చోటు చేసుకుంటున్నవే. వేడిమికి మంచు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతుండటం లోతట్టు ప్రాంతాలు, చిన్నపాటి ద్వీపాల్లో నివసిస్తున్న కోట్లమందికి భారీ ప్రమాద సూచికే. మరెన్నో చోట్ల దావానలాలు సంభవిస్తాయనీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గత ఏడాదిలోనే దక్షిణాఫ్రికానుంచి ఉత్తర అమెరికా వరకు, ఆస్ట్రేలియా ఆసియా ఐరోపాల్లోనూ పదిహేను భయానక ప్రకృతి ఉత్పాతాలకు వాతావరణ మార్పులే పుణ్యం కట్టుకున్నాయి. క్యాలిఫోర్నియా, ఆస్ట్రేలియా అడవుల్లాగా అంత తేలిగ్గా నిప్పంటుకోని అమెజాన్‌ వర్షారణ్యాలూ పెద్దయెత్తున తగలబడిపోవడం గమనించాకనైనా పెద్ద దేశాలు బుద్ధి తెచ్చుకోవాలి. ఒక్క ఆస్ట్రేలియా కార్చిచ్చే వంద కోట్లకుపైగా మూగ జీవాల్ని బలిగొందన్న అంచనా నిశ్చేష్టపరుస్తోంది. భూతాపంలో పెరుగుదలను సమర్థంగా నియంత్రించలేకపోతే మున్ముందు అరటి, కాఫీ, వేరుశనగ, ఆలుగడ్డలవంటి రకాలెన్నో కనుమరుగైపోతాయని, మరెన్నో పంట దిగుబడులు గణనీయంగా తెగ్గోసుకుపోతాయన్న విశ్లేషణలు, భావి తరాలపై దారుణ దుష్ప్రభావాలు తప్పవన్న లాన్సెట్‌ నివేదికాంశాలు... ప్రపంచం ఎంతటి దుస్థితిలో కూరుకుపోతున్నదో స్పష్టీకరిస్తున్నాయి. ఇంతటి విపత్కర దశలోనూ మాడ్రిడ్‌ (స్వీడన్‌)లో ఇటీవలి ‘కాప్‌ 25’ విశ్వ సదస్సు ఎటువంటి కీలక నిర్ణయం ముడివడకుండానే చాపచుట్టేసింది. ఇకనైనా సంపన్న రాజ్యాల్లో ప్రాప్తకాలజ్ఞత రహించి ఉమ్మడి కార్యాచరణ రూపేణా నిర్ణాయక ముందడుగు నమోదైతేనే, మానవాళి భవిత ఎంతో కొంత తెరిపిన పడుతుంది!

Posted on 24-01-2020