Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ప‌ర్యావ‌ర‌ణం

ముంచుకొచ్చిన మహోపద్రవం

* అధికమవుతున్న భూ ఉష్ణోగ్రతలు
* వాతావరణంలో విపరీత మార్పులు

వాతావరణంలో బొగ్గు పులుసు వాయువు (కార్బన్‌డయాక్సైడ్‌) మొన్న మే 11నాడు మొదటిసారి 415 పీపీఎం (పది లక్షల్లో కణాల సంఖ్య) దాటింది. 30 లక్షల సంవత్సరాల్లో ఎన్నడూ నమోదుకాని ప్రమాదకర స్థాయి ఇది. 1900లో 300 పీపీఎం నమోదైన తరవాత 2016నాటికి కాని 400 పీపీఎం స్థాయి నమోదు కాలేదు. కానీ, కేవలం మూడేళ్ల వ్యవధిలోనే ఏకంగా 15 పీపీఎంలు అదనంగా చేరడం మానవాళికి ముంచుకొస్తున్న ముప్పునకు నిదర్శనం. జీవులు సహజ వాతావరణంలో మనగలగడానికి బొగ్గు పులుసు వాయువు 350 పీపీఎం దాటరాదు. మరోవైపు వాతావరణం క్రమం తప్పుతోంది. వర్షకాలంలోనూ వేసవి మాదిరే ఎండలు ఉంటున్నాయి. సరైన వానలే లేవు. వర్షాభావంతో తెలుగు రాష్ట్రాలు సతమతమవుతుంటే, ముంబయి నగరాన్ని వరదలు ముంచెత్తాయి. బిహార్‌, అసోమ్‌ రాష్ట్రాలూ వరదల బారినపడ్డాయి. ఇదే సమయంలో అమెరికా, ఐరోపా దేశాల్లో రికార్డు స్థాయిలో వేసవి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జూన్‌ 2019ని అధికారికంగా ‘అత్యంత వేడైన జూన్‌ నెల’గా ప్రకటించారు. ఈ పరిణామాలన్నీ అతి వాతావరణ (ఎక్స్‌ట్రీం వెదర్‌) సంక్షోభాలకు ప్రమాద ఘంటికలు.

పట్టని శాస్త్రవేత్తల హెచ్చరికలు
కర్బన ఉద్గారాలకు హరితగృహవాయు లక్షణాలు ఉన్నాయని 160 ఏళ్ల క్రితమే జాన్‌ టిండాల్‌ అనే శాస్త్రవేత్త ప్రయోగపూర్వకంగా నిరూపించారు. 1896లో స్పాంటే అర్హీనియస్‌ అనే స్వీడిష్‌ శాస్త్రవేత్త లెక్కలువేసి గాలిలో కర్బనం రెట్టింపు అయితే భూ ఉష్ణోగ్రతలు 1.5 నుంచి నాలుగు డిగ్రీల మధ్య పెరుగుతాయని హెచ్చరించారు. గాలిలో కర్బనాన్ని విశ్లేషించడం 1958లో మొదలైంది. 1965నాటికి గాలిలో కర్బన మోతాదు సమాచారం సమకూరింది. దాని ఆధారంగానే శాస్త్రవేత్తలు అమెరికా అధ్యక్షుడికి నివేదిక సమర్పించారు. ‘50 కోట్ల సంవత్సరాలుగా భూగర్భంలో పోగుపడిన శిలాజ ఇంధనాలను పారిశ్రామిక అవసరాలు, నాగరికత కోసమంటూ మానవాళి వేగంగా వెలికితీస్తోంది. శిలాజ ఇంధన వాడకం వల్ల 2000 సంవత్సరం నాటికి గాలిలో బొగ్గుపులుసు వాయువు 25 శాతం మేర పెచ్చరిల్లుతుంది. ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులకు ఇది కారణమవుతుంది. అప్పుడు జరగబోయే మార్పులను పరిమాణాత్మకంగా ముందస్తుగా అంచనా వేయడం కుదరదు. వాతావరణ గణిత నమూనాల్లో పురోగతితో, పెద్ద కంప్యూటర్ల సహాయంతో రెండు, మూడేళ్లలో ముందస్తు అంచనాలు సాధ్యం కావచ్చు’ అని అప్పటి నివేదికలోనే అధ్యక్షుడి శాస్త్ర సలహాదారులు స్పష్టీకరించారు. మొదటగా బొగ్గు పులుసు వాయువు గాఢత‌ను కొలవాల్సిన అవసరాన్ని గుర్తించి వారు మౌనాలోవాలో పరిశోధనశాల నిర్మించారు. గాలి నమూనాలు నిత్యం సేకరించి గాఢత సమాచారాన్ని రోజర్‌ రెవిల్‌, ఛార్లెస్‌ డేవిడ్‌ కీలింగ్‌ అనే శాస్త్రవేత్తలు నమోదు చేయడం ప్రారంభించారు. 1988లో జేమ్స్‌ హాన్సెన్‌ అమెరికా కాంగ్రెస్‌కు వాస్తవ పరిస్థితిని వివరిస్తూ భూతాపం మొదలైందని ప్రమాద ఘంటిక మోగించారు. నివారణ చర్యలు వెంటనే చేపట్టాలనీ హితవు పలికారు. అయినా కర్బన ఉద్గారాలు పెరుగుతూనే వచ్చాయి. ఇప్పుడు గాలిలో వున్న బొగ్గుపులుసు వాయువులో 50 శాతంపైగా ఆయన హెచ్చరిక తరవాత వెల్లువెత్తినదే! గాలిలో కర్బన ప్రభావం గురించి శాస్త్రవేత్తల హెచ్చరికలను పెడచెవిన పెట్టినందువల్ల ఎదురవుతున్న దుష్పరిణామాలను ప్రపంచ మానవాళి ఇప్పుడు ఎదుర్కొంటోంది. సాధారణ వాతావరణం కనుమరుగై ‘అతి వాతావరణ’ సంక్షోభ స్థితి ఇప్పుడు ప్రపంచానికి పెను సవాలు విసరుతోంది. 2034 నాటికి చెన్నై, ముంబయి లాంటి తీరనగరాల్లో సాధారణ వాతావరణం కనుమరుగై ముందెన్నడూ ఎరుగని వాతావరణం వచ్చేస్తుందని కామిలో మోర బృందం పరిశోధనలు చెబుతున్నాయి. భూమి మొత్తంగా వేడెక్కుతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలూ పెరుగుతున్నాయి. 2019 జులై 25 నాటికి ముందు 365 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కొలుస్తున్న రోజువారీ ఉష్ణోగ్రతలను పరిశీలించి అమెరికా ప్రభుత్వ సంస్థ ఎన్‌ఓఏఏ తయారు చేసిన పట్టిక ప్రకారం 35,847 కొత్త గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డులు నమోదయ్యాయి. 2017లో 10,632 కనిష్ఠ ఉష్ణోగ్రతల రికార్డులు చెరిగిపోయాయి. అదే సంవత్సరం 36,305 గరిష్ఠ ఉష్ణోగ్రతల రికార్డులూ బద్దలయ్యాయి. ఉష్ణోగ్రతల సమాచారాన్ని పరిశీలించిన సంస్థలు కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డుల సంఖ్య తగ్గుతూ వస్తోందని, గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డుల సంఖ్య పెరుగుతోందని తెలిపాయి. రెండు వేల సంవత్సరాల్లో ఎన్నడూలేని విధంగా భూమి వేగంగా వేడెక్కుతున్న విషయాన్ని రాఫెల్‌ నియుకామ్‌ బృందం ఇటీవలే మానవాళి ముందు ఆవిష్కరించింది. కొలమానం లేని కాలంనాటి సమాచారాన్ని చెట్ల కాండ వలయాలు, సరస్సుల అడుగున బురదలో చిక్కిన పుప్పొడి, గుహల నుంచి సేకరించిన నమూనాల ద్వారా అధ్యయనం చేశారు. దీన్ని ‘ప్రాక్సీ డాటా’ అంటారు. మానవాళి విచ్చలవిడిగా విడుదల చేస్తున్న కర్బన ఉద్గారాలే భూతాపం పెచ్చరిల్లడానికి కారణమన్నది నిర్వివాదం. ఉద్గారాలను నియంత్రించకుండా ఇప్పటి ఉష్ణోగ్రతలను, అతి వాతావరణాన్ని సహజస్థాయికి మార్చలేం. వాతావరణ మార్పులకు మనిషి ఎంచుకున్న అభివృద్ధి విధానాలే కారణమని శాస్త్రవేత్తలు కుండ బద్దలుకొట్టి చెబుతున్నా, పారిశ్రామిక శక్తులు, వారి కనుసన్నల్లో నడిచే ప్రభుత్వాలు- వాతావరణ మార్పులు సహజమేనని, అవి తిరిగి మామూలు స్థితికి వస్తాయంటూ విడ్డూర వాదనలు వినిపిస్తున్నాయి!

వాతావరణ మార్పుల వల్ల అతివృష్టి ఉదంతాలు మనదేశంలో తరచూ నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా విస్తార వానలు కురవడం అరుదవుతోంది. కొన్నిచోట్ల అతివృష్టి నమోదవుతున్న ఘటనలు కొన్నేళ్లలో మూడురెట్లు పెరిగాయని గణాంకాలు చాటుతున్నాయి. వరద ఘటనలు మాత్రం అదేస్థాయిలో ఉండటం లేదు. ఆయా ప్రాంతాల భౌతిక, పరివాహక స్థితిగతులు, ఆయకట్టు విస్తీర్ణం, చెట్టుచేమలను బట్టి వర్షపు నీరు ఎంతగా వరదగా మారుతుందో నిర్ణయమవుతుంది. అందువల్ల అతివృష్టి ఒక్కటే వరదల రాకను, స్థాయిని నిర్ణయించదు. మధ్య భారతంలో అతివృష్టి సంఘటనలు మూడు రెట్లు అధికమైనా, 1950-2015 మధ్య జూన్‌-సెప్టెంబరు కాలంలో సగటున వర్షపాతం 10శాతం తగ్గింది. కొన్నిచోట్ల అది 20-30 శాతంగా ఉంది. రోజులో 150 మీమీ కంటే ఎక్కువ వర్షపాతం ఉన్న ఘటనలు 75శాతం పెరిగాయి. వరదల వల్ల ప్రపంచం ఏటా మూడు వేలకోట్ల డాలర్లు నష్టపోతుంటే, అందులో భారత్‌ వాటా పది శాతం (300 కోట్ల డాలర్లు)గా ఉంది.

పేదలే ప్రధాన బాధితులు
దిల్లీలోని ‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ అధ్యయనాలు సైతం వాతావరణ మార్పు ప్రభావం దేశంలో అధికంగా ఉన్న చేదు వాస్తవాలను ఆవిష్కరిస్తున్నాయి. 1901-2017 మధ్యకాలంలో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలించి ఫలితాలను ఆ సంస్థ ప్రకటించింది. 2000 సంవత్సరంనాటితో పోలిస్తే ప్రస్తుతం 1.2 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు దేశ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వైనాన్ని తాజా గణాంకాలు చాటుతున్నాయి. వర్షకాలం మినహాయించి మిగిలిన తొమ్మిది నెలల్లో ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలు అధికంగా ఉంటున్నాయి. శీతకాల ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు అధికమయ్యాయి. 2016-17 శీతకాలంలో ఉష్ణోగ్రత పెరుగుదల 2.95 డిగ్రీలుగా ఉంది. దేశంలో వాతావరణ మార్పు ప్రభావం తీవ్రతను ఈ ఉష్ణోగ్రతల పెరుగుదల స్పష్టీకరిస్తోంది. కానీ, ముంచుకొస్తున్న ముప్పును దేశ పాలకులు, ప్రజలు గుర్తించకపోవడమే అసలైన విషాదం. అందువల్లే ఇంధన వాడుకలో బొగ్గు, చమురుకు ప్రాధాన్యం తగ్గించలేకపోతున్నాం. కొంతకాలంగా ప్రత్యామ్నాయాలు వెలుగులోకి వస్తున్నాయి. పర్యావరణ అనుమతులకు దారులు సుగమం అవుతున్నాయి. వాతావరణ విచ్ఛిత్తితో ముందస్తు ప్రధాన బాధితులు పేదలే ఉంటారు. వాతావరణ కాలుష్యాలకు ఎలాంటి బాధ్యత లేనివారిని బలిపెట్టే విధానాలకు పాలకులు స్వస్తి పలకాలి.

పారిస్‌ ఒప్పందం ప్రకారం 2020 నాటికి కర్బన ఉద్గారాలు తగ్గుముఖం పట్టాలి. అందుకు కేవలం 17 నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈలోపు తీసుకోబోయే చర్యలే భావి తరాల భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ సెప్టెంబరులో నిర్వహిస్తున్న సమావేశానికి, ఇంతకుముందు పారిస్‌ ఒప్పందంలో భాగంగా దేశాలు సమర్పించిన కర్బన ఉద్గారాల ప్రణాళికలను మెరుగ్గా అమలు చేయగలిగినవారు మాత్రమే హాజరు కావాలని షరతు పెట్టారు. ఈ సమావేశానికి ఎన్ని దేశాలు హాజరవుతాయి, ఎంతమేర ఉద్గారాలు తగ్గించడానికి దేశాలు అంగీకరిస్తాయనే విషయంపైనే మానవజాతి భవిత ఆధారపడి ఉంటుంది. డిసెంబరులో శాంటియాగో(చిలీ)లో జరిగే కాప్‌-25; 2020లో యూకేలో నిర్వహించే కాప్‌-26 సమావేశాలు మానవాళి మనుగడకు ఎంతో కీలకమైనవి. వాతావరణ మార్పులను దీటుగా ఎదుర్కొనేలా ప్రపంచ దేశాల పాలకులు నిర్ణయాలు తీసుకోవాలి. వారిపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలు కదం తొక్కాలి. ప్రపంచ సమాజం చైతన్యం కాగలిగితేనే రేపటి తరాలకు భవిష్యత్తు ఉంటుంది. లేదంటే నేటి తప్పిదాలకు భావితరాలు బలైపోతాయన్నది నిష్ఠుర సత్యం. భూమి మృతగ్రహంగా మారకముందే ప్రపంచ మానవాళి మేలుకోవాలి!డాక్టర్‌ కలపాల బాబూరావు
(రచయిత- పర్యావరణ రంగ నిపుణులు)
Posted on 29-07-2019