Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ప‌ర్యావ‌ర‌ణం

అవినీతి కాలుష్యం

కాలుష్య నియంత్రణలో కొన్నేళ్లుగా యంత్రాంగం కనబరుస్తున్న నిర్లక్ష్య ధోరణుల్ని తప్పుపట్టిన తెలంగాణ ఉన్నత న్యాయస్థానం- చట్టాల అమలును పట్టించుకోకుండా విధినిర్వహణలో విఫలమవుతున్నారంటూ అధికారుల్ని బోనెక్కించింది. 2012 సంవత్సరంలోనే నోటీసులు జారీ అయినా, గాడి తప్పిన పరిశ్రమలపై ఇంతకాలం ఎటువంటి చర్యలూ చేపట్టకపోవడంపట్ల హైకోర్టు ధర్మాగ్రహంలో- ఆవేదన ప్రస్ఫుటమవుతోంది. గాలి, నేల, నీరు విషకలుషితమై- క్యాన్సర్‌, ఆస్త్మా కేసులు పెచ్చరిల్లడం చూస్తున్నాం. ప్రజారోగ్యాన్ని బలిపీఠంపైకి నెట్టుకుపోతున్న ఆందోళనకారక అంశాలేమిటో కళ్లకు కట్టిన హైకోర్టు, కాటేదాన్‌ పరిసరాల్లో 198 కాలుష్య యూనిట్ల సంగతేమిటని జీహెచ్‌ఎమ్‌సీ కమిషనర్ని సూటిగా నిగ్గదీసింది. ఆ కాలుష్య పరిశ్రమల్ని ఆరునెలల్లో మూసివేయాల్సిందిగా 2017లో లోకాయుక్త జారీ చేసిన ఆదేశాలు దస్త్రాలకే పరిమితమయ్యాయి. కాలుష్య పరిశ్రమల సంఖ్య 345కు చేరిందన్న సమాచారం ప్రాతిపదికన వాటికి విద్యుత్‌ సరఫరా నిలిపేసి, అక్కడినుంచి ఖాళీ చేయించాలన్న తాజా ఆదేశాలు- మునుపటి ‘సుప్రీం’ నిర్దేశాల్ని స్ఫురణకు తెస్తున్నాయి. దేశవ్యాప్తంగా మూడు నెలల గడువులో జలవనరుల్ని, భూగర్భజలాల్ని కలుషితం కానివ్వకుండా వ్యర్థాల శుద్ధికేంద్రాలను ఏర్పాటుచేయని పరిశ్రమలకు కరెంటు కోత పెట్టాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం 2017 ఫిబ్రవరిలో పిలుపిచ్చింది. నాటిలాగే వాస్తవిక కార్యాచరణ కొల్లబోకుండా యంత్రాంగం ఇప్పుడైనా దీటుగా స్పందిస్తుందేమో చూడాలి! సమాచారహక్కు చట్ట నిబంధనలకింద రెండునెలలక్రితం వెల్లడైన వివరాల ప్రకారం- బాహ్యవలయ రహదారి (ఓఆర్‌ఆర్‌) వెలుపలికి తరలించాల్సినవిగా గుర్తించిన పరిశ్రమలు 1545; అందులో ఇప్పటికీ 1160 నిక్షేపంగా కాలుష్యం ఎగజిమ్ముతూ కొనసాగుతున్నాయి. వాటన్నింటి మాటేమిటి?

జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) సూచనల మేరకు రాష్ట్రాలవారీగా కాలుష్య నియంత్రణ మండళ్ల పనితీరును మదింపు వేసి సీపీసీబీ (కేంద్ర కాలుష్య మండలి) ఏడాది క్రితం ర్యాంకులు ప్రకటించింది. అప్పట్లో మహారాష్ట్ర తరవాత రెండో స్థానాన నిలిచిన తెలంగాణ కాలుష్య మండలిని ఇప్పుడు హైకోర్టు తూర్పారపట్టిన నేపథ్యంలో- తక్కినవాటి ‘కార్యకుశలత’పైనా సహజంగానే శంకలెన్నో రేకెత్తుతున్నాయి. పారిశ్రామిక అవసరాలకు వినియోగించిన నీటిని శుద్ధి చేయకుండా విచ్చలవిడిగా వదిలేయడంవల్ల ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు- దేశవ్యాప్తంగా నదులు, ప్రధాన జలాశయాలతోపాటు కాలువలు, కుంటలు, చెరువులెన్నో మురికి కూపాలైపోతున్నాయి. దేశంలో దశాబ్దాల క్రితమే కాలుష్య నియంత్రణ వ్యవస్థ కొలువుతీరినా ఒరిగిందేముందని కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ నివేదికే ఈసడించింది. నదులు, సరస్సులు, వాతావరణం కాలుష్యం బారిన పడకుండా ఎప్పటికప్పుడు పకడ్బందీ చర్యలు చేపట్టాల్సిన యంత్రాంగం పనితీరు పరమ లోపభూయిష్ఠంగా ఉందని ‘కాగ్‌’ లోగడే హెచ్చరించింది. అవి దిద్దుబాట పట్టని కారణంగా వాటిల్లిన దుష్పరిణామాల తీవ్రతకు వివిధ అధ్యయనాలు అద్దం పడుతున్నాయి. నదుల్లో జలాలు గరళాన్ని తలపిస్తున్నాయన్నా, ఆస్పత్రులూ కర్మాగారాల మురుగు నేరుగా జలవనరుల జీవలక్షణాన్ని హరించివేస్తున్నదన్నా- ఆ అవకతవకలకు, సర్వానర్థాలకు పుణ్యం కట్టుకుంటోంది కాలుష్య నియంత్రణ మండళ్లే. పీసీబీ ప్రాంతీయ కార్యాలయాల్లో ఆర్వో (ప్రాంతీయాధికారి)గా కుదురుకోవడానికి లక్షల్లో లంచాల మేతకు పోటాపోటీ- అవెంతటి సులభార్జన కేంద్రాలుగా వర్ధిల్లుతున్నాయో చాటుతోంది. పీసీబీల్లో పొంగులు వారుతున్న అవినీతి మురుగు బాగోతాలను ఉపేక్షించినన్నాళ్లు కాలుష్యం కథ, అసంఖ్యాక బాధితుల వ్యధ చెక్కుచెదరవు. సమస్యల మూలాలు అక్కడే ఉన్నాయి. మరమ్మతూ అక్కడినుంచే మొదలు కావాలి!

ఉత్పత్తి స్థానంలోనే కాలుష్యాన్ని నివారించడం, కశ్మల తీవ్రతను కట్టడిచేసే నవీన సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, జనచైతన్యం పెంపొందించడం, కాలుష్యం కాటుకు గురైన ప్రాంతాల్లో వాతావరణాన్ని తేటపరచే కృషి- ఇవన్నీ సీపీసీబీ నిర్దేశించుకున్న లక్ష్యాలు. పలు చట్ట నిబంధనల కింద క్షేత్రస్థాయి స్థితిగతుల్ని మదింపువేసి ఏటేటా కూలంకష నివేదికల సమర్పణ పీసీబీల విధుల్లో ఒకటి. అవన్నీ యథాతథంగా అమలుకు నోచుకుంటే- నేడింతటి దుస్థితి దాపురించేదా? కాలుష్య నియంత్రణ మండలి ఓ పనికిమాలిన విభాగమని రాష్ట్ర హైకోర్టే గతంలో పడతిట్టిపోసింది. ఇన్నేళ్లయినా పనితీరు ఏమంత మెరుగుపడని కారణంగానే- ‘పీసీబీ నిద్రపోతోందా?’ అని తాజాగా మరోసారి తలంటించుకోవాల్సి వచ్చింది. కోర్టులు ములుగర్రతో పొడిచినా, గట్టిగా అదిలించినా దారికిరాని కాలుష్య నియంత్రణ మండళ్ల స్తబ్ధత, దేశానికి పెను ప్రమాద సంకేతం. భిన్న పరిశ్రమల ద్వారా వెలువడే కాలుష్య ప్రమాణాల్ని నిర్ధారించి, మోదీ ప్రభుత్వం సరికొత్త సూచీ ఆవిష్కరించి నాలుగేళ్లయింది. దాని ప్రకారం అత్యంత, మధ్య తరహా కాలుష్య కారకాలుగా నిర్ధారించినవన్నీ వ్యర్థాల శుద్ధికి సత్వర ఏర్పాట్లు చేసేలా విధివిధానాల్ని ఇకనైనా పరిపుష్టీకరించాలి. అవినీతి హెచ్చి, అక్రమాలతో పుచ్చిన కాలుష్య నియంత్రణ మండళ్ల సమూల ప్రక్షాళన తక్షణావసరం. పర్యావరణ నిపుణులు, నిజాయతీపరులు, కర్తవ్య నిష్ఠాగరిష్ఠులకు పీసీబీలు, సీపీసీబీలో ప్రాధాన్యం కల్పించి- వాయు నాణ్యతకు, నీటి పరిశుభ్రతకు, వ్యర్థాల నిర్వహణకు వాటిని జవాబుదారీ చేయాలి. దేశంలో ఎక్కడ కాలుష్యం కోరసాచినా, సంబంధిత నియంత్రణ మండలే బాధ్యత వహించేలా కంతలు పూడ్చి, నట్లు బిగించినప్పుడే- ప్రజారోగ్యం తెరిపిన పడుతుంది!

Posted on 13-03-2020