Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ప‌ర్యావ‌ర‌ణం

స్వచ్ఛరవాణాపై తొందరపాటు

గతంలో బొగ్గుతో నడిచే రైళ్లను ధూమశకటాలుగా వ్యవహరించేవారు. ఆ రోజులు పోతేనేం- శిలాజ ఇంధనాలతో నడిచే దాదాపు పాతిక కోట్ల వాహనాలు విషధూమ శకటాలై దేశవ్యాప్తంగా వాయుకాలుష్య తీవ్రత పెంచి ప్రజారోగ్యానికి చేస్తున్న చెరుపు ఇంతా అంతా కాదు. ప్రమాదకర కర్బన ఉద్గారాల్లో రోడ్డురవాణా రంగమే రెండో స్థానంలో ఉన్న నేపథ్యంలో- స్వచ్ఛరవాణాకు వీలుగా విద్యుత్‌ వాహన వినియోగాన్ని పెంచేందుకు కేంద్రప్రభుత్వం వడివడిగా పలు నిర్ణయాలు తీసుకొంటోంది. విద్యుత్‌ వాహనా(ఈవీ)లపై వస్తుసేవల పన్నును 12 నుంచి అయిదు శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ మండలి చేసిన నిర్ణయంతో- ఎలెక్ట్రిక్‌ కార్లు రూ.50 వేల నుంచి లక్షన్నర దాకా, ద్విచక్ర వాహనాలు రూ.8000 దాకా ధర తగ్గనున్నాయి. ఈవీల కోసం ఉపయోగించే ఛార్జర్లు, ఛార్జింగ్‌ కేంద్రాలపై కూడా వసేప అయిదు శాతానికి కుదింపు, మొన్నటి బడ్జెట్లో విద్యుత్‌ వాహన కొనుగోలు రుణంపై చెల్లించే వడ్డీలో లక్షన్నర వరకు ఆదాయ పన్ను నుంచి అదనపు మినహాయింపు వంటివి- కాలుష్య కారక వాహనాలకు క్రమేణా చెల్లుకొట్టాలన్న సర్కారు స్థిర సంకల్పానికి నిదర్శనగా నిలుస్తున్నాయి. ఈవీలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన తదితరాల కోసం ‘ఫేమ్‌’ పథకం మలిదశ కింద కేంద్రం పది వేలకోట్ల రూపాయలు ప్రత్యేకించింది. అంతటితో ఆగకుండా పదిహేనేళ్లు పైబడిన వాహనాల వినియోగాన్ని నియంత్రించేందుకు పలు ఆంక్షలనూ కొత్తగా ప్రతిపాదిస్తోంది. 2018-19లోనే 40 లక్షలకు పైగా పెట్రోలు డీజిల్‌తో నడిచే కార్లు, వాణిజ్య వాహనాలు, 13 లక్షల త్రిచక్ర, రెండు కోట్ల 40 లక్షల ద్విచక్ర వాహనాలు కొత్తగా రోడ్డెక్కిన దేశం మనది. కాలుష్యాన్ని నియంత్రించడం, ఇంధన భద్రతను పెంచుకోవడం, ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా ఈవీ విధానాన్ని కొత్తపుంతలు తొక్కించనున్నట్లు నీతి ఆయోగ్‌ చెబుతున్నా- రోడ్డు రవాణా రంగంలో మార్పులు సాకారం కావాలంటే అటు తయారీదారుల్ని, ఇటు వినియోగదారుల్నీ కలుపుకొని పోయేలా పటిష్ఠ వ్యూహనిర్మాణం సాగాలి!

గాలి నాణ్యతపరంగా మొత్తం 180 దేశాల్లో 178వ స్థానంలో ఈసురోమంటున్న ఇండియాలో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య భరిత నగరాల్లో 14 పోగుపడ్డాయి. ప్రజారవాణా వ్యవస్థ పెద్దగా అక్కరకు రాని దేశంలో ప్రైవేటు వాహనాల వినియోగం ఏటికేడు జాంబవంతుడి అంగలు వేసుకొంటూ పోవడం, ఆ గిరాకీ తట్టుకోవడానికి ఏటా లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి పెట్రో దిగుమతులు సాగించడం, దానివల్ల కాలుష్యభూతం జడలు విరబోసుకొని జనారోగ్యాన్ని కబళించడం- ఇదో విషవలయంలా మారిపోయింది. దాన్ని ఛేదించి ఆరోగ్యకర రోడ్డురవాణా వ్యవస్థను నిర్మించాలనడంలో మరోమాట లేకపోయినా- విధానాల్లో నిలకడలేమి వాహన తయారీదారుల్ని, వినియోగదారుల్ని ఒక్కతీరుగా ఆందోళనపరుస్తోంది! వాహన కాలుష్య ఉద్గారాల్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తెచ్చేందుకు భారత్‌ స్టేజ్‌-6 వచ్చే ఏప్రిల్‌నుంచి అమలులోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. అందుకు అనుగుణంగా వాహనాల తయారీకి పరిశ్రమ వర్గాలు వేలకోట్లు వ్యయీకరిస్తే, సమున్నత నాణ్యతగల ఇంధనం తయారీకి వీలుగా చమురు శుద్ధి కర్మాగారాల ఉన్నతీకరణకే దాదాపు రూ.30 వేలకోట్లు ఖర్చు అయింది. ఈ దశలో విద్యుత్‌ వాహనాల వినియోగం పెంచడానికి కేంద్రం యుద్ధప్రాతిపదికన కదులుతుంటే, నీతి ఆయోగ్‌ ప్రతిపాదన మరింత కలకలం రేపుతోంది. 2023నాటికి శిలాజ ఇంధనాలతో నడిచే ఆటోలు, మరి రెండేళ్లకు స్కూటర్లు, మోటార్‌ సైకిళ్ల స్థానే విద్యుత్‌ వాహనాల తయారీ పట్టాలకెక్కాలన్న సూచన అది. దేశీయంగా రోడ్లపై 2030 నాటికి నూరుశాతం విద్యుత్‌ వాహనాలే ఉండాలన్న సర్కారీ ప్రకటన ఆచరణ సాధ్యం కానిదని భారత వాహన తయారీదారుల సంఘం రెండేళ్లనాడే తోసిపుచ్చింది. ఈ దశలో- మంచి చెయ్యడమే కాదు, మంచిగానూ చెయ్యాలన్న బాపూజీ ప్రబోధమే మోదీ సర్కారుకు శిరోధార్యం కావాలి!

ఆరేళ్ల క్రితం ప్రారంభించిన జాతీయ విద్యుత్‌ మొబిలిటీ మిషన్‌ పథకం- 2020 నాటికి 60-70 లక్షల విద్యుత్‌ వాహన విక్రయాలతో పాతిక లక్షల టన్నుల శిలాజ ఇంధనం ఆదా చెయ్యగల అవకాశాల్ని ప్రస్తావించింది. అది సాకారమై ఉంటే వచ్చే ఏడాదికల్లా కర్బన ఉద్గారాల్లో ఒకటిన్నర శాతం తగ్గుదలా కళ్లకు కట్టేది. వాస్తవ లక్ష్యంలో పదోవంతుకు అటూఇటూగా ఉన్న విద్యుత్‌ వాహన విక్రయాల్ని రెండు దశల్లో ఉన్నతీకరించడానికి ఎన్‌డీఏ సర్కారు వ్యూహాత్మకంగా కదులుతోంది. 2025 సంవత్సరం నుంచి 150 సీసీ లోపు ద్వి, త్రిచక్ర వాహనాల్ని విద్యుత్‌ వాహనాలుగా మార్చాలని, 2030 నుంచి దేశంలో ప్రయాణికుల వాహనాలన్నీ విద్యుత్‌వే అమ్మేలా చూడాలనీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేంద్రం ప్రణాళిక సక్రమంగా అమలైతే 2030నాటికి 37 శాతం కర్బన ఉద్గారాల కట్టడి సాధ్యపడుతుందని, దాదాపు నాలుగులక్షల కోట్ల రూపాయల చమురు బిల్లు ఆదా అవుతుందన్న అంచనాలు ఆకర్షణీయంగా ఉన్నాయనడంలో సందేహం లేదు. కానీ, ద్విచక్ర వాహనాల ధరలో 70 శాతం దాకా, కార్ల తయారీ వ్యయంలో 50 శాతం బ్యాటరీకే వెచ్చించాలని, నేడు ఛార్జింగ్‌ కేంద్రాల సంఖ్య అయిదు వందలలోపే ఉందన్న వివరాలు- బాలారిష్టాల తీవ్రతను చాటుతున్నాయి. లిథియం, సోడియం, సిలికాన్‌ బ్యాటరీలపై విస్తృత పరిశోధనలు సాగాల్సి ఉందని నీతిఆయోగ్‌ చెబుతోంది. గుర్రం ముందు బండి కట్టినట్లున్న సర్కారీ దూకుడు- పాత వాహనాల వినియోగం పెనుభారమయ్యే రీతిలో పలురకాల వడ్డనలకు తెరతీస్తోంది. బడుగు జనావళికి బతుకు తెరువుగా ఉన్న పాతవాహనాల్ని ఉన్నట్లుండి రద్దుల పద్దులో చేరిస్తే వారేమైపోవాలి? విద్యుత్‌ వాహన వినిమయాన్ని పెంచడంలో చైనా, ఐరోపా దేశాల బాటన నడవాలనుకోవడంలో తప్పులేకున్నా, స్థానికాంశాలను విస్మరించడం- నేలవిడిచి సాముగానే విపరిణమిస్తుంది!


Posted on 29-07-2019