Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ప‌ర్యావ‌ర‌ణం

జీవ వ్యర్థాలతో అనర్థాలు

దేశదేశాల్లో కరోనా వైరస్‌ విజృంభణతో కేసుల సంఖ్య పెరుగుతున్నకొద్దీ ఎక్కడికక్కడ జీవవ్యర్థాల రాశీ ఇంతలంతలవుతోంది. భారీగా పోగుపడుతున్న బయో వ్యర్థాలను సత్వరం సక్రమంగా నిర్మూలించకపోతే మరిన్ని అనర్థాలు వాటిల్లే ముప్పుంది. దేశీయంగా ఆస్పత్రులనుంచి జీవ వైద్య వ్యర్థాలను 48 గంటల్లోపు తరలించని పక్షంలో- గాలిలోకి వైరస్‌, బ్యాక్టీరియా చేరి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) హెచ్చరిస్తోంది. కొవిడ్‌-19గా వ్యవహరిస్తున్న మహమ్మారి బారినపడ్డ బాధితులకు, అనుమానితులకు వినియోగించిన సూదులు, సిరంజీలు సహా దేన్నీ ఇతర సాధారణ వ్యర్థాలతో కలపవద్దని, అన్నింటినీ కలగలిపి తగలబెట్టరాదంటూ అది వివిధ మార్గదర్శకాలూ జారీ చేసింది. కరోనా అనుమానితులు క్వారంటైన్‌లో ఉన్న నివాసాలనుంచి చెత్త సేకరించడంలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో పురపాలక కమిషనర్లకు తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శినుంచి వివరణాత్మక ఆదేశాలు జారీ అయ్యాయి. హానికరమైన ఆ వ్యర్థాలను ఇన్సినిరేటర్‌ ద్వారా రూపుమాపాలని, లేని పక్షంలో భూమిలో లోతైన గొయ్యితీసి పూడ్చిపెట్టాలనడం- ఇదెంత నియమబద్ధంగా జరగాల్సిన క్రతువో వెల్లడిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎమ్‌ఆర్‌) వంటివి క్రోడీకరించిన మార్గదర్శకాలను ఉటంకిస్తూ తనవంతుగా కేరళ కాలుష్య నియంత్రణ మండలి సైతం ఆస్పత్రి వ్యర్థాల నిర్వహణపై ఇటీవలే సూచనలు వెలువరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం, సాధారణ ఆస్పత్రి వ్యర్థాల్లో 10-25 శాతాన్నే ప్రమాదకరంగా పరిగణిస్తారు. కరోనా విషయంలో అటువంటి లెక్కలు పనికిరావని, అడుగడుగునా జాగ్రత్తలు అత్యవసరమని నిరూపితమైన దరిమిలా- జీవవ్యర్థాల నియంత్రణకు పకడ్బందీ జాతీయ కార్యాచరణ వ్యూహం అత్యావశ్యకమిప్పుడు!

విశ్వవ్యాప్తంగా ఎనిమిదిన్నర లక్షలకు పైబడిన కరోనా కేసులలో మూడొంతుల మేర అమెరికా, ఇటలీ, స్పెయిన్‌ సహా ఎనిమిది దేశాల్లోనే నమోదయ్యాయి. వాటిలో ఇరాన్‌ మినహా తక్కినవి ఆస్పత్రి వ్యర్థాల నిర్వహణలో ఎప్పటినుంచో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. చైనా సంగతిని ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాలి. గ్రామీణ ప్రాంతాలకూ వైద్యసేవలు అందాలన్న లక్ష్యంతో ‘కాలినడక డాక్టర్ల’ వ్యవస్థను ప్రవేశపెట్టి కొన్నేళ్లుగా విజయవంతంగా అమలుపరుస్తున్న చైనా- కరోనా నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన స్పందించడమంటే ఏమిటో లోకానికి చాటింది. కేవలం రోజుల వ్యవధిలో రెండు ప్రత్యేక ఆస్పత్రుల్ని అవతరింపజేసి ప్రపంచ దేశాల్ని అబ్బురపరచిన చైనాయే, సంక్షుభిత వుహాన్‌లో జీవవ్యర్థాల నిర్వహణ ఎలాగో అంతుపట్టక మొదట ఉక్కిరిబిక్కిరైంది. ఒకసారంటూ పరిస్థితి తీవ్రతను ఆకళించుకున్నాక జిన్‌పింగ్‌ ప్రభుత్వం, ఆస్పత్రి వ్యర్థాల నిర్వహణ సామర్థ్యం పెంపొందించుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచింది. కరోనా కేసులు పోటెత్తక ముందు హుబే ప్రావిన్సులో రోజూ సుమారు 137 టన్నుల దాకా బయో వ్యర్థాలను సేకరించి, నిర్మూలన కేంద్రాలకు తరలించేవారు. వారాల వ్యవధిలో ఆ సామర్థ్యాన్ని 317 టన్నులకు విస్తరించిన చైనా- షియావొగన్‌, వాంగాంగ్‌, వుహాన్‌ ప్రభృత నగరాలకు సంచార వ్యర్థ నిర్మూలన కేంద్రాల్ని హుటాహుటిన తరలించింది. అందుకు విరుద్ధ దృశ్యం దేశంలో తాండవిస్తోంది. నాలాలు, మురుగు కాల్వలు, పట్టణ శివార్లలో ఆస్పత్రి వ్యర్థాలను దిమ్మరిస్తున్న బాగోతాలు ఇక్కడ కోకొల్లలు. రాష్ట్ర స్థాయి కాలుష్య నియంత్రణ మండళ్లు అవినీతి, అలసత్వాలతో భ్రష్టుపట్టిపోగా- జీవవ్యర్థాల తరలింపుపై సీపీసీబీ మార్గనిర్దేశాలకు ఏపాటి మన్నన దక్కనుందన్నది అగమ్యం.

ఆస్పత్రుల్లో వినియోగించిన సిరంజీలు, దూది, చేతి తొడుగులు, శస్త్రచికిత్సలో తొలగించిన శరీర భాగాలు తదితరాలు వేటినీ జనసంచార ప్రాంతాల్లో పారేయరాదన్న బయో మెడికల్‌ వ్యర్థాల చట్టనిబంధనలు సంవత్సరాల తరబడి చట్టుబండలవుతున్నాయి. వాటి అమలు బాధ్యతను ఇన్నేళ్లూ గాలికొదిలేసి, కొత్తగా కరోనా దృష్ట్యా మార్గదర్శకాలు జారీ చేయడంతోనే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి బాధ్యత తీరిపోదు. హానికర వ్యర్థాల్ని ఉంచిన సంచులపై తరచూ హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ చేస్తుండాలని; వాటిని తరలించే సిబ్బందికి ప్రత్యేక మాస్కులు, గౌన్లు, చేతి తొడుగులు, పాదరక్షలు... సమకూర్చాలని నూతన నిబంధనలు సూచిస్తున్నాయి. వాటికి ఎక్కడ భంగం వాటిల్లినా, కరోనా వైరస్‌ రెచ్చిపోవడానికి చేజేతులా అవకాశం ఇచ్చినట్లే. యునిసెఫ్‌ నిబంధనావళీ వ్యర్థాల తరలింపులో ఏమేమి జాగ్రత్తలు అత్యావశ్యకమో పూసగుచ్చిన తరుణంలో- ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ సామగ్రిని పెద్దయెత్తున సిద్ధం చేయడం తప్ప ప్రభుత్వానికి మార్గాంతరం లేదు. ఆస్పత్రుల నుంచి తరలించిన జీవవ్యర్థాలను పర్యావరణానికి, ప్రజారోగ్యానికి హితకరంగా విచ్ఛిన్నం చేసే ఇన్సినిరేషన్‌ విభాగాల్ని అదనంగా సమకూర్చుకోవడం ఎంతటి ప్రాధాన్యాంశమో చైనా అనుభవం చాటుతోంది. గంటకు వెయ్యి కిలోల వరకు జీవ వ్యర్థాలను 850-1100 సెంటీగ్రేడ్‌ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద బూడిదగా మార్చే ఇన్సినిరేటర్ల నిర్మాణం ఖర్చు, శ్రమలతో కూడిన ప్రక్రియ అయినా- వాయిదా వేసే వీల్లేదు. చౌకధరలో వ్యక్తిగత రక్షణ సామగ్రి రూపకల్పన, తయారీలకు భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌, రక్షణ పరిశోధన సంస్థ ముందుకొచ్చాయి. జీవ వ్యర్థాలను క్షేమంగా వదిలించుకోవడానికీ చౌక ప్రత్యామ్నాయాలను ఆవిష్కరించడంలో ప్రభుత్వరంగ సంస్థల చొరవే, మహోత్పాతం నుంచి దేశాన్ని గట్టెక్కించగలుగుతుంది!

Posted on 02-04-2020