Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ప‌ర్యావ‌ర‌ణం

ప్రకృతి ప్రకోపం

‘ఫ్రెండ్స్‌... అందరూ కుశలమే కదా?’

‘కుశలమే మృగరాజా. కరోనా కరాళ నృత్యం చేస్తోంది కదా. దీంతో ఆల్చిప్ప మాదిరిగా మనిషి స్వగృహ కారాగారవాసం విధించుకున్నాడు. ఇళ్లలో బందీలైన మనుషుల్ని ఏడవకండేడవకండంటూ ఓదార్పు యాత్ర చేసి వస్తున్నా’

‘హహ్హా... భళా గజరాజా! చూస్తుంటే కాలగమనంలో ఈ ఏడాది తన విశిష్టతను ఘనంగానే చాటుకునేలా ఉందోయ్‌. ఈ భూగోళాన్నే ఎత్తి భుజమ్మీద మోసేంత ఘనులైన మనుషులకు, కరోనాకు మధ్య కురుక్షేత్ర సంగ్రామానికి తెర తీసింది. 2020 అంకెలోనే ఏదో మ్యాజిక్కు ఉందనిపిస్తోంది.’

‘ఊర్కోండి మహారాజా! మానవాళికి మీరింకేమీ భుజకీర్తులు తొడగకండి. మనిషికి విశ్వాసమనేది ఏ కోశానా లేదు. ఈ ఘోర కలియుగంలో బంధాల్ని, బంధువుల్ని, భూముల్ని, బ్యాంకుల్ని, దేశాన్ని కూడా తాకట్టు పెట్టే మహానుభావులు బయలుదేరారు. వీరికి స్వప్రయోజనమే సర్వస్వం. ఇలాంటి వారితోనా నేను తరతరాలుగా విశ్వసనీయ స్నేహం చేసింది. తలచుకుంటేనే సిగ్గేస్తోంది.’

‘నీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను శునక మిత్రమా. కర్మఫలం ఎవ్వరినీ వదలదు. తోటి మనుషుల్నే బానిసల్ని చేసి రాచి రంపాన పెట్టిన ఘనచరిత్ర వారిది. బానిస, భూస్వామ్య, పెత్తందారీ, జమీందారీ లాంటి దుర్విచక్షణాపూరిత వ్యవస్థల్ని మనమెరుగుదుమా? పేరుకే ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు. కాస్త తరచి చూస్తే కులమని, మతమని, ప్రాంతమని, జాతి అని, దేశమని... ఈ మానవుల చరిత్ర అంతా విభజన, విద్వేషాలమయమే!’

‘నిజమే ప్రభూ! ఆకలేసో, ఉబుసుపోకో, దంతాలకు దురదపెట్టో... ఏవో చిన్నచిన్న కన్నాలేస్తాం మేము. అంతమాత్రానికే పొగ పెట్టో, బోనులో బంధించో, మందు పెట్టో... ఇలా చిత్రహింసలు పెట్టి మరీ మమ్మల్ని చంపుతారే! మరి, ఈ మనిషి ఏకంగా ఓజోన్‌ పొరకే కన్నమేశాడు. ఇక భూగోళాన్నైతే విచక్షణారహితంగా కుళ్లబొడుస్తున్నాడు. మాకేనా శిక్షలు? ఈ మానవులకు అవేవీ వర్తించవా?’

‘నీ ఆక్రోశాన్ని ప్రకృతి ఆలకించిందేమో మూషిక మిత్రమా. ఈ మనుషుల కోరలు పీకి, తోకలు కత్తిరించే పనికి శ్రీకారం చుట్టినట్లే ఉంది. లేకపోతే, ఎంత బడాయి జాతో ఈ మనుషులది! చెప్పేవేమో జీవకారుణ్యం, పర్యావరణ సమతుల్యత లాంటి శ్రీరంగనీతులు. చేసేవన్నీ కల్తీ, కాలుష్య కాసారపు, కసాయి పనులు. నింగీ నీరూ నేలా నిప్పూ గాలి... ఇలా పంచభూతాలపై ఈ మనిషి సాగిస్తున్న విధ్వంస రచనకు అంతర్థానమైపోయిన జీవరాశికి లెక్కాపత్రం ఏమైనా ఉందా? ఈ భూమండలమంతా వీళ్ల బాబు సొత్తు అయినట్లు, వీళ్ల అజమాయిషీ ఏమిటో? ఇది ఒక రకంగా ఈ ధరిత్రిపై మానవులు సాగిస్తున్న నియంతృత్వమే.’

‘నిజమే మహారాజా! నేను కళ్లు మూసుకుని పాలుతాగే జీవినే కావచ్చు. కానీ, నేను కళ్లారా వీక్షించిన వీరి ఆగడాలకు అంతేలేదు. అశ్వమేధ యాగాలు చేస్తాడు. కాకితో కబురంపుతాడు. చిలుకలతో జ్యోతిష్యాలు చెప్పిస్తాడు. మైనాతో పాడిస్తాడు. కోళ్లతో కత్తియుద్ధాలు చేయిస్తాడు. ఎద్దులతో జల్లికట్టు ఆడతాడు. పశువుల తోలు ఒలిచి చెప్పులు కుట్టించుకుంటాడు. గొర్రెల కేశాలతో బట్టలు కుట్టించుకుంటాడు. పులిచర్మం కిందేసుకుని ధ్యానం చేస్తాడు. ఏనుగు దంతాలు పీకి బొమ్మలు చేస్తాడు. పాము కోరల్లో విషం తీసి వైద్యం చేస్తాడు. జంతువుల్ని జూలో బంధిస్తాడు. సర్కసుల్లో ఆడించి వికృతానందం పొందుతాడు. ఈ మనిషి దాష్టీకాలకు, దురాగతాలకు లెక్కేలేదు. మ్యావ్‌!’

‘లెస్స పలికితివి మార్జాలమా! పిల్లికి బిచ్చం కూడా పెట్టనివాడు సమసమాజం నిర్మిస్తాడట. సామ్యవాదం సంగతేమిటో గాని, ఉగ్రవాదం మాత్రం సృష్టించాడు. రెండు ప్రపంచయుద్ధాలతో ఎనలేని విధ్వంసం సృష్టించాడు. హిరోషిమా, నాగసాకి వినాశనాల్ని మరవగలరా? ఇంత జరిగినా, ఇంకా అణ్వాయుధాలతో కయ్యాలకు సై అంటూ భూమాత ఉనికికే విఘాతం తెచ్చేలా ఉన్నాడు.’

‘ముమ్మాటికి వాస్తవం మహారాజా! చైతన్యశీలినని, నాగరికతా నిర్మాతనని ఉత్తర ప్రగల్భాలు పోతాడే. కరవు కాటకాలు, మహమ్మారులు, పేదరికం, హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు, ఆకలిచావులు, హాహాకారాలు... ఇదేనా వీరి నాగరికత, ఇదేనా వీరి చైతన్యం? చివరాఖరికి వీరి సాంగత్య ఫలితాన నాక్కూడా కరోనాను అంటించారు, రెండు వారాల క్వారెంటైన్‌ మీదట ఈ సమావేశానికి హాజరవుతున్నా... హతవిధీ!’

‘ఎంతటి దుర్గతి దాపురించింది వ్యాఘ్రోత్తమా! ఈ నాగరిక జీవి ముక్కూచెవులూ పిండి, నోటికి తాళమేసి, కాళ్లూ చేతులు కట్టేసి కరోనా క్వారంటైన్‌ చేసింది. ఈ కుహనా సాంఘిక జీవిని సామాజిక జీవనానికి దూరం చేసి లాక్‌డౌన్‌ చేసింది. పోన్లెండి, అత్యంత విషమ పరీక్షా కాలమిది. మానవాళి ఆత్మావలోకం చేసుకోవాల్సిన సమయమిది. మనిషి తన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుని ఈ మహాగండాన్ని దాటుతాడని ఆశిద్దాం. అన్నట్లు, కరోనాకు స్త్రీ-పురుష, చిన్న-పెద్ద అనే తేడా లేదు. చివరికి మానవ-పశుపక్ష్యాదులనే విచక్షణా లేదనే విషయాన్ని గుర్తెరగాలి. మనం కూడా ఎంతో జాగరూకతతో మెలగాల్సిన తరుణమిది. అందుకే నేటి మన సర్వసభ్యసమావేశం.’

‘నిజమే, మహారాజా! ఈ ఆపద ఘడియల్లో మీ దిశానిర్దేశానికై మా వృక్షజాతి తరఫున కూడా వేడుకుంటున్నాం!’

‘యథాయథాహి ధర్మస్య అన్నట్లు, అరాచకం పెచ్చరిల్లినప్పుడల్లా ప్రకృతి కూడా కొత్త అవతారమెత్తి సమస్థితిని తీసుకొస్తుందేమో. మానవజాతిలా మనకు మందులు మాస్కులు లేవు; శానిటైజర్లూ వెంటిలేటర్లూ అసలే లేవు. కాబట్టి, ప్రస్తుతానికి మనం కూడా భౌతికదూరం పాటిద్దాం. అదే మనకు శ్రీరామరక్ష!’

- నాగరాజ్‌
Posted on 21-04-2020