Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ప‌ర్యావ‌ర‌ణం

మానవ తప్పు.. మనుగడకు ముపు

* భూక్షయం నివారణపై నేటి నుంచి సదస్సు

పూర్వం రుతు పవనాల్లో సహజంగా వచ్చిన తీవ్ర వ్యత్యాసాల వల్ల సుదీర్ఘ దుర్భిక్షం నెలకొని సింధు నాగరికత అంతరించిపోయిందని పరిశోధకులు నిర్ధారించారు. నేడు మానవ కార్యకలాపాలు ప్రకృతి ప్రకోపానికి హేతువై ప్రపంచ నాగరికతకే చేటు తెచ్చేట్లున్నాయి. ఆధునిక మానవుడు కాలుష్యాన్ని విరజిమ్ముతూ భూతాపానికి, తద్వారా వర్షపాతంలో వైపరీత్యాలకు కారణమవుతున్నాడు. పెరిగిన జనాభా అవసరాలు తీర్చడానికి అడవులు నరికివేయడం ముమ్మరమైంది. పశువులు, మేకలు, గొర్రెల మేత కోసం పచ్చిక బీళ్లను హరించివేయడం, సాగు భూముల్లో ఎడతెరిపి లేని వ్యవసాయం, నీటి దుబారా మూలంగా భూసారం క్షయమవుతోంది. పలు ప్రాంతాల్లో దీర్ఘకాల అనావృష్టి పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ విపరిణామాల మూలంగా భూగోళంపై 23 శాతం, భారత్‌లో 30 శాతం భూములు వేగంగా క్షయానికి లోనవుతున్నాయి. ఏటా 1.2 కోట్ల హెక్టార్ల సారవంతమైన భూములను కోల్పోతున్నామని ఐక్యరాజ్య సమితి ఎడారీకరణ నిరోధ సంస్థ (యు.ఎన్‌.సి.సి.డి.) అంచనా. ఈ భూములకు రెండు కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను అందించే సత్తా ఉంది. ప్రపంచమంతటా నిమిషానికి 23 హెక్టార్ల భూమిని కోల్పోతున్నామని, రోజూ భూ క్షయం వల్ల మానవాళికి 130 కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లుతోందని యు.ఎన్‌.సి.సి.డి. కార్యనిర్వాహక కార్యదర్శి ఇబ్రహీం థియా వెల్లడించారు. పెరుగుతున్న జనాభా కోసం ఈ శతాబ్ది మధ్యనాటికి రెట్టింపు ఆహార ధాన్యాలు పండించాల్సి ఉండగా, ప్రపంచంలో నాలుగో వంతు భూమి ఇప్పటికే వ్యవసాయ యోగ్యం కాకుండా పోవడం ఆందోళనకరం. ప్రపంచంలో ఆధునిక వ్యవసాయ పద్ధతులు మొదలైనప్పటి నుంచి 200 కోట్ల హెక్టార్ల సారవంతమైన భూమిని కోల్పోయాం. ఇప్పటికే 169 దేశాలు ఎడారీకరణ బారిన పడుతున్నామని యు.ఎన్‌.సి.సి.డి.కి మొరపెట్టుకున్నాయి. భూ క్షయాన్ని అడ్డుకొని భూ పునరుజ్జీవనం చేపట్టే మార్గాల గురించి చర్చించడానికి దేశ రాజధాని నగరం దిల్లీ సమీపంలోని గ్రేటర్‌ నొయిడాలో ఈ నెల 2-13 తేదీల మధ్య యు.ఎన్‌.సి.సి.డి. ఆధ్వర్యంలో కాప్‌-14 (కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌) సమావేశం జరగనుంది. ఇందులో 195 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. వచ్చే ఇరవై ముప్ఫై ఏళ్లలో వాతావరణ మార్పులను అరికట్టడానికి కలిసికట్టుగా కృషి చేసే విషయమై వారు లోతుగా చర్చించనున్నారు.

ప్రమాదంలో జన జీవనం
దిల్లీ కాప్‌-14 సభకు ప్రాధాన్యం ఉంది. ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ), అభివృద్ధి సంస్థ (యు.ఎన్‌.డి.పి.), పర్యావరణ సంరక్షణ సంస్థ (యు.ఎన్‌.ఇ.పి.)లు ఇందులో పాల్గొంటున్నాయి. ఈ సంస్థలు యు.ఎన్‌.సి.సి.డి. కన్నా ఎంతో ప్రముఖమైనవి, వాటి కార్యాచరణ పరిధి కూడా విస్తృతమైనది. ఐరాస ప్రకటించిన జీవావరణ పునరుద్ధరణ దశాబ్ది (2021-2030) ప్రారంభమయ్యే ముందు జరిగే చిట్టచివరి కాప్‌ సభ కాబట్టి, దిల్లీ కాప్‌-14 సమావేశానికి అమిత ప్రాధాన్యం ఏర్పడింది. భూ, సముద్ర క్షయం వల్ల దాదాపు 320 కోట్లమంది జీవనం దెబ్బతింటోంది. భూసారం క్షీణించిన భూముల్లో ఆరోవంతును, అంటే 35 కోట్ల హెక్టార్లను 2030లోగా పునరుజ్జీవింపజేస్తే 13 నుంచి 26 గిగాటన్నుల హరిత గృహ వాయు ఉద్గారాలను నివారించవచ్చు. పర్యావరణ పునరుద్ధరణ సేవల ద్వారా సుమారు తొమ్మిది లక్షల కోట్ల డాలర్ల ప్రతిఫలం పొందవచ్చని అంచనా.

మానవ కార్యకలాపాల వల్ల, కొన్ని ప్రాకృతిక కారణాల వల్ల క్షయమవుతున్న భూమికి ప్రత్యామ్నాయంగా వేరే చోట భూములను పునరుజ్జీవింపజేసే కృషికి 122 దేశాలు నిబద్ధత ప్రకటించాయి. భారత్‌ కూడా 2020 కల్లా 1.3 కోట్ల హెక్టార్ల భూమిని, 2030కల్లా అదనంగా 80 లక్షల హెక్టార్లను పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చింది. తదనుగుణంగా హరియాణా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, నాగాలాండ్‌, కర్ణాటక రాష్ట్రాలలో పలచబడిన అడవుల పునరుద్ధరణ చేపట్టింది. దేశ విస్తీర్ణం 32.87 కోట్ల హెక్టార్లు; అందులో 9.64 కోట్ల హెక్టార్లకు ఎడారీకరణ ముప్పు ముంచుకొస్తోంది. గడచిన దశాబ్ద కాలంలో దేశంలోని 26 రాష్ట్రాల్లో ఎడారీకరణ విస్తరించిందని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌ మెంట్‌ (సీఎస్‌ఈ) 2017 నివేదిక వెల్లడించింది. రాజస్థాన్‌, దిల్లీ, గోవా, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, త్రిపుర, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలలో సుమారు 40 నుంచి 70 శాతం భూమి ఎడారీకరణకు లోనవుతోంది. వర్షాల్లో భూమి కోత దాదాపు 11 శాతం ఎడారీకరణకు కారణమవుతోంది. ఈదురు గాలుల వల్ల 5.55 శాతం, మానవ ఆవాసాల వల్ల 0.69 శాతం, వృక్ష సంపద క్షయం వల్ల 8.91 శాతం, లవణీయత వల్ల 1.12 శాతం ఎడారీకరణ సంభవిస్తోందని సీఎస్‌ఈ అధ్యయనం వివరించింది. దీనివల్ల వ్యవసాయ ఉత్పత్తి తగ్గి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2.5 శాతం దాకా కోత పడుతోంది.

ఎడారీకరణ తీరుతెన్నులు
భారత అంతరిక్ష, వ్యవసాయ, భూసార శాస్త్రవేత్తలు గతేడాది నిర్వహించిన అధ్యయనం- కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఎడారీకరణ బారిన పడుతున్నాయని హెచ్చరించింది. కర్ణాటకలో 36.24 శాతం, తెలంగాణలో 31.40 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 14.35 శాతం భూమి ఎడారీకరణకు లోనవుతున్నట్లు తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ఎడారీకరణ రేటు 0.52 శాతం తగ్గడం శుభపరిణామమే కానీ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలలో ఎడారీకరణ రేటు వరసగా 0.19 శాతం, 0.05 శాతం చొప్పున పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో వృక్షసంపద హరించుకుపోవడం, నీటి కోత, నీరు నిలిచిపోవడం ఎడారీకరణకు ప్రధాన కారణాలు. కర్ణాటకలో నీటికోత, లవణీయత, వృక్ష సంపద క్షయం వల్ల ఎడారీకరణ సంభవిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో గనుల తవ్వకం, అతిగా వంట చెరకు వినియోగం, కార్చిచ్చు, అడవుల నరికివేత ఎడారీకరణకు దారితీస్తున్నాయి. అనంతపురం, కర్నూలు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో భూక్షయం ఎక్కువగా ఉంది.

ఎడారీకరణను అడ్డుకోవడానికి చైనా 1960ల నుంచే భూపునరుద్ధరణ పథకాలను సమర్థంగా అమలు చేస్తోంది. మహా హరిత కుడ్యం ప్రాజెక్టు కింద 6,800 కోట్ల మొక్కలను పెంచి ఎడారి విస్తరణను విజయవంతంగా నిలువరించింది. కోతతో దెబ్బతిన్న 4.5 కోట్ల హెక్టార్ల భూమిని పునరుద్ధరించింది. భూక్షయానికి గురైన భూమిలో 2.92 కోట్ల హెక్టార్లలో అడవులు పెంచింది. 2050లో ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక ఎడారిని నిలువరిస్తూ 4,500 కిలోమీటర్ల పొడవునా వృక్ష కుడ్యం ఏర్పడుతుంది. భూసారం క్షీణించిన భూముల పునరుద్ధరణలో ప్రైవేటు రంగాన్నీ భాగస్వామిని చేసి బీజింగ్‌ ఘన విజయం సాధించింది. అలీబాబా గ్రూపులో భాగమైన యాంట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రవేశపెట్టిన యాంట్‌ ఫారెస్ట్‌ యాప్‌ కర్బన ఉద్గారాలను తగ్గించి, భూపునరుద్ధరణకు తోడ్పడేలా పట్టణ ప్రజలను ప్రోత్సహించింది. నగరవాసులు ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లిస్తే కాగితం రసీదుల అవసరం ఉండదు. కాగితం తయారీ కోసం చెట్లను కొట్టివేయాల్సిన అగత్యం ఏర్పడదు. కార్యాలయాలకు, దుకాణాలకు, పాఠశాలలకు నడచివెళ్లినా, ప్రభుత్వ రవాణా సాధనాలైన బస్సులు, రైళ్లు ఎక్కినా కర్బన ఉద్గారాలను చాలా వరకు తగ్గించవచ్చు. పౌరులు ఇటువంటి పర్యావరణ హితకరమైన పనులు చేసినప్పుడల్లా వారికి వర్చువల్‌ గ్రీన్‌ ఎనర్జీ పాయింట్లు లభిస్తాయి. నిర్ణీత పాయింట్లు లభించాక వాటిని గోబీ ఎడారిలో మొక్కలు నాటడానికి వెచ్చిస్తారు. అందుకయ్యే ఖర్చును యాంట్‌ ఫైనాన్షియల్‌ చెల్లిస్తుంది. 2016లో ప్రారంభమైన యాంట్‌ ఫారెస్ట్‌ యాప్‌ కింద సుమారు 50 కోట్లమంది వినియోగదారుల గ్రీన్‌ ఎనర్జీ పాయింట్లతో 93 కోట్ల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో 10 కోట్ల మొక్కలు నాటారు. తమ పాయింట్లతో నాటిన మొక్కల ఎదుగుదలను వినియోగదారులు ఉపగ్రహాల ద్వారా, డ్రోన్ల ద్వారా వారు ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చు. ఈ విధంగా ఆధునిక సాంకేతికత ఎడారీకరణను అడ్డుకోవడానికి అమోఘ సాధనంగా ఉపకరిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా 2030కల్లా ఎడారీకరణను అడ్డుకొని, భూపునరుజ్జీవనం సాధించాలని ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి (ఎస్‌.డి.జి.) లక్ష్యం నిర్దేశిస్తోంది. వాతావరణ మార్పులను నిలువరించడం, జీవవైవిధ్య సంరక్షణ, ఆహార, జల భద్రత, ప్రకృతి ఉత్పాతాల నివారణ, పేదరికాన్ని తగ్గించడం వంటి ఇతర ఎస్‌.డి.జి. లక్ష్యాలను సాధించాలంటే ఎడారి విస్తరణను అడ్డుకొని భూసారాన్ని తప్పనిసరిగా కాపాడాల్సిందే. దీనివల్ల వ్యవసాయోత్పత్తి పెరిగి ఆకలిపై పోరులో విజయం సాధించవచ్చు. గడచిన యాభై సంవత్సరాలలో ప్రపంచంలో చెలరేగిన సంఘర్షణల్లో 40 శాతం- భూమి, నీరు, ఖనిజ సంపద, అడవుల వంటి ప్రాకృతిక వనరుల కోసం పోటీ వల్ల సంభవించినవే.

ఏకాభిప్రాయ సాధన యత్నం
మరో దశాబ్ద కాలంలో జీవావరణ పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలు, భూపునరుజ్జీవన యత్నాల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే విషయంపైనా దిల్లీ కాప్‌ 14 సదస్సు చర్చించనుంది. చైనాలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం సత్ఫలితాలను ఇచ్చినా, ఇతర దేశాల్లో దీనిపై భేదాభిప్రాయాలు తలెత్తవచ్చు. క్షయమైన భూమిని పునరుద్ధరించే ప్రైవేటు సంస్థలకు, ఆ భూవినియోగంపై కనీసం 50-60 ఏళ్లపాటు హక్కు కల్పించి, ఆపైన ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్న ప్రతిపాదన సదస్సులో చర్చకు రానుంది. భూపునరుద్ధరణపై ఒక డాలరు ఖర్చు పెడితే అయిదు డాలర్ల ప్రతిఫలం వస్తుందని యు.ఎన్‌.సి.సి.డి. కార్యనిర్వాహక కార్యదర్శి ఇబ్రహీం థియా చెబుతున్నారు. వాతావరణ మార్పుల వల్ల పదేపదే విరుచుకుపడుతున్న అనావృష్టి పరిస్థితులను ఎదుర్కొనే విషయంపైనా సదస్సు చర్చించనుంది. ఎడారీకరణ నిరోధ కార్యక్రమాలను దారిద్య్ర నిర్మూలన కార్యక్రమాల్లో అంతర్భాగం చేయాలని యు.ఎన్‌.సి.సి.డి. ప్రతిపాదిస్తోంది. దిల్లీ సదస్సు ఈ లక్ష్య సాధన మార్గాలను ఖరారు చేయడం ఎంతైనా అవసరం!


Posted on 02-08-2019