Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ప‌ర్యావ‌ర‌ణం

కాలుష్యానికి కళ్ళెం విద్యుత్‌ వేగంతో

* పర్యావరణానికి దన్ను

ప్రపంచాన్ని ఆవరించి, ప్రజారోగ్యాన్ని కబళిస్తున్న వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు అభివృద్ధి చెందిన దేశాలన్నీ సంప్రదాయ వాహనాల స్థానంలో విద్యుత్‌ వాహనాల(ఈవీల) వినియోగాన్ని ప్రత్యామ్నాయంగా భావిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక కాలుష్య నగరాల్లో అనేకం భారత్‌లో ఉన్నాయి. దీంతో విద్యుత్‌ వాహనాలను రోడ్లపైకి తెచ్చేందుకు కేంద్రం ఎట్టకేలకు కదిలింది. వీటి కొనుగోలుకు తీసుకునే రుణాలపై చెల్లించే వడ్డీలపై లక్షన్నర రూపాయల వరకు పన్ను రాయితీని బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది. జీఎస్టీని తగ్గించింది. ఈ రంగానికి ఊతమిచ్చే నిర్ణయాలే ఇవి. చైనా సహా పలు అభివృద్ధి చెందిన దేశాల్లో కొంత శాతం మేర ఈవీల తయారీ విధిగా ఉండాలనే నిబంధనలున్నాయి. భారత ప్రభుత్వం వాహన తయారీ పరిశ్రమలకు అలాంటి నిబంధనలేవీ విధించలేదు. ముడిచమురు దిగుమతుల ఆర్థికభారం, వాయు కాలుష్యం అంతకంతకు పెరుగుతుండటం దేశం ముందున్న అతి పెద్ద సవాళ్లు. వీటిని తగ్గించడానికి రూ.10 వేల కోట్ల రాయితీలు, ప్రోత్సాహకాలతో ‘ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఆఫ్‌ (హైబ్రిడ్‌ అండ్‌) ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఫేమ్‌-2)’ పథకం అమలును కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి ప్రారంభించింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈవీ రంగంలో పెడుతున్న పెట్టుబడులతో పోలిస్తే ఇది అంత పెద్ద మొత్తం కాదు. కానీ, కేంద్రం ఇస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీలు ఈవీ రంగంలో మరిన్ని పెట్టుబడులకు ఊతమిచ్చేలా, వినియోగదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇప్పటికే విద్యుత్‌ వాహనాల రంగంలో బాగా వెనకబడి ఉన్న భారత్‌లో ఇకనైనా ఈవీలు కళ్లెం విడిచిన గుర్రాలవుతాయా అన్నది చర్చానీయాంశం!

కబళిస్తున్న కాలుష్యం
ఒక వాహనం ప్రయాణించే సమయంలో గ్యాలన్‌ డీజిల్‌ వినిమయానికి 10,180 గ్రాముల బొగ్గు పులుసు వాయువు (కార్బన్‌ డయాక్సైడ్‌) వెలువడుతుంది. పెట్రోల్‌ అయితే 8,887 గ్రాములు గాలిలో కలుస్తుంది. మీథేన్‌, నైట్రస్‌ ఆమ్లం కూడా కొద్ది మొత్తంలో వస్తాయి. ఏసీల నుంచి క్లోరోఫ్లూరో కార్బన్లు వెలువడతాయి. వీటివల్ల కాలుష్యం పెచ్చరిల్లి, ప్రపంచ ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయి. వర్షాలు సకాలంలో పడటం లేదు. విద్యుత్‌ వాహనాలు వాడితే ఈ కాలుష్య ఉద్గారాలు వెలువడవు. భారత్‌లో 2017లో 1,800 కిలోల తలసరి కార్బన్‌ డయాక్సైడ్‌ను గాలిలోకి వదిలినట్లు అంచనా. ఈ వాయువును అత్యధికంగా గాలిలోకి వదులుతున్న దేశాల్లో భారతదేశానిది ప్రపంచంలో నాలుగో స్థానం. ప్రపంచంలో అత్యధికంగా ముడిచమురును దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో ఉంది. వాయుకాలుష్యం అధికంగా ఉన్న మొదటి 20 పెద్ద నగరాల్లో 13 మనదేశంలో ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రమాణాలతో పోలిస్తే ఆరు రెట్లు అధికంగా కాలుష్య కారకాలు గాలిలో ఉన్న నగరంగా దిల్లీ ప్రపంచాన్నే భయపెడుతోంది. దేశంలో 1951లో 3.06 లక్షల వాహనాలుంటే 2017నాటికి వాటి సంఖ్య 25.23 కోట్లకు చేరింది. గత 20 ఏళ్లలోనే వాహనాల సంఖ్య దాదాపు అయిదు రెట్లు పెరిగింది. గాలిలోకి విడుదలవుతున్న కాలుష్యంలో 90 శాతం వాటా వాహనాలదే. దేశాన్ని వాహన కాలుష్యం నుంచి రక్షించేందుకు 2002లో మషేల్కర్‌ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్రం ఆమోదించింది. ఐరోపా ప్రమాణాల ప్రకారం వాహనాల తయారీని ప్రోత్సహించాలని 2000 సంవత్సరంలోనే నిర్ణయించింది. 2010లో ‘భారత్‌ స్టేజ్‌-4’ ప్రమాణాలున్న వాహనాలను ప్రధాన నగరాల్లో వినియోగించాలని సూచించింది. అయినా, దేశంలో వాహన కాలుష్యం మరింత విజృంభించింది. దేశవ్యాప్తంగా ఏటా విపణిలోకి వస్తున్న 2.15 కోట్ల కొత్త వాహనాలు ఇందుకు కారణమవుతున్నాయి. దీని నుంచి బయటపడాలనే లక్ష్యంతో కేంద్రం తొలుత 2015లో ‘ఫేమ్‌’ పథకాన్ని ప్రారంభించింది. దేశంలో 2020 నాటికి 60 లక్షల ఈవీలు రోడ్లపై తిరగాలన్నదే ఈ పథకం ప్రధాన లక్ష్యమంటూ అప్పట్లో ఊదరగొట్టారు. ‘జాతీయ విద్యుత్‌ రవాణా మిషన్‌ ప్రణాళిక (ఎన్‌ఈఎమ్‌ఎమ్‌పీ)’లో భాగంగా ప్రారంభించిన ‘ఫేమ్‌’లో కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలన్నీ పెట్రోలు, డీజిల్‌ వాహనాలను పక్కనపెట్టి ఈవీలను ఉపయోగించాలని నిర్దేశించారు. లక్ష్యసాధన బాధ్యతను కేంద్ర విద్యుత్‌ శాఖకు చెందిన ‘ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌)’కు అప్పగించి, 10 వేల ఈవీలను కొనమన్నారు. ఇంతవరకూ ఇందులో సగం ఈవీలైనా రోడ్లపై తిరగడం లేదు.

అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఐఈఏ) తాజా నివేదిక ప్రకారం 2018 నాటికి ప్రపంచంలోని మొత్తం ఈవీల్లో సగం చైనాలోనే ఉన్నాయి. తరవాతి స్థానాలు ఐరోపా దేశాలు, అమెరికావి. వచ్చే ఏడాది 46 లక్షల ఈవీలను అమ్మాలని చైనా ప్రణాళికలు సిద్ధం చేసింది. జపాన్‌, దక్షిణ కొరియాలూ పెద్దయెత్తున ప్రోత్సాహకాలతో ఈవీలను మార్కెట్‌లోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. దక్షిణ కొరియాలో నిరుడు 32 వేలు, ఈ ఏడాది 57 వేల ఈవీలకు రాయితీలిచ్చారు. జపాన్‌ 2050 నాటికి కర్బన ఉద్గారాలను 80 శాతం దాకా తగ్గించే లక్ష్యసాధనలో భాగంగా ఈవీల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈవీ కొనుగోలు వ్యయంలో 20 నుంచి 25 శాతం వరకు రాయితీలు ఇస్తున్నారు. చిన్న దేశాలు సైతం వాయు కాలుష్య విపరిణామాలకు భయపడి వేగంగా ఈవీలవైపు పరుగులు పెడుతున్నాయి. ఉదాహరణకు నార్వేలో గతేడాది అమ్మిన మొత్తం వాహనాల్లో 46 శాతం ఈవీలే. ఆ దేశం వీటిపై దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది. ఐస్‌లాండ్‌లో 17.2, స్వీడన్‌లో 7.9 శాతం విద్యుత్‌ వాహనాలున్నాయి. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఈవీ విపణి 2024 నాటికి 540 కోట్ల డాలర్ల స్థాయికి ఎదుగుతుందని అంచనా. చైనా ఈవీ మార్కెట్‌ వార్షిక సగటు వృద్ధిరేటు (సీఏజీఆర్‌) 2019-24 మధ్య 28 శాతం ఉంటుందని ‘టెక్సాయ్‌’ సంస్థ వెల్లడించింది. భారత్‌లో 2018-23 మధ్యకాలంలో ఈవీల విపణి సీఏజీఆర్‌ 37 శాతం ఉండవచ్చని భావిస్తున్నారు. చైనా ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాల వల్ల ఆ దేశ సంప్రదాయ వాహనాలఅమ్మకాలకు కోతపడి ఈ ఏడాది 10 శాతం, వచ్చే ఏడాది 12 శాతం ఈవీల కొనుగోళ్లు పెరుతాయని అంచనా. చైనాలో నానాటికీ పెచ్చరిల్లుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో పాటు, ఈవీలకు ఛార్జింగ్‌ స్టేషన్ల వంటి మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దీనివల్ల చైనీయులు ఈవీల కొనుగోలు, వాడకానికి మొగ్గుచూపుతున్నారు. పారిశ్రామిక ప్రాంతాలు అధికంగా ఉన్న ఉత్తర చైనాలో ఈవీల వినియోగం వేగంగా విస్తరించడానికి అక్కడి మౌలిక సదుపాయాల వృద్ధే ప్రధాన కారణమని గుర్తించారు. ద్విచక్ర విద్యుత్‌ వాహనాల విపణి చైనాలో అత్యధిక శాతం వాటాతో పెట్రోలు వాహనాలను పక్కకు నెట్టేస్తోంది.

ప్రోత్సాహకాలే ఆయువుపట్టు
భారతదేశంలో కోట్లమంది వినియోగిస్తున్న డీజిల్‌, పెట్రోల్‌ వాహనాలను ఇప్పటికిప్పుడు పక్కనపెట్టేసి, ఈవీలను మాత్రమే రోడ్లపైకి తేవడం సాధ్యం కాదు. దశలవారీగా, వీలైనంత త్వరగా ఈ పని జరగకపోతే దేశమంతా కాలుష్య కాసారమై బతకడానికి స్వచ్ఛమైన గాలి కూడా దొరకని విపత్తు ముంచుకొస్తుంది. ఈవీల్లో ఉపయోగించే లిథియం ఐయాన్‌ సెల్‌ను దిగుమతి చేసుకోవడానికి కేంద్రం కస్టమ్స్‌ సుంకాన్ని తగ్గించడం ఆహ్వానించదగిన అంశం. సౌర విద్యుత్‌ ఛార్జింగ్‌ స్టేషన్లు, లిథియం బ్యాటరీల తయారీ పరిశ్రమలకు ఆదాయ పన్ను రాయితీలు ఇవ్వడమూ సానుకూల పరిణామం. 2023 నాటికి త్రిచక్ర వాహనాలకు, 2025 నాటికి ద్విచక్ర వాహనాలకు 150 సీసీకన్నా తక్కువ స్థాయి గల డీజిల్‌, పెట్రోలు ఆధార ఇంజిన్ల తయారీని నిషేధించాలనే విధాన ప్రతిపాదనను నీతి ఆయోగ్‌ పరిశీలిస్తోంది. చైనాలో ఇప్పటికే ఈ తరహాలో సంప్రదాయ వాహనాల తయారీ పరిశ్రమల్లో పెట్టుబడులపై ఆంక్షలు పెట్టడం ద్వారా ఈవీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఐరోపాలోని కొన్ని పెద్ద నగరాల్లో ఈవీలకు ఉచితంగా పార్కింగ్‌ సదుపాయం కల్పించారు. నగరంలోని కొన్ని ప్రాంతాలకు ఈవీలను తప్ప ఇతర వాహనాలను అనుమతించకుండా నిషేధం విధించడం వంటి విధానపరమైన నిర్ణయాలూ తీసుకోవడంతో ప్రజలు వాటివైపు మళ్ళకతప్పడం లేదు. భారత్‌లోనూ ఇటీవల కేంద్రం ఈవీలపై జీఎస్టీని 12 శాతం నుంచి అయిదు శాతానికి తగ్గించింది. ఈ వాహనాల వినియోగానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరచాలని ఇటీవలి ఆర్థిక సర్వే సూచించింది. జాతీయ రహదారులు, ప్రధాన రోడ్ల వెంట ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లను పెద్దయెత్తున ఏర్పాటు చేయాలి. ఇప్పటికే పుణెలో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో విద్యుత్‌ వాహనాలను ఎక్కువగా వినియోగిస్తున్నా, అక్కడ ఛార్జింగ్‌ సమస్యలతో సతమతమవుతున్నారు. ఛార్జింగ్‌ స్టేషన్లు లేకపోవడం ఈవీల వినియోగానికి అడ్డంకిగా మారుతోంది. వీటి ఛార్జింగ్‌కు అరగంట నుంచి ఎనిమిది గంటల వరకు సమయం పడుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో వేగంగా ఛార్జి చేసే సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిని ఇక్కడి సామాన్యులకు ఎప్పటిలోగా అందుబాటులోకి తెస్తారనే దానిమీదే ఈవీల విస్తరణ ఆధారపడి ఉంటుంది. ఈ వాహనాల్లో వినియోగించే లిథియం బ్యాటరీల ధర అధికంగా ఉంది. లిథియం, కోబాల్టును దిగుమతి చేసుకుని బ్యాటరీలను తయారు చేయడంవల్ల వాటి వ్యయం అధికమవుతోంది. లిథియం ఐయాన్‌ బ్యాటరీ తయారీ పరిశ్రమల్లో పెట్టుబడుల ద్వారా చైనాలో ఈవీల తయారీ వ్యయాన్ని తగ్గించగలుగుతున్నారు. భారత ప్రభుత్వమూ అదేరీతిలో ముందుకెళ్తేనే ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. దేశంలోని వేడి వాతావరణాన్ని తట్టుకుని పనిచేసేలా బ్యాటరీల పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరచాలి. పలు దేశాలతో పోలిస్తే వాయు, వాహన కాలుష్యాన్ని అరికట్టే చర్యల్లో భారత్‌ చాలా వెనకబడి ఉంది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే విద్యుత్‌ వాహనాలు రోడ్లపైకి వెల్లువలా రావాల్సిందే!


- మంగమూరి శ్రీనివాస్‌
Posted on 04-08-2019