Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

విస్తరిస్తున్న జిహాదీ పడగ నీడ!

ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఉగ్రవాదం అంతకంతకు కోరలు చాస్తోంది. సిరియాలో సాధించిన విజయం ఇచ్చిన ఉత్సాహంతో అది మరింత పెట్రేగుతోంది. అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనల దాడులను దీటుగా ఎదుర్కొంటూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. చాపకింద నీరులా ఒక్కో దేశానికీ విస్తరిస్తున్న ఐఎస్‌ ఉగ్రవాదాన్ని వైమానిక దాడుల ద్వారా మాత్రమే మట్టుపెట్టడం సాధ్యం కాదు. ఈ ఉగ్రవాద విషభుజంగాల కోరలు పీకాలంటే, దేశాలన్నీ పదాతి దళాలను కదనరంగానికి ఉరికించాలి. అందుకోసం ఉమ్మడి వ్యూహంతో ముందుకు కదలాలంటున్న వ్యాసమిది...

సిరియా సరిహద్దు పట్టణమైన కొబానీని ముట్టడిస్తున్న ఐఎస్‌ఐఎల్‌ (ఇస్లామిక్‌ స్టేట్‌ ఇన్‌ ఇరాక్‌ అండ్‌ ద లెవెంట్‌) ఉగ్రవాదుల్ని తరిమికొట్టడానికి నెల రోజులకు పైగా జరుగుతున్న పోరాటం సఫలం కావడంలేదు. ఎంతటి వైమానిక శక్తిసామర్థ్యాలు ఉన్నప్పటికీ, యుద్ధాలు గెలవడానికి అది మాత్రమే సరిపోదని దీన్నిబట్టి స్పష్టమవుతోంది. ఇలాంటి సందర్భాల్లో పదాతిదళాలు అత్యంత కీలకమవుతాయి. పరిస్థితి చూస్తుంటే, ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఉగ్రవాదులతో వివిధ దేశాలు ఉమ్మడిగా సాగిస్తున్న పోరాటం కొన్ని నెలలపాటు కొనసాగవచ్చుననిపిస్తోంది. సంకీర్ణ సేనల వైమానిక దాడులవల్ల ఉగ్రవాదులు ఒక అడుగు వెనక్కి తగ్గవచ్చునేమో కానీ, వారిని పూర్తిగా తరిమికొట్టడం సాధ్యం కాదు. ఇరాకీ భద్రతా దళాలు, షియా సైన్యం, పెష్మెర్గాలు సంయుక్త ప్రతిఘటన ద్వారా ఐఎస్‌ ఉగ్రవాదులను కొంతవరకు కట్టడి చేయగలిగారు. కుర్దుసేనల మీద అమెరికా అధికంగా ఆధారపడుతోంది. అమెరికా దళాలు ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదుల స్థావరాలమీద పెద్దయెత్తున వైమానిక దాడులు నిర్వహించడమే కాకుండా; కుర్దు దళాల కోసం ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఔషధాలూ జారవిడిచాయి. కానీ, కుర్దు దళాలను తన శత్రువులుగా పరిగణిస్తున్న టర్కీ మాత్రం, సంకీర్ణ సేనతో కలవడానికి సిద్ధంగా లేదు. ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదుల్ని బలహీనపరచే చర్యల్ని టర్కీ వ్యతిరేకించకపోవచ్చుకానీ, కొబానీ వద్ద తీవ్రస్థాయిలో పోరాటం సాగిస్తున్న కుర్దు యోధులకు సహాయపడేందుకు మాత్రం అది సుముఖంగా లేదు. ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు ఏదో ఒక రూపేణా తమ కార్యకలాపాలు కొనసాగించే అవకాశాలు ఉన్నాయని దీంతో తేటతెల్లమవుతోంది.

బుస కొడుతున్న విషనాగులు

మొన్న జూన్‌ ఆఖరులో ఖలీఫా రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ ద లెవెంట్‌, దరిమిలా ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌)గా పరివర్తన చెందింది. ఇరాక్‌ ఉత్తరాది పట్టణాలైన మొసుల్‌, తిక్రిత్‌లను తమ అధీనంలోకి తెచ్చుకొన్నాక, టర్కీ సరిహద్దులోని సిరియా ఈశాన్య ప్రాంతాలమీద నియంత్రణ సాధించడంపై అది దృష్టి కేంద్రీకరించింది. 2008లో ఇరాకీ, అమెరికా సేనల చేతిలో పరాజయం పాలైన 'అల్‌ఖైదా ఇన్‌ ఇరాక్‌ (ఏక్యూఐ)'- ప్రస్తుత ఇస్లామిక్‌ స్టేట్‌కు మాతృక. మాజీ ఖైదీలు, సద్దాం జమానా నాటి సైనికాధికారులు అందులో కీలక పాత్రధారులు, సూత్రధారులు. సిరియా తిరుగుబాటును అది తన ఎదుగుదలకు ఉపయోగించుకొంది. సిరియా యుద్ధం నుంచి అది గణనీయ ప్రయోజనం పొందింది. సిరియా అధ్యక్షుడు అస్సాద్‌ను పదవీచ్యుతుణ్ని చేసేందుకు కంకణం కట్టుకున్న గల్ఫ్‌ దేశాలు, ప్రైవేటు రుణదాతలు ఇస్లామిక్‌ స్టేట్‌కు సిబ్బందిపరంగా, ఆర్థికంగా సహాయ సహకారాలు అందజేస్తుండటం గమనార్హం. పెద్దసంఖ్యలో విదేశీ జిహాదీలు చేరుతుండటంతో ఐఎస్‌ క్రమేపీ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ రూపాన్ని సంతరించుకుంటోంది. సిరియా అంతర్యుద్ధంలో కలుగజేసుకున్న ఐఎస్‌- ఆ దేశంలోని అల్‌ రఖా, ఇద్లిబ్‌, దియెర్‌ ఎజార్‌, అలెప్పొ ప్రాంతాల్లో వేళ్లూనుకొంది. ఇరాక్‌లోని సున్నీ సంఖ్యాధిక్య ప్రాంతాల్లో ఇస్లామిక్‌ రాజ్యాన్ని ఏర్పాటు చేయడం దాని ప్రధాన లక్ష్యమైనప్పటికీ, సిరియా అంతర్యుద్ధంలో విజయాల దరిమిలా ఆ దేశంలోని సున్నీ సంఖ్యాధిక్య ప్రాంతాలకూ ఇస్లామిక్‌ రాజ్యాన్ని విస్తరిస్తోంది. దాని దూకుడుకు సిరియాలోని ముజాహిదీన్‌ సేన, అల్‌నుస్రా వంటి ఇస్లామిక్‌ వర్గాలూ కంగుతిని, కుంగిపోయాయి.

అడ్డాగా మారిన సిరియా

అఫ్గానిస్థాన్‌, ఇరాక్‌లకన్నా సిరియాలోనే ఇప్పుడు జిహాదీ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. అదే అత్యంత అనుకూలంగా ఉండటంతో చెలరేగిపోతున్నారు. యునైటెడ్‌ కింగ్డమ్‌, ఫ్రాన్స్‌, టర్కీలకు చెందిన ఉగ్రవాదులు ఇస్లామిక్‌ స్టేట్‌లో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. డెన్మార్క్‌, ఉజ్బెకిస్థాన్‌, ఐర్లాండ్‌, మొరాకో దేశాల్లోని ఇస్లామిక్‌ ఉగ్రవాద వర్గాలు ఇస్లామిక్‌ స్టేట్‌ సహా సిరియాలోని ఇతర ఉగ్రవాదులకు అన్నివిధాలా సహాయ సహకారాలు అందజేస్తున్నాయి. సిరియాలోని అలెప్పొ, లటకియా, ఇద్లిబ్‌ తదితర రాష్ట్రాల్లో దాదాపు వెయ్యిమంది ఉగ్రవాదులు పోరాడుతున్నారన్నది వార్తా సంస్థల భోగట్టా. సిరియాలో జరుగుతున్న పోరులో దాదాపు 500మంది ఐరోపా పౌరులు ఉన్నారని, వారిలో అత్యధికులు యునైటెడ్‌ కింగ్డమ్‌, ఫ్రాన్స్‌, ఐర్లాండ్‌ దేశాలకు చెందినవారని ఐరోపా సమాజ ఉగ్రవాద నిరోధ కార్యకలాపాల సమన్వయకర్త గిలిస్‌ డె కెర్చోవ్‌ అంచనా వేశారు. సిరియాలో ఘర్షణ 2011 మొదట్లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఆస్ట్రియా, స్పెయిన్‌, స్వీడన్‌, యునైటెడ్‌ కింగ్డమ్‌, జర్మనీసహా 14 ఐరోపా దేశాలకు చెందిన 600మంది దాకా పోరులో పాల్గొన్నారని లండన్‌లోని కింగ్స్‌ కళాశాలకు చెందిన పిడివాద అధ్యయనాల అంతర్జాతీయ కేంద్రం జరిపిన ఒక సర్వేలో వెల్లడైంది. సిరియా పోరాటంలో భాగం పంచుకొన్న విదేశీ ఉగ్రవాదుల్లో అత్యధికులు యునైటెడ్‌ కింగ్డమ్‌కు చెందినవారే. 2012 జులై, 2013 మే మధ్యకాలంలో సిరియాలో ఉగ్రవాదులతో కలిసి పోరాడుతూ మరణించిన విదేశీయుల్లో లిబియన్లు 60మంది, ట్యునీసియాకు చెందినవారు 47మంది, సౌదీ అరేబియా నుంచి వచ్చినవారు 44మంది ఉన్నట్టు తేలింది. 'వాషింగ్టన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ నియర్‌ ఈస్ట్‌ పాలసీ', 'ఫ్లాష్‌ పాయింట్‌ గ్లోబల్‌ పార్టనర్స్‌' సంస్థలు సంయుక్తంగా ఉగ్రవాద వర్గాల అంతర్జాల సైట్లను పర్యవేక్షించి, విశ్లేషించి ఈ నిర్ధారణకు వచ్చాయి. సిరియా అంతర్యుద్ధంలో మరణించిన ఉగ్రవాదుల్లో డెన్మార్క్‌, ఫ్రాన్స్‌, ఉజ్బెకిస్థాన్‌, ఐర్లాండ్‌, మొరాకో, టర్కీ యునైటెడ్‌ కింగ్డమ్‌, అమెరికాలకు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నారు. సిరియాలో ప్రస్తుత పాలకులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో 5,500మంది దాకా విదేశీయులు పాలుపంచుకుంటున్నట్లు జిహాదీ వెబ్‌సైట్‌లో తెలిపారు. అస్సాద్‌ పరిపాలనకు అంతం పలికి, సిరియాను ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని 'ఫ్రీ సిరియన్‌ ఆర్మీ' అంటున్నప్పటికీ, జిహాదీల లక్ష్యం వేరుగా ఉంది. అస్సాద్‌ను కూలదోసి, సిరియాలో ఇస్లామిక్‌ పరిపాలనను నెలకొల్పాలన్నది వారి ధ్యేయం. ఇలాంటి ఉగ్రవాద వర్గాలకు ప్రపంచంలోని కొన్ని శక్తిమంతమైన దేశాలు సహకరిస్తుండటం దురదృష్టకరం. దీనివల్ల భవిష్యత్తులో తమ భద్రతకే ముప్పు అని అవి గ్రహించలేకపోతున్నాయి. తాత్కాలిక ప్రయోజనాసక్తితో అవి చేపడుతున్న చర్యలు అంతిమంగా జిహాదీ వర్గాల బలోపేతానికే తోడ్పడుతున్నాయి. అమెరికా గూఢచార సంస్థ సీఐఏ మొన్న సెప్టెంబరులో వెలువరించిన అంచనాల ప్రకారం- ఇరాక్‌, సిరియాల్లో ఇస్లామిక్‌ స్టేట్‌కోసం 20వేలనుంచి 31వేలకు పైబడి ఉగ్రవాదులు పనిచేస్తున్నారు.

సమన్వయంతోనే చరమగీతం

ప్రపంచంలోని పెద్ద దేశాలు ఒక వ్యూహంకానీ, ముందుచూపుకానీ లేకుండా వ్యవహరించినందువల్లే ఇరాక్‌, సిరియాల్లో ఖలీఫా రాజ్యాన్ని ఇస్లామిక్‌ స్టేట్‌ పటిష్ఠం చేసుకోగలుగుతోంది. ఇస్లామిక్‌ స్టేట్‌ అకృత్యాలకు అంతే లేకుండాపోతోంది. బహిరంగంగా మరణశిక్షల అమలు శిరచ్ఛేదాలు, అపహరణలు, చిత్రహింసలు, బలవంతపు మతమార్పిళ్లు, లైంగికపరమైన అఘాయిత్యాలు, పట్టుబడిన సైనికుల కిరాతక హత్యలు, తమకు పడని జాతి, మతవర్గాల అణచివేత వంటివి నిత్యకృత్యాలుగా మారాయి. ఇరాక్‌, సిరియాల్లో విజయాలతో రెచ్చిపోతున్న జిహాదీ శక్తులు, ఇప్పడు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోనూ చెలరేగుతున్నాయి. యూజదీలు, షియా ముస్లిములు, పశ్చిమ దేశాల బందీలను అత్యంత దారుణంగా వారు హతమారుస్తున్నారు. దీంతో, ఇస్లామిక్‌ స్టేట్‌ను మట్టుపెట్టేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా నాలుగు సూత్రాల వ్యూహాన్ని ప్రకటించారు. ఇరాక్‌, సిరియాలను కాపాడేందుకు విస్తృతస్థాయి సంకీర్ణాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఇస్లామిక్‌ స్టేట్‌తో పోరాటానికి కలిసివస్తామని తొమ్మిది దేశాలు ముందుకు రావడంతో ఆయన ప్రయత్నం కొంతవరకు ఫలించింది. ఇస్లామిక్‌ స్టేట్‌ పురోగమనానికి పెద్ద దేశాలు ఏ విధంగా అడ్డుకట్ట వేయగలవన్న దానిమీదే ఒబామా వ్యూహ సాఫల్య వైఫల్యాలు ఆధారపడి ఉన్నాయి. అఫ్గానిస్థాన్‌, ఇరాక్‌లలో చేదు అనుభవాల దరిమిలా పెద్దయెత్తున సైన్యాన్ని రంగంలోకి దించేందుకు అమెరికా సుముఖంగా లేదు. కానీ, వివిధ దేశాలు విస్తృతస్థాయి సంకీర్ణంగా ఏర్పడి, ఉమ్మడిగా ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనక తప్పదు. కేవలం సైనిక శక్తితోనే ఇస్లామిక్‌ స్టేట్‌ను మట్టికరిపించలేం. సైద్ధాంతిక సారూప్యత, వనరులు, సమాచార సాంకేతిక పరిజ్ఞానాలు, భారీయెత్తున పోరాట యోధుల నియామకాల వంటి చర్యల ద్వారానే సత్ఫలితాలు సాధించవచ్చు. యుద్ధనేరాలు, మారణ హోమాలు, మానవాళిపట్ల అపచారాలు, దురాక్రమణ సంబంధ నేరాల మీద విచారణ జరిపే అధికారం అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు(ఐసీసీ)కి ఉంది. అందువల్ల ఇరాక్‌, సిరియాల్లో అరాచకాలకు, అపరాధాలకు పాల్పడుతున్న ఇస్లామిక్‌ స్టేట్‌మీద ఐసీసీలో విచారణ జరిపే అవకాశాన్ని పరిశీలించాలి. ఐసీసీ ఏర్పాటుకు సంబంధించిన శాసనాధికార పత్రాలమీద ఇరాక్‌, సిరియాలు సంతకాలు చేయలేదు. అందువల్ల, భద్రతామండలి సిఫార్సుద్వారా ఐసీసీ విచారణ చేపట్టవచ్చు. ఉత్తర ఉగాండాలోని లార్డ్స్‌ రెసిస్టెన్స్‌ ఆర్మీ తీవ్ర హింసాత్మక ఉగ్రవాద చర్యలకు పాల్పడినప్పుడు ఐసీసీ విచారణ జరిపింది. ఇప్పుడు ఇస్లామిక్‌ స్టేట్‌ వ్యవహారమూ అలాంటిదే. ఈ రకమైన దర్యాప్తువల్ల ఇస్లామిక్‌ స్టేట్‌ను నీరుగార్చవచ్చు. అది వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. అందుకు చాలా సమయం పట్టవచ్చు. అమెరికా సారథ్యంలోని సంకీర్ణ సేనల వైమానిక దాడులు ప్రపంచంలో ఎక్కడా చెప్పుకోదగ్గ ఫలితాలు ఇవ్వలేదు. వాటి కారణంగా లిబియాలో అరాచకమే మిగిలింది. అక్కడ సమీప భవిష్యత్తులో పరిస్థితి మెరుగుపడే అవకాశమే కనిపించడంలేదు. ఎమెన్‌లో 'డ్రోన్‌' దాడులవల్ల చెప్పుకోదగ్గ ప్రయోజనమేదీ చేకూరలేదు. కుర్దు దళాలు, ఇరాకీ సైన్యం కలిసి ఒకవేళ ఇస్లామిక్‌ స్టేట్‌ను ఇరాక్‌ నుంచి తరిమికొట్టగలిగినప్పటికీ సిరియాలో దాని విజృంభణను అడ్డుకోవడం మాత్రం కష్టమే. ఈ పరిస్థితుల్లో సంకీర్ణ సేనలు మరికొన్ని నెలలపాటు వైమానిక దాడులు నిర్వహించినా పెద్దగా లాభం ఉండదు. పదాతి దళాలను రంగంలోకి దింపితే తప్ప ఫలితం చేకూరదు.

(రచయిత - కె.సి.రెడ్డి)
Posted on 11-11-2014