Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

మైత్రీపథంలో మైలురాయి!

* భారత్‌-అమెరికా రక్షణ బంధం

నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవి స్వీకరించాక అమెరికా పట్ల ఎన్డీయే ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతోందా అని అనుమానాలు తలెత్తాయి. ద్వైపాక్షిక సంబంధాలు బహుశా క్షీణిస్తాయేమోనని కొందరు సందేహించారు కూడా. 2005లో మోదీకి అమెరికా వీసా నిరాకరించి ఉండటమే ఈ సందేహాలకు కారణం. వీటికి భిన్నంగా భారత్‌-అమెరికా సంబంధాలు సమూలంగా రూపాంతరం చెందడంతో అన్ని అనుమానాలూ పటాపంచలైపోయాయి. గడచిన రెండేళ్లలో ప్రధాని మోదీ నాలుగుసార్లు అమెరికాను సందర్శించారు. అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో ఏడుసార్లు సమావేశమయ్యారు. ఆర్థిక, సైనిక రంగాల్లో భారతదేశానికి అమెరికాను బలీయ భాగస్వామిగా నిలబెట్టడమే లక్ష్యంగా ఈ సమావేశాలు జరిగాయి. మోదీ అమెరికా యాత్రలో మూడు ముఖ్యమైన పరిణామాలు సంభవించాయి. ఒకటి- ప్రపంచమంతటా వివిధ యుద్ధాల్లో మరణించిన అమెరికన్‌ సైనికుల సమాధులున్న ఆర్లింగ్టన్‌ జాతీయ శ్మశానవాటికకు వెళ్లి నివాళులు అర్పించారు. ప్రమాదంలో మరణించిన భారత సంతతి వ్యోమగామి కల్పనా చావ్లాకు మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. రెండు- మోదీ, ఒబామా చర్చల తరవాత విడుదలైన సంయుక్త ప్రకటన రెండు దేశాల వ్యూహ లక్ష్యాల్లో సారూప్యత పెరుగుతోందని ఉద్ఘాటించింది. మూడు- భారత్‌, అమెరికా సంబంధాలు చారిత్రక సంక్షోభాలను అధిగమించాయని అమెరికా కాంగ్రెస్‌ సంయుక్త సమావేశంలో మోదీ ప్రకటించారు. అమెరికా నుంచి భారత్‌కు రక్షణ ఎగుమతులు కేవలం దశాబ్దకాలంలోనే సున్నా నుంచి వెయ్యి కోట్ల డాలర్లకు పెరగడం విశేషమని ఆయన గుర్తుచేశారు.

ఆయుధ ఉత్పత్తి దిశగా అడుగులు
పాకిస్థాన్‌, చైనాల జగడాలమారి వైఖరి వల్ల భారతదేశం రక్షణపరంగా సదా సన్నద్ధమై ఉండాల్సి వస్తోంది. స్వదేశంలో ఆయుధోత్పత్తి వ్యవస్థ సరిగ్గా అభివృద్ధి చెందకపోవడంతో ఇప్పటికీ 70శాతం ఆయుధాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీనిపై అపారంగా విదేశ మారక ద్రవ్యాన్ని వెచ్చించక తప్పడంలేదు. ఎంతసేపటికీ విదేశీ దిగుమతులపై ఆధారపడటంవల్ల స్వదేశంలో ఉపాధి అవకాశాలు పెరగడంలేదు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని భారతదేశం కేవలం దిగుమతులకు పరిమితమైపోకుండా విదేశాలతో కలిసి ఆయుధాల రూపకల్పన, ఉత్పత్తి చేపట్టాలనుకుంటోంది. తదనుగుణంగా భారత్‌-అమెరికాలు రక్షణ సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్య ఒప్పందం (డీటీటీఐ)ని కుదుర్చుకున్నాయి. దీనికింద మొబైల్‌ ఎలక్ట్రిక్‌ హైబ్రిడ్‌ పవర్‌ సోర్సెస్‌(సంచార బ్యాటరీలు), ఆధునిక రక్షణ కవచాల తయారీ ప్రాజెక్టులను చేపట్టాయి. విమాన వాహక యుద్ధనౌకలు, జెట్‌ ఇంజన్ల రూపకల్పన, ఉత్పత్తిలో పరస్పర సహకారానికి కార్యాచరణ బృందాలను నియమించాయి. భారతదేశానికి నిరాటంకంగా అధునాతన పరిజ్ఞానాల బదిలీ జరగడానికి వీలుగా అమెరికా రక్షణ కార్యదర్శి ఏష్టన్‌ కార్టర్‌ ఓ శీఘ్ర స్పందన విభాగాన్ని నెలకొల్పారు. రక్షణ రంగంలో భారతదేశాన్ని సన్నిహిత మిత్రదేశంగా, భాగస్వామిగా పరిగణించాలని అమెరికా నిర్ణయించింది. పౌర, సైనిక అవసరాలు రెండింటికీ ఉపయోగపడే టెక్నాలజీలను లైసెన్సు అవసరం లేకుండా వినియోగించుకునే సదుపాయాన్ని భారత్‌కు కల్పించడానికి సై అన్నది. మానవ రహిత గగనతల వాహనాలు(డ్రోన్‌లు), విమానాల ఇంజన్లు ఈ కోవలోకి వస్తాయి.

వ్యూహాత్మక అనుబంధం
ఆసియా-పసిఫిక్‌, హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో 2015 భారత్‌-అమెరికా సంయుక్త వ్యూహం కింద సహకారానికి, మార్గనిర్దేశ పత్రంపైనా రెండు దేశాలూ అంగీకారం కుదుర్చుకున్నాయి. భారత్‌-అమెరికా దళాలు పలు సంయుక్త విన్యాసాలు జరుపుతున్నాయి. రెండు దేశాల సైన్యాలు యుద్ధ అభ్యాస్‌, వాయుసేనలు కోప్‌ ఇండియా, నౌకాదళాలు మలబార్‌ పేరిట ఈ విన్యాసాలు జరుపుతున్నాయి. 2014లో మొట్టమొదటిసారిగా భారతదేశం రిమ్‌ ఆఫ్‌ ది పసిఫిక్‌ (రింపాక్‌) నౌకా విన్యాసాల్లో పాల్గొంది. ఆపరేషన్‌ మలబార్‌లో తాజాగా జపాన్‌ చేరింది. ఇదిలాఉంటే భారత్‌ రక్షణ రంగంలో ఇతర దేశాలను అలక్ష్యం చేస్తూ అమెరికా మీదే ఎక్కువగా ఆధారపడుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కానీ, 2015లో మన ఆయుధ అవసరాల్లో 10శాతమే అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నామని ఇక్కడ గుర్తించాలి. ఇప్పటికీ 60శాతానికిపైగా ఆయుధాలను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. రష్యా నుంచి దశాబ్దాలుగా ఆయుధాలు కొంటున్నా, భారత్‌లో ఇప్పటికీ స్వదేశీ రక్షణ పరిశ్రమ పటిష్ఠం కాలేదు. రాబోయే సంవత్సరాల్లో సొంతగా ఆయుధాలను తయారుచేసుకుని విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భారత్‌ లక్షిస్తోంది. అమెరికా సహకారం ఇందుకు ఉపయోగపడనుంది.
భారత్‌ సొంతంగా రూపొందించిన తేజస్‌ యుద్ధ విమానాల్లో అమెరికన్‌ ఇంజన్లనే వాడుతున్నారు. వీటికన్నా శక్తిమంతమైన ఇంజన్లను అమెరికా నుంచే సంపాదించడానికి ఇప్పుడు సానుకూల వాతావరణం ఏర్పడింది. మొత్తం 45 స్క్వాడ్రన్లతో సిద్ధంగా ఉండాల్సిన భారత వాయుసేనలో ఇప్పుడు కేవలం 33 స్క్వాడ్రన్లు ఉన్నాయి. (ఒక్కో స్క్వాడ్రన్‌లో 18 విమానాలుంటాయి). మన స్క్వాడ్రన్‌ బలం బాగా తగ్గిపోవడం దేశ రక్షణకు ఏమాత్రం మంచిది కాదు. ఈ లోటును అధిగమించాలంటే మేకిన్‌ ఇండియా కింద స్వదేశంలోనే ఫైటర్‌ విమానాలను పెద్దయెత్తున ఉత్పత్తి చేయాలి. అమెరికన్‌ సంస్థలైన బోయింగ్‌, లాక్‌ హీడ్‌ మార్టిన్‌లు తమ ఎఫ్‌ ఏ-18, ఎఫ్‌-16 విమానాలను భారత్‌లో తయారుచేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ అంశంపై భారత ప్రభుత్వం మరికొన్ని నెలల్లో తుది నిర్ణయం తీసుకోనుంది.

ఉపాధికి ఆలంబనగా...
ఫైటర్‌ విమానాల తయారీ స్వదేశంలో ఉపాధి అవకాశాల విస్తరణకు, కొత్త టెక్నాలజీల బదిలీ, భారతీయ పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇప్పటికే విమానాల పరిశ్రమ వేళ్లూనుకొంటున్న హైదరాబాద్‌కు, తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు ఎంతో లబ్ధి చేకూరుతుంది. లాక్‌ హీడ్‌ మార్టిన్‌, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ కలిసి సీ-130జే రవాణా విమానాల విడిభాగాలను హైదరాబాద్‌లోనే తయారుచేస్తున్నాయి. వీటిని భారతీయ వాయుసేనతోపాటు ఇతర దేశాలూ వినియోగిస్తున్నాయి. టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌, సికోర్‌ స్కీ సంస్థలు కలిసి హెలికాప్టర్‌ క్యాబిన్లు తయారుచేస్తుండగా, టాటా బోయింగ్‌ సంయుక్త సంస్థ ఏహెచ్‌-64 అపాచీ హెలికాప్టర్ల ప్యూజ్‌ లేజ్‌ల తయారీని కొత్తగా చేపట్టనుంది. మున్ముందు అత్యాధునిక ఫైటర్‌ విమానాల తయారీకి హైదరాబాద్‌ను సన్నద్ధం చేయాలి. దీనివల్ల ఉపాధి అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి. ఇటీవలే క్షిపణి పరిజ్ఞాన నియంత్రణ ఒప్పందం(ఎంటీసీఆర్‌)లో చేరిన భారత్‌, అణు సరఫరాదారుల బృందం(ఎన్‌ఎస్‌జీ)లోనూ చేరడానికి గట్టి ప్రయత్నం చేస్తోంది. పౌర, సైనిక అవసరాలు రెండింటికీ ఉపకరించే పరిజ్ఞానాల ఎగుమతిని నియంత్రించే వాస్సెనార్‌ ఒప్పందం; రసాయన, జీవ ఆయుధాలవ్యాప్తిని నియంత్రించే ఆస్ట్రేలియా గ్రూప్‌లోనూ చేరడానికి అమెరికా సహకారం కోరుతోంది. ఈ గ్రూపుల్లో భారత్‌ చేరినట్లయితే అంతర్జాతీయ ఆయుధ సంస్థలు భారత్‌లో ఉత్పత్తి చేపట్టడానికి, తమ ఆయుధాలను భారత్‌కు విక్రయించడానికి వీలవుతుంది.
అమెరికాతో కలిసి ఆయుధ ఉత్పత్తి సాగించడంతోపాటు ఇతర సైనిక ఒప్పందాలను కుదుర్చుకోవడానికి భారత్‌ సంప్రతింపులు జరుపుతోంది. సైనిక సాధన సంపత్తి సరఫరా(ఎల్‌ఎస్‌ఏ); కమ్యూనికేషన్లు, సమాచార భద్రత ఒప్పందం (సిస్మోవా); మౌలిక మార్పిడి, సహకార (బీఈసీఏ) ఒప్పందాలపై రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. వీటిలో ఎల్‌ఎస్‌ఏపై త్వరలో సంతకాలు జరిగే అవకాశం ఉంది. సాధన సంపత్తి సరఫరా, మరమ్మతులు, విశ్రాంతికి రెండు దేశాల భూభాగాలను, పదాతి, వాయు, నౌకా సేనల స్థావరాలను పరస్పరం వినియోగించుకోవడానికి ఎల్‌ఎస్‌ఏ వీలుకల్పిస్తుంది. కానీ, దీనివల్ల భారత భూభాగంపై పెద్దయెత్తున అమెరికా సేనలు తిష్ఠవేసే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఏదైనా భారత మిత్రదేశంపై అమెరికా యుద్ధానికి దిగితే దాని సేనలకు మన స్థావరాలను ఇవ్వాల్సి వస్తుందని, మన ప్రభుత్వానికి తెలపకుండానే మన స్థావరాలనుంచి ఇతర దేశాలపై దాడులు నిర్వహించే అవకాశం అమెరికాకు ఉంటుందని కొందరు అంటున్నారు. దీనికి స్పందించిన అమెరికా రక్షణ మంత్రి కార్టర్‌, భారత గడ్డపై అమెరికా సేనలు ఉండవని, ఎప్పుడు అవసరమైతే అప్పుడు మాత్రమే ఎల్‌ఎస్‌ఏ కింద సహకారం నడుస్తుందని వివరణ ఇచ్చారు. ఇది ఇతర ఎల్‌ఎస్‌ఏల వంటిది కాదు కాబట్టి దీనికి సాధన సంపత్తి మార్పిడికి అవగాహనా ఒప్పందం (లెమోవా) అని పునఃనామకరణ చేశారు.

అనుభవం నేర్పిన పాఠం
అమెరికా ఏకకాలంలో భారత్‌, పాకిస్థాన్‌లకు ఆయుధాలు విక్రయిస్తోంది. కాబట్టి అది నమ్మదగిన భాగస్వామి కాదనే విమర్శలూ వినవస్తుంటాయి. అయితే రష్యా కూడా భారత్‌తోపాటు చైనాకూ ఆయుధాలు విక్రయిస్తోందని మరవకూడదు. రష్యా 2005 వరకు భారత్‌ కన్నా చైనాకే ఎక్కువ ఆయుధాలు విక్రయించింది. ఆ తరవాత చైనా స్వదేశీ రక్షణ పరిశ్రమను అభివృద్ధి చేసుకోవడంతో రష్యన్‌ ఎగుమతులు తగ్గిపోసాగాయి. అయినా కీలకమైన రష్యన్‌ ఆయుధాలను ఇప్పటికీ చైనాకు విక్రయిస్తున్నారు. వీటిలో అత్యాధునిక సుఖోయ్‌-35 యుద్ధవిమానాలు, ఎస్‌-400 వంటి అధునాతన క్షిపణులు, ట్రయంఫ్‌ దూరశ్రేణి విమాన విధ్వంసక క్షిపణులు ఉన్నాయి. చైనా రూపొందించిన అయిదో తరం యుద్ధవిమానం జె-20 స్టెల్త్‌ ఫైటర్‌కూ రష్యా గణనీయంగా సాంకేతిక సహకారం అందించినట్లు వార్తలు వచ్చాయి. రష్యా-చైనా రక్షణ బంధం భారత్‌-రష్యా రక్షణ బంధానికి అడ్డురానంతకాలం, అమెరికా పాకిస్థాన్‌కూ ఆయుధాలు విక్రయించడంపై భారత్‌కు అభ్యంతరాలు ఉండనక్కర్లేదు.
భారతదేశం ఇటీవలికాలంలో తన పాత అనుభవాల నుంచి విలువైన పాఠాలు నేర్చుకుంటోంది. నేడు అమెరికాతో రక్షణ భాగస్వామ్యం రేపు అత్యధునాతన టెక్నాలజీలు పొందడానికి తోడ్పడబోతోంది. అమెరికా సహకారంతో మేకిన్‌ ఇండియాను ముందుకు తీసుకెళ్లడానికి భారత్‌ ప్రయత్నిస్తోంది. భారత్‌-అమెరికాలు ఏ రంగంలోనూ పోటీదారులు కావు. అరేబియా సముద్రం నుంచి పసిఫిక్‌ మహాసముద్రం వరకు రెండు దేశాలూ చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయాలనే ఉమ్మడి లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. రెండు దేశాల ప్రైవేటు రంగాల మధ్య సహకారం విస్తరిస్తోంది. కేంద్ర మంత్రిత్వశాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలూ కలిసి అమెరికాతో సహకారాన్ని సమర్థంగా ఉపయోగించుకోవాలి. అమెరికా-భారత్‌ల మధ్య వ్యాపార వృద్ధికి, సంయుక్త ఆయుధోత్పత్తికి అనుకూల వాతావరణం కల్పించాలి. దీనివల్ల ఉపాధి అవకాశాలు విస్తరించి, కొత్త టెక్నాలజీలు లభించి, భారత ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తుంది. దేశ భద్రతకూ పూచీ ఏర్పడుతుంది.

- సంజ‌య్ పులిపాక‌
(ఐసీఆర్ఐఈఆర్ స‌ల‌హాదారు)
Posted on 22-06-2015