Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

నిషేధం నష్టదాయకం

* పాకిస్థాన్‌కు విత్తనాల ఎగుమతులు

భారత్‌, పాకిస్థాన్‌ ప్రభుత్వాలు పరస్పర వాణిజ్య సంబంధాల్ని రద్దు చేసుకోవడంతో దేశీయ విత్తన పరిశ్రమకు చిక్కొచ్చిపడింది. భారత విత్తన రంగం తన భారీ ఎగుమతి మార్కెట్లలో ఒకదాన్ని కోల్పోయినట్లయింది. ఇరుదేశాల రైతుల ప్రయోజనార్థం రాజకీయాల్ని, ఆర్థిక వ్యవహారాల్నీ వేర్వేరుగా చూస్తే పరిస్థితులు చక్కబడవచ్చు.

అనేక సంవత్సరాలుగా పండ్లు, కూరగాయల విత్తనాలు మన దేశం నుంచి పాకిస్థాన్‌కు ఎగుమతి అవుతున్నాయి. భారత ఎగుమతులకు పాకిస్థాన్‌ మూడో అతిపెద్ద మార్కెట్‌. 2018-19లో భారత్‌ సుమారు 1.75 కోట్ల డాలర్లకు పైగా విలువైన పండ్లు, కూరగాయల విత్తనాలను ఎగుమతి చేసింది. భారతీయ విత్తనాలకు పాకిస్థాన్‌లో మంచి ఆదరణ ఉంది. ఇరుదేశాల మధ్య ఒకే తరహా వ్యవసాయ వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. భారత్‌ విత్తనాల నాణ్యత కారణంగా ఆయా ఆహార పంటల పదార్థాలు రుచికరంగా ఉంటాయని పాక్‌ ప్రజలు నమ్ముతారు. అధిక దిగుబడులనూ అందజేస్తాయి. ఈ ఆదరణను పత్తి, పప్పు ధాన్యాల వంటివాటికీ విస్తరించేగలిగితే ఎగుమతి రంగం అవకాశాలు మెరుగుపడతాయి. విత్తనాలు, మొక్కలకు సరిహద్దు తేడాలు ఉండవు. నేల, నీరు, వాతావరణ అనుకూలతలు ఉంటే చాలు... పంటలు పండుతాయి. ఉత్తర భారతంలో ఉత్పత్తయ్యే వరి, గోధుమ, చిక్కుడు, పత్తి తదితర విత్తనాల్లో అధిక భాగం పాకిస్థాన్‌కే ఎగుమతి అవుతాయి. భారతీయ విత్తనాలు పాక్‌లో మంచి ఫలితాలు ఇవ్వడానికి కారణం- ఇరు దేశాల్లో పంట సీజన్లు, వాతావరణ పరిస్థితులు, నేలల స్వభావమూ దాదాపు ఒకే రకంగా ఉండటమే

భారత్‌, పాక్‌ల మధ్య ఏటా రూ.1,300 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల మేర విత్తన వ్యాపారం జరుగుతోంది. రాబోయే సంవత్సరాల్లో ఇది రెండు వేల కోట్ల రూపాయలకు చేరుకోవచ్చని అంచనా. రైతులు విత్తన పెంపకదారులకు ప్రోత్సాహకరంగా ఉన్న ఈ పరిస్థితులు ఎగుమతులపై నిషేధం వల్ల ఒక్కసారిగా మారిపోయాయి. నిషేధ నిర్ణయం వల్ల మన అవకాశాలను మనమే దెబ్బ తీసుకుంటున్నట్లు అవుతోందనే అభిప్రాయాలున్నాయి. ఎగుమతులు లేక భారత్‌ నష్టపోతుండగా, సరఫరాకు అంతరాయం ఏర్పడి పాకిస్థాన్‌ ఇబ్బందులు పడుతోంది. ఈ పరిస్థితుల్ని చైనా విత్తన సంస్థలు అందిపుచ్చుకొని తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించుకుంటున్నాయి. పాక్‌, చైనా ప్రభుత్వాలు బాస్మతి బియ్యంలో సంకర రకం అభివృద్ధి దిశగా కసరత్తు చేస్తున్నాయి. వ్యవసాయ రంగంలో చైనా మరింతగా తమకు సహకారం అందజేయాలని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ విజ్ఞప్తి చేశారు. అయితే నాణ్యత విషయంలో భారత్‌తో చైనా విత్తనాలు పోటీపడే పరిస్థితి లేదన్నది నిర్వివాదం.

ఇరుదేశాల మధ్య రాజకీయ వైషమ్యాలు పెచ్చరిల్లుతున్నా, వివాహాలు తదితర కార్యక్రమాలకు హాజరయ్యే పాక్‌ పౌరులకు మనదేశం వీసాల్ని మంజూరు చేస్తూనే ఉంది. పాకిస్థాన్‌ సైతం ఇదే విధానాన్ని పాటిస్తోంది. ప్రజలను, వాణిజ్యాన్ని నిలువరించలేమన్న విషయం ఇరు ప్రభుత్వాలకు తెలియనిది కాదు. మానవతాదృక్పథంతో మనదేశం పాక్‌కు ఔషధాల విక్రయాల విషయంలో అడ్డుపడటం లేదు. అదే విధానాన్ని విత్తన వ్యాపారానికి వర్తింపజేయాలని ఈ రంగం ఎగుమతిదారులు కోరుతున్నారు. చట్టప్రకారం కొన్ని విత్తనాలు నిత్యావసరాల కిందకే వస్తాయి. ఆ విత్తనాలను పాక్‌లోని అత్యంత పేద రైతులు ఉపయోగిస్తున్న సంగతి విస్మరించరాదు. విత్తనాల విషయంలో మానవతాదృక్పథంతో వ్యవహరించడం ద్వారా గ్రామీణ పేదరికం, పోషకాహార లోపాలపై పాకిస్థాన్‌ చేస్తున్న పోరాటానికి మనదేశం అండగా నిలిచినట్లు అవుతుంది.

విత్తనాల పరీక్షకు సంబంధించి సార్క్‌ దేశాల్లో ఎక్కడాలేని అత్యుత్తమ మౌలిక సౌకర్యాలు భారత్‌లోనే ఉన్నాయి. ఈ క్రమంలో పాక్‌ విత్తనాల పరీక్షకు భారత్‌ కేంద్రంగానూ మారవచ్చు. నాణ్యత మదింపులో, పాక్‌కు సహకరించే విషయంలో భారత శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. తద్వారా వ్యవసాయ రంగంలో ఉద్యోగాల కల్పనకు బాటలు పడతాయి. భారత్‌ ధ్రువీకృత విత్తనాలకు అఫ్గానిస్థాన్‌, నేపాల్‌ తదితర దేశాల్లోనూ ఆదరణ ఉంది. ఈ క్రమంలో ఇరుదేశాల్లో రాజకీయాలకు ప్రభావితంకాని ఒక బలమైన వాణిజ్య వ్యవస్థ రూపుదిద్దుకునేలా కృషి చేయవచ్చు. ప్రస్తుతం భారత్‌, పాకిస్థాన్‌ విత్తన సాగుదారులు ఇతర దేశాల్లో కలుసుకుంటూ, వాణిజ్యావకాశాలపై చర్చించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వ్యాపారం చేసుకునేందుకు తృతీయ పక్షాన్ని ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ క్రమంలో అనవసరపు ఖర్చులూ చేయాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితులవల్ల ఇరు దేశాల విత్తనాలకు సంబంధించి ధరలు, రవాణాపరమైన ప్రయోజనాల్ని నష్టపోతున్నాయి.

ఇరుదేశాల మధ్య రాజకీయ విభేదాలు ఏడు దశాబ్దాలుగా కొనసాగుతున్నవే. వాణిజ్య చరిత్ర మాత్రం వేల ఏళ్లనాటిది. పంజాబ్‌, రాజస్థాన్‌ సహా ఇతర ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా విత్తనాలు సహా అనేక వస్తువుల మార్పిడి వాణిజ్యం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉపఖండంలోని పౌరులందరి ప్రయోజనాల గురించి ఆలోచించాల్సిన తరుణం వచ్చింది. ఐరోపాలోనూ ఫ్రాన్స్‌, జర్మనీ, యూకే వందల సంవత్సరాలపాటు పోరాటాలు జరిపి లక్షలమంది ప్రాణాలు బలితీసుకున్నాయి. ఆధునిక కాలంలో ఆర్థిక బంధాలతో ఒక్కటైపోయాయి. యుద్ధంకన్నా వాణిజ్యం, శాంతి మార్గాలు ఆచరణాత్మకమైనవి. వాణిజ్య ఆంక్షల పరిధి పరిమితం. భారత్‌, పాక్‌ల మధ్య రాజకీయ విభేదాలు సన్నగిల్లితే, విత్తన వాణిజ్యం మళ్ళీ పునరుద్ధరణ బాట పడుతుంది. ఆ మేరకు రైతు శ్రేయం, ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉభయ దేశాల ప్రభుత్వాలు సానుకూల నిర్ణయాలు తీసుకోవాలి.

- ఇంద్రశేఖర్‌సింగ్‌
Posted on 14-01-2020