Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

ద్వీపదేశంతో బంధం బలపడేనా?

* భారత్‌లో శ్రీలంక ప్రధాని

భారత పర్యటనను శ్రీలంక ప్రధాన మంత్రి మహింద రాజపక్స ఓ సంప్రదాయ వ్యవహారంగా భావిస్తున్నారు. అత్యంత చేరువగా ఉండి, భౌగోళికంగా వ్యూహాత్మక పొరుగు దేశమైన భారత్‌లో- కొత్తగా ఎన్నికైన శ్రీలంక అధ్యక్ష, ప్రధానమంత్రులు తమ పర్యటనను ఓ సంప్రదాయంలా భావించడంలో తప్పేమీలేదు. 2019 నవంబరు 18న శ్రీలంకకు అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా రాజపక్స సోదరుడు గోటబాయ భారత్‌లో పర్యటించారు. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం తాను పదవీ బాధ్యతలు చేపట్టాక శ్రీలంకలో పర్యటించారు. పొరుగు దేశాలకు ప్రాధాన్యమనే తన విదేశాంగ విధానాన్ని చాటుకునే క్రమంలో మోదీ శ్రీలంక పర్యటన చేపట్టారు. శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స పర్యటన తన సోదరుడైన గోటబాయ పర్యటనకు భిన్నమైంది. అధ్యక్షుడు గోటబాయ ప్రధాన స్రవంతి రాజకీయాలకు కొత్త. విదేశీ సంబంధాల్లో విభిన్న ప్రతిష్ఠను, తటస్థతను చాటుకోవాలని భావిస్తున్నారు. తన సోదరుడి ప్రభుత్వంలో శక్తిమంతమైన రక్షణమంత్రిగా ఉన్నప్పుడు గోటబాయ భారత సహకారంతో ఎల్‌టీటీఈని అణచివేశారు. 2009 మే నెలలో ఎల్‌టీటీఈని సైనికపరంగా ఓడించారు. అయితే, మహింద రాజపక్స మాత్రం రెండోసారి పదవీ కాలంలో చైనావైపు మొగ్గు చూపారు. ఇతర దేశాలకు మించి శ్రీలంక, చైనా సంబంధాల్ని బలోపేతం చేశారు. ఆ సమయంలో శ్రీలంకకు అంతర్జాతీయంగా మిత్రుల సంఖ్య చాలా తక్కువన్న సంగతి తెలిసిందే. యుద్ధానంతర పరిస్థితులపై శ్రీలంక జవాబుదారీని కోరే తీర్మానం ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘంలో ప్రవేశపెట్టినప్పుడు భారత్‌ తీర్మానానికి అనుకూలంగా ఓటేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ క్రమంలో ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా దెబ్బతినకపోయినా, ఇరుదేశాల సంబంధాల్లో స్పష్టమైన అసౌకర్య పరిస్థితి నెలకొంది. వీటిని సరిదిద్దాల్సిన బాధ్యత ఇరుపక్షాలపైనా పడింది.

రాజపక్స 2015 జనవరిలో జరిగిన ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. తన ఓటమికి భారతదేశమే ప్రధాన కారణమని బహిరంగంగా నిందించారు. ఈ ఆరోపణలతో భారత్‌తో శ్రీలంక సంబంధాలు మరింత క్షీణించినట్లయింది. ఇరుదేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాల్ని బలోపేతం చేసేందుకు భారత్‌ 2017లో తరణ్‌జిత్‌సింగ్‌ సంధూను తన రాయబారిగా శ్రీలంకలో నియమించింది. సంధూను నియమించేనాటికి భారత, శ్రీలంక సంబంధాలు క్షీణించి, చైనా ప్రభావం పెరిగినట్లు విదేశాంగ విధాన నిపుణులు విశ్లేషించారు. అప్పట్నుంచి సంధూ ఇరుదేశాల సంబంధాల్లో మెరుగైన పరిస్థితిని పునరుద్ధరించేందుకు యత్నించారు. అదే క్రమంలో రాజపక్స భారత్‌తో మంచి సంబంధాల్ని పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి, అర్థం చేసుకొన్నారు. ఇటీవలి కాలంలో విపక్ష చట్టసభ సభ్యుడిగా రాజపక్స భారత్‌ను కనీసం మూడుసార్లయినా సందర్శించారు. ఒక సందర్భంలో ప్రధాని నరేంద్రమోదీని కలుసుకునేందుకు శ్రీలంకలో చట్టసభ సభ్యుడైన తన తనయుడు నమల్‌ను కూడా వెంట తీసుకెళ్లారు. ప్రస్తుతం తన సోదరుడి నేతృత్వంలోని ప్రభుత్వానికి సేవలందిస్తున్న రాజపక్స త్వరలోనే ఎన్నికల తీర్పు కోసం ప్రజల ముందుకెళ్లనున్నారు. ముఖ్యంగా, శ్రీలంక రాజ్యాంగానికి చేసిన 19వ సవరణ ప్రధానమంత్రి అధికారాల్ని పెంచాయి. ఇది శ్రీలంక రాజకీయ పరిస్థితుల్ని ప్రభావితం చేయగలిగే దిశగా మరింత పట్టు బిగించే అవకాశాన్ని కల్పించనుంది. కొత్త ప్రభుత్వం గత సర్కారు కుదుర్చుకున్న ఒప్పందాల్ని సమీక్షించడంపై దృష్టి సారించింది. అవసరమైతే పలు ఒప్పందాల విషయంలో మళ్లీ సంప్రతింపులు జరపాలని భావిస్తోంది. ఇందులో మహింద రాజపక్స అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేసుకొన్న ఒప్పందాలు కూడా ఉండటం విశేషం. భారత్‌ కాలిలో ముల్లులా మారిన చైనా నిధులు సమకూర్చిన కొలంబో పోర్ట్‌సిటీ ప్రాజెక్టు కూడా ఇందులో ఒకటి.

చైనాను వెనక్కినెట్టే చర్యలు ప్రస్తుతానికైతే లేవు. చైనా తదితర దేశాలతో కుదుర్చుకున్న వివాదాస్పద ఒప్పందాలకు సంబంధించి కొత్త నాయకత్వం కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న సంగతి ప్రధాని రాజపక్సకు తెలుసు. భారత్‌తో సంబంధాల్ని పునర్నిర్మించుకోవడమూ ప్రాధాన్యాంశమే. శ్రీలంకలో యుద్ధానంతరం పునర్నిర్మాణ, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టాల్సి వచ్చిందని, ఆ బహుళ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు మద్దతు ఇచ్చేందుకు చైనా మాత్రమే సిద్ధపడిందని రాజపక్స సన్నిహితులు చెబుతున్నారు. అది పశ్చిమ దేశాల దాతలు తమ వ్యూహాత్మక అవసరాల కోసం పలురకాల డిమాండ్లు పెట్టే తరహాలోది కాదని, భారత్‌కు అలాంటి సామర్థ్యం లేదా సంకల్పం లేవని మాజీ ఉన్నతాధికారి ఒకరు వివరించారు. రాజపక్సకు చెందిన ఎస్‌ఎల్‌పీపీ పార్టీ ఎన్నికల్లో భారీ విజయం సాధించనుందని చెబుతున్నారు. దీనివల్ల రాజ్యాంగ సవరణకు వీలుకలిగే అవకాశం ఉంది. ఇది మార్పు అజెండాను ముందుకు నెట్టేందుకు రాజకీయంగా చక్కని అవకాశాన్ని కల్పించే సమయం. ఈ క్రమంలో ముందుగానే పొరుగు దేశంతో మంచి సంబంధాల్ని నెలకొల్పుకోవడం వివేకవంతమైన పనిగా భావిస్తున్నారు.

- దిల్‌రుక్షి హందునెట్టి
(రచయిత్రి - శ్రీలంకలో ప్రముఖ పాత్రికేయురాలు)
Posted on 10-02-2020