Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

గ్రహణం వీడినా విజయం చేరునా?

* ట్రంప్‌పై వీగిన అభిశంసన

అమెరికా అధ్యక్షుడి అభిశంసన ప్రక్రియను పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అవిశ్వాస తీర్మానంతో పోల్చవచ్చు. అవిశ్వాస తీర్మానం అరకొర మెజారిటీతో నెట్టుకొచ్చే సంకీర్ణ ప్రభుత్వాలను గద్దె దించగలదు తప్ప సంపూర్ణ మెజారిటీ ఉన్న పాలక పార్టీలను దించడం అరుదు. అమెరికా ఎగువ సభ సెనెట్‌లో పాలక రిపబ్లికన్‌ పార్టీకి మెజారిటీ ఉన్నందువల్ల అధ్యక్షుడిపై అభిశంసన (అవిశ్వాసం) తేలిగ్గా వీగిపోయింది. ట్రంప్‌ ఇంతవరకు తన అధ్యక్ష పదవికి ఎదురైన రెండు గండాలను అవలీలగా అధిగమించారు. ఒకటి- ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గడానికి రష్యా తోడ్పడిందనే ఆరోపణపై రాబర్ట్‌ మల్లర్‌ జరిపిన దర్యాప్తు, రెండోది- అభిశంసన. కాంగ్రెస్‌ (పార్లమెంటు) విధి నిర్వహణకు ఆటంకం కలిగించడమే కాక, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణపై ట్రంప్‌పై అభిశంసన ప్రక్రియ చేపట్టారు. ఈ ముప్పులను విజయవంతంగా ఎదుర్కొన్న ట్రంప్‌ ఇక ఈ ఏడాది నవంబరు అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి నెగ్గాలని ఉవ్విళ్లూరుతున్నారు.

ఈ మద్దతు సరిపోతుందా?
తానేమీ తప్పుచేయకపోయినా ప్రత్యర్థులు వెంటాడి వేధిస్తున్నారని ట్రంప్‌ మొదటినుంచీ ఆరోపిస్తున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం, ట్రంప్‌ ఆదాయపన్ను రిటర్నులు వెల్లడి చేయాలన్న డిమాండ్లు, ఆయనపై వివిధ కాంగ్రెస్‌ విచారణలు, ట్రంప్‌ పూర్వ సహాయకులపై నేరాభియోగాలు, ఉక్రెయిన్‌పై ఒత్తిడికి అధికార దుర్వినియోగం- ఇవన్నీ ప్రతిపక్ష బూటకపు ఆరోపణలని బుకాయిస్తూ వచ్చారు. ట్రంప్‌ను పదవి నుంచి తొలగించాలా వద్దా అనే అంశంపై అభిశంసనకు మూడు నెలల ముందు నుంచి జరిగిన సర్వేలలో ట్రంప్‌ అనుకూలురు, ప్రతికూలురులలో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. అయితే, రాగద్వేషాలకు అతీతంగా ఆలోచించే ఓటర్లు 52 శాతం ఉన్నారు. డెమోక్రాట్‌ ప్రత్యర్థి జో బైడెన్‌పై దర్యాప్తు జరిపించాలని ఉక్రెయిన్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాబోయే అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేయడానికి ట్రంప్‌ ప్రయత్నించారని, అది అధికార దుర్వినియోగమని 52 శాతం తటస్థ ఓటర్లు భావిస్తున్నట్లు ఎన్‌బీసీ-వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ సంయుక్త సర్వే తేల్చింది. కానీ, ఈ కారణంపై ట్రంప్‌ను అభిశంసించాలని భావించినవారు 46 శాతం, ఆయన పదవిలో కొనసాగాలని కోరుకున్నవారు 49 శాతం. మొత్తంమీద అభిశంసన గండం నుంచి సెనెట్‌ ఓటు ద్వారా ట్రంప్‌ ఒడ్డున పడినా, ఈ వ్యవహారానికి అమెరికా ప్రజాస్వామ్యం మూల్యం చెల్లించుకోక తప్పదని విజ్ఞులు హెచ్చరిస్తున్నారు. ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ఎన్నికలు ఆ దేశ ప్రజల అభీష్టాన్ని ప్రతిబింబించాలి తప్ప, విదేశీ ప్రభుత్వాల ఇష్టాయిష్టాలను కాదు. 2016 ఎన్నికల్లో తమకు ఇష్టుడైన ట్రంప్‌ గెలవాలని, ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌ ఓడిపోవాలన్న కోరికను రష్యన్లు కుట్ర పద్ధతుల్లో నెరవేర్చుకొన్నారనే ఆరోపణను ఇక్కడ ప్రస్తావించాలి. మల్లర్‌ దర్యాప్తు ఈ ఆరోపణను నిరూపించకపోవడం, జో బైడెన్‌ వ్యవహారంలో ఉక్రెయిన్‌పై ట్రంప్‌ ఒత్తిడి గురించి సాక్షులను విచారించకపోవడం వల్ల ట్రంప్‌ విజేతగా నిలిచారు.

వచ్చే నవంబరు నాటి అధ్యక్ష ఎన్నికల్లో కూడా ట్రంప్‌ గెలుస్తారా, ఆయన పరిపాలనను అమెరికాతోపాటు ప్రపంచం మరి నాలుగేళ్లపాటు భరించనుందా అనే ప్రశ్న అందరి మదిలో మెదలుతోంది. నవంబరు ఎన్నికలు అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద, సాంఘిక, రాజకీయ గమనం మీద జనవాక్య సేకరణ కానున్నాయి. నేడు అమెరికాలో 96 శాతం ఉద్యోగార్థులకు పని దొరుకుతుందంటే అది తన విధానాల ఫలితమేనని ట్రంప్‌ గర్వంగా చెప్పుకొంటున్నారు. కానీ, ఆ ఉద్యోగాల నాణ్యత మీద భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్‌ విధానాలు దేశంలోని ఒక్క శాతం కుబేరులకు లబ్ధి చేకూర్చాయి తప్ప మిగతావారికి ఒరిగిందేమీ లేదని ఉదారవాద ఆర్థికవేత్తలు అంటున్నారు. మరి ఓటర్లు ఏమనుకుంటున్నారో నవంబరు ఎన్నికల్లోనే తేలాలి. అభిశంసన ప్రక్రియలో ట్రంప్‌ విజయంతో దేశాధ్యక్షుడి అభీష్టమే రాజ్య వ్యవస్థ అభీష్టమని, అదే ప్రజలకు క్షేమకరమని ట్రంప్‌ మద్దతుదారులు భావిస్తున్నారు. ట్రంప్‌ ఏం చేసినా దాన్ని బలపరచడమే పాలక రిపబ్లికన్‌ పార్టీ విధానమైపోయింది. ఇది నిరంకుశ పాలనకు బాట వేస్తుందన్న ఆందోళన ఆలోచనాపరులను ముప్పిరిగొంటోంది. పాలక పార్టీపై పూర్తి అదుపు సాధించి, న్యాయ పాలన అంటే తూష్ణీభావం జీర్ణించుకుపోయిన వ్యక్తిని అమెరికన్‌ రాజ్యాంగం అదుపులో పెట్టలేకపోయిందని, ఇది ప్రజాస్వామ్యానికి పెను ముప్పు తీసుకొస్తుందని వారు భయపడుతున్నారు. అలాగని పరిస్థితి పూర్తిగా చేజారిపోయినట్లు కాదనేవారు ఉన్నారు. అభిశంసన ప్రక్రియ ద్వారా ట్రంప్‌ను తొలగించరాదని, ఆయన అధ్యక్ష పదవిలో కొనసాగాలని భావించే ఓటర్లు 49 శాతం ఉన్నా, పూర్వ అధ్యక్షులకు లభించిన ఆదరణ ముందు ఈ మద్దతు దిగదుడుపే. అధ్యక్ష ఎన్నికలకు ముందునాళ్ళలో బరాక్‌ ఒబామా, జార్జ్‌ బుష్‌, ఆయన పుత్రుడు, బిల్‌ క్లింటన్‌, జిమ్మీ కార్టర్‌లకు ట్రంప్‌ కన్నా ఎక్కువ ఆదరణ లభించింది. మరి ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ ఇంత దివ్యంగా ఉన్నా, విదేశాల నుంచి ఎటువంటి ముప్పూలేకున్నా ట్రంప్‌ జనాదరణలో పూర్వ అధ్యక్షులను ఎందుకు మించలేకపోయారని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. కానీ, నియోజక గణం ఓట్లు మళ్ళీ ఆయన్ను గెలిపిస్తే ఆశ్చర్యం లేదు. 2016 ఎన్నికల్లో జరిగింది ఇదే. అమెరికా అధ్యక్షుడిని ప్రజలు నేరుగా ఎన్నుకోరు. వారి ప్రతినిధులతో ఏర్పడే నియోజక గణమే దేశాధ్యక్షుడిని ఎన్నుకొంటుంది. పైగా ఒక రాష్ట్రంలోని నియోజక గణ ఓట్లలో అత్యధికం ఏ అభ్యర్థికి వస్తే, ఆ రాష్ట్రంలోని మొత్తం నియోజక ఓట్లు అతడు లేక ఆమె ఖాతాలోనే జమ అవుతాయి. అమెరికాలోని 50 రాష్ట్రాలకు 48 రాష్ట్రాల్లో ఈ పద్ధతే అమలులో ఉంది. ఉదాహరణకు 55 నియోజక గణ ఓట్లు ఉన్న క్యాలిఫోర్నియా రాష్ట్రంలో ఒక అభ్యర్థికి 50.1 శాతం ఓట్లు వచ్చి, ప్రత్యర్థికి 49.9 శాతం ఓట్లే వస్తే మొత్తం 100 ఓట్లూ మెజారిటీ ఓట్లు వచ్చిన అభ్యర్థికే జమ అవుతాయి. ఈసారీ అదే కథ పునరావృతమవుతుందా అనే సందేహం చాలామందిని పీడిస్తోంది. దాన్ని నివారించాలంటే అత్యధిక రాష్ట్రాల్లో ఓటర్లు ఎలాగైనాసరే ట్రంప్‌ను ఓడించాలని కంకణం కట్టుకోవాలి. మరి అలాంటి పరిస్థితి ఉందా అనేది ప్రశ్న. నింగికి ఎగసిన స్టాక్‌ మార్కెట్‌, నిరుద్యోగ నిర్మూలనలు తనకు అఖండ విజయం కట్టబెడతాయని ట్రంప్‌ ధీమా కనబరుస్తున్నారు. ‘నాకు ఓటువేయడం వినా మీకు మరో మార్గం లేదు’ అని ఇటీవల న్యూ హ్యాంప్‌షైర్‌ సభకు హాజరైన ప్రజలతో ఆయన అన్నారు.

ఉద్యోగితే ఎన్నికల అస్త్రం
కేవలం ఆర్థిక గణాంకాలే విజయం సాధించిపెట్టలేవని, మొత్తం నాలుగు అంశాల్లో అధ్యక్షుడి రేటింగ్‌ను బట్టి తదుపరి ఎన్నికల్లో జయాపజయాలు నిర్ధారణ అవుతాయని కొందరు నిపుణులు వివరించారు. ఆ అంశాలు- అధ్యక్షుడి జనాదరణ రేటింగులు, ఆర్థిక పరిస్థితిపై వినియోగదారుల నమ్మకం, అమెరికా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ), నిరుద్యోగ రేటు. అమెరికా నేడు ఆర్థికంగా వెలిగిపోతున్నా, ఆ స్థాయిలో ట్రంప్‌ జనాదరణ రేటింగ్‌ పెరగడం లేదు. కేవలం ఆర్థిక కోణం నుంచి చూస్తే ట్రంప్‌ పట్ల ఆదరణ ఇప్పుడున్నదానికన్నా 20 పాయింట్లు ఎక్కువ ఉండాలని ఓ రాజనీతి శాస్త్రజ్ఞుడు వ్యాఖ్యానించారు. ఐసిస్‌ అధినాయకుడు అల్‌ బాగ్దాదీ, ఇరాన్‌ సేనాని సులేమానీ, యెమెన్‌లో అల్‌ఖైదా నాయకుడు కాసిం అల్‌ రీమీలను అమెరికన్‌ డ్రోన్లు హతమార్చడం వంటి సంచలనాలు తన రేటింగ్‌ను పెంచుతాయని ట్రంప్‌ ఆశపెట్టుకుంటే ఆశ్చర్యం లేదు. ఎన్నికల లోపల ఇలాంటి మరిన్ని సంచలనాలను ఆయన సృష్టించే అవకాశం లేకపోలేదు. చైనాతో వాణిజ్య యుద్ధం వికటించి ఎన్నికలకు ముందు ఆర్థిక పరిస్థితి మందగిస్తే వినియోగదారుల మనోభావాలు మారవచ్చు. జీడీపీ, ఉద్యోగితకు సంబంధించిన గణాంకాలు మాత్రం ట్రంప్‌నకు అనుకూలంగానే ఉన్నాయి. ఇప్పుడు సాధించిన జోరును ట్రంప్‌ నవంబరు అధ్యక్ష ఎన్నికల వరకు కొనసాగించగలగాలి. ప్రతిపక్షం డెమోక్రటిక్‌ పార్టీ ట్రంప్‌తో గట్టిగా తలపడగల అభ్యర్థిని ఎంచుకోగలగాలి. నవంబరు అధ్యక్ష ఎన్నికల్లోగా ఏవైనా అనూహ్య ఘటనలు జరిగి, పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు. ఏమి జరిగినా తనదే పై చేయి కావాలని ట్రంప్‌ దుందుడుకుగా ముందుకెళుతున్నారు. అమెరికన్‌ ఓటరు ఆయన దూకుడుకు ముగ్ధుడవుతాడా?

చట్టరీత్యా దోష విముక్తుడే...
అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చట్టరీత్యా దోష విముక్తుడైనా, రాజకీయంగా ఆయనపై అపనమ్మకం సడలలేదు. అధ్యక్షుడు అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా నియంత్రించే నైతిక, శాసన నియమనిబంధనలు రాజకీయ కుమ్ములాటలో నిర్వీర్యమయ్యాయి. అయితేనేం, పాలక రిపబ్లికన్‌ పార్టీ లెజిస్లేటర్లలో, రిపబ్లికన్‌ ఓటర్లలో ట్రంప్‌ పట్ల ఆదరణ కాంక్రీటులా బిగుసుకుంది. సాధారణ ప్రజానీకంలో 49 శాతం, రిపబ్లికన్‌ ఓటర్లలో 94 శాతం ట్రంప్‌ పట్ల అభిమానం ప్రదర్శించారని విఖ్యాత జనవాక్య సేకరణ సంస్థ గ్యాలప్‌ సర్వేలో తేలింది. ప్రతిపక్ష డెమోక్రాట్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, తన పోటీదారు జో బైడెన్‌ను అవినీతి ఆరోపణల్లో ఇరికించడానికి ఉక్రెయిన్‌ ప్రభుత్వంపై ట్రంప్‌ ఒత్తిడి తెచ్చారని, ఆ దేశానికి కాంగ్రెస్‌ మంజూరు చేసిన సహాయాన్ని బిగపట్టి బెదిరించారనే ఆరోపణలపై మల్లర్‌ దర్యాప్తు జరిపారు. ఆయన నివేదికపై కార్యాచరణ జరగలేదు. ఈ తతంగాన్ని నవంబరు అధ్యక్ష ఎన్నికల సమయానికి ఓటర్లు మరచిపోతారని రిపబ్లికన్ల ధీమా. వీగిపోయిన అభిశంసన తీర్మానం, ప్రభావం చూపలేని మల్లర్‌ నివేదికను డెమోక్రాట్లపై దుడ్డుకర్రలా ఝళిపించి రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికవడానికి ట్రంప్‌ దురుసుగా దూసుకెళ్లనున్నారు. ఆలోగా అభిశంసన ప్రక్రియ అమెరికా రాజకీయ పార్టీలను ఆదిమ తెగల్లా హోరాహోరీ పోరాడుకునేట్లు చేసింది.

- ఏఏవీ ప్రసాద్‌
Posted on 12-02-2020