Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

చైనా సాగరణ తంత్రం

* ఉమ్మడి ప్రతిఘటనే విరుగుడు మంత్రం

‘తుపాకి గొట్టం ద్వారా అధికారం వస్తుంది’- మావో జెడోంగ్‌ ఈ సూక్తిని వెలువరించిననాటికీ ఇప్పటికీ ప్రపంచం మారిపోయిందని బీజింగ్‌ తలపోయడం లేదు. ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రంపై పట్టు సాధించడానికి మావో సూత్రంపైనే చైనా ఆధారపడుతోంది. ఆ సముద్ర జలాల్లో కృత్రిమ దీవులు నిర్మించి సేనలను మోహరించింది. దక్షిణ చైనా సముద్రంలో 90 శాతం తనదేనన్న చైనా వాదన చట్టపరంగా నిలవదని హేగ్‌లోని శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం (పీసీఏ) తీర్పుచెప్పినా, అది వట్టి చెత్త అని చైనా గేలిచేసింది. కేసులో ఫిలిప్పీన్స్‌ నెగ్గినప్పటికీ ఈ సముద్రం నుంచి నిష్క్రమించడానికి ససేమిరా అంటోంది. తాను ఒక అగ్రరాజ్యం కాబట్టి తన ప్రాదేశిక హక్కులు, రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి నిర్ణయం తీసుకునే హక్కును ఇతరులకు వదలకూడదని బీజింగ్‌ భావిస్తోంది. అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌ సభ్యత్వం పొందాలంటే అంతర్జాతీయ నియమనిబంధనలు పాటించాలంటూ ఇటీవలే చైనా సుద్దులు చెప్పింది. తాను మాత్రం సముద్ర న్యాయంపై ఐక్యరాజ్యసమితి ఒడంబడిక (యున్‌క్లోస్‌)ను యథేచ్ఛగా ఉల్లంఘించి దక్షిణ చైనా సముద్రాన్ని కబళించజూస్తోంది. యున్‌క్లోస్‌పై చైనా సహా 160 దేశాలు సంతకాలు చేసినా వాటిలో అమెరికా లేదు. యున్‌క్లోస్‌కు కట్టుబడి ఉన్నామని అమెరికా ప్రభుత్వం ప్రకటించినా, ఆ దేశ కాంగ్రెస్‌ (పార్లమెంటు) ఆ ఒడంబడికను ఆమోదించలేదు. అమెరికా వంటి అగ్రరాజ్యం తన కీలక ప్రయోజనాలపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఇతరులకు ఇవ్వకూడదని భావించడమే దీనికి కారణం. చైనా అభిప్రాయమూ అదే. ఇదే వరసలో దక్షిణ చైనా సముద్రంలో ఇతర దేశాల నౌకల రాకపోకలను అడ్డుకునే అధికారాన్నీ చైనా చేజిక్కించుకొంటుందా అన్నదే ప్రశ్న. దక్షిణ చైనా సముద్రంలో అది ఇలాంటి అఘాయిత్యపు పనేదో చేస్తుందని చాలామంది అనుమానిస్తున్నారు.

ఇదీ మూలకారణం
సమస్యను నివారించాలని అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా ఫిలిప్పీన్స్‌, వియత్నాం వంటి తీరస్థ దేశాలు ఆశిస్తున్నాయి. వాటికి అమెరికా, జపాన్‌లు అండగా నిలుస్తున్నాయి. యున్‌క్లోస్‌పై చైనా సంతకం చేసింది కనుక సముద్రాలకు సంబంధించిన అంతర్జాతీయ ఒడంబడికలను అది గౌరవించాలని భారతదేశమూ కోరుతోంది. గతంలో బంగ్లాదేశ్‌-భారత్‌ సముద్ర వివాదంపై పీసీఏ తీర్పు తనకు ప్రతికూలంగా వచ్చినా భారత్‌ దాన్ని శిరసావహించింది. ఇదే స్ఫూర్తితో దక్షిణ చైనా సముద్రంలో నిరాటంకంగా నౌకల రాకపోకలు, విమానాల సంచారం జరగాలని భారత్‌ ఆశిస్తోంది. దక్షిణ చైనా సముద్రం గుండా ఏటా అయిదు లక్షల కోట్ల డాలర్ల వాణిజ్యం జరుగుతోంది కాబట్టి, ఆ ప్రాంతంలో స్వేచ్ఛా సంచారం జరగాలని అంతర్జాతీయ సమాజం కోరుతోంది. దీనికి చైనా అడ్డు తగిలితే తప్పక ఎదుర్కొంటామని చాటడానికి అమెరికా, జపాన్‌, భారత నౌకాదళాలు ఆపరేషన్‌ మలబార్‌ పేరిట పసిఫిక్‌ మహాసముద్రంలో ఇటీవల విన్యాసాలు జరిపాయి. చైనా దూకుడును గట్టిగా ఎదుర్కొంటున్న ఫిలిప్పీన్స్‌, వియత్నామ్‌లకు అమెరికాతోపాటు భారతదేశమూ అండదండలు అందిస్తోంది. ఫిలిప్పీన్స్‌కు యుద్ధ నౌకలను, వియత్నామ్‌కు బ్రహ్మోస్‌, వరుణాస్త్రాలను విక్రయించడానికి భారత్‌ సన్నద్ధంగా ఉంది.
దక్షిణ చైనా సముద్రంలోని స్ప్రాట్లీ, పారాసెల్‌ దీవులపై సార్వభౌమత్వం ఎవరిదనే అంశంపై ఆగ్నేయాసియా దేశాలకు, చైనాకు మధ్య చాలాకాలం నుంచి జగడం నడుస్తోంది. పశ్చిమాసియా నుంచి చమురు తీసుకొచ్చే నౌకలు హిందూ మహాసముద్రం మీదుగా పయనించి మలక్కా జల సంధి గుండా దక్షిణ చైనా సముద్రంలో ప్రవేశిస్తాయి. దక్షిణ కొరియాకు 70 శాతం చమురు, జపాన్‌, తైవాన్‌లకు 60 శాతం, చైనాకు 80 శాతం చమురు ఈ సముద్రం గుండానే వస్తోంది. పైగా దక్షిణ చైనా సముద్రంలో 1100 కోట్ల పీపాల చమురు, 190 లక్షల కోట్ల ఘనపుటడుగుల సహజవాయు నిక్షేపాలున్నాయని అమెరికా అంచనా. అక్కడ మత్స్య సంపద కూడా అపారమే. ప్రపంచ చేపల వేటలో 12 శాతం ఇక్కడే జరుగుతోంది. అందువల్లనే దక్షిణ చైనా సముద్రంపైన, అందులోని దీవులమీద గుత్తాధిపత్యం చేజిక్కించుకోవడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలను వియత్నాం, ఫిలిప్పీన్స్‌ వంటి ఆగ్నేయాసియా దేశాలు గట్టిగా ప్రతిఘటిస్తున్నాయి. అసలు 2012 నుంచే ఇక్కడ ఇతర దేశాల చేపల పడవల వేటను చైనా నౌకలు అటకాయిస్తున్నాయి.
ఒకవేళ చమురు ట్యాంకర్లను, సరకుల నౌకలను కూడా అడ్డగిస్తే ఆగ్నేయాసియా దేశాలతోపాటు జపాన్‌, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాలకు తీవ్ర ఆర్థిక నష్టం సంభవిస్తుంది. దక్షిణ చైనా సముద్రం చుట్టూ తిరిగిరావాలంటే రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. ఈ సముద్రంపై చైనా సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తే, తమ ఆర్థికాభివృద్ధి కోసం దాని దయాదాక్షిణ్యాలపై ఆధారపడినట్లవుతుంది. జపాన్‌, చైనాల మధ్యనున్న తూర్పు చైనా సముద్రంపైన ఇతర దేశాల విమానాలు తిరగకూడదని ఇప్పటికే ఆంక్షలు విధించిన చైనా, దక్షిణ చైనా సముద్ర గగనతలంలోనూ అదే పని మొదలుపెట్టింది. స్ప్రాట్లీ దీవుల్లో కొత్త రాడార్‌ కేంద్రాలను నెలకొల్పి, పారాసెల్‌ దీవుల్లోని వుడీ ద్వీపంపై ఫైటర్‌ విమానాలను దించి, అక్కడ ఉపరితలం నుంచి గగనంలోకి ప్రయోగించే హెచ్‌.క్యు-9 క్షిపణులనూ మోహరించింది. ఈ క్షిపణులు 100 కిలోమీటర్ల ఎత్తులోని ఇతర దేశాల విమానాలను చిటికెలో కూల్చేయగలవు. మొత్తం మీద స్ప్రాట్లీ దీవుల్లోని ఏడు కృత్రిమ దీవుల్లో విమానాలు దిగడానికి వసతులు, కమ్యూనికేషన్‌, సరకుల సరఫరా సౌకర్యాలు నిర్మించి, కొన్ని చోట్ల ఫిరంగులు, క్షిపణులను ఏర్పరచింది. ఇది చాలదన్నట్లు ఈ సముద్రంలో చైనీస్‌ చేపల పడవలు, తీర రక్షక దళ నౌకల సంచారం ఎక్కువైంది. ఇవి చైనా తరఫున సముద్ర పారామిలిటరీ దళాల్లా వ్యవహరిస్తున్నాయి. నేడు ప్రపంచంలో అతిపెద్ద చేపల పడవల దళం చైనాదే. ఇది చేపల వేటకు బంగాళాఖాతంలోకి చొచ్చుకొస్తూ భారతదేశానికి ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధ నౌకలతోపాటు ఇతర నౌకలు, పడవల సంచారానికీ అంతర్జాతీయ ప్రవర్తన నియమావళిని రూపొందించుకోవడం అనివార్యమవుతోంది. నేడు దక్షిణ చైనా సముద్రంలో ఇష్టారాజ్యంగా విహరిస్తున్న చైనా నౌకలు రేపు అండమాన్‌ సముద్రంలోనూ అదే పని చేయవని హామీ ఏమిటి? అందుకే అమెరికా, జపాన్‌, భారత్‌, వియత్నాం, ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్‌లు చైనా దూకుడుకు ముకుతాడు వేయాలని చూస్తున్నాయి.

తీరు మార్చుకోని చైనా
ప్రతిఘటన పెరగడంతో సముద్రాలపై ఆధిపత్యం సాధించేవరకు ద్వైపాక్షిక చర్చలంటూ పొద్దుపుచ్చాలని చైనా ప్రయత్నిస్తోంది. ఆ క్రమంలోనే ఆసియాన్‌ సభ్యదేశాల్లో తన అంతేవాసులైన కంబోడియా, లావోస్‌లను తనవైపు తిప్పుకొని ఆ సంఘంలో చీలిక తీసుకురావాలని చూస్తోంది. హేగ్‌ న్యాయస్థానం తీర్పును అనుసరించి బీజింగ్‌ నాయకత్వం దక్షిణ చైనా సముద్రం నుంచి విరమించుకుంటే, దాన్ని చైనీయులు జాతికే తలవంపులుగా భావిస్తారు. దీనివల్ల చైనా అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌ పీఠానికి ఎసరు రావచ్చు.అందుకే దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ దీవుల నిర్మాణాన్ని విరమించేది లేదని చైనా నౌకాదళాధిపతి అడ్మిరల్‌ వూ షెంగ్లీ ఇటీవల అమెరికా ప్రధాన నౌకాదళాధికారి జాన్‌ ఎం. రిచర్డ్‌సన్‌కు స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో హేగ్‌ న్యాయస్థానం తీర్పునకు అనుగుణంగా ఫిలిప్పీన్స్‌ ప్రయోజనాలను రక్షించడంతో పాటు సముద్రాల్లో నౌకల రాకపోకలు స్వేచ్ఛగా జరిగేట్లు చూడాల్సిన బాధ్యత కూడా ప్రపంచదేశాలపై ఉంది. చైనా మొండిగా నౌకల సంచారాన్ని అటకాయిస్తే అది భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. చమురు, సరకుల నౌకలైనా, యుద్ధ నౌకలైనా దక్షిణ చైనా సముద్రంలో ప్రవేశించాలంటే- మొదట మలక్కా జలసంధిని దాటవలసిందే. మలేసియా, ఇండొనేసియాల మధ్యనున్న ఈ సన్నని జల సంధి అమెరికా అదుపులో ఉంది. చైనా కనుక దుస్సాహసానికి పాల్పడితే దాని సరఫరా మార్గాన్ని బంద్‌ చేయడం అమెరికా చేతిలోని పని. ఈ పరిస్థితిని తప్పించుకోవడం కోసం ‘మలక్కాను మీరు బిగిస్తే దక్షిణ చైనా సముద్రాన్ని నేను బిగిసా’్తనంటోంది బీజింగ్‌.
కథ అక్కడితో ఆగదు. పశ్చిమాసియా, లాటిన్‌ అమెరికా, ఆఫ్రికాలతో ఎగుమతి, దిగుమతి మార్గాలను పరిరక్షించుకోవడం కోసం బీజింగ్‌ తన పరిధిని క్రమంగా హిందూ మహాసముద్రానికి విస్తరిస్తోంది. పాకిస్థాన్‌లో గ్వాడర్‌ రేవును, శ్రీలంకలో హంబాన్‌తోట, ఆఫ్రికాలో జిబూటీ రేవులను నిర్మించడానికి నడుం కట్టిన చైనా, మాల్దీవుల్లోనూ రేవు నిర్మాణానికి మార్గం సుగమం చేసుకొంది. సముద్రాలపై ఆధిపత్య సాధనకు నౌకాబలాన్ని పెంచుకొంటోంది. మొత్తంమీద బీజింగ్‌ ప్రవర్తన ప్రస్తుత ప్రపంచ వ్యవస్థను కకావికలం చేస్తోంది. దేశాల మధ్య వివాదాల పరిష్కారానికి, సహకార సాధనకు అంతర్జాతీయ ఒడంబడికలు, సంస్థలు అవసరమని ప్రపంచం అంగీకరిస్తుండగా- చైనా అంతర్జాతీయ చట్రంలో కాకుండా ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తోంది. ఆర్థిక ప్రలోభాలు, ఒత్తిళ్లతో ఆగ్నేయాసియా దేశాలను దారికి తెచ్చుకోవాలని చూస్తోంది. కానీ, ప్రపంచ దేశాలు ఈ ఎత్తుగడలను నిరసిస్తున్నాయి!

- ఏఏవీ ప్రసాద్‌
Posted on 20-07-2016