Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

ట్రంప్‌ మోదీ చెట్టపట్టాల్‌...

సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండు రోజుల భారత పర్యటన దిగ్విజయంగా ముగిసింది. ‘అమెరికా ఇండియాల మధ్య ఉన్నది సాదాసీదా భాగస్వామ్యం కాదు; ఎంతో సన్నిహిత బాంధవ్యం’ అన్న ప్రధాని మోదీ మాటలకు దీటుగా దేశాధినేతల నడుమ అడుగడుగునా సౌహార్దం వెల్లివిరిసింది. ఇండియాతో విస్తృత వాణిజ్య ఒప్పందం ముడివడేది ఇప్పుడు కాదని ముందే తెలిసినా, ఇతర కీలకాంశాలపై సానుకూలత రాబట్టడంతోపాటు, వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో భారత-అమెరికన్‌ ఓటర్ల మద్దతు కూడగట్టడమే లక్ష్యంగా డొనాల్డ్‌ ట్రంప్‌ యాత్ర ధూంధాంగా సాగిపోయింది! భద్రత, రక్షణ, ఇంధనం, సాంకేతిక పరిజ్ఞానం, ప్రజల నడుమ సత్సంబంధాలనే అయిదు అంశాలపై ఫలప్రదంగా చర్చలు జరిగాయని; మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధానికి, మాతృదేశ భద్రతను ఇనుమడింపజేయడానికి రెండు కార్యదళాల ఏర్పాటుకు అంగీకారం కుదిరిందని భారత విదేశాంగ కార్యదర్శి చెబుతున్నారు. 300 కోట్ల డాలర్ల రక్షణ ఒప్పందాల ఖరారుతో పాటు ఇంధన సరఫరాకు సంబంధించిన దానితో సహా మూడు అవగాహన పత్రాలపై సంతకాలు జరగడం గమనార్హ విశేషం. పాకిస్థాన్‌ గడ్డ మీద ఉగ్రవాద కార్యకలాపాల్ని తుడిచిపెట్టాలని తీర్మానించామని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించినా, అది ఎలా... అన్నదానిపై స్పష్టత మృగ్యం! భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చెయ్యనున్న 5జి సాంకేతికతపై చైనా సంస్థ హువావై మీద కారాలూ మిరియాలూ నూరుతున్న ట్రంప్‌- దాన్ని దూరం పెట్టాలంటూ పలు దేశాల మీద ఒత్తిడి తీసుకురావడం తెలిసిందే. స్వేచ్చ, ప్రగతి, సౌభాగ్యాల సాధనం కావాల్సిన 5జి నెట్‌వర్క్‌- అణచివేత, సెన్సార్‌షిప్‌ల వాహకం కారాదన్న సంయుక్త ప్రకటనలో గూఢార్థాన్ని గుర్తించాల్సిందే! జార్జిబుష్‌ తరవాత ఏ అధ్యక్షుడూ ఇండియా పర్యటన దరిమిలా పాకిస్థాన్‌కు వెళ్ళింది లేదు. అదే ఆనవాయితీని కొనసాగించి అగ్రరాజ్యం దృష్టిలో భారత్‌ ప్రాధాన్యాన్ని చాటిన ట్రంప్‌- మత స్వేచ్ఛ వంటి అంశాలపైనా ప్రధాని మోదీ మాట తిరుగులేనిదని స్పష్టీకరించారు. అమెరికా ఇండియాలు ఇలా చెట్టపట్టాలు కట్టి సాగడం ఉభయులకే కాదు, యావత్‌ ప్రపంచానికీ ఎంతో మేలు!

‘ఇండియాతో ప్రగాఢ భాగస్వామ్యంలేని భావి ప్రపంచాన్ని నేను ఊహించలేకపోతున్నాను’ అంటూ 2000 సంవత్సరంలో బిల్‌ క్లింటన్‌ జరిపిన పర్యటన- ఇరు దేశాల మధ్య ఘనీభవించిన విభేదాల మంచును కరిగించింది. ‘వ్యూహాత్మక భాగస్వామ్యంలో తదుపరి అడుగుల’ పేరిట జార్జి బుష్‌ పర్యటన సందర్భంగా కుదిరిన అణు ఒప్పందం- తొలుత కొత్త ఆశల్ని, పిదప ఎన్నో భయాల్ని రేకెత్తించింది. రెండుసార్లు ఒబామా భారత యాత్ర వాణిజ్య వృద్ధికి ఎంతగానో దోహదపడినా, శ్వేత సౌధాధిపతిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రాక దరిమిలా ‘ఉభయ కుశలోపరి’ అని చెప్పే వీలు లేకపోతోంది. భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికాకు చెందిన చెల్లింపు సంస్థలు డేటాను ఇక్కడే నిల్వ చేసుకోవాలని ఇండియా నిర్దేశించడంతో- హెచ్‌1బీ వీసాలపై పరిమితుల విధింపు అస్త్రం దూసుకొచ్చింది. భారత్‌కు ఇస్తున్న పన్ను రాయితీల్ని రద్దు చేసి, ఇండియా మరేమాత్రం అభివృద్ధి చెందుతున్న దేశం కానే కాదని ట్రంప్‌ ప్రకటించారు. జీఎస్‌పీ (జనరలైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్సెస్‌) విధానం కింద అప్పటిదాకా ఇండియాకు కల్పించిన వెసులుబాటును రద్దు చెయ్యడంతో అమెరికాకు ఇండియా చేసే 560 కోట్ల డాలర్ల ఎగుమతులపై దుష్ప్రభావం పడుతోంది. ఇరాన్‌తో చమురు, సహజ వాయువు లావాదేవీల్ని పూర్తిగా నిలిపేసి తమనుంచే దిగుమతి చేసుకోవాలని కోరుతున్న అమెరికా- ఆ ఒత్తిడి వ్యూహంలో సఫలమవుతున్నట్లే కనిపిస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎంతో దన్నుగా ఉన్న భారత వృత్తి నిపుణుల సామాజిక భద్రత అంశాన్నీ ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చల్లో ప్రస్తావించాల్సి వచ్చింది. ‘భారత్‌ను ప్రేమిస్తున్నా’నంటూనే షరతుల్ని వర్తింపజేసే ధోరణి- డొనాల్డ్‌ ట్రంప్‌లో పక్కా వాణిజ్యవేత్తనే కళ్లకు కట్టింది!

ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అమెరికా ఏనాడూ ఇండియాను పూర్తిగా విశ్వసించింది లేదు. రెండు దశాబ్దాలుగా దిల్లీ-వాషింగ్టన్ల చెలిమి మారాకు తొడిగినా, ట్రంప్‌ తరహా ఆభిజాత్య ధోరణులతో నిజమైన నెయ్యం- ఉభయ తారక వాణిజ్యంగా ఎదగడం లేదు! దశాబ్దకాలంలో 1800 కోట్ల డాలర్లకుపైగా అత్యధునాతన రక్షణ ఉపకరణాలను ఇండియా అమెరికానుంచే దిగుమతి చేసుకొంది. రష్యాను పూర్తిగా పక్కనపెట్టి, తన దిగుమతులపైనే ఇండియా ఆధారపడాలన్నట్లుగా అగ్రరాజ్యం వ్యవహారసరళి ఇండియాకు ఎప్పటికప్పుడు ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. వ్యూహాత్మక భాగస్వామ్యంతో ఒక దేశానికి చేరువ అవుతున్నామంటే, మరే దేశానికో దూరం జరుగుతున్నట్లు కానే కాదని ఇరవయ్యేళ్లనాడు వాజ్‌పేయీ ప్రభుత్వం స్పష్టీకరించింది. అందుకు అనుగుణంగానే 2018లో బ్యూనస్‌ ఎయిర్స్‌లో జపాన్‌, అమెరికా, ఇండియా (జై) త్రైపాక్షిక వేదికను; మరోపక్క రష్యా, ఇండియా, చైనాల భాగస్వామ్యంతో ఇంకో చర్చా వేదికను జోడు గుర్రాలుగా కట్టి మోదీ సర్కారు నడిపించింది. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో చైనా ప్రాబల్యానికి చెక్‌ పెట్టాలని; అమెరికా, జపాన్‌, ఇండియా, ఆస్ట్రేలియా (క్వాడ్‌) కూటమిగా జతకట్టాలని, బీజింగ్‌ ప్రారంభించిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ ప్రాజెక్టుకు దీటుగా ‘బ్లూ డాట్‌’ మౌలిక సదుపాయాల నెట్‌వర్క్‌కు శ్రీకారం చుట్టాలనీ అమెరికా తలపోస్తోంది. మరో ప్రచ్ఛన్న యుద్ధ ఛాయల్ని కళ్లకు కడుతున్న అమెరికా వ్యూహాలపట్ల ఇండియా జాగ్రత్తగా స్పందించాలి. ట్రంప్‌ స్వయంగా చెప్పినట్లు ఏమాత్రం కొరుకుడుపడని మనస్తత్వంతో మోదీ- భారతావని ప్రయోజనాల్ని కాచుకోవాలి!

Posted on 26-02-2020