Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

పాక్‌పై ట్రంప్‌ మృదు వైఖరి!

* అఫ్గాన్‌ పరిణామాలే కారణమా?

‘అఫ్గానిస్థాన్‌లో గ్రంథాలయాన్ని ఎవరు ఉపయోగిస్తారు, నాకైతే తెలియదు’... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 2019 జనవరిలో చేసిన వ్యంగ్య వ్యాఖ్యలివి. అఫ్గానిస్థాన్‌కు భారత్‌ చేసిన సహాయాన్ని అపహాస్యం చేస్తూ కేవలం ఓ గ్రంథాలయ భవనాన్ని నిర్మించారన్నట్లుగా వ్యాఖ్యానించారు. భారత ఆర్థిక సహాయంతో నిర్మించిన, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన అఫ్గానిస్థాన్‌ పార్లమెంట్‌ భవనాన్ని ట్రంప్‌ ఓ గ్రంథాలయ భవనంగా అభివర్ణించారు. యుద్ధం, హింసాత్మక పరిస్థితులతో అల్లకల్లోమైన అఫ్గాన్‌ నుంచి అమెరికా దళాల్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్న క్రమంలో ఓ పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వాటిపై భారత్‌ అసంతృప్తిని వెల్లడించినా, అఫ్గాన్‌ పునర్నిర్మాణ ప్రక్రియ కోసం తాను చేసిన మూడు బిలియన్‌ డాలర్ల తోడ్పాటును గుర్తు చేసింది. అమెరికా, పాకిస్థానీయులతో పోలిస్తే స్థానిక అఫ్గాన్లలో భారతీయులకే ఎక్కువ ఆదరణ ఉందని స్పష్టం చేసింది.

ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌లోని మొతేరాలో సరికొత్తగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంలో కిక్కిరిసిన జనాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్సిన ఆవశ్యకతను ప్రస్తావించారు. అయితే, పాకిస్థాన్‌పై మృదువైఖరి ప్రదర్శించారు. పాక్‌కు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. మనసులో అఫ్గానిస్థాన్‌ ఉన్న కారణంగానే ట్రంప్‌ పాకిస్థాన్‌పై మృదువైఖరిని ప్రదర్శించారని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘నమస్తే ట్రంప్‌’ పేరిట మొతేరా స్టేడియంలో నిర్వహించిన భారీ కార్యక్రమంలో పక్కన ప్రధాని మోదీ సమక్షంలో ట్రంప్‌ మాట్లాడుతూ... ‘ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు, వారి భావజాలంపై పోరాడేందుకు కలిసికట్టుగా పని చేసేందుకు అమెరికా, భారత్‌ కట్టుబడి ఉన్నాయి. ఈ కారణంగానే, ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి... పాక్‌ సరిహద్ద్దుల్లో ఉండే ఉగ్రవాదులను, ఉగ్రసంస్థల్ని అణచివేసేందుకు పాకిస్థాన్‌తో కలిసి సానుకూల దిశగా కృషి చేస్తున్నాం’అని పేర్కొన్నారు. 2010, 2015 సంవత్సరాల్లో నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాలా భారత్‌, పాకిస్థాన్‌ పర్యటనల్ని కలుపకుండా, ఒక అమెరికా అధ్యక్షుడు భారత్‌లో మాత్రమే చేపట్టిన తొలి పర్యటన ఇదే కావడం విశేషం. అయినప్పటికీ, పాకిస్థాన్‌ సమక్షంలో కుదిరిన అమెరికా- తాలిబన్‌ శాంతి ఒప్పందం ఆయన మనసులో కదలాడింది. ‘పాకిస్థాన్‌తో మా సంబంధం బాగుంది. పాక్‌తో సంబంధాల్లో పురోగతికి సంబంధించిన సంకేతాల్ని చూడటం ప్రారంభమైంది. ఆ మేరకు అక్కడ ఉద్రిక్తతలు తగ్గుతాయని, సుస్థిరత నెలకొంటుందని, దక్షిణాసియాలోని అన్ని దేశాల వారూ భవిష్యత్తులో సామరస్యంగా మెలుగుతారని ఆశాజనకంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు. ‘డొనాల్డ్‌ ట్రంప్‌ అఫ్గానిస్థాన్‌తో ఒప్పందాన్ని కోరుకున్నారు. తాను మళ్లీ ఎన్నికల్లో గెలిచి, అధ్యక్ష పదవిని చేపట్టడంలో సదరు ఒప్పందం చాలా కీలకంగా మారుతుంది. 2020 నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందే అమెరికా దళాల్ని వెనక్కి తీసుకెళ్లిపోవడం అవసరం. ట్రంప్‌ ఇచ్చిన భారీ హామీలలో ఒకటైన ఈ అంశాన్ని నెరవేర్చి చూపాల్సి ఉంటుంది’ అని రీసెర్చ్‌ అనాలిసిస్‌ వింగ్‌(రా) మాజీ ప్రత్యేక కార్యదర్శి, బెంగళూరుకు చెందిన తక్షశిల ఇన్‌స్టిట్యూషన్‌లో నిఘా విశ్లేషకులు ఆనంద్‌ అర్ణి అభిప్రాయపడ్డారు. నిరుడు పాక్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ను మంచి స్నేహితుడుగా సంబోధించిన ట్రంప్‌ శ్వేతసౌధంలో తన పక్కనే కూర్చోబెట్టుకోవడం గమనార్హం. దావోస్‌లోనూ అలాగే వ్యవహరించారు. ‘అమెరికా, పాకిస్థాన్‌ల మధ్య అనుబంధం లావాదేవీలతో కూడుకున్నది. అమెరికా పాక్‌వైపు మొగ్గుతూ సహాయం చేయమని కోరుతోంది. కీలకమైన అఫ్గాన్‌ ఒప్పందాన్ని తీసుకురావడంలో పాక్‌ కీలకపాత్ర పోషించింది. అందుకని, గుజరాత్‌లో ట్రంప్‌ చేసిన వ్యాఖ్యల విషయంలో ఆశ్చర్యపడాల్సిన అవసరమేమీ లేదు’ అని పాకిస్థాన్‌లో మాజీ హైకమిషనర్‌ శరత్‌ సబర్వాల్‌ విశ్లేషించారు. ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో పాకిస్థాన్‌పై అమెరికా నిరంతరం ఒత్తిడి కొనసాగిస్తున్నా, అఫ్గాన్‌ నుంచి తమ దళాలను ఉపసంహరించుకోవడానికి మాత్రం పాక్‌పైనే ఆధార పడుతున్నారని భావించాలి. ప్రతిపాదిత శాంతి ఒప్పందం నేపథ్యంలో అమెరికా తన దళాల్ని ఉపసంహరించున్న తరవాత... లష్కరే తోయిబాతో సహా భారత్‌ను లక్ష్యంగా చేసుకున్న పలు ఉగ్రవాద సంస్థలు తమ శిక్షణ శిబిరాలను అఫ్గాన్‌ సరిహద్దు ప్రాంతాలకు, అక్కడ్నుంచి కశ్మీర్‌కు తరలిస్తే పరిస్థితి ఏమిటి? ఈ నేపథ్యంలో దక్షిణాసియాలో పాకిస్థాన్‌ పాత్రపై అనుమానాలు అపరిష్కృతంగానే ఉన్నాయి.

- స్మితాశర్మ
(రచయిత్రి- ప్రముఖ పాత్రికేయురాలు)
Posted on 26-02-2020