Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

రెండునాల్కల చైనా!

* ఉగ్రవాదంపై వూసరవెల్లి తీరు

తన దాకా వస్తేగాని నొప్పి తెలియదన్న నానుడి చైనాకు చక్కగా సరిపోతుంది. పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదం కారణంగా ఇంతకాలం భారత్‌ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నంగినంగిగా మాట్లాడిన చైనా, ఆ తాకిడి తనకు తగలగానే కఠినంగా వ్యవహరించడానికి సిద్ధమవుతోంది. పాక్‌తో చిరకాల స్నేహం ఉన్నప్పటికీ పకడ్బందీగా వ్యవహరించాలని నిర్ణయించింది. సరిహద్దుల్లో చీమ చిటుక్కుమన్నా స్పందించేందుకు సమాయత్తమవుతోంది. డిసెంబరు ఆఖరులో జరిగిన అవాంఛనీయ ఘటనల నేపథ్యంలో చైనాలోని స్వయంపాలిత ప్రాంతమైన జియాంగ్‌లో తలెత్తిన ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు బీజింగ్‌ సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పాకిస్థాన్‌తో గల సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని నిర్ణయించింది. పాకిస్థాన్‌లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు అక్రమంగా సరిహద్దులు దాటి జియాంగ్‌లో ప్రవేశించి చిచ్చురేపుతున్నారన్నది చైనా అనుమానం!

ఆరున్నర దశాబ్దాల అలజడి
చైనాలోని మొత్తం అయిదు స్వయంపాలిత ప్రాంతాల్లో జియాంగ్‌ ఒకటి. వాయవ్య ప్రాంతంలోని జియాంగ్‌ దేశంలో ఆరోవంతు భూభాగం కలిగి ఉంది. 2009 లెక్కల ప్రకారం అక్కడ జనాభా రెండు కోట్లకు పైగానే ఉంటుంది. అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌, భారత్‌, మంగోలియా, రష్యా, కజికిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, తజికిస్థాన్‌లతో సరిహద్దులు కలిగిన జియాంగ్‌ సువిశాల రాష్ట్రం. పశ్చిమాసియాను చైనాతో కలిపే పురాతన ‘సిల్క్‌ మార్గం’ ఈ రాష్ట్రం మీదుగానే వెళ్తొంది. కొండలు, గుట్టలతో ఉండే జియాంగ్‌లో సున్నీ ముస్లిములదే ఆధిపత్యం. వీరిని ఇక్కడ ‘ఉయిఘుర్‌’లని పిలుస్తారు. ప్రత్యేక అస్తిత్వం గల తాము అసలు చైనీయులమే కాదని, తమ మూలాలు ఇక్కడ లేవని వారంటారు. 1949లో ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న చైనా తమపై అణచివేత చర్యలకు పాల్పడుతోందన్నది వారి ఆరోపణ. తమ హక్కులను చైనా కాలరాస్తోందని, తమ పట్ల విచక్షణ ప్రదర్శిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తోందని నిరసన తెలుపుతున్నారు. 1993లో ప్రారంభమై, ఈస్ట్‌ టర్కిష్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ (ఈటీఐఎం) పేరుతో ప్రత్యేక అస్తిత్వం కోసం పోరాడుతున్న వీరిపై చైనా జరుపుతున్న దమనకాండ ప్రసార మాధ్యమాలపై ఆంక్షల కారణంగా పెద్దగా వెలుగులోకి రావడం లేదు. ఆరున్నర దశాబ్దాలుగా చైనా పాలకులు, ఉయిఘుర్‌ ప్రజల మధ్య పోరాటం నడుస్తోంది. హింసాకాండ చెలరేగుతోంది. గడచిన ఏడేళ్లలో సుమారు 900 మంది హతులైనట్లు అంచనా. వేలమంది క్షతగాత్రులయ్యారు. ఉయిఘుర్ల ప్రాబల్యాన్ని తగ్గించేందుకు చైనా పాలకులు వ్యూహాత్మకంగా హన్‌ తెగ ముస్లిములను ఆ ప్రాంతానికి పంపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 40 శాతం హన్‌ తెగ చైనీయులే. ఈ రెండు వర్గాల మధ్య పాలకులే విభేదాలు సృష్టిస్తున్నారు. హన్‌ తెగ చైనీయులకు అన్ని విషయాల్లో ప్రాధాన్యం లభిస్తుండగా, తమను ద్వితీయశ్రేణి పౌరులుగా చూస్తున్నారని ఉయిఘుర్లు ఆరోపిస్తున్నారు. వారిపై అణచివేత కొనసాగుతోంది. రాజకీయ హక్కులనూ నిరాకరిస్తున్నారు. చివరికి మతపరమైన ఆంక్షలు విధించేందుకూ బీజింగ్‌ వెనకాడటంలేదు. రంజాన్‌ వంటి పర్వదినాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. భద్రతా బలగాల అండతో వారిని పూర్తిగా అణచివేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు విఫలమవుతున్నాయి.
జియాంగ్‌ రాష్ట్రం పాక్‌తో సుమారు 526 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది. అఫ్గానిస్థాన్‌ సహా పాక్‌లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు అక్రమంగా సరిహద్దులు దాటి జియాంగ్‌లో చిచ్చురేపుతున్నారన్నది చైనా అనుమానం. ఈ ఉద్దేశంతోనే సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించింది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించాలని ఎవరూ చెప్పరు! తమ దేశంలో పెచ్చరిల్లే ఉగ్రవాదం పీచమణిచే హక్కు అక్కడి ప్రభుత్వాలకు ఎప్పుడూ ఉంటుంది. అదే సమయంలో ఇతర దేశాల్లో జరిగే ఉగ్రవాద ఘటనలపై మౌనం దాల్చడం, మాట మార్చడం, పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లు స్పందిస్తుండటం బాధ్యతారాహిత్యమే అవుతుంది. పెద్దగా ప్రభావం లేని చిన్నాచితకా దేశాల మాటలకు, వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఉండదు. కానీ, అంతర్జాతీయ శక్తిగా ఎదిగేందుకు పరితపిస్తున్న, పరిశ్రమిస్తున్న బీజింగ్‌- భారత్‌ ఎదుర్కొంటున్న పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదంపై ఇన్నేళ్లుగా రెండు నాల్కలతో మాట్లాడుతోంది. భద్రతామండలిలోని అయిదు శాశ్వత సభ్యదేశాల్లో ఒకటిగా అత్యంత బాధ్యతాయుత పాత్ర పోషించాల్సింది పోయి, అది ఆషామాషీగా వ్యవహరించడం కచ్చితంగా ఆక్షేపణీయమే. పాకిస్థాన్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌ సంస్థ అధినేత మసూద్‌ అజహర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ ఐరాసలో భారత్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పదేపదే అడ్డుకోవడం- ఉగ్రవాదంపై చైనా అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలకు నిలువెత్తు నిదర్శనం. అందుకు నిబంధనలను, సాంకేతిక అంశాలను సాకుగా చూపడం చైనాకే చెల్లింది. పాకిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ కేంద్రంగా పనిచేస్తున్న పలు ఉగ్రవాద సంస్థలు జమ్ముకశ్మీర్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో చిచ్చురేపడానికి అదేపనిగా ప్రయత్నిస్తున్న విషయం చైనాకు తెలియనిది కాదు. ముంబయి పేలుళ్ల సూత్రధారి, జమాత్‌-ఉద్‌-దవాహ్‌ అధినేత హఫీజ్‌ సయీద్‌ కశ్మీర్‌ అంశంపై భారత్‌కు వ్యతిరేకంగా నేరుగా పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో నిరుడు ఫిబ్రవరిలో ప్రదర్శన నిర్వహించినా చైనా నోరు మెదపలేదు. నవాజ్‌ షరీఫ్‌ ఆధ్వర్యంలోని పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌ (ఎన్‌) ఈ ప్రదర్శనకు మద్దతు ఇవ్వడం గమనార్హం. జమాత్‌ను ఉగ్రవాద సంస్థగా, సయీద్‌ను ఉగ్రవాదిగా 2008 డిసెంబరులోనే ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అమెరికా ఇప్పటికే అతడి మీద కోటి డాలర్ల పారితోషికం ప్రకటించింది.

పాక్‌ అరాచకాలపై మౌనముద్ర
నాటి ముంబయి పేలుళ్ల నుంచి నేటి పఠాన్‌కోట్‌ ఘటనల వరకు భారత్‌పై ముష్కర మూకల దాడుల్లో పాక్‌ ప్రత్యక్ష ప్రమేయం సంగతి తెలిసిందే! భారత్‌లో ఉగ్రవాదానికి నారూనీరూ పోస్తున్న పాకిస్థాన్‌ను అదేమిటని బీజింగ్‌ ప్రభుత్వం ప్రశ్నించిన పాపాన పోలేదు. పాక్‌ ప్రమేయానికి కచ్చితమైన ఆధారాలు ఉన్నా, చైనా స్పష్టంగా స్పందించడం లేదు. పాక్‌ అడిగిందే తడవుగా ఆయుధాలను సరఫరా చేయడం చైనా వైఖరిని ప్రతిబింబిస్తోంది. అయిదేళ్ల క్రితం వరకు పాక్‌కు చైనా 38 శాతం, అమెరికా 39 శాతం మేర ఆయుధాలను సరఫరా చేసేవి. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారింది. ప్రస్తుతం చైనాదే పైచేయి. బీజింగ్‌ వాటా 63 శాతానికి పెరిగింది. అమెరికా వాటా 19 శాతానికి తగ్గింది. అత్యాధునిక పోరాట విమానాలు, జలాంతర్గాములు సరఫరా చేసేందుకు చైనా ముందుకు వస్తోంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా చైనా అవతరించింది. ప్రస్తుతం చైనా ఆయుధ ఎగుమతుల్లో 35 శాతం పాకిస్థాన్‌కే వెళుతున్నాయంటే, ఆ రెండు దేశాల సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. తమ స్నేహం హిమాలయాల కన్నా ఎత్తయినదని, సాగరాల కన్నా లోతైనదని, చక్కెర కన్నా తియ్యనైనదని గతంలో ఇరు దేశాల పాలకులు ఘనంగా ప్రకటించుకున్నారు. వాటి మధ్య సంబంధాలు ఎంత గొప్పగా ఉన్నప్పటికీ, ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తుంటే ఆ బంధాన్ని ప్రశ్నించాల్సిందే! అంతర్జాతీయంగా అనేక అంశాల్లో అమెరికాను సవాలు చేస్తూ, దానికి దీటుగా అగ్రరాజ్యంగా ఎదిగేందుకు అహర్నిశలు కృషిచేస్తున్న బీజింగ్‌ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంది!

- గోపరాజు మల్లపరాజు
Posted on 18-01-2017