Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

అంతర్జాతీయ వాణిజ్యంలో చమురు మంటలు

* ధరల పతనం దేనికి సంకేతం

కరోనా నీడలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. ఈ నెల ఆరున మళ్ళీ ముడిచమురు ధరల పతనం దీనికి తాజా ఉదాహరణ. చమురును భారీగా దిగుమతి చేసుకునే భారత్‌ వంటి దేశానికి దీనివల్ల ఊరట కలిగినా ప్రపంచమంతటా చమురుకు గిరాకీ తగ్గడం, అంతర్జాతీయ వాణిజ్యానికి మంచిది కాదు. ఆరో తేదీన బ్రెంట్‌ ముడిచమురు ధర పీపాకు 3.1 శాతం చొప్పున, వెస్ట్‌ టెక్సస్‌ ఇంటర్మీడియట్‌ క్రూడ్‌ ధర మూడు శాతం చొప్పున తగ్గాయి. అంతర్జాతీయ చమురు సరఫరాను తగ్గించడం ద్వారా ధరను నిలబెట్టాలనే అంశంపై ఆరో తేదీన రష్యా, సౌదీ అరేబియాల మధ్య జరగాల్సిన చర్చలు ఏప్రిల్‌ తొమ్మిదో తేదీకి (నేటికి) వాయిదాపడ్డాయి. ఈ పరిణామం చమురు ధరను మళ్ళీ పడగొట్టింది. అంతకుముందు చమురు ధరల క్షీణతకు సౌదీ అరేబియాయే కారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆరోపించి చమురు ఎగుమతి దేశాల సంఘం (ఒపెక్‌)కు దూరం జరిగారు. రష్యా ఆరోపణను సౌదీ ఖండించింది. మరోవైపు ఈ రెండు దేశాలు ఒక అంగీకారానికి రాకపోతే వాటినుంచి చమురు దిగుమతులను బంద్‌ చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నేటి సమావేశంపై అన్ని దేశాల్లో ఆసక్తి పెరిగింది.

పడిపోయిన గిరాకీ
ఈ ఏడాది మొదట్లో 70 డాలర్లు పలికిన పీపా చమురు మూడు నెలలు తిరగకుండానే 30 డాలర్లకు దిగివచ్చింది. ఈ పరిస్థితికి ప్రధాన కారణం కరోనా వైరస్‌. ఈ మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేయడంతో అత్యధిక ప్రజానీకం ఇళ్లకే పరిమితం కావలసి వచ్చింది. రవాణాతోపాటు పారిశ్రామిక ఉత్పత్తి రంగమూ స్తంభించిపోయింది. ఫలితంగా చమురుకు గిరాకీ తగ్గిపోయి ధరలు పతనమయ్యాయి. ఒక దశలో గడచిన 18 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువగా చమురు ధర 20 డాలర్లకు పడిపోయింది. సౌదీ, రష్యాలు పోటాపోటీగా ధరలు తగ్గించడమూ చమురు విపణిని దెబ్బతీసింది. షేల్‌ చమురును అధికంగా ఉత్పత్తి చేయడం ద్వారా అమెరికా అంతర్జాతీయ చమురు ధరలను శాసిస్తోంది. ప్రపంచ చమురు సరఫరాపై ఒపెక్‌ గుత్తాధిపత్యాన్ని దెబ్బతీస్తోంది. దీంతో ఒపెక్‌ తన పట్టును కాపాడుకోవడానికి రష్యాను కలుపుకొని ఒపెక్‌ ప్లస్‌గా అవతరించింది. ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలు సజావుగా సాగాలంటే చమురు పీపా 70 డాలర్లకు విక్రయించాల్సిందే. లేకుంటే వాటి జీడీపీ పడిపోయి ఆర్థికంగా కష్టనష్టాల పాలవుతాయి. 2018నాటికి అమెరికా షేల్‌ చమురు ఉత్పత్తిని గరిష్ఠంగా పెంచుకొని ప్రపంచంలో అతి పెద్ద చమురు ఉత్పత్తిదారుగా అవతరించింది. ఒపెక్‌ చమురుపై ఆధారపడాల్సిన అగత్యం నుంచి బయటపడింది. అమెరికా నుంచి గిరాకీ తగ్గడంతో సహజంగానే అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు దిగివచ్చాయి. ధరలను మళ్ళీ పెంచి తమ మార్కెట్‌ను నిలబెట్టుకోవాలని ఒపెక్‌ ప్లస్‌ ప్రయత్నిస్తున్న తరుణంలో కరోనా సంక్షోభం వచ్చిపడింది. ఉత్పత్తిని తగ్గించడం ద్వారా ధరలను ఆశించిన స్థాయిలో నిలబెడదామని సౌదీ అరేబియా సూచించినా రష్యా ససేమిరా అంది. పీపా చమురు ధర 50 డాలర్లకన్నా తక్కువకు పడిపోతే అమెరికా షేల్‌ చమురు కంపెనీలకు గిట్టుబాటు కాదు. కాబట్టి ఉత్పత్తిని పెంచి ధరలను పడగొడితే అమెరికన్‌ షేల్‌ ఉత్పత్తి దారుణంగా దెబ్బతిని, మళ్ళీ తనదే రాజ్యం అవుతుందని రష్యా అంచనా. అందుకు తగ్గట్లే పలు అమెరికన్‌ షేల్‌ కంపెనీలు దివాలా అంచున వేలాడుతున్నాయి. చమురు ధరలు అట్టడుగుకు పడిపోతే అవి మార్కెట్‌ నుంచి అదృశ్యమై, తమకు ఎదురే లేకుండా పోతుందని రష్యా అంచనా. ఇంతలో సౌదీ అరేబియా ఉత్పత్తిని పెంచి రష్యా లెక్కలను తారుమారు చేసింది. ధర విషయంలో రష్యాను రాజీకి ఒప్పించాలని సౌదీ వ్యూహం. వీరిద్దరి గొడవలో ధరలు మరింత పడిపోయి అమెరికన్‌ షేల్‌ కంపెనీలు దెబ్బతిన్నాయి. దీనివల్లే ట్రంప్‌ సౌదీ-రష్యా చర్చల వాయిదాపై మండిపడ్డారు.

పీపా ముడిచమురు ధర 45-50 డాలర్ల మధ్యకు చేరినా రష్యా ఆర్థిక రథం సజావుగానే నడుస్తుంది. సూత్రరీత్యా ఇంతకన్నా తక్కువ ధరను కూడా సౌదీ అరేబియా తట్టుకోగలదు కానీ, అత్యంత భారీగా ఉండే సౌదీ బడ్జెట్‌ కేటాయింపులకు తగ్గ ఆదాయాన్ని ఆర్జించాలంటే చమురు ధర కొంత ఎక్కువగానే ఉండాలి. సౌదీ, రష్యా తదితర చమురు ఎగుమతి దేశాలకు ముడిచమురుపై సాధ్యమైనంత ఎక్కువ ఆదాయం సంపాదించడం వినా వేరే మార్గం లేదు. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలు సమతుల్యంగా అభివృద్ధి చెందినప్పుడు ఇలా ముడిసరకుల మీద అతిగా ఆధారపడవలసిన అగత్యం ఉండదు. నేటి రష్యా, సౌదీలకు ముడిసరకుల ఎగుమతే ప్రధాన ఆదాయ వనరు. కాబట్టి ఆరో తేదీ సమావేశంలో రెండు దేశాలూ కలిసి ఏదో ఒక అంగీకారానికి వస్తాయని ఆశించాయి. అలా జరగలేదు. ధరలు తగ్గడం, పెరగడమనేది కేవలం సరఫరా హెచ్చుతగ్గుల మీదనే కాక గిరాకీ పైనా ఆధారపడి ఉంటుంది. కరోనా సంక్షోభం వల్ల నేడు విమాన ప్రయాణాలు బంద్‌ అయ్యాయి. చమురుకు అతిపెద్ద మార్కెట్లయిన చైనా, ఇండియాల్లో లాక్‌డౌన్‌ వల్ల వాహనాలు తిరగడం లేదు. ఈ విధంగా గిరాకీ తగ్గినప్పుడు చమురు సరఫరాను కట్టడి చేయడం వల్ల ఒనగూడే ప్రయోజనం ఏమీ ఉండదు. కనుక సరఫరా తగ్గించడానికి ఇతర చమురు ఉత్పత్తి దేశాలను సౌదీ ఒప్పించగలదా అంటే సందేహమే. సౌదీ కూడా ఏ మేరకు ఉత్పత్తి తగ్గించగలదో చెప్పలేం. అమెరికా ప్రభుత్వం తన షేల్‌ కంపెనీలను ఉత్పత్తి తగ్గించాలని ఆదేశించలేదు. అలాంటి ఆదేశమే ఇస్తే ప్రైవేట్‌ షేల్‌ కంపెనీలు కోర్టుకెళతాయి. మరోవైపు ఈ ఏడాది చమురుకు గిరాకీ రోజుకు 90వేల పీపాల చొప్పున తగ్గిపోతుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ హెచ్చరించింది. చమురు ధరలు ఇంకా 20-25 శాతం మేరకు తగ్గవచ్చునని అంతర్జాతీయ కంపెనీలు లెక్కవేస్తున్నాయి. కనుక చమురు ధర మళ్ళీ 100 డాలర్లకు పెరగాలని ఒపెక్‌ ప్లస్‌ దేశాలు కలగంటూ ఉంటే, అది నెరవేరే సూచనలు లేవు.

సామాన్యుడికి ఊరట కలిగేలా...
భారతదేశ దిగుమతుల్లో చమురు వాటా 82 శాతం. 2018-19లో ఈ దిగుమతులపై భారత్‌ 11,100 కోట్ల డాలర్లు (దాదాపు రూ.8.43 లక్షల కోట్లు) ఖర్చుపెట్టింది. చమురు ధరలు పతనమైతే భారతదేశానికి ఈ బిల్లు తగ్గుతుంది. విదేశ మారక ద్రవ్య నిల్వలు ఆదా అయ్యి కరెంటు ఖాతా లోటు తగ్గిపోతుంది. కరోనా వల్ల పన్ను ఆదాయం పడిపోయిన సమయంలో దీనివల్ల భారతదేశానికి కొంతలో కొంత ఆర్థిక ఉపశమనం లభిస్తుంది. ప్రజల దృష్టి కోణం నుంచి చూస్తే దేశంలో పెట్రోలు, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు దిగిరాకపోవడం నిరాశ కలిగిస్తోంది. నిజం చెప్పాలంటే అవి మరే దేశంలోనూ లేనంత ఎక్కువగానే ఉన్నాయి. కొంతకాలంగా డాలరుతో రూపాయి మారక విలువ తగ్గుతూ వస్తున్నందువల్ల, అంతర్జాతీయ చమురు ధరల పతనం రూపేణా భారత్‌ లబ్ధి పొందలేకపోతోందనే వాదన ఉంది. రూపాయి విలువ తగ్గడాన్ని మించి చమురు ధర పతనమైందని ఇక్కడ గమనించాలి. కాబట్టి భారత ప్రభుత్వం చమురు ధరలను హెచ్చుస్థాయిలో కొనసాగించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకొంటోందని భావించాల్సి వస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చమురు ఉత్పత్తులపై అధిక పన్నులు విధిస్తున్నందువల్ల పెట్రోలు, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు దిగిరావడం లేదు. కరోనా సంక్షోభ సమయంలో ప్రభుత్వాలు పన్నులు తగ్గించలేకపోయినా వాటిని పెంచకుండా ఉంటే అదే పది వేలు. అలాగే కొత్త పన్నులు వేయకూడదు.

Posted on 09-04-2020