Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

జాతీయ వాదం నుంచి ఉన్మాదానికి...

* ట్రంప్‌ జమానా-కలహాల కుంపట్లు

‘మా కుటుంబాల్ని, పిల్లల్ని ఇక్కడ ఉంచడం సురక్షితమేనా? మనిషి రంగును బట్టి మంచి చెడులు ఎలా నిర్ణయిస్తారు? అసలు మేం కలలుకన్న దేశం ఇదేనా?’ అమెరికాలోని కేన్సస్‌ రాష్ట్రంలో జాత్యహంకార దాడికి బలైన కూచిబొట్ల శ్రీనివాస్‌ భార్య సునయన పుట్టెడు దుఃఖంతో అడిగిన ప్రశ్నలివి. కేన్సస్‌ కాల్పులపై అమెరికన్‌ సమాజమంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేసినా అయిదు రోజులపాటు అదేమిటో తెలియనట్లే వ్యవహరించిన ట్రంప్‌- సర్వత్రా విమర్శలు ముమ్మరించడంతో ఎట్టకేలకు నోరు విప్పారు. ఆ దాడిని అమెరికన్‌ కాంగ్రెస్‌ సంయుక్త సమావేశంలో ఆయన- విద్వేషపూరితమైనది, దుర్మార్గమైనది అని ఖండించారు. మనిషిని మనిషి మట్టుబెట్టే పాశవిక సంస్కృతిని క్షణమాత్రం ఆలోచన లేకుండా దునుమాడాల్సిన పరిస్థితుల్లో- అధికార పీఠాలను అధిరోహించిన వారి నోట ఆ మాట పలికించడం కోసం ప్రజాసమూహాలు ఉద్యమాలు చేయాల్సి రావడమే దారుణం. అమెరికాకు పునర్‌వైభవం పేరిట- మెక్సికన్లు, ముస్లిములు, నల్లజాతీయులు, స్వలింగ సంపర్కులపై వాచాలత్వంలో తనకు సరిసాటిలేరన్నట్లుగా కొత్త అధ్యక్షుడు ట్రంప్‌ చెలరేగిపోతుంటే- ఆయన అనుచర గణాలు అంతకు పదింతలు చిందులేయడం ఆశ్చర్యం కలిగించదు! అధ్యక్ష ప్రచారంలో అదుపు తప్పినా కనీసం పాలకుడిగా పరిణతి, వాస్తవిక స్థితిగతులపై సదవగాహనతో స్పందిస్తారని ఆశించినవారికి- మౌఢ్యానికి పరాకాష్ఠగా కొత్త రికార్డులు తిరగరాస్తున్న ట్రంప్‌ నిర్వేదమే మిగులుస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ విజయం సాధించిన తొలి పది రోజుల్లోనే 867 విద్వేష నేరాలు నమోదయ్యాయన్న అంచనా- అదుపుతప్పిన రాజకీయవేత్తలు రాజేసే మంటల ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో వెల్లడించింది. ‘ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు తోటి మనిషి చేయాల్సిందే నేను చేశాను’ కేన్సస్‌ కాల్పుల్లో శ్రీనివాస్‌, అలోక్‌లను కాపాడే క్రమంలో ఉన్మాది తూటా దెబ్బతిన్న 24ఏళ్ల అమెరికన్‌ యువకుడు గ్రిల్లెట్‌ మాటలు ఇప్పుడు సర్వత్రా ప్రశంసలందుకొంటున్నాయి. అమెరికా స్వేచ్ఛా ప్రతిమ స్ఫూర్తికి ఒకరు ప్రతీక అయితే... జాత్యహంకారాగ్నికి మరొకరు దర్పణం! వరసగా రెండు పర్యాయాలు నల్లజాతి ఒబామాను అధ్యక్షుడిగా ఎన్నుకొని అరమరికల్లేని ప్రజాస్వామ్యానికి అసలైన చిరునామాగా నిలిచిన అమెరికా నేడు- నలుపు, తెలుపులుగా విడిపోతున్న బాధాకర చిత్రం కళ్లకు కడుతోంది!

దేశం నిండా అడ్డు గోడలు
అమెరికన్‌ కాంగ్రెస్‌ సంయుక్త సమావేశ ప్రసంగంలో ట్రంప్‌ ఒక్క రోజైనా మారిన మనిషిలా కనిపించారని చాలామంది తీర్మానిస్తున్నారు. గర్వించడానికి పెద్ద కారణాలేవీ లేనప్పుడు ‘టెలీప్రాంప్టర్‌’లో రాసిపెట్టిన ప్రసంగాన్ని అప్పగించడమూ పిడివాదులకు అండపిండ బ్రహ్మాండంగానే తోచడంలో ఆశ్చర్యం లేదు. ప్రచార ఘట్టంలో అడ్డూ ఆపూ లేకుండా ట్రంప్‌ రెచ్చిపోయినప్పుడే అమెరికా సమాజంలో ప్రమాదకర చీలికలు పొడగట్టాయి. తాను గెలిస్తే తప్ప ఎన్నికల ఫలితాలను అంగీకరించబోనన్న ట్రంప్‌- అధ్యక్ష పగ్గాలు చేపడితే హిల్లరీని జైలుకు పంపిస్తానని పచ్చిగా పేలి ప్రజాస్వామ్య వాదులకు వెగటు పుట్టించారు. ట్రంప్‌ ప్రవచించిన విద్వేషాన్నే పవిత్ర బోధగా పరిగణించి ఆయన అనుయాయులు జాతి, కులం, ప్రాంతం, రంగు, రూపం పేరిట విద్వేష దాడులకు తెగబడుతున్నారు. అమెరికాయే తొలి ప్రాధాన్యమంటూ అయన మొదలుపెట్టిన జాతీయవాదం- అతివాదంగా మారి చివరికి ఉన్మాదంగా స్థిరపడింది! సమాజంలో బలవంతంగా కొన్ని భావాలను ప్రవేశపెట్టి, వాటికి బలమైన ప్రచారం కల్పిస్తే కొంతకాలానికి అవి వ్యవస్థీకృత నియమాలుగా మారే అవకాశం ఉంది. జాతి విచక్షణ, జాత్యహంకారం అలా పాదుకొన్నవే! సమాజ సహజ స్రవంతిలో ఏ తరహా ఆలోచనలు నిలదొక్కుకుంటాయన్నది ప్రజాస్వామ్య వ్యవస్థల బలం, పరిణతిపై ఆధారపడి ఉంటుంది. అడ్డుగోడల యుద్ధ భాషను రాజకీయ నుడికారంగా మార్చుకున్న ట్రంప్‌ జమానా అమెరికాలో ఇప్పుడు విద్వేష వ్యవస్థల్నే స్థిరపరుస్తోంది. ‘అమెరికన్ల కోసమే అమెరికా’ అంటూ ఆ దేశంలో మాతృభాషలో మాట్లాడటమే ప్రమాదకరమన్న స్థాయిలో వలసదారులను వణికిస్తున్న ట్రంప్‌ పాలన అభద్రతకు ఆనవాలుగా నిలుస్తోంది. అంతర్జాతీయంగా అనేక దేశాల ప్రజలు వలసవెళ్ళి ఇటుక ఇటుక పేర్చి నిర్మించిన ఫలితమే నేటి అమెరికా! ట్రంప్‌తో సహా ఆయన మద్దతుదారులు, అమెరికన్లుగా జబ్బలు చరచుకుంటున్నవారు అంతా ఇతర దేశాలనుంచి వచ్చి ఆ గడ్డపై స్థిరపడినవారే. స్వయంగా డొనాల్డ్‌ ట్రంప్‌ తాత జర్మనీ నుంచి అమెరికాకు బతుకు దెరువుకోసం వలసవచ్చి అక్కడ పారిశ్రామికవేత్తగా ఎదిగారు. స్థానిక ఆదివాసీ తెగలకు చెందిన ‘రెడ్‌ ఇండియన్లు’ మినహా అసలైన అమెరికన్లుగా చెప్పుకోగలవారు అక్కడ లేనే లేరు! ఆ ప్రాతిపదికన అగ్రరాజ్యంలోని 99శాతం జనాభాకు అమెరికా మూలాలు లేవన్నది నిష్ఠుర సత్యం. ఈ వాస్తవిక అవగాహన ఉండబట్టే అమెరికా పదహారో అధ్యక్షుడిగా పనిచేసిన రిపబ్లికన్‌ పార్టీకి చెందిన అబ్రహం లింకన్‌- వైవిధ్యానికి చోటుపెడుతూ నైపుణ్యాల సృజన కేంద్రంగా అమెరికా విస్తరించాలని ఆకాంక్షించారు. బెర్లిన్‌ గోడను బద్దలు కొట్టి ఉభయ జర్మనీలు ఏకమైతే- అదే జర్మనీ మూలాలున్న ట్రంప్‌ దేశాల మధ్య అడ్డుగోడలు లేపేందుకు సన్నద్ధమవుతుండటమే బాధాకరం!
డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణ స్వీకారోత్సవ వేళ- ‘ఈ అధ్యక్షుడు మాకొద్దు’ అని నినదిస్తూ సుమారు పదిలక్షలమంది అమెరికా వీధుల్లో కదం తొక్కారు. అమెరికాను మహోన్నతంగా నిలుపుతానన్న వ్యక్తిని అంతమంది వ్యతిరేకించడానికి కారణం- ఆయన ప్రవచించిన మార్గాలు భయాందోళనలు రేకెత్తించడమే! శత్రుభాష మాట్లాడుతున్న ట్రంప్‌- మరోవంక ప్రజలు మాత్రం తన మాటలను స్నేహంగా అర్థం చేసుకోవాలంటున్నారు. సంకుచిత ప్రయోజనాలు, పరిమితులను అధిగమించే విశాల దృక్పథం అమెరికన్‌ అధ్యక్షుడు ట్రంప్‌నకు లేదని స్పష్టమవుతోంది. మతాన్ని, జాతిని ప్రాతిపదిక చేసుకున్న ఫాసిస్టులు కేవలం అధికార పీఠం చేజిక్కించుకోవడంతోనే సరిపెట్టరు; అన్ని సామాజిక రంగాలనూ అదుపులోకి తీసుకోవడం ద్వారా తమ ఆధిక్యాన్ని నెలకొల్పుకొనేందుకు ప్రయత్నిస్తారు. ప్రజాస్వామ్యం కల్పించిన అవకాశాలను ఎలా ఉపయోగించుకోవాలో సైతం ప్రజలకు తామే బోధపరుస్తామన్న తరహా అహంభావం పాలకుల్లో పెరిగితే ఆ వ్యవస్థ నియంతృత్వానికి దగ్గరవుతోందనే అర్థం. న్యాయస్థానాలను, మీడియాను, భిన్నాభిప్రాయాన్నీ సహించలేని ట్రంప్‌ సారథ్యంలో అమెరికాలో ఇప్పుడు కొనసాగుతోంది... నియంత పాలనే! ఏడు ముస్లిం దేశాలపై పరమ దారుణంగా డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన ఆంక్షలను న్యాయస్థానంలో వ్యతిరేకించిన అటార్నీ జనరల్‌ను గంటల వ్యవధిలోనే ఆ పదవినుంచి తొలగిస్తూ ట్రంప్‌ సర్కారు ఉత్తర్వులు వెలువరించింది. న్యాయస్థానాలు ఇదే విధంగా వ్యవహరిస్తే భవిష్యత్తు పర్యవసానాలకు వాటిదే బాధ్యత అంటూ ట్రంప్‌ చేసిన తెంపరి వ్యాఖ్యలు జాత్యహంకారులు మరింత బరితెగించడానికే వూతమిచ్చాయి.
ఉభయ సభలను ఉద్దేశించి ట్రంప్‌ చేసిన ప్రసంగంలో మాటలకూ చేతలకూ మధ్య సంపూర్ణ వైరుధ్యం కనిపించింది. యుద్ధాలు, సంక్షోభం బొత్తిగా గిట్టని తాను; కేవలం శాంతి సుస్థిరతలనే కోరుకుంటున్నానని ట్రంప్‌ ధర్మపన్నాలు వల్లించారు. ఆ మాట అన్న వెంటనే అమెరికా సైనిక బడ్జెట్‌కు 5,400కోట్ల డాలర్లు అదనంగా కేటాయిస్తున్నట్లు ప్రకటించి అందరినీ నిర్ఘాంతపరచారు. తాను ప్రపంచ ప్రతినిధిని కాదని, కేవలం అమెరికా అధ్యక్షుడిగా మాత్రమే మాట్లాడుతున్నానని పరమ సత్యం వెల్లడించిన ట్రంప్‌- మిత్రరాజ్యాల భద్రతకోసం చేస్తున్న వ్యయానికీ కోతపెడతానని తేల్చిచెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా మిలిటరీ వ్యయం తగ్గిస్తామని చెబుతూ మరోవైపు- రక్షణ బడ్జెట్‌కు కొత్త కేటాయింపులు చేయడం ఏమాత్రం అంతుచిక్కని విషయం.

రెండు నాల్కల ధోరణి
‘ఒబామా కేర్‌’ను రద్దుచేసి అంతకంటే మెరుగైన ఆరోగ్య సేవల వ్యవస్థను నిర్మిస్తానని ఎన్నికల వేళ వాగ్దానం చేసిన ట్రంప్‌- అధ్యక్ష పగ్గాలు చేపట్టిన 40 రోజుల తరవాతా ‘రద్దు’ గురించే మాట్లాడుతున్నారు. దేశ ఆరోగ్య వ్యవస్థను పునర్నిర్మించే ప్రత్యామ్నాయ ప్రణాళికను ఆయన ఇప్పటికీ వివరించలేకపోతున్నారు. మంత్రివర్గాన్ని శతకోటీశ్వరులతో నింపి, సొంత అల్లుడికి కీలక సలహాదారు పదవిని కట్టబెట్టిన ట్రంప్‌ బృందానికి- వ్యాపారం చేసి డబ్బు సంపాదించడంపై ఉన్న అవగాహన పాలన ప్రాథమిక సూత్రాలపై లేదన్నది క్రమంగా తేటపడుతున్న సత్యం. అధ్యక్ష పదవి చేపట్టిన వెంటనే పర్యావరణ పరిరక్షణ సంస్థ గొంతు నులుముతూ దాని కేటాయింపులకు భారీ కోతపెట్టారు. ఆంక్షల కొరడా ఝుళిపించి అధ్యక్ష కార్యాలయ ‘వెబ్‌సైట్‌’నుంచి వాతావరణ మార్పు అన్న పదమే లేకుండా తొలగించారు. కాలుష్య ఉద్గారాలతో భూగోళం భగభగలకు తనవంతు కారణమైన అమెరికా ఆ మేరకు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన దశలో ‘పారిస్‌ ఒప్పందం’ కుదిరింది. ఆనాటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సైతం దానికి కట్టుబాటు చాటారు. ఈ నేపథ్యంలో వాతావరణం వేడెక్కుతోందన్న వాదనే అబద్ధమని వాచాలత్వం ప్రదర్శించిన ట్రంప్‌- ఆ ఒప్పందాన్ని కాలదన్నుతాననీ ప్రకటించారు. భూగోళంపై పచ్చదనం పెంచి మానవాళిని ఆదుకునే లక్ష్యంతో దేశాలన్నీ కదులుతున్న వేళ- ట్రంప్‌ తీరు ప్రపంచానికే పెను ముప్పుగా పరిణమిస్తోంది!
అధికారం ప్రతీకార సాధనం కాదు... అది తరతరాల నాగరికతా విలువ! ఈ స్పృహలేని ట్రంప్‌ ఐక్యరాజ్య సమితినే కాలక్షేపం క్లబ్బుగా తీర్మానించేశారు. ‘సమితి’ తరఫున ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్న వివిధ విభాగాలకు నిధులు తెగ్గోస్తాననీ హెచ్చరించారు. ‘నాటో’కి కాలం చెల్లిందని, పసిఫిక్‌ వాణిజ్య భాగస్వామ్య ఒడంబడిక (టీపీపీ)పై వేటు వేస్తామన్న దుందుడుకు ప్రకటనల ద్వారా ట్రంప్‌ అంతర్జాతీయంగా నిరసనల తుట్టె కదిపారు. మరోవంక సిరియా గగనతలాన్ని ‘నోఫ్లైజోన్‌’గా ప్రకటిస్తామన్న అమెరికా ప్రకటనపట్ల రష్యా, ఇరాన్‌లు అసహనం వ్యక్తం చేశాయి. అల్‌ఖైదా ఉగ్రమూకలను మట్టుబెట్టే పేరిట యెమెన్‌ మధ్యప్రాంతంపై అమెరికా గగనతల దాడులకు తెగబడింది. అధ్యక్ష పగ్గాలు చేపట్టాక విదేశీ గడ్డపై ఉగ్రవాదులమీద ట్రంప్‌ సర్కారు నిర్వహించిన మొట్టమొదటి దాడి అది. ఆ దాడిలో కొందరు ఉగ్రవాదులతోపాటు పెద్ద సంఖ్యలో మహిళలు పిల్లలు మరణించారు. అమెరికా దుందుడుకు చర్య ప్రపంచవ్యాప్తంగా పలు విమర్శలకు తావిచ్చింది. ఇక ఎట్టిపరిస్థితుల్లోనూ తమ గడ్డపై దాడులకు దిగేందుకు అమెరికాకు అనుమతి ఇవ్వబోమని యెమెన్‌ సర్కారు తెగేసి చెప్పింది. ట్రంప్‌ తెంపరితనం- నిద్రాణంగా ఉన్న విద్వేషాల్ని తట్టిలేపుతూ, ప్రపంచవ్యాప్తంగా కల్లోల కుంపట్లు రగిలిస్తోంది. అమెరికాలో శాంతి భద్రతలను నెలకొల్పడమే తన లక్ష్యమని ప్రమాణ స్వీకారోత్సవ వేళ డొనాల్డ్‌ ప్రకటించారు. పనిగట్టుకుని ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడం ద్వారా ఆయన చేస్తోంది అంతటా అశాంతిని ఎగదోయడమే. సమాజంలో సంక్షోభం తలెత్తడమే తన అవసరాన్నీ, బలాన్నీ పెంచుతుందని ట్రంప్‌ భావిస్తున్నట్లయితే- ఆయన నిప్పుతో చెలగాటమాడుతున్నట్లే లెక్క!

- ఇందిరాగోపాల్‌
Posted on 04-03-2017