Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

చైనా నష్టం భారత్‌కు లాభించేనా?

విశ్వవ్యాప్తంగా కొవిడ్‌ కేసుల ప్రజ్వలనానికి పురిటిగడ్డగా పరువుమాసిన చైనాతో వాణిజ్య బాంధవ్యం పట్ల అమెరికా సహా ఎన్నో దేశాల విముఖత- భారత్‌కు సానుకూలాంశం కానుందా? కొన్నేళ్లుగా అంతర్జాతీయ సరఫరా గొలుసుపై చైనా తిరుగులేని ఆధిపత్యానికి ఇక గండి పడనుందా? ఇవిప్పుడు ప్రపంచ దేశాల్లో ఎనలేని ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్నలు. చైనాకు అనివార్యంగా వాటిల్లనున్న నష్టం ఇండియాకు లబ్ధి చేకూర్చనుందన్న వాదనలకు పోనుపోను గట్టి వత్తాసు వ్యక్తమవుతోంది! వాస్తవానికి అమెరికా, చైనాల మధ్య పెచ్చరిల్లిన వాణిజ్య యుద్ధం గత జులైలో అనూహ్య ఘటనలకు తెరతీసింది. అప్పట్లో అమెరికా కంప్యూటర్‌ దిగ్గజాలు హెచ్‌పీ, డెల్‌తోపాటు పలు విదేశీ సంస్థలు చైనాలో వాణిజ్య ఉత్పత్తి కార్యకలాపాలను తెగ్గోశాయి. రీకో, సోనీ వంటి జపాన్‌ కంపెనీలు, విశ్వసనీయ సరఫరా గొలుసుపై ఆధారపడిన మరెన్నో సంస్థలు ఆగ్నేయాసియా దేశాలను ప్రత్యామ్నాయాలుగా ఎంచుకున్నాయి. వుహాన్‌ కేంద్రస్థలిగా కరోనా కేసులు ముమ్మరించిన తరుణంలో వెయ్యికిపైగా సంస్థలు భారత ప్రభుత్వంతో సంప్రతింపులు ఆరంభించాయన్న కథనాలు వెలుగుచూశాయి. చైనా ఊసెత్తితేనే నిప్పులు కక్కుతూ, అక్కడికి ఎగుమతులపై కొత్తగా ఆంక్షలు విధించిన అమెరికా- బీజింగ్‌ను ఇరకాటంలోకి నెట్టడమే ప్రధాన అజెండాగా పావులు కదుపుతోంది. చైనా భూభాగంనుంచి ఉత్పాదక విభాగాలను తరలించే సంస్థలకు చేయూతగా జపాన్‌ దాదాపు 25వేల కోట్ల యెన్‌ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. కొన్ని కొరియన్‌ సంస్థలు చైనానుంచి తట్టా బుట్టా సర్దేసి భారత్‌లో కార్యకలాపాలు సాగించడానికి ఉత్సుకత కనబరుస్తున్నాయి. ఈమధ్య చైనానుంచి తరలివెళ్ళిన 56 సంస్థల్లో వియత్నామ్‌కు 26, తైవాన్‌కు 11, థాయ్‌లాండ్‌కు ఎనిమిది చేరగా- భారత్‌కు దక్కింది కేవలం మూడేనని నొమురా అధ్యయనం నిగ్గుతేల్చింది. ఈ దశలో ఇండియాకు నికరంగా కలిసొచ్చేది ఎంతన్నదానిపై మూడీస్‌ సంస్థ నివేదికాంశాలు, ప్రభుత్వాల తక్షణ కర్తవ్యమేమిటో సూటిగా చాటుతున్నాయి.

తయారీ రంగాన ఎదురన్నదే లేని మహాశక్తిగా వెలుగొందిన చైనాది ఇక గత ప్రాభవమేనంటున్న మూడీస్‌ అధ్యయనం- మారిన స్థితిగతుల్లో తూర్పు, ఆగ్నేయ ఆసియా దేశాలు సమధికంగా లాభపడనున్నాయంటోంది. సువర్ణావకాశం అందిపుచ్చుకోకుండా భారత్‌ను దిగలాగుతున్న అంశాల్నీ అది క్రోడీకరించింది. పోటీదారులతో పోలిస్తే దేశీయంగా అధిక ఉత్పత్తి వ్యయం వెలుపలి పెట్టుబడిదారుల్ని కుంగదీసేదే. మూలధన పెట్టుబడులు, విద్యుత్‌ సుంకాలు, పన్నుల మోత సైతం ఇక్కడ ఎక్కువేనని గణాంకాలు స్పష్టీకరిస్తున్నాయి. బ్యురాక్రటిక్‌ అలసత్వం, అడుగడుగునా పనుల్లో అలవిమాలిన జాప్యం భారత ప్రగతికి ప్రతిబంధకాలవుతున్నట్లు నిపుణులు ఎన్నేళ్లుగానో మొత్తుకుంటున్నారు. ఆ లోటుపాట్లే ఇండియాకు ఇప్పటికీ గుదిబండలంటున్న హెచ్చరిక, ప్రభుత్వాలు ఇక ఎంతమాత్రం ఉపేక్షించరానిది! చైనాకు ఎదురుగాలి వీస్తున్న దృష్ట్యా ఎలెక్ట్రానిక్స్‌ తయారీ రంగంలో నిలదొక్కుకునేందుకు కృషి చేయాల్సిందిగా కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ రాష్ట్రాలకు పిలుపిచ్చారు. దేశం ఎలెక్ట్రానిక్‌ హబ్‌గా రూపాంతరం చెందాలంటే- మరిన్ని తయారీ సమూహాల(క్లస్టర్ల)కు అనుమతులివ్వాలని, సూక్ష్మ చిన్న మధ్యతరహా సంస్థలకు మినహాయింపులు ప్రసాదించాలన్న రాష్ట్రాల అభ్యర్థనలకు మన్నన దక్కాలి. దేశ ఉత్పాదక రంగానికి కొత్త సత్తువనిచ్చే కీలక విధాన నిర్ణయాల్ని చురుగ్గా అమలుపరచాలి. కుదేలైన ఆర్థిక రంగానికి నవోత్తేజం కలిగేలా భిన్న పరిశ్రమల్ని సరఫరా గొలుసులో అంతర్భాగం చేయడంతోపాటు- భూ, కార్మిక, పన్ను నియంత్రణ వ్యవస్థల్ని సాకల్యంగా ప్రక్షాళించాలి. మౌలిక వసతుల్ని పరిపుష్టీకరించాలి. ఆ మేరకు కార్యకుశలతే- చైనా నష్టాన్ని భారత్‌కు లబ్ధిగా స్థిరీకరించగలిగేది. అందులో సాధించే విజయమే, 2024నాటికి అయిదు లక్షల కోట్ల డాలర్ల భూరి వ్యవస్థగా అవతరించాలన్న లక్ష్య సాధనకు గట్టి పునాది అవుతుంది!

Posted on 30-04-2020