Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

కొవిడ్‌కు కోరలు తొడిగిందెవరు?

* డబ్ల్యూహెచ్‌ఓ వైపు చూపుడు వేళ్లు

ఏదైనా ప్రపంచస్థాయి సంస్థ పురుడు పోసుకొన్న మొదట్లో తప్పటడుగులు వేసిందంటే అర్థముంది. కానీ, వ్యవస్థీకృతం అయ్యాక- అనుభవం గడించేకొద్దీ బండబారిపోతే అది ప్రజల అస్తిత్వానికే పెను ప్రమాదంగా మారుతుంది. కరోనా వైరస్‌ విజృంభించిన వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) వైఫల్యాలపై ప్రపంచ దేశాలు గుర్రుగా ఉన్నాయి. మహమ్మారిపై దేశాలను అప్రమత్తం చేయడంలో డబ్ల్యూహెచ్‌ఓ విఫలమైందని, చైనాకు కొమ్ముకాసిందన్న విమర్శల్ని ఎదుర్కొంటోంది. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వంటివారి విపరీత స్పందనలు ఊహించినవే. మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఏమీ చేయలేని పరిస్థితిలో చాలా దేశాలు మౌనం పాటిస్తున్నాయి. కొవిడ్‌ మహమ్మారి అంతమయ్యాక దీని సంగతేమిటో చూద్దాం అన్నట్లు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ‘మేము చెప్పినప్పుడే అప్రమత్తమైతే మెరుగ్గా ఉండేది’ అంటూ డబ్ల్యూహెచ్‌ఓ అధ్యక్షుడు టెడ్రోస్‌ అధెనం గెబ్రియోసిస్‌ సన్నాయి నొక్కులు నొక్కారు. ఆయన ఏం చెప్పారా అని గతంలోకి వెళ్లి చూస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థ వైఫల్యాలు ఎదురవుతాయి.

సకాలంలో అందని సమాచారం
ప్రపంచ ఆరోగ్య సంస్థకు సరైన సమాచారం అందించడంలో చైనాకు అత్యంత చెత్త రికార్డు ఉంది. ఈ విషయం 2002లో సార్స్‌ ప్రబలినప్పుడే రుజువైంది. అయినా ఆ దేశం చెప్పిన సమాచారాన్ని గుడ్డిగా నమ్మి దానినే ప్రపంచం నెత్తిపై రుద్దడం టెడ్రోస్‌కే చెల్లింది. డిసెంబరు 30వ తేదీనే చైనాలోని నేత్రవైద్యుడు డాక్టర్‌ వెన్‌లియాంగ్‌ సార్స్‌ వంటి వైరస్‌ మనిషికి సోకిందని నివేదికలతో సహా సామాజిక మధ్యమాల్లో వెల్లడించారు. గతంలో మనుషులకు సోకిన కరోనా వైరస్‌లు అంటువ్యాధులకు కారణమైన చరిత్ర ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలియదా? మరి ఏ పరిస్థితుల్లో ‘సార్స్‌ కోవ్‌ 2 అంటువ్యాధి అనడానికి ఆధారాల్లేవు’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ట్వీట్‌ చేసింది. వైద్యశాస్త్రానికి సంబంధం లేని వ్యక్తి ప్రపంచ ఆరోగ్య సంస్థ పగ్గాలు చేపడితే పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రపంచానికి అర్థమైంది.

ప్రపంచ స్థాయి సంస్థలు సొంత విచారణ, విచక్షణ, అధ్యయనాలతో పని చేస్తేనే వాటి ఉనికికి న్యాయం చేస్తాయి. దీనికి నార్వే మాజీ ప్రధాన మంత్రి డాక్టర్‌ గ్రో హార్లెమ్‌ బ్రంట్లాండ్‌ నేతృత్వంలో డబ్ల్యూహెచ్‌ఓ పనితీరే నిదర్శనం. 1998లో డైరెక్టర్‌ జనరల్‌గా ఆమె పగ్గాలు చేపట్టారు. ఆమెకు ఒక దేశానికి ప్రధానిగా చేసిన అనుభవం ఉండటంతో అంతర్జాతీయంగా ఎలా వ్యవహరించాలో బాగా తెలుసు. కేవలం ప్రభుత్వాలు ఇచ్చే, పరిస్థితి తీవ్రతను తగ్గించి చూపే నివేదికలపై ఆధారపడకుండా స్థానిక సంబంధాలు, దౌత్య మార్గాల ద్వారా సమాచారం తెప్పించుకోవడం వంటివి చేశారు. సార్స్‌ (సివియర్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌)కు అడ్డుకట్ట వేయడానికి ఈ వ్యవస్థ బాగా ఉపయోగపడింది. 2002 నవంబర్‌లోనే చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లో విచిత్రమైన న్యుమోనియా ప్రబలింది. ఈ వ్యాధి వేగంగా ఆసుపత్రి సిబ్బందికి సోకడం మొదలుపెట్టింది. ఈ విషయాన్ని డ్రాగన్‌ తొక్కిపట్టింది. అదే ప్రాంతంలో ఉన్న డబ్ల్యూహెచ్‌ఓ ఉద్యోగి కుమారుడు 2003 ఫిబ్రవరి 10న సంస్థకు ఉప్పందించాడు. అప్పటికే 100 మంది చనిపోయినట్లు పేర్కొన్నాడు. వెంటనే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిపై చైనాను నిలదీసింది. ఆ మర్నాడే చైనా అధికారికంగా నివేదిక పంపింది. సంస్థ 55 ఏళ్ల చరిత్రలో తొలిసారి హాంకాంగ్‌, గ్వాంగ్‌డాంగ్‌ వెళ్లడంపై ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. దీన్ని తొలగించాలనే ఒత్తిళ్లకు గ్రో హార్లెమ్‌ లొంగలేదు. దీనికితోడు రోగి సంబంధీకులను గుర్తించడం, క్వారంటైన్‌ చేయడం వంటి చర్యలతో సార్స్‌ 26 దేశాలకే పరిమితమై- 1,000 ప్రాణాలను బలిగొని అదృశ్యమైపోయింది. వైద్యం, టీకా లేని ఈ భయంకర వ్యాధిని హార్లెం నేతృత్వంలోని డబ్ల్యూహెచ్‌ఓ కేవలం నియంత్రణ చర్యలతో రూపుమాపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రారంభంలో చిన్నచిన్న ఒడుదొడుకులు, విమర్శలు ఎదుర్కొన్నా మహమ్మారుల కట్టడిలో ఎంతో సమన్వయంతో పనిచేసింది. 1950లలో మశూచి వ్యాప్తి సమయంలో రోగనిరోధకతపై పరిశోధనలు చేయడంతోపాటు దౌత్యపరంగా ప్రపంచ దేశాలను డబ్ల్యూహెచ్‌ఓ సమన్వయం చేసింది. 2.5 కోట్ల టీకాలను తయారు చేసేందుకు రష్యాను ఒప్పించింది. అమెరికా నుంచి నిధులను తీసుకొచ్చింది. 1960లలో ప్రపంచ దేశాలన్నీ ప్రతివారం మశూచిపై నివేదికలను పంపేలా ఏర్పాటుచేసింది. ఈ సమన్వయ చర్యల ఫలితంగా 1979లో మశూచి అంతమైంది. కానీ, ఆ తరవాత ఎయిడ్స్‌ వంటి మహమ్మారులను ముందస్తుగా గుర్తించడంలో విఫలమైందనే విమర్శలకు గురైంది. 1988-98 మధ్యలో డాక్టర్‌ హిరోషీ నకజిమ నేతృత్వంలో ఈ సంస్థపై అవినీతి ఆరోపణలూ వచ్చాయి. డాక్టర్‌ హార్లెం రాకతో పునర్వైభవాన్ని అందుకొంది. కానీ, చైనాకు చెందిన మార్గరెట్‌ చాన్‌ దీనికి డైరెక్టర్‌ జన రల్‌గా ఉండగా, 2009 మార్చిలో మెక్సికోలో స్వైన్‌ఫ్లూ(హెచ్‌1ఎన్‌1) సమయంలో బిలియన్ల కొద్దీ డోసుల టీకాలు వృథాగా కొనుగోలు చేయించిందనే విమర్శలను ఎదుర్కొంది. 2014లో పశ్చిమ ఆఫ్రికాలో ఎబోలాపై వేగంగా స్పందించలేకపోయింది. గినియా, లైబీరియా, సియెర్రా లియోన్‌లో పరిస్థితి ప్రపంచ ఆరోగ్య సంస్థ చేజారిపోయింది. దీంతో అమెరికాతో సహా ఇతర దేశాలు 5,000 మంది సైనిక సిబ్బందిని పంపి ఐరాస తాత్కాలిక కమిటీ నేతృత్వంలో పనిచేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. కానీ, అప్పటికే 11,310 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. దీంతో డబ్ల్యూహెచ్‌ఓ డీజీ చాన్‌ తీవ్రంగా విమర్శలపాలయ్యారు.

వైరస్‌పై పిల్లిమొగ్గలు
కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తిలో ఈ సంస్థ తీరు విపరీతమైన గందరగోళానికి దారితీసింది. తైవాన్‌ ఇచ్చిన సమాచారాన్ని డబ్ల్యూహెచ్‌ఓ పట్టించుకోలేదు. పైగా సాధారణ వ్యక్తులు ముఖ మాస్కులు వాడాల్సిన అవసరం లేదని పేర్కొంది. సార్స్‌ కోవ్‌2 అంటువ్యాధి కాదని మొదట్లో ప్రకటించడం, చైనా నుంచి వైరస్‌ జన్యుసమాచారం రాబట్టడంలో ఆలస్యం చేయడం, అన్నింటికీ మించి- చైనా వాస్తవాన్ని దాచిందని తెలుస్తున్నా ‘వ్యాధిని అరికట్టడంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది’ అని టెడ్రోస్‌ పొగడ్తలతో ముంచెత్తడం ప్రపంచ దేశాలకు ఆగ్రహం తెప్పించింది. జనవరి 31న చైనానుంచి వచ్చేవారిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆంక్షలు విధించడాన్ని టెడ్రోస్‌ తప్పుబట్టడం మరీ విచిత్రం. 100 దేశాల్లో కొవిడ్‌ వ్యాపించేదాకా చోద్యం చూసి, ఆ తరవాతే ప్రపంచ మహమ్మారిగా ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్యసంస్థ అధ్యక్షుడు రాజకీయ కోణంలో విమర్శలు చేయడం- దేశాధినేతలను దెప్పిపొడవడం వంటివి ఆ సంస్థ కీర్తి ప్రతిష్ఠలను మసకబార్చాయి. ఇథియోపియాకు చెందిన టెడ్రోస్‌ వ్యక్తిగత రాజకీయ చరిత్ర, చైనాతో ఉన్న అవసరాలు, సంబంధాలు వంటివి పక్కన పెడితే- ప్రపంచ ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ఒక సంస్థను సరైన దారిలో నడపలేదని జరిగిన ఘటనలు చెబుతున్నాయి. ఫలితంగా ఇప్పుడు ఆ సంస్థ అస్తిత్వమే ప్రమాదంలో పడింది. భవిష్యత్తులో దీన్ని సంస్కరించి పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పనిచేసే గౌరవప్రదమైన వ్యవస్థగా తీర్చి దిద్దాల్సిన అవసరం ఉంది.

చైనాను ప్రశ్నించడంలో వైఫల్యం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేస్తున్న విమర్శలకు బలాన్నిచ్చేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యవహరిస్తోంది. 2002లో సార్స్‌ వ్యాప్తి తరవాత ప్రపంచ ఆరోగ్యసంస్థను బలోపేతం చేస్తూ ‘అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలు(ఐహెచ్‌ఆర్‌)-1969’ స్థానంలో ‘ఐహెచ్‌ఆర్‌-2005’ను తీసుకొచ్చారు. దీని ప్రకారం సభ్యదేశాల్లో ఏదైనా వ్యాధి, ఘటన ప్రపంచ ప్రజల ఆరోగ్యానికి పెనుముప్పుగా మారే అవకాశం ఉంటే- ఆ దేశాలు ముందు డబ్ల్యూహెచ్‌ఓకు వెల్లడించాలి. ముఖ్యంగా ఇన్‌ఫ్లుయెంజా తరహా కొత్త వ్యాధుల సమాచారం తెలియజేయాలని స్పష్టంగా ఉంది. కొవిడ్‌ కూడా ఇన్‌ఫ్లుయెంజా వంటిదేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్‌సైట్‌ చెబుతోంది. మరి ఈ నిబంధన పూర్తిగా అమలు చేయని చైనాను డబ్ల్యూహెచ్‌ఓ ప్రశ్నించలేదు. దీంతో ఆ సంస్థ చైనా విషయంలో బాగా మెతకవైఖరి అవలంబిస్తోందనే విమర్శలు వెల్లువెత్తాయి.

"ప్రపంచ ఆరోగ్య సంస్థ పనితీరును పరిశీలిస్తే అది చైనాకు ప్రజా సంబంధాల విభాగం (పబ్లిక్‌ రిలేషన్స్‌ ఏజెన్సీ)లా వ్యవహరిస్తోంది. దీనికి సంస్థ సిగ్గుపడాలి. కరోనా ఉపద్రవానికి కారకులైన వారిని ఊరికే వదిలేయడం ఏమాత్రం సమంజసం కాదు"

- పెద్దింటి ఫణికిరణ్‌
Posted on 03-05-2020