Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

బరితెగించిన పాకిస్థాన్‌!

* ‘గిల్గిత్‌’పై కొత్త పాచిక

పాకిస్థాన్‌ మళ్ళీ పేట్రేగుతోంది. తన ఆధీనంలో ఉన్న గిల్గిత్‌- బాల్టిస్థాన్‌కు రాష్ట్ర హోదా కల్పించాలనుకోవడం ద్వారా అది మరోసారి తెంపరితనం ప్రదర్శించింది. ఇదే జరిగితే భారత్‌ పాక్‌ల మధ్య సంబంధాలు మరింత క్షీణించడం ఖాయం. పాకిస్థాన్‌ 78వ వార్షిక ఉత్సవాలను (1940 మార్చి 23న ‘ముస్లిం లీగ్‌’ పాకిస్థాన్‌ ఏర్పాటు తీర్మానాన్ని ఆమోదించింది) పురస్కరించుకుని దాయాది దేశం అధ్యక్షుడు మమ్‌నూన్‌ హుస్సేన్‌ కశ్మీరీలకు నైతిక, రాజకీయ మద్దతు కొనసాగిస్తామంటూ నోటికొచ్చిందల్లా మాట్లాడారు. అందుకు తానా తందానా అన్నట్లుగా భారత్‌లో పాక్‌ హై కమిషనర్‌ అబ్దుల్‌ బాసిత్‌ సైతం కశ్మీరీల స్వతంత్ర పోరాటానికి పాక్‌ మద్దతు ఉంటుందని దూకుడు ప్రదర్శించారు. పాకిస్థానీల అవాకులు చెవాకులకు భారత్‌ దీటుగా బదులిచ్చింది. ‘పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ సహా గిల్గిత్‌-బాల్టిస్థాన్‌లను ఇస్లామాబాద్‌ పిడికిళ్లనుంచి విడిపించి తీరతా’మని భారత కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ తేల్చి చెప్పారు. ఇప్పటివరకు ఉత్తర ప్రాంతాలుగా పిలుస్తున్న ఈ భౌగోళిక విభాగం నిజానికి మన జమ్ము కశ్మీర్‌లో అంతర్భాగం. నాటి కశ్మీర్‌ పాలకుడు మహారాజా హరిసింగ్‌ భారత్‌లో విలీనం చేసిన కశ్మీర్‌ సంస్థానంలో ఇదీ ఒక భాగమే. ఆనాడు కశ్మీర్‌ను కబళించే లక్ష్యంతో పాక్‌ పంపిన ఉగ్రమూకలు, నేడు ఆజాద్‌ కశ్మీర్‌గా పాక్‌ పిలుస్తున్న ప్రాంతంతో పాటు ఈ భాగాన్నీ ఆక్రమించుకున్నాయి. ముందుచూపు లేని నాటి మన పాలకుల వైఫల్యం కారణంగా ఈ ప్రాంతం అప్పటి నుంచి పాకిస్థాన్‌ ఆధీనంలోనే ఉండిపోయింది.

ద్వంద్వనీతికి ఉదాహరణ
రక్షణపరంగా గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ మనదేశానికి అత్యంత కీలకమైనది. 1935లో అప్పటి బ్రిటీష్‌ పాలకులు గిల్గిత్‌ను 60 సంవత్సరాల పాటు తమకు లీజుకు ఇవ్వాల్సిందిగా హరిసింగ్‌పై ఒత్తిడి తెచ్చారంటే, ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా ఎంత ముఖ్యమైనదో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాంతం మన ఆధీనంలో ఉండి ఉంటే పాక్‌, చైనాల మధ్య సరిహద్దే ఏర్పడేది కాదు. పైగా భారత్‌, అఫ్గానిస్థాన్‌ల మధ్య ప్రత్యక్ష భూ సరిహద్దు ఉండి ఉండేది. దాంతో మధ్య ఆసియా దేశాలతో భారత్‌కు ప్రత్యక్ష వ్యాపార సంబంధాలు ఏర్పడేవి. గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ ప్రాంతమంతా సింధు, గిల్గిత్‌, శిగర్‌, షోక్‌ వంటి నదుల పరవళ్లతో, కారకోరం పర్వతశ్రేణుల్లో భాగాలైన నంగ పర్వత శిఖరాల అందాలతో కనువిందు చేస్తుంటుంది. ఇక్కడుండే హుంజ, స్కర్దు తదితర లోయలు పాక్‌ పర్యాటకానికి ఆయువుపట్లు. అయినా ఈ ప్రాంతంలో అభివృద్ధి మాత్రం శూన్యం. రాజకీయ పరమైన హక్కుల మాట దేవుడెరుగు... సాధారణ పౌరహక్కులకు సైతం అక్కడి స్థానికులు నోచుకోలేదు. దీనిపై చాలా కాలంగా అక్కడి ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కశ్మీర్‌ వేర్పాటువాద ఉద్యమాన్ని భుజాన మోస్తున్న పాకిస్థాన్‌, గిల్గిత్‌ ప్రజాఉద్యమాన్ని మాత్రం అణచివెయ్యడం- దాని ద్వంద్వనీతికి నిదర్శనం. అందుకే ఎర్రకోట సాక్షిగా ప్రధాని మోదీ బలూచిస్థాన్‌ పౌరుల హక్కుల గురించి ప్రస్తావించినప్పుడు- మా గోడూ పట్టించుకోండంటూ గిల్గిత్‌ పౌరులు చేసిన నినాదాలు ప్రపంచమంతా ప్రతిధ్వనించాయి. అమెరికా కేంద్రంగా గిల్గిత్‌ హక్కుల కోసం చాలా ఏళ్లుగా పోరాడుతున్న గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ డైరెక్టర్‌ సెంగ్‌ సెరింగ్‌ అయితే ఈ ప్రాంతం రెండు దేశాల మధ్య వివాదాస్పద ప్రాంతంగా ఉన్నంత మాత్రాన ఇక్కడి ప్రజలకు మానవహక్కులు లేకుండా పోతాయా అంటూ పాక్‌ను నిలదీస్తున్నారు. అంతేకాక పాకిస్థాన్‌ తొలుత ఈ ప్రాంతాన్ని ఖాళీ చేస్తే, కశ్మీర్‌ సమస్యకు తగిన పరిష్కారం లభిస్తుందని పలుమార్లు సూచించారు కూడా!
ఇన్నాళ్లు లేని రాష్ట్ర హోదా ఈ ప్రాంతానికి ఇప్పుడే ఇవ్వాలనుకోవడం వెనక పాకిస్థాన్‌ కుతంత్రాలు చాలానే ఉన్నాయి. చైనాలోని సింజియాంగ్‌ ప్రావిన్స్‌ నుంచి బలూచిస్థాన్‌లోని గదర్‌ ఓడరేవు వరకు ఏర్పాటయ్యే ‘చైనా-పాకిస్థాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌’ (ఆర్థిక నడవ)కు ఈ ప్రాంతమే కీలకం. దీన్ని సీపీఈసీ అని అంటున్నారు.ఇందులో భాగంగా గదర్‌నుంచి కాస్‌గర్‌కు 2,442 కిలోమీటర్ల దూరాన్ని రోడ్డు, రైలు మార్గాల ద్వారా అనుసంధానిస్తారు. దీనినే ‘వన్‌ రోడ్‌ వన్‌ బెల్ట్‌’గానూ వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా పలుచోట్ల ఆర్థిక, పారిశ్రామిక పార్కులూ ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టుకోసం సుమారు 46 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేయాలని రెండు దేశాల ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈ ప్రాజెక్టు విషయంలో మనదేశంతో పాటు పాక్‌ ప్రజల్లోను, ప్రతిపక్షాల్లోను అనేక అనుమానాలు, ఆందోళనలు నెలకొని ఉన్నాయి. పైకి ఈ నడవ ఆ రెండు దేశాల ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి ప్రాజెక్టుగా కనపడుతున్నా, రక్షణపరంగా భారత్‌ను ఇబ్బందుల్లో నెట్టడమే సీపీఈసీ ప్రధాన ఉద్దేశం.
భారత్‌ ఈ ఒప్పందం పట్ల ఆది నుంచి తన వ్యతిరేకతను వ్యక్తం చేస్తూనే ఉంది. గత ఏడాది హంగ్జూలో జరిగిన జి-20 సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఈ అంశాన్ని మన ప్రధాని ప్రస్తావించారు. సీపీఈసీపట్ల తన అసంతృప్తినీ వ్యక్తపరచారు. ఇక ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా భారత్‌ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాల్లో మొదటిది మన దేశానికీ హక్కుభుక్తాలున్నాయని వాదిస్తున్న ప్రాంతం గుండా ఈ నిర్మాణాలు చేపట్టడం. రెండోది- పైకి ఈ ఒప్పందం ఆర్థిక, వ్యాపారపరమైనదిగా కనిపిస్తున్నా భారత్‌ రక్షణకు సంబంధించిన అనేక ఆందోళనకరమైన అంశాలు దీనితో ముడివడి ఉండటం. ఇప్పటికే భారత్‌ను తన చక్రవ్యూహంలో బంధించాలనుకుంటున్న చైనా బంగాళాఖాతం, హిందూ మహాసముద్ర దీవుల్లో తన సైనిక స్థావరాలు ఏర్పరుచుకుంది. ఇప్పుడీ ఒప్పందం వల్ల కీలకమైన భారత పశ్చిమ, వాయవ్య తీరంలోనూ చైనాకు ఒక స్థావరం లభించినట్లవుతుంది. చైనా, భారత్‌ల మధ్య ఎప్పుడైనా ఉద్రిక్తతలు నెలకొంటే- అవి తన ఆయుధ సంపత్తిని కారకోరం రహదారి ద్వారా పాకిస్థాన్‌కు తరలించి మన తీరంలో సులువుగా మోహరించవచ్చు. అంతేకాక అఫ్గానిస్థాన్‌తో భారత్‌కు కొంతకాలంగా పెరుగుతున్న సత్సంబంధాలు బీజింగ్‌కి ఏ మాత్రం రుచించడం లేదు. అందుకే దాని కన్ను ఆ దేశానికి దగ్గరగా ఉన్న గదర్‌ రేవుపై పడింది. తూర్పుదేశాలతో సత్సంబంధాలకోసం భారత్‌ చేస్తున్న ప్రయత్నాలూ చైనాకు కంటగింపు అయ్యాయి. సీపీఈసీని దానికి ప్రతిచర్యగా భావించవచ్చు.

చక్రవ్యూహం
చైనాతో నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం కుదుర్చుకున్న ఈ ఒప్పందం పట్ల పాక్‌ ప్రజలు, రాజకీయవర్గాల్లోనూ ఎన్నో అనుమానాలున్నాయి. మరీ ముఖ్యంగా ఈ ప్రాజెక్టుకు ముఖద్వారమైన బలూచిస్థాన్‌లో స్థానిక ప్రజలు సీపీఈసీ వల్ల తమ ప్రాంతానికి ఒరిగేదేమీ ఉండదంటున్నారు. బలూచిస్థాన్‌లో ఉన్న విలువైన ఖనిజ సంపదని దోచుకోవడానికే ఈ ప్రాజెక్టు అని అక్కడివారి అభిప్రాయం. ఈ ఒప్పందంలో భాగంగా స్థానికులకు ఉపాధి కల్పిస్తామన్న భరోసా కూడా ప్రభుత్వం ఇవ్వడంలేదని, పంజాబ్‌ నుంచి వలసల్ని ప్రోత్సహించి సొంత ప్రాంతంలోనే తమను మైనారిటీలుగా మార్చే కుట్ర దాగుందని వారంటున్నారు. బలూచిస్థాన్‌ స్వాతంత్య్ర సమరయోధులైతే ఈ ఒప్పందం కేవలం పంజాబ్‌ వ్యాపారవర్గాలకు మేలు చేసేందుకు, తమను అణచివేసేందుకేనని నినదిస్తున్నారు. పంజాబ్‌, ఖైబర్‌, పంక్తువా ప్రజలు సైతం ఈ ప్రాజెక్టుపట్ల సంతోషంగా లేరు. ఇప్పటికే పెషావర్‌, లాహోర్‌ మార్కెట్లను చైనా వస్తువులే ఆక్రమించాయని, ఇక ఈ ప్రాజెక్టు పూర్తయితే పాకిస్థాన్‌ నిండా చైనా వస్తువులు వెల్లువెత్తుతాయన్నది వారి వాదన.
ఇన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నా పాకిస్థాన్‌, చైనాలు ఈ ప్రాజెక్టు కోసం తహతహలాడటం వెనకున్న మర్మమేమిటో తెలిసిందే. ఆ రెండింటికి ఉమ్మడి శత్రువైన భారత్‌ను చక్రవ్యూహంలో ఇరికించడమే ఈ ప్రాజెక్టు వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం. వివాదాస్పద ప్రాంతం గుండా ఆర్థిక నడవా నిర్మిస్తున్నారన్న అపప్రథ రాకుండా చూసేందుకే-గిల్గిత్‌-బాల్టిస్థాన్‌కి రాష్ట్ర హోదా కల్పించేందుకు పాక్‌ తెగబడింది. మనదేశం ఇప్పటికే ఈ అంశంపై స్పందించింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో సహా జమ్ముకశ్మీర్‌ రాష్ట్ర పూర్తి భూభాగంపై హక్కులు ఇండియాకే చెందుతాయని, ఇందులో మరో ప్రశ్నకు తావులేదని భారత విదేశాంగశాఖ ప్రతినిధి గోపాల్‌ బోగ్లే అన్నారు. దీనితో సరిపెట్టకుండా భారత్‌ మరింతగా ఈ అంశాన్ని ఐక్యరాజ్యసమితి, ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లాలి. అంతర్జాతీయ వేదికలపై పాక్‌ వైఖరిని ఎండగట్టాలి. లేదంటే మరో చారిత్రక తప్పిదానికి పునాది పడినట్లవుతుంది. తనకు ఏ హక్కూ లేని వివాదాస్పద ప్రాంతాన్ని భూమికగా చేర్చి అంతర్జాతీయ ఒప్పందం కుదుర్చుకోవడమే కాక ఆ ప్రాంతానికి తన దేశంలోని ఇతర ప్రావిన్స్‌లతో సమానంగా రాష్ట్రస్థాయిని కట్టబెట్టడం పరాకాష్ఠకు చేరిన పాక్‌ ధోరణికి నిలువెత్తు నిదర్శనం!

- గొడవర్తి శ్రీనివాసు
Posted on 24-03-2017