Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

ఐరోపా కోటకు బీటలు!

* ఈయూ షష్టి పూర్తి

ఐరోపా సమాజం ఇప్పుడు అనేక ఆటుపోట్ల నడుమ ప్రస్థానిస్తోంది. సంక్షోభ స్థితిని ఎదుర్కొంటోంది. అంతర్జాతీయంగా ఎదురవుతున్న కొత్త సవాళ్లు, ఐరోపా సమాజంలోని దేశాల మధ్య విస్తరిస్తున్న పొరపొచ్చాల నడుమ ఎన్నడూ లేనంతటి సంకట స్థితిలో ఐరోపా సమాఖ్య (ఈయూ) నేడు 60వ వార్షికోత్సవం జరుపుకొంటోంది. ఆరు దశాబ్దాల క్రితం రోమ్‌ ఒడంబడికతో ఐరోపా ఆర్థిక సమాజం ఆవిర్భవించింది. రెండో ప్రపంచ యుద్ధానంతరం శాంతి సుహృద్భావాల మధ్య జీవనం సాగించేందుకు వీలుగా ఐరోపా దేశాలు ఓ సార్వత్రిక వేదికను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించాయి. ఫ్రెంచి విదేశాంగ మంత్రి రాబర్ట్‌ షూమెన్‌ క్రియాశీల చొరవతో 1950 మే తొమ్మిదిన ఆనాడు బద్ధశత్రువులుగా ఉన్న ఫ్రాన్స్‌, పశ్చిమ జర్మనీ ఆర్థిక ఒడంబడిక కుదుర్చుకున్నాయి. అనంతరం 1957 మార్చి 25న ఐరోపా ఆర్థిక సమాజం (ఈఈసీ లేదా ఉమ్మడి విపణి) ఆవిష్కృతమైంది. ఈఈసీ ఏర్పాటై నేటికి అరవయ్యేళ్లు గడచిపోయాయి. ఎనిమిదో దశకం తరవాత మరిన్ని ఐరోపా దేశాలు ఈ కూటమిలో చేరడంతో ఉమ్మడి విపణి అనూహ్యంగా విస్తరించింది. అనేక ఐరోపా దేశాలు ఉమ్మడి అవగాహన మేరకు వస్తు సేవల ఎగుమతి దిగుమతులకు తలుపులు బార్లా తెరిచాయి. ఐరోపా దేశాలన్నీ ప్రాంతీయ ఆర్థిక చైతన్యంతో జాతీయ విధానాలను మరింత సమ్మిళితంగా రూపుదిద్దడంతో ఉమ్మడి కరెన్సీ ‘యూరో’ ఆవిర్భావానికి పునాదులు పడ్డాయి. ఆ రకంగా ఐరోపా ఉమ్మడి విపణి నుంచి క్రమంగా ఒకే కరెన్సీ దిశగా కదిలింది. సోవియట్‌ రష్యాలో అంతర్భాగంగా ఉండి యూనియన్‌ విచ్ఛిన్నం తరవాత బయటపడిన 11 దేశాలకూ ఐరోపా సమాజంలో చోటు కల్పించారు. ప్రపంచంలోని మిగిలిన దేశాల మధ్య నెలకొన్న ఆదాయ అసమానతలతో పోలిస్తే ఐరోపా దేశాల మధ్య అసమానతలు చాలా తక్కువ. రెండో ప్రపంచ యుద్ధానంతరం ఐరోపాకు రాజకీయంగా శాంతి సుస్థిరతలను ప్రసాదించి; ఆర్థిక విజయాలను అందించడంలో ఐరోపా సమాఖ్య కీలక పాత్ర పోషించింది. అదంతా గతం. ఐరోపా సమాఖ్య ఎన్నడూలేని స్థాయిలో అస్తిత్వ సంక్షోభం ఎదుర్కొంటోంది.

వణికిస్తున్న వలసల తాకిడి
సభ్య దేశాల్లో ఐరోపా సమాఖ్యపట్ల విశ్వాసం అంతకంతకూ కోసుకుపోతుండటం దాని ముందున్న సవాలు. ఈయూనుంచి బయటపడాల్సిందేనంటూ తొమ్మిది నెలల క్రితం జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం)లో బ్రిటన్‌ ప్రజానీకం తేల్చిచెప్పడమే ఇందుకు నిదర్శనం. మరోవంక నిరుద్యోగిత ఉచ్చులో చిక్కుకొన్న గ్రీస్‌, స్పెయిన్‌ దేశాలు; అప్పులకుప్పగా మారి ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఇటలీ వంటివి ఉమ్మడి కరెన్సీ, ఆర్థిక సమాఖ్య భావనలను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. రుణ బకాయిలు పేరుకుపోయిన దేశాలపై ఆంక్షలు విధించే విషయంలో ఐరోపా కమిషన్‌తో పోలిస్తే అంతర్జాతీయ ద్రవ్యనిధికే అత్యధిక విశ్వసనీయత ఉందని స్వయంగా జర్మన్‌ ఛాన్సెలర్‌ ఇటీవల వ్యాఖ్యానించడం గమనార్హం. మరీ ముఖ్యంగా ఐరోపా ఆర్థిక నిధి ఏర్పాటు ప్రతిపాదనను జర్మనీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈయూలోనే అత్యంత శక్తిమంత దేశమైన జర్మనీ తీరు అక్కడి వ్యవస్థలు క్రమక్రమంగా పెళుసుబారుతున్న వైనాన్నే వెల్లడిస్తోంది. మరోవంక లిబియా, టర్కీ వంటి పొరుగు దేశాలనుంచి పెరుగుతున్న వలసల ఉద్ధృతి ఐరోపాను వణికిస్తోంది. నిరుడు లిబియానుంచి ఏకంగా లక్షా 80వేల మంది ఇటలీకి వలస వచ్చారు. నైజీరియా వంటి పేద దేశాలనుంచి పెద్దయెత్తున ఐరోపాలోకి వలసలు పోటెత్తుతున్నాయి. ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో తెలియక ఐరోపా దేశాలు తల్లడిల్లుతున్నాయి. కొందరు స్మగ్లర్ల అండదండలతో ఐరోపాలోకి వెల్లువెత్తుతున్న వలసల నిరోధానికిగాను 2016 మార్చిలో టర్కీతో ఈయూ ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తరవాత వలసల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఇదే వూపులో లిబియాతోనూ ఒప్పందానికి ఈయూ అడుగులు వేస్తోంది. లిబియాలో ‘సమితి’ మద్దతుతో కొనసాగుతున్న జీఎన్‌ఏ ప్రభుత్వంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇటలీ ఒప్పందం కుదుర్చుకుంది. దానిప్రకారం స్మగ్లర్ల కట్టడికి అవసరమైన ఆర్థిక మద్దతును లిబియా సర్కారుకు ఇటలీ అందిస్తుంది. ఈయూ సైతం ఈ ఒప్పందానికి కొంత ఆర్థిక మద్దతు ప్రకటించింది. కానీ జీఎన్‌ఏ ప్రభుత్వానికి లిబియా భౌగోళిక ప్రాంతాలపై నియంత్రణ తక్కువ. ఈ పరిస్థితుల్లో ఐరోపాకు వలసల నిరోధంలో లిబియన్‌ ప్రభుత్వం ఎంతమేరకు విజయం సాధించగలదన్నది సందేహాస్పదమే!
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యవహార సరళీ ఈయూకు ఇబ్బంది కలిగిస్తోంది. ప్రాథమికంగా ఐరోపా సమాఖ్య భావననే ట్రంప్‌ వ్యతిరేకిస్తున్నారు. మరోవంక ఆయన ‘నాటో’ అవసరాన్ని సైతం ప్రశ్నిస్తున్నారు. కొంతలో కొంత అమెరికన్‌ రక్షణ ఛత్రం నీడలో మొన్నటిదాకా భద్రంగా ఉన్న ఈయూ, ఇప్పుడు అమెరికా ధోరణితో బెంబేలెత్తిపోతోంది. ఇదే అదనుగా అణ్వస్త్ర సంపన్న రష్యా జోక్యం చేసుకుని ఐరోపాలో జాతీయవాద ఉద్యమాలకు ప్రాణం పోసే ప్రమాదం ఉందన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. ఐరోపా రక్షణ బాధ్యతలనుంచి అమెరికా పూర్తిగా పక్కకు తప్పుకొన్న నేపథ్యంలో- ఇకమీదట ఆ బరువు బాధ్యతలన్నీ జర్మనీ, ఫ్రాన్స్‌లే మోయాల్సి ఉంటుంది. ఫలితంగా ఐరోపాలోని ఇతర దేశాలపై ఫ్రాన్స్‌, జర్మనీల పెత్తనం పెరిగి, మొత్తంగా ఈయూ స్థాపిత విలువలకే భంగం కలిగే ప్రమాదం కొట్టిపారేయలేనిది. ఆర్థికాభివృద్ధి క్రమంలో ఈయూలో ఒక్కో దేశానిది ఒక్కో వేగం. ఆయా దేశాల రాజకీయ, ఆర్థిక లక్ష్యాలూ పూర్తిగా భిన్నమైనవి. ఈ పరిస్థితుల్లో ఆదరాబాదరాగా ఉమ్మడి కరెన్సీని ప్రవేశపెట్టడంవల్ల వివిధ దేశాల ద్రవ్య విధానాలు అదుపు తప్పాయి. దాంతో కఠిన నియంత్రణ, పొదుపు చర్యలతో తప్ప దారి తప్పిన ద్రవ్య విధానాలను తిరిగి గాడిన పెట్టుకోలేని పరిస్థితుల్లోకి ఆయా దేశాలు జారుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు రక్షణాత్మక ఆర్థిక విధానాలతో ముందుకువెళ్తున్న పరిస్థితుల్లో- ఈయూ సభ్య రాజ్యాలూ తమ తీరు మార్చుకోక తప్పని వాతావరణం ఏర్పడింది.

ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు
వ్యవస్థలను పటిష్ఠంగా తీర్చిదిద్దుకుంటే తప్ప ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవడం ఈయూకు సాధ్యం కాదు. ఈ వ్యవస్థల విశ్వసనీయతను పునరుద్ధరించడం చాలా అవసరం. పటిష్ఠ వ్యవస్థలే ఆసరాగా గతంలో ఐరోపా ఉమ్మడి కరెన్సీ రూపుదిద్దుకొంది. తాత్కాలిక రాజకీయ స్వార్థ ప్రయోజనాలను పక్కనపెట్టి- ఈయూ దేశాలన్నీ విస్తృత ప్రాతిపదికన ఏకమైతే తప్ప అక్కడి వ్యవస్థలకు జవాబుదారీతనం మప్పడం సాధ్యం కాదు. లిబియా, టర్కీ వంటి దేశాలకు నిధులు సమకూర్చి, సముద్ర రక్షణ వ్యవస్థలను పటిష్ఠంగా తీర్చిదిద్దినంత మాత్రాన వలసలకు పూర్తిగా అడ్డుకట్టవేయడం కుదిరేపని కాదు. ఆయా దేశాల్లో చెలరేగుతున్న రాజకీయ, సామాజిక సంక్షోభాల కారణంగానే అక్కడినుంచి ప్రజలు ఐరోపాకు పోటెత్తుతున్న విషయాన్ని గ్రహించాలి. పొరుగు దేశాల్లో జరుగుతున్న పరిణామాలను కేవలం ప్రేక్షక పాత్ర వహించి చూస్తూ వూరుకోవడం వరకే ఈయూ పరిమితమైతే ఈ సమస్య పరిష్కారం కాదు. తాజాగా అమెరికా ధోరణిలో పొడగడుతున్న మార్పునూ ఈయూ ఒక అవకాశంగా మలచుకోవాలి. ప్రత్యామ్నాయ భద్రతా వ్యవస్థల రూపకల్పనకు నడుం బిగించాలి. ‘బ్రెగ్జిట్‌’ తరవాత ఈయూ అస్తిత్వంపై సర్వత్రా సందేహాలు ముమ్మరించాయి. ఇప్పటికైనా అంచెలవారీ, నిర్మాణాత్మక దిద్దుబాటు చర్యలకు ఐరోపా దేశాలు సమకట్టని పక్షంలో ఈయూ విచ్ఛిన్నం మరెంతో దూరంలో లేదనే చెప్పొచ్చు.

- డాక్టర్‌ మహేంద్రబాబు కురువ
Posted on 25-03-2017