Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

అందరికీ నీరు... ఎన్నటికి నెరవేరు?

* పరిశోధనల బాటలో పరిష్కారాలు

ప్రపంచ దేశాలన్నీ మున్ముందు ఎదుర్కొంటున్న అతిపెద్ద విపత్తు... నీటి కొరత! మూడింట రెండొంతుల ప్రపంచ జనాభా (సుమారు 466 కోట్లు) ఏటా కనీసం నెల రోజులపాటు తీవ్ర నీటి కొరతతో సతమతమవుతోంది. వచ్చే పదేళ్లలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలను అత్యంత ప్రతికూలంగా ప్రభావితం చేయగల మూడు విపత్తుల్లో నీటి సంక్షోభమూ ఒకటని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ శతాబ్దపు వాతావరణ సమస్యలు అనే అంశంపై నెదర్లాండ్స్‌లోని ట్వెంటె విశ్వవిద్యాలయం విస్తృత పరిశోధనలు జరిపింది. ప్రపంచ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేయబోయే కీలక సమస్యల్లో నీటికొరతే ముఖ్యమైనదని అది నిర్ధారించింది. 1996-’05 మధ్య కాలానికి సంబంధించిన సమాచారాన్ని ఆ విశ్వవిద్యాలయం క్షుణ్నంగా విశ్లేషించింది. దాని ప్రకారం జనావళికి అందుబాటులో ఉన్న నీటి వనరులకన్నా, తిరిగి భర్తీ చేస్తున్న నిల్వలకన్నా- వినియోగమే రెండింతలుగా ఉంది. ఆ తరవాతి దశాబ్దం(2005-15)లోనూ నీటి వినియోగానికి సంబంధించి కటకట పరిస్థితులే కొనసాగాయి. యెమెన్‌ వంటి దేశాల్లో విచ్చలవిడిగా నీటిని వినియోగిస్తున్నారు. జల నిల్వను పునరుద్ధరించేందుకు అక్కడ ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు. దీనివల్ల ఒకటి రెండేళ్లలో ఆ దేశ ప్రజలు కనీసం నీటి చుక్కనైనా చూడలేని దురవస్థ ఎదుర్కోనున్నట్లు పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ఒక్క యెమెన్‌ దేశమే కాదు- పాకిస్థాన్‌, ఇరాన్‌, సౌదీ అరేబియా, మెక్సికో వంటి దేశాలూ నీటి వినియోగం, పునరుద్ధరణ విధానాల్లో క్రమశిక్షణ పాటించకపోవడం వల్ల భవిష్యత్తులో తీవ్ర సంక్షోభాల పాలబడబోతున్నాయంటూ వివిధ అధ్యయనాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.

మేలుకోకుంటే ముప్పే
నీటి ఎద్దడి, సంక్షోభం, వనరులు కరిగిపోవడం జల సమస్య విస్తరించడానికి కారణం. తగినన్ని వానలు కురిసినప్పటికీ ఆ నీటిని ఒడిసిపట్టకపోతే ఎదురయ్యేది నీటి ఎద్దడి. వానలు కురవక వనరులు ఎండిపోయినప్పుడు ఏర్పడేది నీటి సంక్షోభ స్థితి. ఇక నీటి వనరులైన చెరువులు, బావులు, కాల్వలు వంటివాటిని పూడ్చేసి కష్టాలను కొనితెచ్చుకుంటున్నాం. వీటి ప్రభావం వాతావరణంపై పడుతోంది. వివిధ రకాల కాలుష్య కారకాలు భూగోళాన్ని, నీటిని, గాలిని ప్రభావితం చేస్తున్నాయి. ప్రకృతి సహజ సమతుల్యతను కోల్పోతున్నందువల్ల వాతావరణ చక్రం అనూహ్య మార్పులకు లోనవుతోంది. ప్రపంచవ్యాప్తంగా వర్షపాత క్రమం అదుపు తప్పుతోంది. సకాలంలో వానలు కురవకపోవడం ఇబ్బందికర పరిస్థితి అయితే, భళ్లున కురుస్తున్న వర్షాల వల్ల జీవజలాలు సముద్రంపాలై వృథా పోతున్నాయి. నీటిని ఒడిసిపట్టడంలో, ఉన్న నీటిని క్రమశిక్షణతో సద్వినియోగపరచంలో సరైన అవగాహన, క్రమశిక్షణ ప్రజల్లో లోపిస్తుండటంవల్ల నీటికొరత సమస్య తీవ్రరూపం దాల్చి ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెడుతోంది. నీటి కొరత ప్రధానంగా రెండు రకాలు. ఒకటి- భౌతికమైనది. అంటే, నిజమైన నీటి కొరత. రెండోది- ఆర్థికపరమైనది. అంటే, కృత్రిమ నీటి కొరత. ఒక ప్రాంత ప్రజల అవసరాలకు అనుగుణంగా అక్కడ నీటి వనరులు లభించకపోతే దాన్ని భౌతికమైన నీటి కొరత అంటారు. తగినన్ని నీటి వనరులు అందుబాటులో ఉన్నా, వాటిని ప్రజల అవసరాల మేరకు అందించలేకపోతే దాన్ని ఆర్థికపరమైన నీటికొరత అంటారు. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమ నివేదిక ప్రకారం అనేక దేశాల్లో తగినన్ని నీటి వనరులు లభ్యమవుతున్నాయి. కాకపోతే సరైన ప్రణాళికలు లేక తాగు, సాగు, పరిశ్రమలు, ఇతర అవసరాలకు వాటిని పద్ధతిగా అందజేయడంలో ఆయా ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయి. అందువల్ల ఆర్థికపరమైన నీటికొరత బారినపడి తలలు పట్టుకొంటున్నాయి. నేటి ప్రపంచంలో అమెరికాలోని న్యూయార్క్‌ నగరం ఎంతో ఆధునికమైంది. అక్కడా రోజుకు పైపుల లీకేజీవల్ల 3.6 కోట్ల గ్యాలన్ల మేర నీరు వృథా అవుతోంది. దీన్నిబట్టి ఎలాంటి ఆధునిక వ్యవస్థలు లేని భారత్‌లోని మహా నగరాల్లో ఇక ఎంతమేర నీరు వృథా అవుతుందో సులభంగా అర్థం చేసుకోవచ్చు. దీనికి ముఖ్య కారణం మన నగరపాలక సంస్థల నీటి సరఫరా విభాగాలు ఆధునిక పోకడలను అందిపుచ్చుకోలేకపోవడమే. దిల్లీ నగరంలో 30 శాతం, ముంబయిలో 20 శాతం నీరు లీకేజీల వల్ల వృథాగా పోతోంది. విజయవాడ లాంటి నగరాల్లో నీటి సరఫరాలో లోపాలు, లీకేజీలను గుర్తించడానికి సగటున 30 రోజులు పడుతోంది. హైదరాబాద్‌, ముంబయి వంటి నగరాల్లోనూ దాదాపుగా ఇలాంటి పరిస్థితే నెలకొంది.
ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరికి సరైన తాగునీరు దొరకడం లేదు. వారిలో కోటిమందికి పైగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నారు. ఫాల్కన్‌ మార్క్‌ నీటి ఎద్దడి సూచీ ప్రకారం- ప్రతి మనిషికి ఏడాది కాలంలో 1,700 ఘనపు మీటర్ల నీరు లభించినట్లయితే నీటి ఎద్దడి లేనట్లు లెక్క! అది 1,000 ఘనపు మీటర్ల కన్నా తక్కువగా ఉంటే ఆ దేశం నీటి కరవుతో ఇబ్బందిపడుతున్నట్లు పరిగణిస్తారు. 2006నాటి గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 48 దేశాల్లోని 70 కోట్ల ప్రజలకు 1,700 ఘనపు మీటర్ల కన్నా తక్కువ నీరు లభ్యమవుతోంది. ఈ నీటి ఎద్దడి చైనా, భారత్‌, పాకిస్థాన్‌ వంటి దేశాల్లో అధికంగా ఉంది. ముఖ్యంగా పశ్చిమాసియా దేశాల్లో సగటున 1,200 ఘనపు మీటర్ల కన్నా తక్కువగా జలం లభ్యమవుతోంది.
ప్రపంచవ్యాప్తంగా లభ్యమవుతున్న నీటిలో కేవలం మూడు శాతమే తాగు అవసరాలకు ఉపయోగపడుతోంది. ఇందులోనూ మూడింట ఒక వంతు మాత్రమే ప్రపంచ జనాభాకు అందుబాటులో ఉంది. టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం, దేశవ్యాప్తంగా 50 లక్షల కుటుంబాలకు తాగునీరు అందుబాటులో లేదు. అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ అధ్యయనాలనుబట్టి ప్రతి కుటుంబానికీ రోజూ 100 నుంచి 200 లీటర్ల నీరు అందుబాటులో ఉండాలి. కానీ, సగటున కేవలం 90 లీటర్ల జలం మాత్రమే అందుతోంది! నీటి కొరతవల్ల ఆసియా దేశాల్లో 2050 నాటికి ఆహార ధాన్యాల దిగుబడి బాగా కోసుకుపోతుండటం ఆహార భద్రతకు పెనుప్రమాద హెచ్చరిక. ఎన్నో ఇబ్బందులను, విపత్తులను ఎదుర్కొంటూ మానవాళి వేల ఏళ్లుగా ప్రస్థానం సాగిస్తోంది. తాజా సవాలును సైతం అదే స్ఫూర్తి, ప్రేరణలతో స్వీకరించాలి. నీటి చుక్క బంగారం కన్నా విలువైనదిగా ప్రతి ఒక్కరూ పరిగణించాల్సి ఉంది. నీటి వినియోగం, నియంత్రణలకు సంబంధించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ, పరిశోధనలను నిత్యనూతనంగా కొనసాగిస్తే నీటి సంక్షోభాన్ని చాలావరకు అధిగమించవచ్చు.

ఆధునిక పరిజ్ఞానమే అండగా...
అనేక దేశాలు ఈ సమస్యను క్రమంగా అర్థం చేసుకుంటున్నాయి. నీటి వినియోగానికి సంబంధించి పరిశోధనలకు పదును పడుతూ అవి నిర్మాణాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. నీటి వృథాను అరికట్టేందుకుగాను ప్రతి దశలోనూ కీలక వ్యవస్థలను ఆవిష్కరించే దిశగా ఆలోచనలు సాగిస్తున్నాయి. సమస్య తలెత్తిన ప్రతి చోటా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కారాలను అన్వేషిస్తున్నాయి. తక్కువ ఖరీదుగల సోలార్‌ యంత్రాలను వినియోగించి నీటిని శుద్ధి చేయడం, కలుషిత నీటిని పునర్వినియోగించడంపై మేలైన కసరత్తులు సాగిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో ఇంకా ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉంది. భారతీయ మూలాలు కలిగిన అమెరికా యువతి దీపికా కురూప్‌ అభివృద్ధి పరచిన నీటి యంత్రం ఆ దేశంలో పలువురి ప్రశంసలు చూరగొంది. దీపిక పరిశోధన నాటి అమెరికా అధ్యక్షుడు ఒబామా అభినందనలతోపాటు, అనేక పురస్కారాలనూ ఆమెకు సాధించిపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు రక్షిత నీటిని సులభంగా అందజేయగల పరికరమిది. లీకేజీల రూపంలో పెద్దయెత్తున వృథాగా పోతున్న నీటి నియంత్రించేందుకు జర్మనీకి చెందిన కొన్ని సంస్థలు ‘ఐఓటీ’ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాయి. మరుగుదొడ్లు, స్నానపు గదులు, వంటగదుల్లో వ్యర్థమవుతున్న నీటిని గుర్తించి, వృథాను అడ్డుకోవడానికి ‘జీన్‌ స్కాన్‌ ఆల్ఫా సాఫ్ట్‌వేర్‌’ ఎంతగానో దోహదపడుతుంది. ఇటువంటి సాంకేతిక పరికరాలను ప్రజలకు తక్కువ ఖర్చుకు చేరువ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే!
పరిశ్రమల్లో యంత్రాలను చల్లబరిచేందుకు, శుభ్రపరిచేందుకు భారీ పరిమాణాల్లో నీటిని వినియోగిస్తున్నారు. ఓ కారు తయారయ్యే క్రమంలో మొత్తంగా 40వేల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నారు. ఇటువంటి పరిశ్రమల్లో నీటికి బదులు బొగ్గుపులుసు వాయువు (కార్బన్‌ డై ఆక్సైడ్‌)ను వాడుకోవచ్చు. ఘనస్థితిలో ఉన్న కార్బన్‌ డై ఆక్సైడ్‌ చల్లని మంచు బిందువులు కలిగి ఉంటుంది. దీన్ని విమాన, ఆటొమొబైల్‌, వైద్య పరికరాల తయారీ వంటి వివిధ పరిశ్రమల్లోనూ పర్యావరణానికి ఏమాత్రం చెరుపు కలగని రీతిలో వినియోగించుకోవచ్చు! తుపాన్లు, వరదలు వంటి విపత్తులు సంభవించినప్పుడు తాగునీరు కలుషితం కావడం సాధారణమే. పెద్దయెత్తున అంటువ్యాధులు ప్రబలడానికి కారణమయ్యే కలుషిత నీటిని శుద్ధి చేసుకోవడానికి ఉపకరించే అద్భుతమైన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. మైఖేల్‌ ప్రిచార్డ్‌ అనే శాస్త్రవేత్త అభివృద్ధి పరచిన జీవరక్షక ఫిల్టరుగల ఒకరకమైన ఫ్లాస్కు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వస్తోంది. ఈ ఫిల్టరు ద్వారా ఎలాంటి ఎటువంటి కాలుష్య కారకాలనైనా అత్యంత సులభంగా అడ్డుకోవచ్చు. మంచినీరు లభ్యంకాని ప్రాంతాల్లో బ్రిటిష్‌ సైన్యం గడచిన పదేళ్లుగా ఈ ఫిల్టర్లను విజయవంతంగా వినియోగిస్తోంది. భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో నీటిని శుద్ధి చేసే ఏర్పాట్లు వెదికినా కనబడని పరిస్థితి ఉంది. ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ తరహా ఉపకరణాలను పల్లెపట్టులకు చేరువ చేయగలిగితే వారి ఆరోగ్యాలకు భరోసా లభిస్తుంది. ప్రస్తుతం మన భూగోళంపై వినియోగమవుతున్న నీరు తొమ్మిది లక్షల కోట్ల ఘనపులీటర్లు! జనాభా పెరుగుతున్న కొద్దీ ఈ పరిమాణం మరింత అధికమవుతుందనడంలో సందేహం లేదు. సర్వత్రా ఇనుమడిస్తున్న జల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పరిశోధనలకు పెద్దపీట వేయాల్సిన తరుణమిది. నీటి సంరక్షణ, శుద్ధి, పునర్వినియోగాల్లో ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న మేలిమి పరిశోధనలను స్ఫూర్తిగా తీసుకుని భారతీయ శాస్త్రవేత్తలు పురోగమించాలి. నిత్య జీవన సమస్యల పరిష్కారానికి ఉపయోగపడని పరిశోధనలవల్ల ఫలితం లేదు. ప్రతి పరిశోధనా మానవాళి జీవన నాణ్యతను పెంచేందుకు దోహదపడాలి. అప్పుడే ఉరుముతున్న నీటి సమస్యనుంచి ప్రజలకు ఉపశమనం దక్కుతుంది!

Posted on 22-04-2017