Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

ధనికులకు దన్ను- మెరికలపై గన్ను!

* ట్రంప్‌ భస్మాసుర విధానాలు

అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన 100 రోజుల్లోనే డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకొన్న పలు నిర్ణయాలు ప్రపంచమంతటా తీవ్ర భయాందోళనలు రేపాయి. అమెరికాకే ప్రాధాన్యమిస్తా, విదేశాలు కాజేస్తున్న ఉద్యోగాలను వెనక్కు తెస్తానంటూ ట్రంప్‌ భారతీయ ఐటీ పరిశ్రమకు గుబులు పుట్టిస్తున్నారు. అమెరికాలో పనిచేయడానికి భారతీయులు హెచ్‌ 1బీ తదితర వీసాలను దుర్వినియోగం చేస్తున్నారని ట్రంప్‌ ప్రభుత్వం ఆరోపించడం 15,000 కోట్ల డాలర్ల (రూ. 9,75,000 కోట్ల) భారతీయ ఐటీ పరిశ్రమకు కష్టకాలం తెచ్చిపెట్టింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా కోటిమందికి ఉపాధి కల్పిస్తున్న ఐటీ రంగ భవిష్యత్తు ఏమిటని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఐటీ రంగంలో ప్రత్యక్ష ఉపాధి పొందుతున్న 39లక్షలమంది ఉద్యోగుల్లో సగం మంది, టెక్నాలజీ మార్పులతో రానున్న నాలుగేళ్లలో ఉపాధి కోల్పోతారని మెకిన్సే సంస్థ హెచ్చరించింది. ఇంకో మూడేళ్లలో ఐటీ పరిశ్రమలో 20 శాతం ఉద్యోగాలు కోసుకుపోతాయని నాస్కామ్‌ అంచనా. ఆటొమేషన్‌, రోబోటిక్స్‌, కృత్రిమ మేధ, బిగ్‌ డేటా, త్రీడీ ప్రింటింగ్‌ వంటి అధునాతన టెక్నాలజీల వల్ల ప్రారంభ స్థాయి ఉద్యోగాలు కనుమరుగు కానుండటం దీనికి కారణం. అందుకే వీటిని విచ్ఛిన్నకర పరిజ్ఞానాలని అంటున్నారు. ఈ పరిజ్ఞానాల వల్ల అమెరికాలో ఇప్పటికే పారిశ్రామికోత్పత్తి, చిల్లర వర్తకం, సంప్రదాయ ఐటీ సేవల్లో లక్షలాది ఉద్యోగాలు పోగా, నవీన పరిజ్ఞానాలను ఉపయోగించే సంస్థలు అర్హులైన ఉద్యోగులు దొరక్క అల్లాడుతున్నాయి. అయినాసరే కాలం చెల్లిన పరిశ్రమలకు మళ్ళీ ప్రాణం పోసి పాత ఉద్యోగాలను పునరుద్ధరిస్తాననే హామీతో ట్రంప్‌ అధికారంలోకి వచ్చారు. విదేశీ పోటీని అడ్డుకుని సొంత వాణిజ్యం, పరిశ్రమలను కాపాడుకోవడానికి రక్షణాత్మక విధానాలను ప్రతిపాదిస్తున్నారు. దీనివల్ల పోటీకి తావు లేని సంకుచిత ఆర్థిక వ్యవస్థ ఏర్పడి, నవీకరణ కుంటువడి, అమెరికాయే వెనకబడిపోతుంది. ఈలోగా చైనా, జర్మనీ వంటి దేశాలు వినూత్న ఆవిష్కరణలతో సరికొత్త పరిశ్రమలతో దూసుకెళ్ళిపోతాయి!

‘రక్షణాత్మక’ తీరుతెన్నులు
ట్రంప్‌ ఇదేమీ గమనించకుండా ప్రపంచీకరణపైనా, నిపుణుల వలసలపైనా ధ్వజమెత్తారు. ఆయన రక్షణాత్మక విధానాలు భారతదేశానికి తీవ్ర నష్టదాయకంగా పరిణమిస్తున్నాయి. అమెరికాతోపాటు బ్రిటన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, సింగపూర్‌ దేశాలూ వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ భారతీయ ఇంజినీర్లకు క్రమంగా తలుపులు మూసేస్తున్నాయి. ఈ విధానాన్ని భారత ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. సేవల వాణిజ్యానికి, సిబ్బంది వలసలకు వెసులుబాటు కల్పించే ప్రాతిపదిక ఒప్పందాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) చేపట్టాలని నిర్మలా సీతారామన్‌ పిలుపిచ్చారు. ప్రపంచ దేశాలు ఈ ప్రతిపాదనను కూలంకషంగా పరిశీలించి ఈ ఏడాది డిసెంబరులో అర్జెంటీనాలో జరిగే డబ్ల్యూటీఓ మంత్రుల స్థాయి సమావేశంలో ఒక నిర్ణయానికి రావాలంటున్నారు. ప్రస్తుతానికి తాము అమెరికా, ఆస్ట్రేలియాలపై డబ్ల్యూటీఓకు అధికారికంగా ఫిర్యాదు చేయకపోయినా, భారత్‌ పట్ల అన్యాయంగా వ్యవహరించడాన్ని సహించబోమని ఆమె స్పష్టీకరించారు. భారతీయ ఐటీ సంస్థలపై వీసాపరమైన ఆంక్షలు విధిస్తే అది భారతదేశంలో వ్యాపారం చేస్తున్న అమెరికన్‌ కంపెనీలపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.

కళ్లు చెదిరే లాభాలు
ఆమె హెచ్చరిక ఆషామాషీ ఏమీ కాదు. ప్రపంచంలో 500 అగ్రశ్రేణి కంపెనీల్లో 134 అమెరికాకు చెందినవేనని ఫార్చ్యూన్‌ పత్రిక 2016లో లెక్కగట్టింది. పోర్బ్స్‌ గ్లోబల్‌ 2000 జాబితాలో 540 అమెరికన్‌ కంపెనీలున్నాయి. వీటిలో జనరల్‌ ఎలక్ట్రిక్‌, ఆపిల్‌ ఐబీఎం, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ వంటి అమెరికన్‌ కంపెనీల ఆదాయం అనేక దేశాల జీడీపీ కన్నా చాలా చాలా ఎక్కువ. బడా అమెరికన్‌ కంపెనీలు స్విట్జర్లాండ్‌, సింగపూర్‌, లగ్జెంబర్గ్‌ వంటి దేశాల్లో హోల్డింగ్‌ కంపెనీల్లా రిజిస్టరై వేర్వేరు దేశాల్లో కర్మాగారాలు, బ్యాంకు ఖాతాలను నిర్వహిస్తున్నాయి. లక్షల కోట్ల డాలర్ల లాభాలు ఆర్జిస్తున్న ఈ సంస్థలు అమెరికా ప్రభుత్వానికి పన్ను కట్టకుండా విదేశాల్లోనే ఉంచేస్తున్నాయి. ఈ నగదు నిల్వలు దాదాపు రెండు లక్షల కోట్ల డాలర్ల (రూ. 135 లక్షల కోట్ల) మేరకు ఉంటాయని నిపుణులు లెక్కగట్టారు. అయినా అమెరికన్‌ కంపెనీల నుంచి సక్రమంగా పన్నులు రాబట్టే చొరవ, ధైర్యం అమెరికా ప్రభుత్వానికి లేకుండా పోయాయి. తాము వ్యాపారం చేస్తున్న దేశాల్లోనూ పన్ను ఎగ్గొట్టడంలో ఈ బహుళజాతి కంపెనీలు ఆరితేరాయి. ట్రంప్‌ దుందుడుకు విధాన ప్రకటనకు కీలకం ఇదే. భారత వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఈ విషయం బాగా తెలుసు కనుకనే అమెరికన్‌ కంపెనీల ప్రస్తావన తెచ్చారు.
విచ్ఛిన్నకర టెక్నాలజీల సాయంతో జోరందుకున్న ప్రపంచీకరణ అమెరికన్‌ కంపెనీలకు కనకవర్షం కురిపిస్తోంది. రోబోటిక్స్‌, ఆటొమేషన్‌, కృత్రిమ మేధ వల్ల కంపెనీలకు వేతన బిల్లు తగ్గి ఉత్పాదకత పెరిగి లాభాలు విజృంభించాయి. అమెరికాలో 1948-1994 మధ్య కాలంలో పారిశ్రామిక ఉద్యోగాలు 50 శాతం తగ్గిపోగా ఉత్పాదకత మాత్రం 190 శాతం పెరిగింది. 2000-2010 మధ్య కొత్త టెక్నాలజీలు రాకపోయి ఉంటే రెండు కోట్లకు పైగా పారిశ్రామిక ఉద్యోగాలు పుట్టుకొచ్చేవి. విచ్ఛిన్నకర టెక్నాలజీల మూలంగా ఉత్పాదకత పెరిగి కేవలం కోటీ 21 లక్షల మంది కార్మికులతోనే పని జరిగిపోయింది. ఉదాహరణకు ప్రపంచ వస్త్ర మిల్లుల రాజధానిగా పేరుగాంచిన అమెరికన్‌ నగరం గ్రీన్‌ విల్‌లో 1990లో 48,000 మంది జౌళి కార్మికులు పనిచేయగా ఇప్పుడు వారి సంఖ్య 6,000కు తగ్గిపోయింది. ఇలాంటి సంప్రదాయ పరిశ్రమలు పెద్దయెత్తున మూతబడుతున్నాయంటే- అందుకు కారణం టెక్నాలజీయే తప్ప ప్రపంచీకరణ, ఇతర దేశాల కార్మికులు, నిపుణుల వలసలు కానే కావు.
పాత ఉద్యోగాలకు కాలం చెల్లడంతో కార్మికులు, మధ్యతరగతి ప్రజల ఆదాయాలు దారుణంగా పడిపోగా టెక్నాలజీ సంబంధిత ప్రపంచీకరణ వల్ల అమెరికాలో ఒక్క శాతం ధనికుల సంపద ఇంతలంతలైంది. కంపెనీల్లో, బ్యాంకుల్లో, స్టాక్‌మార్కెట్లలో వారు పెట్టిన పెట్టుబడులు కామధేనువులై ధనరాశులను వర్షిస్తున్నా వారిపై పన్నులు విధించడానికి అమెరికా ప్రభుత్వాలు జంకుతున్నాయి. మరోవైపు ఆర్థిక, ఆరోగ్య, సామాజిక భద్రత కరవై సామాన్య ప్రజలు కుతకుత ఉడికిపోతున్నారు. వారి ఆగ్రహాన్ని ట్రంప్‌ సొమ్ము చేసుకుని అధికారంలోకి వచ్చారు. తమ ప్రజల దుస్థితికి, సమాజాన్ని పీడిస్తున్న అసమానతలకు స్వేచ్ఛావాణిజ్యాన్ని, నిపుణుల వలసను ఆడిపోసుకొంటున్నారే తప్ప- సమస్య మూలాల్లోకి వెళ్లడంలేదు. ధనికులు పన్నులు కట్టక, పేదలు పన్నులు కట్టలేక అమెరికా బడ్జెట్‌ లోటు ఏటికేడు పెరిగిపోతోంది. 2016 చివరకు జాతీయ రుణ భారం 19 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. దీన్ని పూడ్చటానికి ధనికులపైన, కార్పొరేట్లమీద పన్నులు పెంచాలని ప్రతిపక్ష డెమొక్రటిక్‌ పార్టీ ప్రతిపాదిస్తోంది. ట్రంప్‌ దీనికి భిన్నంగా వారిపై పన్నులు తెగ్గోస్తానంటున్నారు. కార్పొరేట్లపై నియంత్రణలను తగ్గిస్తానంటున్నారు. దీనివల్ల కొత్త పెట్టుబడులొచ్చి ఉపాధి వెల్లువెత్తుతుందని సెలవిస్తున్నారు. బ్యాంకర్లు, స్టాక్‌ మార్కెట్‌ నిపుణులూ సొంత పొట్ట నింపుకొని దేశాన్ని నట్టేట ముంచారని ఎన్నికల ప్రచారంలో నానా యాగీ చేసిన ట్రంప్‌ అధికారంలోకి రాగానే తన మంత్రివర్గాన్ని సరిగ్గా వారితోనే కొలువుతీర్చారు. అంతర్జాతీయ ఫైనాన్స్‌ కంపెనీ గోల్డ్‌ మాన్‌ శాక్స్‌పై నిప్పులు కక్కిన ట్రంప్‌, తీరా అధికారంలోకి వచ్చాక, ఆ సంస్థకు చెందిన ముగ్గురు మాజీ ఉద్యోగులను దేశ ఆర్థిక సారథులుగా నియమించారు. వారిలో ఒకరైన స్టీవెన్‌ మెనూషిన్‌ను ఏకంగా ఆర్థిక మంత్రిగా కూర్చోబెట్టారు. ఇంకా ట్రంప్‌ మంత్రివర్గంలో అయిదుగురు శతకోటీశ్వరులు, ఆరుగురు కోటీశ్వరులు ఉన్నారు. వీరు సహజంగానే ధనికులు, కార్పొరేట్ల ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తున్నారు. ట్రంప్‌ ఎన్నికల వాగ్దానాల్లో చాలావాటిపై మాట మార్చినా పన్నుల కోత, కార్పొరేట్‌ రంగంపై నియంత్రణల తొలగింపు వంటి హామీలను మాత్రం తు.చ. తప్పకుండా నెరవేర్చబోతున్నారు. దానికి కాంగ్రెస్‌ పచ్చజెండా వూపడం ఖాయం. అసలు ధనికులపైన, కార్పొరేట్లపైన పన్నులు తగ్గించాలన్నదే రిపబ్లికన్‌ పార్టీ విధానం. ఆ పార్టీకి నేడు కాంగ్రెస్‌ ఉభయ సభల్లో మెజారిటీ ఉంది కనుక ట్రంప్‌ సంపన్న అమెరికన్లపై ఆదాయ, మూలధన లాభాల పన్నులను తగ్గిస్తే కాంగ్రెస్‌ అడ్డుచెప్పదు. కొందరు రిపబ్లికన్‌ కాంగ్రెస్‌ సభ్యులు కార్పొరేట్‌ పన్నును 35 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలని, దానివల్ల ఏర్పడే రెండు లక్షల కోట్ల డాలర్ల ఆదాయ లోటును సరిహద్దు సర్దుబాటు పన్నును పెంచి భర్తీచేసుకోవాలని ప్రతిపాదించారు. అందుకు అనుగుణంగా భారీ పన్నుల సంస్కరణలకు అధ్యక్షుడు ట్రంప్‌ తెరతీశారు. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు ప్రతిపాదనకు సంబంధించిన సారాంశాన్ని శ్వేతసౌధంలో విడుదల చేశారు. పన్ను శ్లాబులనూ ఏడు నుంచి మూడుకు తగ్గించాలని ట్రంప్‌ సంకల్పించారు. కానీ, దీనికి ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలు అంగీకరించవు. ట్రంప్‌ ప్రభుత్వం దిగుమతులపై సుంకం పెంచితే ఇతర దేశాలూ అమెరికన్‌ ఎగుమతులపై అదనపు సుంకం విధిస్తాయి. అంతేకాదు- తమ భూభాగాల్లో అమెరికన్‌ కంపెనీల వ్యాపారంపైనా పన్నులు పెంచుతాయి. చివరకు ఇది వాణిజ్య యుద్ధానికి దారితీసి అందరూ మునుగుతారు. ఈ అంశాన్నే వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్యాపదేశంగా సూచించారు. ఇంతకీ అమెరికా కాంగ్రెస్‌ వాణిజ్య యుద్ధాన్ని అనుమతిస్తుందా అన్నది సందేహమే. హెచ్‌ 1బీ వీసాలపై ట్రంప్‌ ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా ఆ వీసా విధానాన్ని రద్దు చేసే అధికారం ఆయనకు లేదు. అది కాంగ్రెస్‌కు మాత్రమే సంబంధించింది.

నూతన విపణుల అన్వేషణ
మొత్తంమీద భారతీయ ఐటీ నిపుణులు, సంస్థల పొరుగు సేవలపై ట్రంప్‌ ఏదో ఒక రూపంలో ఆంక్షలు విధించవచ్చు. దీనివల్ల కలిగే భారీ నష్టాన్ని అధిగమించడానికి భారతీయ కంపెనీలు అప్పుడే ఆటొమేషన్‌, కృత్రిమ మేధ వంటి కొత్త టెక్నాలజీలను ఆశ్రయిస్తున్నాయి. దీనికితోడు అమెరికా మార్కెట్‌పై ఆధారపడటం తగ్గించుకుని కొత్త మార్కెట్లను అన్వేషించాలి. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) వేదికపై ఐరోపా సమాఖ్య, చైనాలతో కలిసి అంతర్జాతీయ వాణిజ్యానికి కొత్త ప్రాతిపదికను ఏర్పరచుకోవాలి. భారతదేశం ఇప్పటికే సేవారంగంలో వాణిజ్య అభివృద్ధికి దోహదం చేసే ప్రతిపాదనలను డబ్ల్యూటీఓకి సమర్పించింది. విదేశీ వృత్తినిపుణుల ప్రవేశంపై అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు విధిస్తున్న ఆంక్షల గురించి డబ్ల్యూటీఓకి ఫిర్యాదు చేసింది. భారతీయ ఐటీ రంగానికి హానిచేసే విధానాలను ట్రంప్‌ మొండిగా అనుసరిస్తే ఎలాంటి ప్రతి చర్యలు చేపట్టేదీ వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్‌ వివరించకపోయినా- భారత్‌లో అమెరికన్‌ కంపెనీలు ఆర్జించే లాభాలపైన, వాటి తరలింపుపైన ఏదో ఒక నియంత్రణ విధించే అవకాశముంది.

- ఏఏవీ ప్రసాద్‌
Posted on 28-04-2017