Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

పారిస్‌పై దగా... మానవాళికి సెగ!

* ట్రంప్‌ ఆట కట్టించేదెలా?
వాతావరణ మార్పుపై ఐక్యరాజ్య సమితి ఒడంబడిక (పారిస్‌ పర్యావరణ ఒప్పందం) నుంచి వైదొలగాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకొన్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల్లో ట్రంప్‌కు గట్టి మద్దతుదారులుగా నిలిచిన అమెరికా వ్యాపారవేత్తలు సైతం ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. పారిస్‌ ఒప్పందాన్ని శిరసా వహించే విషయంలో తమకు ఎలాంటి సమస్యలూ లేవని ఎక్సాన్‌ మొబిల్‌ వంటి బడా చమురు సంస్థలు చెబుతుంటే, అమెరికన్‌ పరిశ్రమలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నానని ట్రంప్‌ వాదిస్తుండటం విచిత్రంగా ఉంది. పారిస్‌ ఒప్పందంపై 197 దేశాలు సంతకాలు చేశాయి. వాటిలో 148 దేశాలు ఇప్పటికే దాన్ని ఆమోదించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక దేశమైన అమెరికా ఇప్పుడు ఈ ఒప్పందం నుంచి వైదొలగుతాననడం విచారకరం.

పర్యావరణానికి విఘాతం
వాతావరణ మార్పును ఎదుర్కోవడానికి కొత్త ఒప్పందం కుదుర్చుకోవడంపై సంప్రతింపులు 1992లో ప్రారంభమయ్యాయి. ప్రపంచ సగటు ఉష్ణోగ్రతల్లో పెరుగుదలను తగ్గించడానికి అంతర్జాతీయ ఒడంబడికను తెరపైకి తేవడం ఆ చర్చల లక్ష్యం. 1997లో క్యోటో ప్రొటోకాల్‌పై సంతకం చేయడంతో వాతావరణ మార్పును ఎదుర్కొనే దిశగా పెద్ద ముందడుగు పడింది. ఆ ఒప్పందంపై 192 దేశాలు సంతకాలు చేశాయి. దాని ప్రకారం- ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలకు అభివృద్ధి చెందిన దేశాలు చట్టబద్ధంగా కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. ఆ ఒప్పందాన్ని రెండు దశల్లో అమలు చేయాలనుకొన్నారు. మొదటి దశ 2008 నుంచి 2012 వరకు. రెండో దశ 2013లో మొదలై 2020లో ముగియాల్సి ఉంది. ఆర్థికాభివృధ్ధి దిశగా తాము వేస్తున్న అడుగుల ఫలితంగానే భూతాపం బాగా పెరిగిందని, అందువల్ల కాలుష్యాన్ని తగ్గించేందుకు సత్వరం ప్రయత్నిస్తామని అభివృద్ధి చెందిన దేశాలు అంగీకరించడం క్యోటో ఒప్పందంలో విశేషాంశం. క్యోటోలో కుదిరిన ఏకీభావాన్ని పునాదిగా చేసుకొని కార్యాచరణను వేగంగా ముందుకు తీసుకెళ్లడం, భవిష్యత్తులో కర్బన ఉద్గారాల తగ్గింపునకు కావాల్సిన పెట్టుబడులను పెంపొందించడం- 2015 నాటి పారిస్‌ ఒప్పందం ఉద్దేశాలు. పారిశ్రామికీకరణకు ముందునాటికన్నా రెండు డిగ్రీల సెల్సియస్‌ దిగువకు ప్రపంచ ఉష్ణోగ్రతలో పెరుగుదలను పరిమితం చేయడం, తరవాత దాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గించాలన్నవి పారిస్‌ ఒప్పందంలోని బృహత్తర లక్ష్యాలు. వీటిని సాధించడానికి వీలుగా చేపట్టే వివిధ కార్యక్రమాలకు దన్నుగా ఉండేందుకు 10,000 కోట్ల డాలర్ల నిధిని ఏర్పాటు చేయదలచారు. ఆ డబ్బులో ఎక్కువ మొత్తం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఖర్చు చేయాలనుకొన్నారు. పేద దేశాలు తమ జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగాల్సి ఉంటుంది. కనుక, వాటికి మద్దతుగా నిలవాలనుకొన్నారు. భూతాపం, వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి అవసరమయ్యే ఆ నిధిని ధనిక దేశాలే సమకూర్చాల్సి ఉంటుంది. ఇది తదుపరి లక్ష్యం.
పారిస్‌ ఒప్పందం నుంచి అమెరికా ఈ దశలో వైదొలగుతాననడం దీర్ఘకాలంలో పెను దుష్ప్రభావం చూపే పరిణామమే. మొత్తం పారిస్‌ ఒప్పందం సుహృద్భావం మీద, లక్ష్యాలను సాధిస్తామన్న హామీపైనా ఆధారపడి ఉంది. ఒప్పందంలో భాగం పంచుకొంటున్న దేశాలన్నీ కలిపి ప్రపంచ కర్బన ఉద్గారాల్లో దాదాపు సగంవరకు వెలువరిస్తున్న పక్షంలోనే ఈ ఒప్పందానికి చట్టపరమైన కట్టుబాటు ఉంటుంది. లేకపోతే లేదు. అమెరికా, చైనాలు ప్రపంచంలోనే అతిపెద్ద కాలుష్య కారకాలు. ప్రపంచ ఉద్గారాల్లో 40 శాతం ఆ రెండు దేశాలనుంచే వెలువడుతున్నాయి. భారత్‌ వాటా అయిదు శాతమే. ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ)కి చెందిన దేశాలు 55 శాతం మేర కర్బన ఉద్గారాలు వెలువరిస్తున్నాయని అంచనా.
అమెరికా అతిపెద్ద కాలుష్యకారకమన్న వాస్తవాన్ని ఆ దేశ అధ్యక్షుడిగా ఒబామా గుర్తించారు. అందుకే, పారిస్‌ ఒప్పందంలో భాగంగా హరితగృహ వాయు ఉద్గారాలను 2025 నాటికి 2005 స్థాయికన్నా 26 నుంచి 28 శాతం దిగువకు తగ్గించుకొంటామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడయ్యాక అందుకు భిన్నమైన దారిలో సాగుతామంటున్నారు. ఒప్పందం నుంచే పూర్తిగా వైదొలగాలన్న ఆయన నిర్ణయం- ప్రపంచ పర్యావరణానికే పెను విఘాతం. అమెరికా లాంటి పెద్ద దేశం తోడు లేకుంటే ఈ విషయంలో ముందుకు సాగడం చాలా కష్టం. పారిస్‌ ఒప్పందం విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలన్నదానిపై చర్చించడానికి 195 దేశాల ప్రతినిధులు వచ్చే నవంబరులో బాన్‌లో సమావేశం కానున్నారు. ఆ సమావేశం సందర్భంగా దీనిపై ఏమైనా స్పష్టత వస్తుందేమో చూడాలి. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఒప్పందాలు సాధారణంగా నెమ్మదిగా పట్టాలపైకి వస్తాయి. గరిష్ఠస్థాయిలో భాగస్వాములను కలుపుకొని వెళ్లే ఉద్దేశంతోనే అలా చేస్తారు. విస్తృత ఏకీభావంతో ఒప్పందం అమలులోకి వచ్చాక వెనుదిరిగి చూసేదేమీ ఉండదు. చకచకా దూసుకెళ్లడమే. ప్రజానీకానికి భద్రమైన ఆవాసంగా ప్రపంచాన్ని మార్చడమే ఆ ఒప్పందాల ఉద్దేశం. పారిస్‌ ఒప్పందం వంటి బహుళపక్ష అంగీకారాలకు గండికొట్టడమంటే- ప్రపంచ దేశాలన్నీ ఒక్క వేదిక మీదకు వచ్చి, ఏకీభావంతో కుదుర్చుకొన్న అవగాహనలను, అందుకోసం చేసిన కృషిని పూర్తిగా నీరుగార్చడమే. దాంతో ఇన్నాళ్లూ చేసిన ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరవుతాయి. దానివల్ల పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుంది. కానీ ట్రంప్‌ ఏదో ప్రకటన చేసినంత మాత్రాన భయభ్రాంతులకు లోనుకావలసిన అవసరం లేదు. అంతర్జాతీయ ఒప్పందాలు చాలా పకడ్బందీగా ఉంటాయి. అలాంటి ఒప్పందాల నుంచి బయటకు రావడమన్నది నాయకులు చెప్పినంత సులభం కాదు. పారిస్‌ ఒప్పందానికి సంబంధించిన నియమ నిబంధనలమీద అమెరికా ఇదివరకే సంతకాలు చేసింది. దాని ప్రకారం- అమెరికా 2020 నవంబరులోగా ఒప్పందం నుంచి వైదొలగడానికి వీల్లేదు. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేయగలిగింది ఏమీలేదు. ఆయన తనవంతు ప్రయత్నాలు చేస్తారు. వివిధ వేదికలను ప్రభావితం చేయడానికీ ప్రయత్నిస్తారు. కానీ ఫలితం మాత్రం దక్కదు.

ఉమ్మడి కృషి ప్రధానం
వాతావరణ మార్పు మానవాళిపై ముఖ్యంగా భారత్‌ వంటి పేద దేశాలపై తీవ్ర దుష్ప్రభావం చూపుతోంది. మనిషి చర్యలే భూతాపానికి కారణమవుతున్నాయని, వాతావరణ వైపరీత్యాల్లో సగానికిపైగా దానివల్లే ఏర్పడుతున్నాయని ఇటీవలి తమ అధ్యయనాల్లో వెల్లడైనట్లు ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) తెలిపింది. భరించలేని ఉష్ణోగ్రతల వంటి వైపరీత్యాలు గతంలో తరానికి ఒకసారి సంభవిస్తే, ఇప్పుడు అవి పది రెట్లు పెరిగాయని అది పేర్కొంది. మరొక అధ్యయనం ప్రకారం 1960-2009 మధ్యకాలంలో భారతదేశంలో సగటు ఉష్ణోగ్రత 0.5 డిగ్రీల సెల్సియస్‌ను మించి పెరిగింది. అంటే వడగాడ్పుల వల్ల ప్రజలు మరణించే ప్రమాదం ఇదివరకటికన్నా బాగా పెరిగిందన్న మాట. వాతావరణ మార్పు ప్రభావాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. మరొక అధ్యయనం ప్రకారం దేశంలోని నదీ పరీవాహక ప్రాంతాల్లో వర్షపాత సరళి బాగా మారిపోయింది. వర్షపాతం అదే స్థాయిలో ఉన్నా, వర్షం కురిసే రోజుల సంఖ్య తగ్గిపోయింది. అంటే, మరింతగా నీటి నిల్వకు ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు, ప్రజలు ఇప్పుడిక సిద్ధపడాలన్నమాట! ఇటీవలి కాలంలో హరిత ఆర్థిక వ్యవస్థ పట్ల స్పృహ పెరిగింది. ఇందుకోసం పెట్టుబడులూ వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా కొన్ని దేశాల్లో బొగ్గు ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్తు కన్నా, సౌర విద్యుత్‌ ఉత్పత్తి వ్యయం తగ్గిపోయింది. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా సౌరవిద్యుత్తే చవక కాగలదని అంచనా. పైగా సౌరశక్తి బొగ్గులాగా కాకుండా అపరిమితమైనది. అందువల్లే బొగ్గు వంటి కాలుష్యకారకాల బదులు, పునరుత్పాదక ఇంధనాలవైపు ప్రపంచం ఇప్పుడు మొగ్గు చూపుతోంది. ఒక అధ్యయనం ప్రకారం- సౌర విద్యుత్‌ వంటి పునరుత్పాదక ఇంధనాల్ని ఉత్పత్తి చేసిన ప్రతిసారీ ఉత్పత్తి సామర్థ్యం రెట్టింపు అయితే, ఉత్పత్తి వ్యయం 20 శాతం తగ్గుతుంది. అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) తెలియజేసిన దాన్నిబట్టి 2025 నాటికి సౌర విద్యుత్‌ ఉత్పత్తి వ్యయం 2009 నాటికన్నా 84 శాతం తగ్గుతుంది. భారత్‌వంటి పేద దేశాలకు ఇది మరింత ప్రయోజనదాయకం. 2030 నాటికి విద్యుత్‌ అవసరాల్లో 40 శాతం పునరుత్పాదక ఇంధనాల ద్వారానే తీర్చుకుంటామని, కర్బన ఉద్గారాలను 2005 నాటికన్నా 33 నుంచి 35 శాతం దాకా తగ్గించుకొంటామని భారత్‌ ఇప్పటికే ప్రకటించింది. సౌర విద్యుత్‌ ఉత్పత్తి వ్యయం ఎంత తగ్గితే భారత్‌ అంత త్వరితంగా ఈ లక్ష్యాన్ని సాధించగలుగుతుంది. ఆ దిశగా భారత్‌ ఇప్పటికే ధీమాగా పురోగమిస్తోంది. కొచ్చి, కోల్‌కతా విమానాశ్రయాల్లో సౌర విద్యుత్‌నే ఉపయోగిస్తున్నారు. సౌర విద్యుత్‌ విషయంలో భారీ పెట్టుబడులతో చైనా మునుముందుకు దూసుకెళుతోంది. ఆ స్థాయిని అందుకొనేందుకు మనదేశం వేగం పెంచాల్సిన అవసరం ఉంది.
భూతాపాన్ని తగ్గించి, వాతావరణ మార్పును నిరోధించడానికి పారిస్‌ ఒప్పందం ఒక్కటే సరిపోతుందనుకొంటే, అంతకన్నా పొరపాటు ఉండదు. పారిస్‌ ఒప్పందాన్ని ఉన్నది ఉన్నట్లు అమలు చేసినా, ప్రపంచ ఉష్ణోగ్రత 2050 నాటికి 1.9 నుంచి 2.6 డిగ్రీల సెల్సియస్‌; 2100 నాటికి 3.1 నుంచి 5.2 డిగ్రీల సెల్సియస్‌ వరకు పెరుగుతుందని ఎంఐటీ పరిశోధకులు తేల్చారు. అందువల్ల వాతావరణ మార్పును ఎదుర్కొనే బాధ్యతను ప్రభుత్వాలకే వదలిపెట్టడం సరికాదు. పారిస్‌ పర్యావరణ ఒప్పందంపై సంతకం చేసినంత మాత్రాన సరిపోదు. ప్రభుత్వాలు ఒకదారి చూపగలవంతే. పౌరులు, కంపెనీలు, వివిధ సంస్థలూ ఆ దారిలో ముందుకు సాగాల్సి ఉంటుంది. పునరుత్పాదక ఇంధనాలు, నీటి సంరక్షణే లక్ష్యం చేరే మార్గాలు. తక్కువ వడ్డీలపై పెద్దమొత్తంలో సులభ రుణాలు అందించడం ద్వారా ఆ ప్రయత్నాలను ప్రభుత్వం ప్రోత్సహించాలి. తమకు అవసరమైన విద్యుత్‌లో 50 శాతం పునరుత్పాదక ఇంధనాల ద్వారానే ఉత్పత్తి చేసుకొనేలా లేదా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు చేసేలా బడా ఇంధన వినియోగదారులను ప్రభుత్వం వెన్నుతట్టాలి. ఏ దేశానికి ఆ దేశం ఇలాంటి చర్యలు చేపట్టినప్పుడు ట్రంప్‌ వంటి తెంపరి నాయకుల బెదిరింపులకు భయపడి, ప్రజానీకం బెంబేలెత్తాల్సిన అవసరం ఉండదు!

Posted on 11-06-2017